సాక్షి, ఆమదాలవలస (శ్రీకాకుళం): వైఎస్సార్‌సీపీ ఆమదాలవలస నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి తమ్మినేని సీతారాం గతంలో మంత్రిగా పనిచేశారు. స్థానిక సమస్యలపై పూర్తి అవగాహన కలిగిన వ్యక్తిగా మాత్రమే కాకుండా 15 సంవత్సరాలుగా ప్రజలతో మమేకమై ఉంటూ సేవలందిస్తున్నారు. ప్రస్తుతం వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న ఆయన అవకాశం ఇస్తే ప్రజా సమస్యల పరిష్కారానికి అంతఃకరణ శుద్ధితో పనిచేస్తానని మనసులో మాటను సాక్షి ఇంటర్వ్యూ లో తెలియజేశారు.
ప్రశ్న: ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు మీ వ్యూహం ఏంటి?
జవాబు: ప్రత్యేకించి వ్యూహాలు ఏమీ లేవు. టీడీపీ హయాంలో ఇసుక దోపిడి, లిక్కర్ మాఫియా, భూ దందాలతో పాలకులు ప్రజలను ఇబ్బందులకు గురి చేశారు. వారికి ఆసరాగా నిలుస్తామనే భరోసా కల్పిస్తున్నాము. ఐదేళ్లుగా నియోజకవర్గం అభివృద్ధిని కూన రవికుమార్ మరిచిపోయారు. కేవలం తన అభివృద్ధి, టీడీపీ నాయకుల అభివృద్ధికే పెద్దపీట వేశారు. అందుకే అటువంటి పాలనకు చరమగీతం పాడాల్సిన అవసరం ఉంది. నియోజకవర్గంలోని ప్రజల సమస్యలపై నిరంతరం పోరాటాలు చేస్తున్నాము. దీనికి తోడు జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన మ్యానిఫెస్టోలోని అంశాలు అన్ని వర్గాల వారికి లబ్ధిచేకూర్చే విధంగా ఉన్నాయి. వైఎస్సార్‌సీపీతోనే ప్రజా సంక్షేమం సాధ్యమని ప్రజలు గమనించారు. ఫ్యాన్ గుర్తుకు ఓటువేసి వైఎస్సార్‌సీపీని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారు.
ప్రశ్న: నియోజకవర్గ ప్రజలతో ఎలా మమేకమయ్యారు?
జవాబు: గత 40 ఏళ్లుగా నా రాజకీయ జీవితం నియోజకవర్గ ప్రజల ముందు తెరిచిన పుస్తకమే. ఇక్కడ అన్ని గ్రామాల ప్రజలతోనూ నాకు స్నేహ బంధాలు ఉన్నాయి. దీంతోపాటు ప్రజలందిరికీ నేనేంటో తెలుసు. అందరికీ దగ్గరగా ఉంటూ ప్రజలకు చేసిన సేవలతోనే నన్ను గుర్తిస్తున్నారు.
ప్రశ్న: నియోజకవర్గంలో మీరు గుర్తించిన ప్రత్యేక సమస్యలు ఏంటి?
జవాబు: నియోజకవర్గంలో ప్రజలకు గత ఐదేళ్లుగా రాక్షస, రాబందుల పాలనలో సరైన సంక్షేమం అందలేదు. గ్రామాల్లో తాగునీరు అందలేదు, రహదారులు నిర్మాణాలకు నోచుకోలేదు. దీంతోపాటు సాగు నీరుకు పలు ఎత్తిపోతల పథకాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. ప్రధానంగా స్థానికంగా మూతపడిన సుగర్ ఫ్యాక్టరీ నియోజకవర్గం అభివృద్ధిని కుంటి పరిచింది. కర్మాగారాలు మూతపడ్డాయి. ఉపాధి అవకాశాలు దెబ్బతిన్నాయి. అందుకే వీటిని తెరిపించేందుకు పాదయాత్ర సమయంలో జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. మా ప్రభుత్వం వస్తే తప్పకుండా సుగర్ ఫ్యాక్టరీ తెరుస్తాము.
ప్రశ్న: సమస్యల పరిష్కారానికి ఎలా కృషి చేస్తారు?
జవాబు: నాకు నియోజకవర్గంలోని అన్ని గ్రామాలపైనా అవగాహన ఉంది. సుగర్ ఫ్యాక్టరీ తెరిపించి రైతులకు ఆసరా కల్పిస్తాము. వంశధార ప్రధాన కాలువకు అనుసంధానంగా కొన్నిచోట్ల ఎత్తిపోతల పథకాలు ఏర్పాటు చేసి రైతులకు పూర్తి స్థాయిలో సాగునీరు అందించేందుకు కృషి చేస్తాను. స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు నియోజకవర్గంలో పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తాను.
ప్రశ్న: టీడీపీ పాలనలో ఇబ్బందులకు గురైన బాధితులకు మీరెలా న్యాయం చేస్తారు?
జవాబు: టీడీపీ పాలనలో జన్మభూమి కమిటీల పెత్తనంతో ప్రజలకు సంక్షేమ పథకాలు సక్రమంగా అందలేదు. అన్ని పనుల్లోనూ అవినీతికి పాల్పడి అర్హులకు పథకాలు అందకుండా చేశారు. మా పార్టీ అధికారంలోకి వస్తే అలాంటి ఇబ్బందులు ఉండవు. గ్రామ సచివాలయం ఏర్పాటు చేసి నేరుగా ప్రజలకే సంక్షేమ పథకాలు అందిస్తామని జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. పేదరికమే అర్హతగా పథకాలు అందజేస్తాము.
Comments
Please login to add a commentAdd a comment