పలమనేరులో వైఎస్‌ఆర్‌సీపీ మరింత బలోపేతం
జగన్ సమక్షంలో పార్టీలో చేరిన ఎమ్మెల్సీ సోదరుడు విజయభాస్కర్ రెడ్డి
ఎమ్మెల్యే సొంత మండలంలో మారనున్న రాజకీయం
ఎంపీపీ పీఠం కూడా వైఎస్సార్‌సీపీకే దక్కే అవకాశం
సమరోత్సాహంతో నియోజకవర్గ పార్టీ శ్రేణులు
పలమనేరు: వైఎస్సార్‌సీపీకి బలమైన పలమనేరు నియోజకవర్గం మరింత బలోపేతం కానుంది. నియోజకవర్గంలోని పెద్దపంజాణికి చెందిన మాజీ ఎంపీపీ, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్సీ రెడ్డెప్ప రెడ్డి సోదరులు విజయభాస్కర్ రెడ్డి తన అనుచరులతో కలసి మంగళవారం వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ఆ పార్టీలో చేరారు. దీంతో పెద్దపంజాణి మండలంతో పాటు నియోజకవర్గంలోనే పార్టీ బలపడనుంది.
ఈ కీలక పరిణామంతో స్థానిక ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి సొంత మండలమైన పెద్దపంజాణిలో రాజకీయం వేడెక్కడం ఖాయం. మాజీ ఎంపీపీ విజయభాస్కర్ రెడ్డితో పాటు వైస్ ఎంపీపీ, పలువురు ఎంపీటీసీ సభ్యులు కూడా వైఎస్‌ఆర్‌సీపీలో చేరడంతో రాబోయే రోజుల్లో ఎంపీపీ పీఠం సైతం వైఎస్సార్‌సీపీ దక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో నియోజకవర్గంలోని వైఎస్సార్‌సీపీ శ్రేణులు సమరోత్సాహంతో పార్టీని ముందుకు తీసుకెళుతామంటున్నాయి.
రెండు నియోజకవర్గాల్లో పట్టున్న నాయకుడు
పెద్దపంజాణి మండలానికి చెందిన మాజీ ఎంపీపీ విజయభాస్కర్ రెడ్డి ఇటు పలమనేరు, అటు పుంగనూరు నియోజకవర్గాల్లోనూ పట్టు కలిగిన వ్యక్తి. గతంలో నుంచి కూడా మండలంలో ఏ ఎన్నికలు జరిగినా తన ప్రాబల్యాన్ని చూపేవారు. ముఖ్యంగా తన సొంత పంచాయతీ సామనేరులో సర్పంచ్‌ను మూడుసార్లు ఏకగ్రీవం చేయించారు. ప్రస్తుత ఎంపీపీ పీఠం దక్కేందుకు ఆయనే కారణం. గత రెండు దఫాలుగా పంజాణి పీఏసీఎస్ పాలకవర్గాన్ని గెలిపిస్తూ వస్తున్నారు. ఈదఫా రికార్డు స్థాయిలో 13కు 10 మంది డైరెక్టర్లను పీఏసీఎస్‌లో గెలిపించి తన అనుచరుడు శంకరప్పను అధ్యక్షుడిని చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 46వేల ఓట్లున్న ఈ మండలంలో వైఎస్సార్‌సీపీకి రెండువేల దాకా మెజార్టీ రాగా ఈయన రాకతో వచ్చే ఎన్నికల్లో మెజార్టీ భారీగా పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. తాను కాంగ్రెస్‌పార్టీలో ఉన్నప్పటినుంచి వైఎస్ అంటే ఎంతో అభిమానించేవారు. ఈనేపధ్యం లో ఆయన్ను వైఎస్సార్‌సీపీలోకి రప్పించేందుకు రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, స్థానిక కోఆర్డినేటర్లు రాకేష్‌రెడ్డి, రెడ్డెమ్మ, కుమార్ కృషిచేశారు.
ఎంపీపీ పీఠం దక్కే అవకాశం
పెద్దపంజాణి మండలంలోని మొత్తం 15 ఎంపీటీసీ సెగ్మెంట్లలో 6టీడీపీ, 5 వైఎస్సార్‌సీపీ, 4 స్వతంత్రులు గెలిచారు. ఇండిపెండెంట్లను విజయభాస్కర్ రెడ్డి బరిలోకి దించారు. ఆయన ఆదేశాలతోనే వారు వైఎస్సార్‌సీపీకి మద్దతు ఇవ్వడంతో బీసీ అభ్యర్థి మురళి ఎంపీపీ అయ్యారు. అయితే అతను ఎమ్మెల్యేతోపాటు పార్టీ ఫిరాయించడంతో ఇక విజయభాస్కర్ రెడ్డి చేతిలోకి ఎంపీపీ బంతి చిక్కింది.
మారనున్న రాజకీయం
విజయభాస్కర్ రెడ్డితో పాటు వైఎస్ ఎంపీపీ సుమిత్ర వెంకటేష్, పీఏసీఎస్ ప్రెసిడెంట్ శంకరప్ప, సర్పంచ్‌లు ఆదెమ్మ మార్కొండయ్య, హరినాథ్, పుష్ప, భాగ్యమ్మ, ముగ్గురు ఎంపీటీసీ సభ్యులు, మాజీ జెడ్పీటీసీ సభ్యులు రెడ్డెప్ప, కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు తమ్మిరెడ్డి, యూత్ నాయకులు భాగారెడ్డి, ఓబుల్‌రెడ్డి, వెంకట్రమణారెడ్డి, మాలమహానాడు జిల్లా అధ్యక్షులు ఎర్రబెల్లి శ్రీనివాసులు, ఎస్టీ సెల్ నాయకుడు వై.శ్రీనివాసులు, బీసీ సెల్ నాయకుడు సీతారామయ్య, సురేష్‌రెడ్డి చేరికతో మండలంలోని పలు సెగ్మెంట్లలో వైఎస్సార్‌సీపీ బలం మరింత పుంజుకోనుంది.