భూసేకరణం
⇒ పలమనేరు నియోజకవర్గంలో భారీగా భూసేకరణ
⇒ బాధితులకు గిట్టుబాటుకాని నష్టపరిహారం
⇒ అధికారుల ధర నిర్ణయంపై తీవ్ర అభ్యంతరం
⇒ తీవ్ర ఆందోళనలో అన్నదాతలు
⇒ న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని హెచ్చరిక
⇒ అన్ని ప్రాజెక్టుల్లోనూ బాధిత రైతులది ఇదే తంతు
అభివృద్ధి మాటున విలువైన భూములను కారుచౌకగా దక్కించుకోవాలని ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఎప్పుడో పదేళ్ల క్రితం నిర్ణయించిన ధరలనే పరిగణనలోకి తీసుకుంటోంది. రైతులకు కంటితుడుపుగా పరిహారం అందిస్తూ ముప్పుతిప్పలు పెడుతోంది. దీనిపై పలువురు రగిలిపోతున్నారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా పోరుబాటకు సన్నద్ధమవుతున్నారు. ప్రస్తుత మార్కెట్ రేట్ల ప్రకారం పరిహారం ఇవ్వకుంటే కోర్టులకెళ్తామని హెచ్చరికలు పంపుతున్నారు.
పలమనేరు : చెన్నై–బెంగళూరు నాలుగో నంబరు జాతీయరహదారి విస్తరణ, పలమనేరు సమీపం నుంచి గంగవరం మీదుగా బైపాస్ రోడ్డు కోసం ప్రభుత్వం భూములు సేకరిస్తోంది. సుమారు రెండు మండలాలకు చెందిన 140 మంది రైతులు తమ భూములు, ఇంటి స్థలాలను పోగొట్టుకుంటున్నారు. వీరి భూములకు ధర నిర్ణయించేందుకు గత నెల స్థానిక మున్సిపల్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ గిరీషా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పలమనేరు, గంగవరం గ్రామాల్లోని మెయిన్ రోడ్డుకు ఆనుకుని ఉంటే ఎకరాకు రూ.40 లక్షలు, దూరంగా ఉంటే రూ.22 లక్షలదాకా ధర నిర్ణయించారు. ఇక్కడ రోడ్డు పక్కన ఎకరా రూ.2 కోట్లు పలుకుతోంది. రూ.40 లక్షలకు భూములు ఎలా ఇచ్చేదని పలువురు రైతులు ప్రశ్నిస్తున్నారు.
ఎక్స్‌ప్రెస్ హైవే బాధితులదీ అదే పరిస్థితి
నియోజకవర్గంలోని వీకోట, బైరెడ్డిపల్లె, పలమనేరు మండలాల్లో 700 మంది రైతులకు చెందిన వేలాది ఎకరాల భూముల్లో రోడ్డు నిర్మాణం సాగనుంది. అధికారులు ఎకరానికి రూ.9 లక్షల నుంచి రూ.14 లక్షలు, ఇంటి స్థలాలకు చదరపు అడుగుకు రూ.1,673గా నిర్ణయించారు. ఈ ధరలు బహిరంగ మార్కెట్‌కంటే తక్కువ. ప్రస్తుతం పలమనేరు–కుప్పం రోడ్డు విస్తరణ పనులకు ఎల్‌ఏ నోటిఫికేషన్ వెలువడింది. త్వరలో ధర నిర్ణయానికి సమావేశం జరగనుంది. ఇందులో కూడా తమకు నష్టం తప్పదేమోనని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
హంద్రీ–నీవాలోనూ తక్కువే
హంద్రీ–నీవా కాలువ పనుల కోసం నియోజకవర్గంలోని పెద్దపంజాణి, గంగవరం, బైరెడ్డిపల్లె, వి.కోట మండలాల్లో 3వేల ఎకరాలకుపైగా భూములను ప్రభుత్వం సేకరించింది. బాధిత రైతులకు ఎకరానికి రూ.9 లక్షల దాకా పరిహారం అందిస్తోంది. ఈ మొత్తం తమకు గిట్టుబాటు కావడంలేదని రైతులు కోర్టులకెక్కుతున్నారు. ప్రభుత్వం ప్రజావసరాల పేరిట చేస్తున్న భూసేకరణ తమకు తీరని నష్టాన్ని మిగిల్చిందని గగ్గోలు పెడుతున్నారు.