Palamaneru constituency
-
సేవకుడిలా పని చేస్తా..
సాక్షి, పలమనేరు : మంత్రి నియోజకవర్గమని పేరేగానీ గ్రామాల్లో కాని, పట్టణంలో కానీ తాగేందుకు నీళ్లులేవు. అందుకే పలమనేరులో ఇంటింటికీ నళ్లా, గ్రామాల్లో తాగునీటి సౌకర్యం కల్పించడమే తన ధ్యేయమని పలమనేరు అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్సార్సీపీ అభ్యర్థి ఎన్.వెంకటేశగౌడ తెలిపారు. ఆయన శనివారం ‘సాక్షి’ తో మాట్లాడారు. అభివృద్ధి కోసమే పార్టీ మారానని టీడీపీలో చేరి మంత్రి పదవిని దక్కించుకున్న అమరనాథ రెడ్డి నియోజకవర్గంలో చేసిందేమీలేదన్నారు. రూ.900 కోట్లతో అభివృద్ది చేశామంటూ గొప్పలు చెబుతున్నారేగానీ దాంట్లో రూ.300 కోట్లదాకా అక్రమాలు జరిగాయని ఆరోపించారు. రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖమంత్రిగా తన సొంత నియోజకవర్గంలో కనీసం కుటీర పరిశ్రమైనా కల్పించారా అని సూటిగా ప్రశ్నించారు. దివంగత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి స్ఫూర్తి, పెద్దిరెడ్డి అండతో తాను రాజీయాల్లోకి వచ్చానన్నారు. తనను గెలిపిస్తే పేదల కష్టాలు తెలిసినా వానిగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని తెలిపారు. ప్రశ్న: రాజకీయాల్లోకి ఎలా వచ్చారు? జవాబు: నేను ఏడేళ్లుగా నియోజకవర్గంలో ఎన్వీజీ ట్రస్టు ద్వారా సేవా కార్యక్రమాలను చేస్తున్నా. పెద్దిరెడ్డి కుటుంబ అండదండలతో నా రాజకీయ ప్రస్థానం మొదలైంది. గత ఎన్నికల్లో ఇక్కడి అభ్యర్థిని గెలిపించడం నుంచి స్థానికంగానే ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషిచేస్తున్నా. వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్రను చూసి స్ఫూర్తి పొందాను. నాయకుడు అంటే అలానే ఉండాలనుకున్నా. ఇందులో భాగంగానే నియోజకవర్గంలో ఇంటింటికీ వెళ్లి వారి సమస్యలను తెలుసుకున్నా. ప్రశ్న: కుటుంబ నేపథ్యం గురించి జవాబు:మాది పలమనేరు నియోజకవర్గంలోని వీకోటమండలం తోటకనుమ . తండ్రిపేరు చెంగేగౌడ. నా సతీమణి పావణి గృహిణి. నాకు ఇద్దరు సంతానం. నా విద్యాభ్యాసం పక్కనే ఉన్న వీ.కోటలో సాగింది. 9వతరగతి దాకా చదువుకున్నా. ఇంట్లో ఆర్థిక పరిస్థితులు సహకరించకపోవడంతో బెంగళూరుకు వెళ్లా. అక్కడ తాపీ పనులు చేశా. ఈ ప్రాంతం నుంచి వెళ్లిన కూలీలను గ్రూపుగా చేసి చిన్నచిన్న పనులు ఒప్పుకున్నాను. అదే రంగంలో అంచలంచెలుగా ఎదిగి బిల్డర్‌గా స్థిరపడ్డాను. ప్ర: ఐదేళ్ల టీడీపీ పాలనపై ఏమంటారు జ: టీడీపీ నాయకులు నిధులు దోచుకోవడానికే సరిపోయింది. నియోజకవర్గంలో చాలా గ్రామాల్లో తాగేందుకు నీళ్లు కూడా లేవు. మంత్రి లేనిపోని మాటలు, ప్రజలను ఏమార్చేందుకు శిలాఫలకాలు తప్పా ఇక్కడ చేసిందేమీ లేదు. ప్ర:నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలు గుర్తించారు... జ: నియోజకవర్గంలో ప్రధానంగా తాగునీటి సమస్య ఉంది. ఇది మెట్టప్రాంతం కాబట్టి రైతుల సాగునీటికి ఇబ్బందులున్నాయి. పెండింగ్‌లోని గంగన్న శిరస్సు, కైగల్ ఎత్తిపోతల, హంద్రీనీవాతో చెరువుల అనుసంధానం చేయాల్సి ఉంది. ఏనుగుల సమస్య, టమాటా రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించడం ఇలా చాలా సమస్యలున్నాయి. ప్ర: ఎన్నికల్లో గెలిస్తే ఏం చేస్తారు? జ: నిత్యం నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటా. ఇంతవరకు మా సొంత మండలానికి ఏ రాజకీయపార్టీలోనూ ప్రాతినిధ్యం వహించే అవకాశం రాలేదు. ఇప్పుడు వైఎస్సార్సీపీ నా ద్వారా ఆ అవకాశం కల్పించింది. వెంకటగౌడ ఎమ్మెల్యేగా బాగా పనిచేశాడబ్బా అని జనం చెప్పుకుంటే చాలు. ఏడాదికి ఒక్కసారి .. ఐదేళ్లలో కనీసం ఐదుసార్లు ఇంటింటికీ వెళతాను. వాళ్ల యోగక్షేమాలు తెలుసుకుంటాను. వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా. -
భూసేకరణం
⇒ పలమనేరు నియోజకవర్గంలో భారీగా భూసేకరణ ⇒ బాధితులకు గిట్టుబాటుకాని నష్టపరిహారం ⇒ అధికారుల ధర నిర్ణయంపై తీవ్ర అభ్యంతరం ⇒ తీవ్ర ఆందోళనలో అన్నదాతలు ⇒ న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని హెచ్చరిక ⇒ అన్ని ప్రాజెక్టుల్లోనూ బాధిత రైతులది ఇదే తంతు అభివృద్ధి మాటున విలువైన భూములను కారుచౌకగా దక్కించుకోవాలని ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఎప్పుడో పదేళ్ల క్రితం నిర్ణయించిన ధరలనే పరిగణనలోకి తీసుకుంటోంది. రైతులకు కంటితుడుపుగా పరిహారం అందిస్తూ ముప్పుతిప్పలు పెడుతోంది. దీనిపై పలువురు రగిలిపోతున్నారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా పోరుబాటకు సన్నద్ధమవుతున్నారు. ప్రస్తుత మార్కెట్ రేట్ల ప్రకారం పరిహారం ఇవ్వకుంటే కోర్టులకెళ్తామని హెచ్చరికలు పంపుతున్నారు. పలమనేరు : చెన్నై–బెంగళూరు నాలుగో నంబరు జాతీయరహదారి విస్తరణ, పలమనేరు సమీపం నుంచి గంగవరం మీదుగా బైపాస్ రోడ్డు కోసం ప్రభుత్వం భూములు సేకరిస్తోంది. సుమారు రెండు మండలాలకు చెందిన 140 మంది రైతులు తమ భూములు, ఇంటి స్థలాలను పోగొట్టుకుంటున్నారు. వీరి భూములకు ధర నిర్ణయించేందుకు గత నెల స్థానిక మున్సిపల్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ గిరీషా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పలమనేరు, గంగవరం గ్రామాల్లోని మెయిన్ రోడ్డుకు ఆనుకుని ఉంటే ఎకరాకు రూ.40 లక్షలు, దూరంగా ఉంటే రూ.22 లక్షలదాకా ధర నిర్ణయించారు. ఇక్కడ రోడ్డు పక్కన ఎకరా రూ.2 కోట్లు పలుకుతోంది. రూ.40 లక్షలకు భూములు ఎలా ఇచ్చేదని పలువురు రైతులు ప్రశ్నిస్తున్నారు. ఎక్స్‌ప్రెస్ హైవే బాధితులదీ అదే పరిస్థితి నియోజకవర్గంలోని వీకోట, బైరెడ్డిపల్లె, పలమనేరు మండలాల్లో 700 మంది రైతులకు చెందిన వేలాది ఎకరాల భూముల్లో రోడ్డు నిర్మాణం సాగనుంది. అధికారులు ఎకరానికి రూ.9 లక్షల నుంచి రూ.14 లక్షలు, ఇంటి స్థలాలకు చదరపు అడుగుకు రూ.1,673గా నిర్ణయించారు. ఈ ధరలు బహిరంగ మార్కెట్‌కంటే తక్కువ. ప్రస్తుతం పలమనేరు–కుప్పం రోడ్డు విస్తరణ పనులకు ఎల్ఏ నోటిఫికేషన్ వెలువడింది. త్వరలో ధర నిర్ణయానికి సమావేశం జరగనుంది. ఇందులో కూడా తమకు నష్టం తప్పదేమోనని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హంద్రీ–నీవాలోనూ తక్కువే హంద్రీ–నీవా కాలువ పనుల కోసం నియోజకవర్గంలోని పెద్దపంజాణి, గంగవరం, బైరెడ్డిపల్లె, వి.కోట మండలాల్లో 3వేల ఎకరాలకుపైగా భూములను ప్రభుత్వం సేకరించింది. బాధిత రైతులకు ఎకరానికి రూ.9 లక్షల దాకా పరిహారం అందిస్తోంది. ఈ మొత్తం తమకు గిట్టుబాటు కావడంలేదని రైతులు కోర్టులకెక్కుతున్నారు. ప్రభుత్వం ప్రజావసరాల పేరిట చేస్తున్న భూసేకరణ తమకు తీరని నష్టాన్ని మిగిల్చిందని గగ్గోలు పెడుతున్నారు. -
వైఎస్ఆర్సీపీ గెలుపే లక్ష్యం
పలమనేరు అభ్యర్థి ఎవరైనా భారీ మెజారిటీతో గెలిపిస్తాం వైఎస్ఆర్సీపీ నాయకులు విజయభాస్కర్ రెడ్డి పలమనేరు: పలమనేరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ గెలుపే తన లక్ష్యమని ఆ పార్టీలో చేరిన పెద్దపంజాణి మాజీ ఎంపీపీ విజయభాస్కర్ రెడ్డి సృష్టంచేశారు. పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి సమక్షంలో మంగళవారం వైఎస్ఆర్సీపీలో చేరాక తొలిసారిగా పలమనేరుకు విచ్చేసిన విజయభాస్కర్‌రెడ్డికి స్థానిక కోఆర్డినేటర్లతో కలసి పార్టీ నాయకులు, ఆయన అభిమానులు, కార్యకర్తలు బుధవారం పట్టణంలో భారీ స్వాగత కార్యక్రమాన్ని నిర్వహించారు. సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి, పట్టణంలో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. ‘జగన్ నాయకత్వం వర్థిల్లాలి, రాష్ట్రానికి ప్రత్యేక హోదా దక్కాలి’ అనే నినాదాలతో హోరెత్తించారు. మార్కెట్ కమిటీ ఆవరణలోని వైఎస్ విగ్రహానికి పూలమాలవేసి నివాళుర్పించారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి నివాళుర్పించారు. ఈ సందర్భంగా విజయభాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ పలమనేరు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పార్టీ ఎవరిని ప్రకటించినా వారి గెలుపుకోసం కృషిచేస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డిని చూడడమే తన లక్ష్యమన్నారు. రాష్ట్రంలో నాటి వైఎస్ సంక్షేమపాలన రావాలంటే ఆయన తనయుడు జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావాల్సిందేనన్నారు. రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ముచేయకుండా పార్టీ గెలుపును తన భుజాలపై వేసుకుంటానన్నారు. స్థానిక కోఆర్డినేటర్లు, ముఖ్య నాయకులకు ఎన్నటికీ రుణపడి ఉంటానన్నారు. పెద్దపంజాణి మండలంలో పార్టీ కేడర్‌ను మరింత బలోపేతం చేసి నియోజకవర్గంలోనే తన మండలాన్ని వైఎస్ఆర్సీపీకి కంచుకోటలా తయారుచేస్తామన్నారు. అనంతరం కోఆర్డినేటర్లు రాకేష్‌రెడ్డి, సీవీ కుమార్ మాట్లాడుతూ విజయభాస్కర్ రెడ్డి పార్టీలో చేరికతో తమకు రెట్టింపు ఉత్సాహం వచ్చిందన్నారు.అనంతరం రాష్ట్ర కార్యదర్శి మురళీకృష్ణ, సంయుక్త కార్యదర్శి వెంకటేష్‌గౌడ, జిల్లా కార్యదర్శి చెంగారెడ్డి, పలమనే రు, బైరెడ్డిపల్లె, గంగవరం మండల కన్వీనర్లు బాలాజీ నాయుడు, కేశవులు, మోహన్‌రెడ్డి, బాగారెడ్డి తదితరులు ప్రసంగించారు. నియోజకవర్గ నేతలంతా కలసి విజయభాస్కర్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. -
పలమనేరులో వైఎస్ఆర్సీపీ మరింత బలోపేతం
జగన్ సమక్షంలో పార్టీలో చేరిన ఎమ్మెల్సీ సోదరుడు విజయభాస్కర్ రెడ్డి ఎమ్మెల్యే సొంత మండలంలో మారనున్న రాజకీయం ఎంపీపీ పీఠం కూడా వైఎస్సార్సీపీకే దక్కే అవకాశం సమరోత్సాహంతో నియోజకవర్గ పార్టీ శ్రేణులు పలమనేరు: వైఎస్సార్సీపీకి బలమైన పలమనేరు నియోజకవర్గం మరింత బలోపేతం కానుంది. నియోజకవర్గంలోని పెద్దపంజాణికి చెందిన మాజీ ఎంపీపీ, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్సీ రెడ్డెప్ప రెడ్డి సోదరులు విజయభాస్కర్ రెడ్డి తన అనుచరులతో కలసి మంగళవారం వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో ఆ పార్టీలో చేరారు. దీంతో పెద్దపంజాణి మండలంతో పాటు నియోజకవర్గంలోనే పార్టీ బలపడనుంది. ఈ కీలక పరిణామంతో స్థానిక ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి సొంత మండలమైన పెద్దపంజాణిలో రాజకీయం వేడెక్కడం ఖాయం. మాజీ ఎంపీపీ విజయభాస్కర్ రెడ్డితో పాటు వైస్ ఎంపీపీ, పలువురు ఎంపీటీసీ సభ్యులు కూడా వైఎస్ఆర్సీపీలో చేరడంతో రాబోయే రోజుల్లో ఎంపీపీ పీఠం సైతం వైఎస్సార్సీపీ దక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో నియోజకవర్గంలోని వైఎస్సార్సీపీ శ్రేణులు సమరోత్సాహంతో పార్టీని ముందుకు తీసుకెళుతామంటున్నాయి. రెండు నియోజకవర్గాల్లో పట్టున్న నాయకుడు పెద్దపంజాణి మండలానికి చెందిన మాజీ ఎంపీపీ విజయభాస్కర్ రెడ్డి ఇటు పలమనేరు, అటు పుంగనూరు నియోజకవర్గాల్లోనూ పట్టు కలిగిన వ్యక్తి. గతంలో నుంచి కూడా మండలంలో ఏ ఎన్నికలు జరిగినా తన ప్రాబల్యాన్ని చూపేవారు. ముఖ్యంగా తన సొంత పంచాయతీ సామనేరులో సర్పంచ్‌ను మూడుసార్లు ఏకగ్రీవం చేయించారు. ప్రస్తుత ఎంపీపీ పీఠం దక్కేందుకు ఆయనే కారణం. గత రెండు దఫాలుగా పంజాణి పీఏసీఎస్ పాలకవర్గాన్ని గెలిపిస్తూ వస్తున్నారు. ఈదఫా రికార్డు స్థాయిలో 13కు 10 మంది డైరెక్టర్లను పీఏసీఎస్‌లో గెలిపించి తన అనుచరుడు శంకరప్పను అధ్యక్షుడిని చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 46వేల ఓట్లున్న ఈ మండలంలో వైఎస్సార్సీపీకి రెండువేల దాకా మెజార్టీ రాగా ఈయన రాకతో వచ్చే ఎన్నికల్లో మెజార్టీ భారీగా పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. తాను కాంగ్రెస్‌పార్టీలో ఉన్నప్పటినుంచి వైఎస్ అంటే ఎంతో అభిమానించేవారు. ఈనేపధ్యం లో ఆయన్ను వైఎస్సార్సీపీలోకి రప్పించేందుకు రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, స్థానిక కోఆర్డినేటర్లు రాకేష్‌రెడ్డి, రెడ్డెమ్మ, కుమార్ కృషిచేశారు. ఎంపీపీ పీఠం దక్కే అవకాశం పెద్దపంజాణి మండలంలోని మొత్తం 15 ఎంపీటీసీ సెగ్మెంట్లలో 6టీడీపీ, 5 వైఎస్సార్సీపీ, 4 స్వతంత్రులు గెలిచారు. ఇండిపెండెంట్లను విజయభాస్కర్ రెడ్డి బరిలోకి దించారు. ఆయన ఆదేశాలతోనే వారు వైఎస్సార్సీపీకి మద్దతు ఇవ్వడంతో బీసీ అభ్యర్థి మురళి ఎంపీపీ అయ్యారు. అయితే అతను ఎమ్మెల్యేతోపాటు పార్టీ ఫిరాయించడంతో ఇక విజయభాస్కర్ రెడ్డి చేతిలోకి ఎంపీపీ బంతి చిక్కింది. మారనున్న రాజకీయం విజయభాస్కర్ రెడ్డితో పాటు వైఎస్ ఎంపీపీ సుమిత్ర వెంకటేష్, పీఏసీఎస్ ప్రెసిడెంట్ శంకరప్ప, సర్పంచ్‌లు ఆదెమ్మ మార్కొండయ్య, హరినాథ్, పుష్ప, భాగ్యమ్మ, ముగ్గురు ఎంపీటీసీ సభ్యులు, మాజీ జెడ్పీటీసీ సభ్యులు రెడ్డెప్ప, కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు తమ్మిరెడ్డి, యూత్ నాయకులు భాగారెడ్డి, ఓబుల్‌రెడ్డి, వెంకట్రమణారెడ్డి, మాలమహానాడు జిల్లా అధ్యక్షులు ఎర్రబెల్లి శ్రీనివాసులు, ఎస్టీ సెల్ నాయకుడు వై.శ్రీనివాసులు, బీసీ సెల్ నాయకుడు సీతారామయ్య, సురేష్‌రెడ్డి చేరికతో మండలంలోని పలు సెగ్మెంట్లలో వైఎస్సార్సీపీ బలం మరింత పుంజుకోనుంది. -
బెరైడ్డిపల్లె టీడీపీలో మళ్లీ భగ్గుమన్న విభేదాలు
ఇరువర్గాల బాహాబాహీ మండల కన్వీనర్‌ను నిర్బంధించిన ఓ వర్గం ఇరువర్గాల మధ్య ఘర్షణ పోలీసులకు పరస్పర ఫిర్యాదులు రంగంలోకి దిగిన ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ బోస్ పలమనేరు: పలమనేరు నియోజకవర్గంలోని బెరైడ్డిపల్లె తెలుగుదేశం పార్టీల మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. శుక్రవారం లక్కనపల్లెలో జరిగిన పార్టీ సంస్థాగత ఎన్నికల సందర్భంగా ఇరువర్గాలవారు బాహాబాహీకి దిగి ఘర్షణలకు పాల్పడ్డారు. పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. దీంతో ఆ మండలంలో ఉద్రిక్తతనెలకొంది. పలమనేరు శాసనసభ టీడీపీ టికె ట్ కోసం ఆ పార్టీకి చెందిన బెరైడ్డిపల్లె మండల సీనియర్ నాయకులు లక్కనపల్లె శ్రీనివాసులు రెడ్డి, ప్రస్తుత పార్టీ ఇన్చార్జ్ సుభాష్‌చంద్రబోస్ తీవ్రస్థాయిలో ప్రయత్నించారు. ఎట్టకేలకు పార్టీ టికెట్ బోస్‌కు వరించింది. మొన్న జరిగిన ఎన్నికల్లో బోస్ వైఎస్సార్సీపీ అభ్యర్థి అమరనాథరెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. అయితే ఈ ఎన్నికల్లో శ్రీనివాసులు రెడ్డి తనకు వ్యతిరేకంగా పనిచేశారని బోస్ భావించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో వీరిరువురి మధ్య మనస్పర్థలు నెలకొన్నాయి. గత కొన్నాళ్లుగా బెరైడ్డిపల్లె మండలంలో శ్రీ నివాసులురెడ్డి వర్గం, బోస్ వర్గాలుగా ఉంటున్నాయి. పార్టీ కన్వీనర్‌గా బోస్ వర్గానికి చెందిన డాక్టర్ కదిరప్పను ఏకపక్షంగా నియమించారని శ్రీనివాసులురెడ్డి వర్గం ఆగ్రహంతో ఉంది. ఇలా ఉండగా గత పది రోజు లుగా ఈ మండలంలోని పంచాయతీల్లో సంస్థాగత ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం లక్కనపల్లెలో ఈ ఎన్నికల కోసం సమావేశం నిర్వహించారున బోస్ వర్గానికి చెందిన డాక్టర్ కదిరప్ప శ్రీనివాసులురెడ్డి సొంత గ్రామమైన లక్కనపల్లెకు వెళ్లి అక్కడ కమిటీలను ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యా రు. విషయం తెలుసుకున్న శ్రీనివాసులురెడ్డి వర్గీయు లు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. అయితే వా రిని పట్టించుకోకుండా కదిరప్ప వారి వర్గానికి చెందిన రఘుచంద్రగుప్త వద్దకెళ్లి ఆయన సూచించిన పేర్లతో కమిటీని ఏర్పాటు చేసుకుని వచ్చారు. దీనిపై మరింత ఆగ్రహించిన శ్రీనివాసులు రెడ్డి వర్గీయులు కదిరప్పపై వాగ్వాదానికి దిగారు. ఇలా మొదలైన చిచ్చు ఇరువర్గా ల ఘర్షణలకు దారి తీసింది. అనంతరం తనను లక్కనపల్లెలో శ్రీనివాసులురెడ్డి వర్గీయులు నిర్బంధించారని కన్వీనర్ కదిర ప్ప బెరైడ్డిపల్లె పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే కదిరప్ప వర్గీయులే తమపై దాడికి పాల్పడ్డారని పెద్దపురానికి చెందిన నాగరాజు, లక్కనపల్లెకు చెందిన శివకుమార్, రాజేంద్ర పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ హుటాహుటిన బెరైడ్డిపల్లె పోలీస్ స్టేషన్‌కెళ్లి తమ వర్గీయులకు అండ గా నిలిచారు. దీన్ని జీర్ణించుకోలేని శ్రీనివాసులురెడ్డి వర్గీయులు తమ ఫిర్యాదును పోలీసులు పట్టించుకోకుండా ఫిర్యాదు చేసేందుకు వచ్చిన వారినే స్టేషన్లో ఎలా కుర్చోబెడుతారంటూ వాగ్వాదానికి దిగారు. అయితే పూర్తిస్థాయిలో విచారణ జరిపాక ఈ సంఘటనపై తగు చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. గత ఆరు నెలలుగా ఈ రెండు వర్గాల మధ్య జరుగుతున్న పోరు దీంతో మరింత తారాస్థాయికి చేరినట్టైంది. -
కమ్మనపల్లెలో టెన్షన్..టెన్షన్
పలమనేరు: పలమనేరు నియోజకవర్గం బెరైడ్డిపల్లె మండలం కమ్మనపల్లెలో ఆదివారం టెన్షన్ నెలకొంది. కమ్మనపల్లెకు చెందిన ఓ అదృశ్యమైన వివాహిత కర్ణాటక రాష్ట్రంలోని ముల్బాగల్ వద్ద శవమై బయటపడిందంటూ పుకార్లు వినిపించాయి. దానికితోడు గంగవరం పోలీసులు ఆ ప్రాంతంలో అన్వేషణ జరపడం, ఇందుకు సంబంధించి పలువురిని అదుపులోకి తీసుకోవడం అనుమానాలను బలపరిచాయి. అదృశ్యమైన వివాహిత ఏమైందనే సమాచారం తెలియనప్పటికీ కమ్మనపల్లె పంచాయతీలోని అన్ని గ్రామాల్లో దీని గురించే చర్చ జరిగింది. కమ్మనపల్లె పంచాయతీ ఎర్రకదిరేపల్లెకు చెందిన శిల్పతో వారి బంధువైన కీలతొరిడి గ్రామానికి చెందిన కుమార్‌రాజాకు పెళ్లయింది. వీరికి పిల్లలు లేరు. ఈ సాకుతో అత్తమామలు వేధిస్తున్నారని, ఇందుకు భర్త సహకరిస్తున్నాడని బాధితురాలు గతంలో పలమనేరు కోర్టులో కేసు వేసింది. విచారణ జరుగుతుండగానే కమ్మనపల్లెకు చెందిన కొందరు తాము కేసును రాజీ చేస్తామంటూ ప్రయత్నాలు చేసినట్టు తెలిసింది. ఆ తర్వాత కోర్టుకు హాజరైన శిల్ప అదృశ్యమైంది. కుటుంబ సభ్యులు గంగవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కర్ణాటక రాష్ట్రంలోని ముల్బాగల్ సమీపంలో గల ఓ చెరువులో పూడ్చి పెట్టిన ఒక గుర్తు తెలియని మహిళ శవం బయటపడిందనే విషయం దావానలంలా వ్యాపించింది. దుస్తులు దాదాపు అలాగే ఉండడంతో ఆ మృతదేహం శిల్పాదేనని కుటుంబ సభ్యులు అనుమానించారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికెళ్లి కర్ణాటక పోలీసులతో చర్చించారు. భర్త కుమార్‌రాజాను అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. అతను ఇచ్చిన సమాచారం మేరకు కమ్మనపల్లెకు చెందిన ప్రస్తుత సర్పంచ్ కుమారుడు, మాజీ సర్పంచ్‌తో పాటు మరికొంధరిని ఆదివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయమై పలమనేరు డీఎస్పీ హరినాథరెడ్డిని వివరణ కోరగా శిల్ప అదృశ్యమైందని తమకు గతంలో ఫిర్యాదు వచ్చిందని, ముల్బాగల్ ప్రాంతం లో వెలుగు చూసిన మహిళ శవం ఆమెదేనా అన్న అనుమానంతో విచారణ జరుపుతున్నామని తెలిపారు. వివరాలు తెలిశాక సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేస్తామన్నారు. -
గుసగుసలు
పలమనేరు టీడీపీ అభ్యర్థిగా మంత్రి గల్లా చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ బోసు వర్గంలో భయం పలమనేరు నియోజకవర్గం నుంచి రాష్ట్ర భూగర్భ వనరుల శాఖ మంత్రి గల్లా అరుణకుమారి టీడీపీ శాసనసభ అభ్యర్థిగా పోటీలో ఉండేందుకు రంగం సిద్ధమైనట్టు విశ్వసనీయంగా తెలిసింది. అయితే ఈ విషయాన్ని ఆమె ధ్రువీకరించలేదు. తానుఇంకా టీడీపీలోకి వెళ్లాలనే నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. సాక్షి ప్రతినిధి, తిరుపతి: మంత్రి గల్లా అరుణకుమారి గత ఆదివారం టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు విగ్రహావిష్కరణ సభలో పాల్గొన్నారు. చంద్రబాబుతో గల్లా మంతనాలు జరిపినట్లు సమాచారం. ఇటీవల జయదేవ్ తమ ఫ్యాక్టరీ వద్ద సహచరులు, అభిమానులతో సమావేశం ఏర్పాటు చేసి ‘‘మా అమ్మకు ఎలాగైనా టీడీపీలో సీటు సంపాదించాలి. మా అమ్మను అభిమానించే కాంగ్రెస్, టీడీపీ వారంతా చంద్రబాబుపై ఒత్తిడి తీసుకు రావాలి’’ అని కోరారు. దీంతో మంత్రి గల్లా అనుయాయుల నుంచి కూడా చంద్రబాబుపై వత్తిడి పెరిగినట్లు సమాచారం. చంద్రగిరిలో కష్టమనే... చంద్రగిరి నుంచి పోటీచేస్తే గెలుపు కష్టమని, వైఎస్ఆర్ సీపీ నుంచి తీవ్రస్థాయిలో పోటీ ఉంటుందనే భావనతోనే చంద్రగిరి కాకుండా పలమనేరును ఎంచుకున్నట్లు సమాచారం. పలమనేరు నియోజకవర్గంలోకి పునర్విభజన సందర్భంగా కుప్పం నియోజకవర్గంలోని వీ.కోట మండలం రావడంతో ఈ మండలం నుంచి వచ్చే ఓట్లు చంద్రబాబు నాయుడి అభిమానులవేనని ఆమె నమ్ముతున్నారు. పైగా ఆమె తండ్రి రాజగోపాల్‌నాయుడు కూడా పార్లమెంటుకు గతంలో ప్రాతినిథ్యం వహించడంతో ఇదీ తనకు ఉపయోగపడుతుందనే ఆలోచనతో ఆమె పలమనేరు నుంచి పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాల్సిందిగా కోరినట్లు సమాచారం. చంద్రబాబు కూడా సానుకూలంగా స్పందించారని తెలిసింది. అయితే చంద్రబాబు తుది నిర్ణయం ఎలా ఉంటుందనేది తెలియాలి. త్వరలో గుంటూరులో జరిగే టీడీపీ మీటింగ్‌లో గల్లా అరుణకుమారితో పాటు ఆమె తనయుడు జయదేవ్కూడా టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారని తెలిసింది. బోస్ వర్గంలో భయం పలమనేరు టీడీపీ టికెట్ కోరుకుంటున్న సుభాష్‌చంద్రబోస్ ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహిస్తున్న నేపథ్యంలో గల్లాకు టిక్కెట్ ఇస్తారనే విషయం పలమనేరులో హాట్ టాపిక్‌గా మారింది. టీడీపీలో ఈమెకు టికెట్ ఇస్తారో లేదో గానీ బోస్ వర్గానికి మాత్రం ఈ విషయం కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.రేసులో బోస్‌తో పాటు మరో ఆరుగురు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ బోస్ మాత్రమే అన్ని మండలాల్లోనూ ఇప్పటికే ప్రచారం సైతం చేసుకెళ్తున్నారు.