అన్ని వర్గాలకు సమన్యాయం | Sakshi Interview With YSRCP MLA Candidate Piriya Sairaj | Sakshi
Sakshi News home page

అన్ని వర్గాలకు సమన్యాయం

Published Tue, Apr 9 2019 3:41 PM | Last Updated on Tue, Apr 9 2019 3:41 PM

Sakshi Interview With YSRCP MLA Candidate Piriya Sairaj

సాక్షి, కంచిలి (శ్రీకాకుళం): ప్రజాసేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చానని ఇచ్ఛాపురం నియోజకవర్గ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్‌ అన్నారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో ప్రజలు ఆదరించి గెలిపిస్తే పూర్తిగా అవినీతి రహిత పాలన అందిస్తానన్నారు. 2009లో తొలిసారి ఎమ్మెల్యే ఎన్నికైనప్పుడు ప్రతిపక్షంలో ఉన్నానని, అయినప్పటికీ వెరవకుండా ప్రజాసమస్యల పరిష్కారానికి పోరాటాలు చేశానని పేర్కొన్నారు. సోంపేట ధర్మల్‌ పవర్‌ప్లాంట్‌ రద్దుకు మూడేళ్లపాటు అవిశ్రాంతంగా పోరాడానన్నారు. 15 రోజుల పాటు శ్రీకాకుళం సబ్‌జైల్లో కూడా ఉన్నానని గుర్తుచేశారు. కిడ్నీరోగులను ఆదుకోవడానికి ఉద్దానం ఫౌండేషన్‌ ఏర్పాటు చేసి వ్యాధి పీడిత గ్రామాల్లో మినరల్‌ వాటర్‌ప్లాంట్‌లను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. సోంపేట ప్రభుత్వాస్పత్రిలో సొంత ఖర్చులతో డయాలసిస్‌ యూనిట్‌ ఏర్పాటు చేశానన్నారు. ఇలా పలు అంశాలను ఆయన ‘సాక్షి’తో పంచుకున్నారు.

ప్రశ్న: నియోజకవర్గ ప్రజలతో ఎలా మమేకమయ్యారు?
జవాబు: ఇచ్ఛాపురం నియోజకవర్గం నుంచి ఇప్పటికే ఒకసారి 2009లో శాసనసభ్యునిగా ఎన్నికై సేవలందించిన అనుభవం ఉంది. అప్పట్లో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నుంచి ఎన్నికైనప్పటికీ ప్రజాసమస్యల పరిష్కారం కోసం అలుపెరగకుండా పోరాటాలు చేశాను. తద్వారా అన్ని వర్గాల ప్రజలతో మమేకమైన అనుభవం ఉంది.

ప్రశ్న: నియోజకవర్గంలో మీరు గుర్తించిన సమస్యలేమిటి?
జవాబు: నియోజకవర్గం అభివృద్ధి విషయంలో పూర్తిగా వెనుకబడి ఉంది. సాగునీటి సమస్య, నిరుద్యోగంతో వలసలు, మౌలిక సౌకర్యాల కల్పన కూడా మిగతా నియోజకవర్గాలతో పోల్చితే తక్కువే. ముఖ్యంగా ఉద్దాన ప్రాంత ప్రజల్ని కిడ్నీవ్యాధి మహమ్మారి ఎందర్నో బలి తీసుకుంటుంది.

ప్రశ్న: సమస్యల పరిష్కారానికి ఎలా కృషిచేస్తారు?
జవాబు: నియోజకవర్గంలో ఉన్న శాశ్వత సమస్యలన్నీ పరిష్కరించడం కోసం చిత్తశుద్ధితో కృషిచేస్తాను. నేను గుర్తించిన ప్రతీ సమస్యపై రానున్న వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అధిక ప్రాధాన్యతనిచ్చి సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తాను.

ప్రశ్న: ఈ ఎన్నికల్లో విజయం సాధించడానికి మీ వ్యూహం ఏమిటి?
జవాబు: ప్రత్యేకంగా వ్యూహం అంటూ ఏమీ లేదు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మ్యానిఫేస్టోలో పేర్కొన్న అంశాలు నా విజయానికి దోహదపడతాయి. అంతకు ముందు నేను చేసిన ప్రజాహిత సేవా కార్యక్రమాలు, నా వ్యక్తిత్వం, విద్యార్హతలు, గడచిన టీడీపీ పాలనలో చోటుచేసుకొన్న అవినీతి కార్యక్రమాలన్నీ ప్రజలు గమనిస్తున్నారు. అవే నన్ను గెలిపిస్తాయి.

ప్రశ్న: మీరు ఎన్నికైతే అన్ని సామాజిక వర్గాల ప్రజలకు ఒకే విధంగా ప్రాధాన్యత ఇస్తారా? 
జవాబు: ఈ నియోజకవర్గంలో అన్ని సామాజిక వర్గాలకు సమాన ప్రాధాన్యత ఇచ్చి పరిపాలిస్తాను. వారికి అన్నింటా గౌరవం దక్కేలా వ్యవహరిస్తాను. గడచిన టీడీపీ ప్రభుత్వం నియోజకవర్గంలో వివిధ సామాజిక వర్గాలను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది.  అటువంటి పరిపాలన నాకు నచ్చదు. అందర్నీ కలుపుకొని పోతాను. మొదటిసారి ఎన్నికైనప్పుడే నా పాలనలో అన్ని వర్గాల వారికి సమాన ప్రాధాన్యత ఇచ్చాననేది రుజువయ్యింది కూడా.

ప్రశ్న: వ్యక్తిగతంగా ఏమైనా సేవాకార్యక్రమాలు చేపట్టారా?
జవాబు: అవును.. నేను పదవితో సంబంధం లేకుండా సొంతంగా ఉద్దానం ఫౌండేషన్‌ అనే సంస్థను ఏర్పాటు చేసి కిడ్నీబాధిత గ్రామాల్లో మినరల్‌ వాటర్‌ ప్లాంట్ల ఏర్పాటు, ఉచిత మెడికల్‌ క్యాంపులు, ఉచిత అంబులెన్స్‌ సర్వీసులు ఏర్పాటు చేసి సేవలందిస్తున్నాను. అదేవిధంగా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, మాజీ అయ్యాక కూడా నాకు వచ్చిన గౌరవ వేతనాన్ని పూర్తిగా కిడ్నీబాధితుల కుటుంబాలకు నెలవారీ వారి అకౌంట్లలో వేసి వారికి సాయం చేస్తున్నాను.

రాజకీయ నేపథ్యం
వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిరియా సాయిరాజ్‌ ఇప్పటికే 2009 నుంచి 2014 వరకు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉంది. పదవీ కాలం చివరిలో తన పదవికి రాజీనామా చేసి వైఎస్సార్‌కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. తర్వాత 2014 నుంచి 2019 వరకు నియోజకవర్గ పార్టీ సమన్వయకర్తగాను, పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. 2014 ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లా పార్టీ పరిశీలకునిగా కూడా సేవలందించారు.
ప్రశ్న:  టీడీపీ పాలనలో పలు ఇబ్బందులకు గురైన బాధితులకు మీరెలా న్యాయం చేస్తారు? 
జవాబు: అవును టీడీపీ పాలనలో ఎంతో మంది అర్హులైన పేదలకు ఇళ్లు, సామాజిక పింఛన్లు రాలేదు. ఇలా చాలా మందికి  ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తించలేదు. అటువంటి వారందరికీ పార్టీలకతీతంగా అర్హత ఉన్న మేరకు ప్రాధాన్యమిచ్చి న్యాయం చేస్తాను. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement