Handri-niva Canal
-
భూసేకరణం
⇒ పలమనేరు నియోజకవర్గంలో భారీగా భూసేకరణ ⇒ బాధితులకు గిట్టుబాటుకాని నష్టపరిహారం ⇒ అధికారుల ధర నిర్ణయంపై తీవ్ర అభ్యంతరం ⇒ తీవ్ర ఆందోళనలో అన్నదాతలు ⇒ న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని హెచ్చరిక ⇒ అన్ని ప్రాజెక్టుల్లోనూ బాధిత రైతులది ఇదే తంతు అభివృద్ధి మాటున విలువైన భూములను కారుచౌకగా దక్కించుకోవాలని ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఎప్పుడో పదేళ్ల క్రితం నిర్ణయించిన ధరలనే పరిగణనలోకి తీసుకుంటోంది. రైతులకు కంటితుడుపుగా పరిహారం అందిస్తూ ముప్పుతిప్పలు పెడుతోంది. దీనిపై పలువురు రగిలిపోతున్నారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా పోరుబాటకు సన్నద్ధమవుతున్నారు. ప్రస్తుత మార్కెట్ రేట్ల ప్రకారం పరిహారం ఇవ్వకుంటే కోర్టులకెళ్తామని హెచ్చరికలు పంపుతున్నారు. పలమనేరు : చెన్నై–బెంగళూరు నాలుగో నంబరు జాతీయరహదారి విస్తరణ, పలమనేరు సమీపం నుంచి గంగవరం మీదుగా బైపాస్ రోడ్డు కోసం ప్రభుత్వం భూములు సేకరిస్తోంది. సుమారు రెండు మండలాలకు చెందిన 140 మంది రైతులు తమ భూములు, ఇంటి స్థలాలను పోగొట్టుకుంటున్నారు. వీరి భూములకు ధర నిర్ణయించేందుకు గత నెల స్థానిక మున్సిపల్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ గిరీషా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పలమనేరు, గంగవరం గ్రామాల్లోని మెయిన్ రోడ్డుకు ఆనుకుని ఉంటే ఎకరాకు రూ.40 లక్షలు, దూరంగా ఉంటే రూ.22 లక్షలదాకా ధర నిర్ణయించారు. ఇక్కడ రోడ్డు పక్కన ఎకరా రూ.2 కోట్లు పలుకుతోంది. రూ.40 లక్షలకు భూములు ఎలా ఇచ్చేదని పలువురు రైతులు ప్రశ్నిస్తున్నారు. ఎక్స్‌ప్రెస్ హైవే బాధితులదీ అదే పరిస్థితి నియోజకవర్గంలోని వీకోట, బైరెడ్డిపల్లె, పలమనేరు మండలాల్లో 700 మంది రైతులకు చెందిన వేలాది ఎకరాల భూముల్లో రోడ్డు నిర్మాణం సాగనుంది. అధికారులు ఎకరానికి రూ.9 లక్షల నుంచి రూ.14 లక్షలు, ఇంటి స్థలాలకు చదరపు అడుగుకు రూ.1,673గా నిర్ణయించారు. ఈ ధరలు బహిరంగ మార్కెట్‌కంటే తక్కువ. ప్రస్తుతం పలమనేరు–కుప్పం రోడ్డు విస్తరణ పనులకు ఎల్ఏ నోటిఫికేషన్ వెలువడింది. త్వరలో ధర నిర్ణయానికి సమావేశం జరగనుంది. ఇందులో కూడా తమకు నష్టం తప్పదేమోనని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హంద్రీ–నీవాలోనూ తక్కువే హంద్రీ–నీవా కాలువ పనుల కోసం నియోజకవర్గంలోని పెద్దపంజాణి, గంగవరం, బైరెడ్డిపల్లె, వి.కోట మండలాల్లో 3వేల ఎకరాలకుపైగా భూములను ప్రభుత్వం సేకరించింది. బాధిత రైతులకు ఎకరానికి రూ.9 లక్షల దాకా పరిహారం అందిస్తోంది. ఈ మొత్తం తమకు గిట్టుబాటు కావడంలేదని రైతులు కోర్టులకెక్కుతున్నారు. ప్రభుత్వం ప్రజావసరాల పేరిట చేస్తున్న భూసేకరణ తమకు తీరని నష్టాన్ని మిగిల్చిందని గగ్గోలు పెడుతున్నారు. -
ఆగస్టు నాటికి ఏయే చెరువులకు నీళ్లిస్తారో చెప్పాలి
► ఇవ్వకపోతే రాజీనామా చేస్తారా? ► మంత్రి పరిటాల సునీతకు తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి సవాల్ అనంతపురం: హంద్రీ-నీవా కాలువ నిర్మాణాలను పూర్తి చేసి ఆగస్టు నాటికి జిల్లాలోని చెరువులకు నీళ్లిస్తామని మంత్రి పరిటాల సునీత చెబుతున్నారని, రాప్తాడు నియోజకవర్గంలో ఏయే చెరువులకు నీళ్లిస్తారో బహిర్గతం చేయాలని వైఎస్సార్సీపీ రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి డిమాండ్ చేశారు. జిల్లా పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రెండేళ్లుగా అందుబాటులో లేని మంత్రి ఈరోజు నియోజకవర్గ ప్రజల్లో ఉండేందుకు తాపత్రయపడుతున్నారని ఎద్దేవా చేశారు. హంద్రీ-నీవా నీటిని కుప్పం తరలించేందుకు కుట్ర పన్నిన వైనంపై హంద్రీ-నీవా జలసాధన సమితి ఆధ్వర్యంలో ఉభయ కమ్యూనిస్టు పార్టీలతో కలిసి తాము ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేశామన్నారు. దీనిపై అనవసరంగా ప్రజలకు అపోహాలు కల్పిస్తున్నారంటూ మంత్రి మాట్లాడుతున్నారన్నారు. అధికార పార్టీ చే స్తున్న నీటి చౌర్యంపై ప్రజలు ఎక్కడ తిరగబడుతారోనని భయపడి భూములకు అంచనాలు వేసి ప్రతిపాదనలు పంపామని ఈనెల రెండో వారంలో అధికారులకు చెప్పార న్నారు. అయితే ఇప్పటి దాకా చెరువులు, పిల్లకాలువల తవ్వకాలకు ప్రతిపాదనలు ఇవ్వలేదన్నారు. ఈ సందర్భంగా ఆయన మంత్రి సునీతకు కొన్ని ప్రశ్నలు సంధించారు. వాటిపై రైతులకు సూటిగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సమావేశంలో జెడ్పీ ఫ్లోర్‌లీడర్ వెన్నపూస రవీంద్రరెడ్డి, కనగానపల్లి జెడ్పీటీసీ బిల్లే ఈశ్వరయ్య, కనగానపల్లి సింగిల్‌విండో అధ్యక్షులు లక్ష్మారెడ్డి, ఆత్మకూరు మండల కన్వీనర్ నరసింహారెడ్డి, నగర అధ్యక్షులు రంగంపేట గోపాల్‌రెడ్డి, రైతు విభాగం రాష్ట్ర ప్రధానకార్యదర్శి యూపీ నాగిరెడ్డి, విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి మద్దిరెడ్డి నరేంద్రరెడ్డి, జిల్లా ప్రధానకార్యదర్శి బాబా సలాం, కార్యదర్శి సునీల్‌దత్తరెడ్డి పాల్గొన్నారు. ►జీఓ 22ను అడ్డుపెట్టుకుని రాప్తాడు నియోజకవర్గం పరిధిలోని ఆయకట్టును తొలిగించిన మాట వాస్తవం కాదా? లేదంటే ఉత్తర్వులు బహిరంగపరచండి. ►2,3,4,5,7 ప్యాకేజీల్లో రాప్తాడు నియోజకవర్గంలోని సుమారు 80 కిలోమీటర్ల ప్రధానకాలువలో ఒక ఎకరా నీరివ్వడానికైనా డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థ ఏర్పాటు చేశారా? తూములు, చెరువులకు నీళ్లిచ్చేందుకు, సప్లయ్చానళ్లకు ప్రొవిజన్ లేదని చెప్పిన మాట వాస్తవం కాదా? మీరు ఒప్పుకుంటారా.. లేదంటే తాము బహిర్గ పరచాలా? ► జిల్లాలో 1263 చెరువులకు ఆగస్టులోగా నీళ్లిస్తామని చెబుతున్నారు. ఏయే చెరువులకు నీళ్లిస్తారో చెప్పాలి. ►చెరువులు, ఆయకట్టుకు నీళ్లివ్వక ప్రధానకాలువను పూర్తిచేసి నీటిని కుప్పం తరలించడమే మీ ఉద్ధేశం కాదా? ►కుప్పం నియోజకవర్గంలోని ఆయకట్టుకు నీళ్లు ఇవ్వాలని చూస్తున్నారు తప్ప రాప్తాడు రైతులకు నీళ్లు అవసరం ఉందా? లేదా? ►హంద్రీ నది నుంచి నీవా నది వరకు కాలువ పూర్తి చేసి, తర్వాత ఆయకట్టుకు నీళ్లిస్తామని మంత్రి చెబుతున్నారని నీవా దిగువ సుమారు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న కుప్పం వరకు కాలువ తవ్వడం వెనుక మర్మమేమిటో? ► బద్ధలాపురం చెరువుకు నీరు ఏవిధంగా ఇస్తారో చెప్పాలి ►పేరూరు డ్యాంకు హంద్రీ-నీవా నుంచి నీరిస్తామని సర్వే అంచనాలు సిద్ధం చేశామని చెబుతున్నారు. ఆ వివరాలు బహిర్గ పరచాలి ► హంద్రీ-నీవా సృష్టికర్త శివరామకృష్ణయ్య డీపీఆర్ కంటే కూడా మీరు చేస్తున్న సర్వే గొప్పదా అని ప్రశ్నించారు. ఈ అంశాలన్నింటిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. -
హంద్రీ-నీవా ఆయకట్టుకు ఎగనామం
► జిల్లా రైతుల పొట్ట కొట్టి వేరే జిల్లాకు నీరు తీసుకెళ్లే కుట్ర ► కలసికట్టుగా జిల్లాను కాపాడుకోవాలి ► లేదంటే భావితరాలకు అన్యాయం ► ఆయకట్టు సాధన సమితి సమావేశంలో నాయకులు ► సీఎంకు బహిరంగ లేఖ ► 3న చేపట్టాల్సిన మహాధర్నా వాయిదా అనంతపురం అర్బన్ : ‘హంద్రీ-నీవా ద్వారా జిల్లాలో 3.50 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరివ్వాల్సి ఉంది. అయితే.. చంద్రబాబు ఎగనామం పెట్టారు. పొలాలకు నీరిచ్చే డిస్ట్రిబ్యూటరీ (కాలువల) పనులు నిలిపివేయాలంటూ జీవో 22 విడుదల చేశారు. జిల్లా రైతుల పొట్టకొట్టి వేరే జిల్లాకు నీరు తీసుకెళ్లేందుకు కుట్ర చేస్తున్నార’ని హంద్రీ-నీవా సాధన సమితి నాయకులు ధ్వజమెత్తారు. జిల్లాకు సాధించిన నీటిని కలసికట్టుగా కాపాడుకోకపోతేభవిష్యత్ తరాలకు అన్యాయం జరుగుతుందన్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల ద్వారా జిల్లాకు జరుగుతున్న అన్యాయంపై ప్రజలను చైతన్యవంతుల్ని చేయాల్సిన అవసరముందన్నారు. మే 3న తలపెట్టిన మహాధర్నా తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. బుధవారం అనంతపురం నగరంలోనివీకే మెమోరియల్ హాలులో హంద్రీ-నీవా ఆయకట్టు సాధన సమితి జిల్లా కన్వీనర్ జగదీశ్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.ముఖ్యఅతిథులుగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యద ర్శి అనంతవెంకటరామిరెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్, వైఎస్ఆర్సీపీ రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ హంద్రీ-నీవా విషయంలో చంద్రబాబుకుచిత్తశుద్ధి లేదన్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి 1996లో ఉరవకొండ వద్ద ఒకసారి, 1999లో ఆత్మకూరు వద్ద రెండోసారి శంకుస్థాపన చేశారన్నారు. టీడీపీ అధికారంలో ఉన్న 2004 వరకు ఒక్క కిలోమీటర్ మేర కూడా కాలువ పనులు ముందుకు సాగలేదన్నారు. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖరరెడ్డి ఉరవకొండ వద్ద ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడంతో పాటు రూ.6 వేల కోట్ల నిధులు ఇచ్చారని గుర్తు చేశారు. 2009లో వైఎస్ భౌతికంగా దూరమయ్యాక.. ఆ తరువాత సీఎంగా ఉన్న రోశయ్య, కిరణ్‌పై ఒత్తిడి చేసి మొదటి దశగా 2012లో జీడిపల్లి వరకు నీటిని తెచ్చామని వివరించారు. ఈ పథకం ద్వారా నిర్దేశించిన ఆరు లక్షల ఎకరాల్లో 3.50 లక్షల ఎకరాల ఆయకట్టు జిల్లాలోనే ఉందన్నారు. మొదటి దశ కింద 2014లోనే భూములకు నీరివ్వాల్సి ఉందన్నారు. ఎన్నికల సమయంలో ఆరు లక్షల ఎకరాలకు నీరిస్తామని టీడీపీ చెప్పిందని, అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా అతీగతీ లేదని విమర్శించారు. ఆయకట్టుకు ఎగనామం పెడుతూ జీవో ఇచ్చిన చంద్రబాబు చెరువులకు నీరిస్తామని అంటున్నారని, ఎప్పుడు, ఎలా ఇస్తారో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. సంక్షేమ పథకాలపై వైఎస్ఆర్ ముద్ర ఉండటంతో వాటికి పేర్లు మారుస్తూ, చెడగొట్టేందుకు కుట్ర చేస్తున్నారనిపిస్తోందన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ జిల్లాలో శాశ్వత కరువు నివారణకు హంద్రీ-నీవా ఒక్కటే మార్గమన్నారు. అయితే.. పొలాల్లో గుంతలు తవ్వించి కరువును పారదోలతానని చంద్రబాబు ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. గోదావరి పుష్కరాలకు రూ.1600 కోట్లు ఖర్చు చేసి 30 మంది ప్రాణాలు తీశారని మండిపడ్డారు. కరువు ప్రాంతానికి మాత్రం డబ్బు ఇవ్వకుండా గుంతలు తవ్వుకోండని ఉచిత సలహా ఇస్తున్నారన్నారు. రాష్ట్రాభివృద్ధిని విస్మరించి అమరావతి చుట్టూ తిరుగుతున్నారని దుయ్యబట్టారు. ఎమ్మెల్యే విశ్వేశ్వరెడ్డి మాట్లాడుతూ జిల్లా గురించి చంద్రబాబు బాధ్యతగా ఆలోచించడం లేదన్నారు. తుంగభద్ర నుంచి 20 టీఎంసీల నీరు కిందకు పోతుంటే ఎందుకు ఆలోచించడం లేదని ప్రశ్నించారు. సాధించుకున్న నీటిని కాపాడుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. జిల్లాలో అధికార పార్టీకి 12 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు ఉన్నారని, పట్టిసీమకు రూ.1,600 కోట్లు ఇచ్చి హంద్రీ-నీవాకు ఎందుకు ఇవ్వరని నిలదీయాలని సూచించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్ మాట్లాడుతూ చంద్రబాబుకు ఇతర పార్టీల వారిని తమ పార్టీలోకి చేర్చుకోవడంపై ఉన్న శ్రద్ధ ఇతర అంశాలపై లేదని మండిపడ్డారు. హామీలు అమలు చేయలేని వారికి జిల్లా గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ హంద్రీ-నీవా ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు కుట్ర చేస్తున్నారన్నారు. జీడిపల్లి రిజర్వాయర్‌కు వచ్చిన సమయంలో 80 వేల ఎకరాలకు నీరిచ్చే ప్యాకేజీని రద్దు చేయాలని మౌఖికంగా చెప్పారన్నారు. హంద్రీ-నీవా డిజైన్ మార్చి కుప్పంకు నీరు తీసుకుపోయేందుకు సిద్ధపడ్డారన్నారు. దీనిపై ప్రజలను చైతన్యవంతుల్ని చేసి ఉద్యమాన్ని గ్రామ స్థాయి నుంచి తీసుకురావాలన్నారు. అనంతరం నాయకులు సీఎంకు బహిరంగ లేఖ విడుదల చేశారు. సమావేశంలో వైఎస్ఆర్ సీపీ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యూపీనాగిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి నయిముద్దీన్, శింగనమల నియోజకవర్గ నేత ఆలూరు సాంబశివారెడ్డి, పార్టీ నేత మహానందరెడ్డి, అనంతపురం అభివృద్ధి వేదిక అధ్యక్షుడు వీకేరంగారెడ్డి, మానవహక్కుల సంఘం నేత బాషా, కాంగ్రెస్ నాయకులు కేటీ శ్రీధర్, కేవీరమణ, మాజీ ఎమ్మెల్యే నాగరాజరెడ్డి తదితరులు పాల్గొన్నారు. బహిరంగ లేఖలోని ప్రధానాంశాలు ‘హంద్రీ-నీవా ద్వారా జిల్లాలో 3.50 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీటిని గత ప్రభుత్వం కేటాయిస్తే, తమరు అధికారంలోకి వచ్చిన తర్వాత డిస్ట్రిబ్యూటరీ పనులను నిలిపివేస్తూ ఎందుకు ఆదేశాలిచ్చారు? తుంగభద్ర సమాంతర కాలువ ద్వారా జిల్లాను సస్యశ్యామలం చేస్తామని పెద్దపెద్ద ప్రకటలు ఇచ్చారు. రెండేళ్లు పూర్తయ్యింది. సమాంతర కాలువ ఎక్కడుంది? తుంగభద్ర ఎగువ కాలువ ఆధునికీకరణ పనులకు రూ.220 కోట్లు అవసరముంటే బడ్జెట్లో రూ.17 కోట్లు మాత్రమే ఇవ్వడం ఎంతవరకు సమంజసం? రూ.5 వేల కోట్లు అవసరమైన హంద్రీ-నీవాకు రూ.504 కోట్లు బడ్జెట్లో ఇవ్వడం న్యాయంగా ఉందా? పంటలు పండలేదని జిల్లాలోని 63 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించారు. అలాంటప్పుడు జిల్లాలోని రైతులందరికీ పెట్టుబడి రాయితీని రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. కానీ నిబంధనలు వర్తించవంటూ ఎగనామం పెట్టారు. ఇక మీరు కరువు పీడిత రైతులకు ఇచ్చింది ఏమిటో చెప్పండి. గతంలో ఇరిగేషన్ కమిషన్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కమిటీ సూచించిన విధంగా జిల్లాకు 100 టీఎంసీల నీరు లేదా 33 శాతం సాగు భూమికి నీరు ఇవ్వాలనే అంశాలను మీరెందుకు ఆలోచించరు? మాయ మాటలు చెబుతూ కరువు జిల్లాతో ఎందుకు పరిహాసమాడతారు? కేవలం 550 మిల్లీమీటర్ల వర్షపాతం కురుస్తున్న జిల్లాలో ఫారంపాండ్లతోనే కరువు పోతుందా? గతంలో చెక్‌డ్యాంల ద్వారా కరువు పోతుందన్నారు. ఇప్పుడు ఇంకుడు గుంతల ద్వారా కరువు పోతుందని చె బుతున్నారు. చిత్తశుద్ధిలేని ప్రకటనలతో మీరెంతో కాలం మా జిల్లా ప్రజలను మోసం చేయలేరు. ఇప్పటికైనా వాస్తవంలోకి రండి.’ -
హంద్రీ-నీవా నీటి కోసం ప్రతి ఒక్కరూ ఉద్యమించాలి
► అనంతను కోనసీమగా చేసుకుందాం ► వైఎస్సార్సీపీ రాప్తాడు సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి రాప్తాడు : హంద్రీ-నీవా నీటితో అనంత జిల్లాను కోనసీమగా మార్చుకుందామని, ఇందు కోసం ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని , ప్రతి ఒక్కరూ తనకు సహకరించి ముందుకు సాగాలని వైఎస్సార్సీపీ రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం మండలంలోని గాండ్లపర్తి, యర్రగుంట, బొగినేపల్లి గ్రామాల్లో హంద్రీ-నీవా ఆయకట్టు సాధన సమితి ఆధ్వర్యంలో ‘హంద్రీ-నీవా ఆయకట్టు చైతన్యయాత్ర’ను నిర్వహించారు. ఈ సందర్భంగా తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ హంద్రీనీవాను పూర్తి చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. పీఏబీఆర్ కుడికాలువ ద్వారా మన చెరువులకు నీరు చేరిందంటే అది దివంగత నేత వైఎస్ చాలువేనన్నారు. హంద్రీనీవా ద్వారా 23 టీఎంసీల నీటితో జిల్లాను సస్యశ్యామం చేసుకోవచ్చని తెలిపారు. టీడీపీ అధికారంలోకి రాగానే చంద్రబాబు నాయుడు ప్రత్యేక జీవో 22 విడుదల చేసి హంద్రీనీవా డిజైన్‌ను మార్చి, జిల్లాలో ఆయకట్ల (డిస్టిబ్యూటర్స్)ను తొలగించారన్నారు. వైఎస్ఆర్ ప్రతి రైతు భూమి తడవాలనే ఉద్ధేశంలో పిల్ల, పంట కాలువను ఏర్పాటు చేస్తే, బాబు ప్రత్యేక జీవో ద్వారా వాటిని తొలగించారన్నారు. బాబు రాగానే చాలా ప్యాకేజీలను రద్దు చేశారన్నారు. మంత్రి పరిటాల సునీత లేఖ రాయడంతోనే హంద్రీనీవా పాత కాంట్రాక్టర్లను ప్రభుత్వం రద్దు చేసి, కొత్త కాంట్రాక్టర్లు సీఎం.రమేష్, సురేంద్రచౌదరిలకు దాదాపుగా రూ. 200 కోట్లు లబ్ధి చేకూరేలా రూపకల్పన చేశారని ఆరోపించారు. మండలాల్లో ఒక్కొక్క గ్రామానికి రూ. 12 లక్షలు ఇస్తూ, ఏకంగా ఆ గ్రామం మీదే రూ. 12 కోట్లు మంత్రి దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. హంద్రీనీవా ఆయకట్టు సాధనకు ఈ నెల 20వ తేదిన రాప్తాడులో భారీ బహిరంగ ఏర్పాటు చేశామనీ, ఆ సభకు అన్ని పార్టీల నాయకులు, ప్రజలు హాజరై విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీ ఫ్లోర్ లీడర్ వెన్నపూస రవీంద్రారెడ్డి, జిల్లా కార్యదర్శి సాకే నారాయణ, మండల కన్వీనరు బోయ రామాంజినేయులు, నాయకులు రాము, శేఖర్, బీరన్న, బాలకృష్ణారెడ్డి, చిన్న కృష్ణారెడ్డి, గాండ్లపర్తి నాయుడు, శివయ్య, యర్రగుంట కేశరెడ్డి, సర్పంచు నారాయణమ్మ, వెంకటేష్, పుల్లారెడ్డి, సీపీఐ నాయకులు నాగరాజు, నరేంద్ర చలపతి, పెద్దన్న తదితరులు పాల్గొన్నారు. -
ఆయకట్టు బీడే!
► హంద్రీ-నీవా అసలు ఉద్దేశాన్ని మార్చేస్తున్న సర్కార్ ► డిస్ట్రిబ్యూటరీ పనులు పూర్తి చేసి కుప్పంకు నీటిని తరలించడమే లక్ష్యం ► ఇప్పుడు ఆయకట్టును పూర్తిగా డిజైన్ నుంచి తొలగిస్తున్న వైనం ► ఉద్యమానికి సిద్ధమవుతున్న ప్రతిపక్షాలు సాక్షి ప్రతినిధి, అనంతపురం వర్షాలు లేక... సాగునీళ్లు ‘కరువై’ పంట పండించలేక లక్షలమంది ‘అనంత’లో వలసలు పోతున్నారు. ఈ రెండేళ్లలో 154 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అయినా సీఎం చంద్రబాబుకు రైతులపై కాసింత కనికరం కూడా కలగలేదు. నీళ్లిచ్చి పంట పొలాలను...పంటలు పండించి రైతులను ఆదుకుందామనే ఆలోచన రాలేదు. చిత్తూరు, కుప్పంకు నీళ్ల తరలించడమే లక్ష్యంగా హంద్రీ-నీవా పనులు చేయిస్తున్నారు. జిల్లాలో గతేడాది 4 లక్షల మంది రైతులు వలస వెళ్లారంటే జిల్లాలో కరువు ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ పరిస్థితులన్నీ కేవలం సాగునీటి వనరులు లేక తలెత్తుతున్నావే. 2003 ముందు కూడా ‘అనంత’ పరిస్థితులు దుర్భరంగానే ఉండేవి. ఈ నేపథ్యంలో 2004లో అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖరరెడ్డి హంద్రీ-నీవా ప్రాజెక్టు నిర్మాణానికి పూనుకున్నారు. 2014లోపు 85 శాతం పనులు పూర్తయ్యాయి. 2012లోనే హంద్రీ-నీవా ద్వారా జిల్లాకు కృష్ణా జలాలు వచ్చాయి. జీడిపల్లి రిజర్వాయర్‌లో తొణికిసలాడుతున్న కృష్ణమ్మను చూసి ‘అనంత’ రైతులు, ప్రజాసంఘాల ప్రతినిధులు ‘అనంత’ రాత మారుతుందని ఆశపడ్డారు. రిజర్వాయర్ నుంచి ఇక బీడు భూములకు పారడమే తరువాయి అని భావించారు. ఆశలు అడియాసలు! హంద్రీ-నీవా ద్వారా జిల్లాలో 3.45 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఇందులో ఫేజ్-1 ద్వారా 1.18 లక్షలు, ఫేజ్-2 ద్వారా 2.27 లక్షల ఎకరాలు నీరు అందించాలి. ఫేజ్-1లో జీడిపల్లి రిజర్వాయర్ వరకూ ప్రధాన కాలువ పనులు పూర్తయ్యాయి. అక్కడి నుండి గొల్లపల్లి రిజర్వాయర్‌కు కాలువ పనులు జరుగుతున్నాయి. అయితే ఆయకట్టు పనులు చేయవద్దని ప్రభుత్వం గతేడాది ఫిబ్రవరి 23న జీవో 22 జారీ చేసింది. ఇప్పుడు తాజాగా ఆయకట్టును ప్రాజెక్టు నుంచి తొలగిస్తోంది. 2, 3, 4, 5. 7. 25, 1 ప్యాకేజీల నుంచి 85 వేల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించాలి. అలాగే 36వ ప్యాకేజి పరిధిలోని బ్రహ్మసముద్రం, జీడిపల్లి, ఉరవకొండ, బెళుగుప్ప, కణేకల్లు, గుమ్మఘట్ట, రాయదుర్గం పరిధిలోని ఆయకట్టుకు నీళ్లివ్వాలి. ఈ ప్యాకేజీలన్నింటికీ పాత టెండర్లు రద్దు చేసి కొత్త టెండర్లు ఆహ్వానించి పనులు చేయిస్తున్నారు. అయితే 36వ ప్యాకేజి పనులు ఎవరికీ కేటాయించలేదు. దీనికి భూసేకరణ సమస్యను సాకుగా చూపారు. వీటిలో ఆయకట్టుకు సంబంధించిన పనులు లేవు. ఆయకట్టుకు నీళ్లిచ్చేందుకు డిస్ట్రిబ్యూటరీకి ఎకరాకు రూ.4,700 కాంట్రాక్టర్‌కు ఇచ్చేందుకు ప్రభుత్వం ధర నిర్ణయించింది. ఈ ధర తెలంగాణలో రూ.12 వేల వరకూ ఉంది. దీంతో జీవో నెంబరు 22ను అడ్డుపెట్టుకుని కాంట్రాక్టర్లు తాము డిస్ట్రిబ్యూటరీ పనులు చేయలేమని ప్రభుత్వానికి నివేదించారు. అయితే ఇదంతా బూటకమని తెలుస్తోంది. ఎకరాకు రూ.9 వేలకు పెంచుతూ గతంలో జీవో 63 జారీ చేసినా, దాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇలా డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థకు అన్ని విధాలా ప్రభుత్వం అడ్డంకులు సృష్టించింది. అసలు ఉద్దేశం ఇదే అసలు ఆయకట్టుకు నీరిస్తే చిత్తూరు వరకూ నీళ్లు తీసుకెళ్లే అవకాశాలు తక్కువ. 40 టీఎంసీల నీళ్లు ఎత్తి పోయడం అంతసులువు కాదు. పట్టిసీమ నుంచి గోదావరి నీళ్లు డెల్టాకు ఇచ్చి, శ్రీశైలం నీళ్లు మొత్తం సీమకు ఇస్తామని చెబుతున్నా, అన్ని నీళ్లు ఎత్తిపోసే అవకాశం తక్కువగా ఉండటంతోనే ఆయకట్టుకు బ్రేక్ వేశారు. మొదట కుప్పం నీళ్లు తీసుకెళ్లి కాలువ పరిధిలోని ప్రాంతాల్లో చెరువులకు నీళ్లిచ్చేందుకు సిద్ధమయ్యారు. తర్వాత నీటి లభ్యతను బట్టి ఆలోచించొచ్చని భావిస్తున్నారు. దీనికి తోడు కరెంటు బిల్లులు సాకుగా చూపి మెయింటెనెన్స్ ఎక్కువగా వస్తుందని ఆయకట్టుకు నీరిచ్చే ప్రక్రియకూ బ్రేక్ వేశారు. దీంతో కేవలం చెరువులకు నీళ్లిచ్చే ప్రాజెక్టుగానే హంద్రీ-నీవా మిగిలే పరిస్థితి తలెత్తింది. ప్రభుత్వ వైఖరిని నిశితంగా పరిశీలిస్తున్న రాజకీయపార్టీల నేతలు, రైతు, ప్రజాసంఘాల ప్రతినిధులు ‘అనంత’కు జరుగుతున్న అన్యాయాన్ని పసిగట్టారు. హక్కుగా దక్కాల్సిన జలాలను దక్కించుకునేందుకు పోరుకు సిద్ధమయ్యారు. ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్సీపీతో పాటు సీపీఎం, సీపీఐ పోరుకు సిద్ధమయ్యాయి. ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తాం జిల్లాకు సాగునీరందించేందుకు గత ప్రభుత్వ హయూంలో హంద్రీ-నీవా ప్రాజెక్టుకు రూపకల్పన జరిగింది. 40 టీఎంసీలో 23 టీఎంసీలు జిల్లాకు కేటాయించారు. తద్వారా జిల్లాలో 3.50 లక్షల ఎకరాలకు సాగునీరు, కొన్ని పట్టణాలకు తాగునీరు అందించాలనేది ఉద్దేశం. అయితే చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం జీవో 22ని విడుదల చేసి తూట్లు పొడిచింది. కేవలం చెరువులకు అడపాదడపా నీరు ఇస్తే సరిపోతుందనే ఉద్దేశం ఉన్నట్లుగా కనిపిస్తోంది. దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. నిర్దేశించిన విధంగా 3.50 లక్షల ఎకరాలకు, జిల్లాలోని అన్ని చెరువులకు నీరివ్వాలి. లేకపోతే ప్రతిపక్ష పార్టీలను, ప్రజాసంఘాలను కలుపుకుని పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం నిర్మిస్తాం. -డి.జగదీశ్, సీపీఐ జిల్లా కార్యదర్శి పోరాటం సాగిస్తాం గత ప్రభుత్వం నిర్ణయించిన విధంగా హంద్రీ-నీవా ద్వారా జిల్లాలో 3.50 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలి. ఆయకట్టును తొలగించడం అంటే జిల్లా రైతాంగానికి తీరని ద్రోహం చేయడమే అవుతుంది. హంద్రీ-నీవా ప్రాజెక్టు ఉద్దేశానికి తూట్లు పొడిచి మొక్కుబడిగా కొద్ది చెరువులకు నీరిస్తే సరిపోతుందనే ఆలోచనలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నట్లుగా కనిపిస్తోంది. జిల్లా అభివృద్ధే ధ్యేయమని చంద్రబాబు పదేపదే చెప్పే మాటలకు చేతలకు పొంతన ఇసుమంతైనా కనిపించడం లేదు. హంద్రీ-నీవా కింద నిర్దేశించిన ఆయకట్టుకు కచ్చితంగా నీరు ఇవ్వాల్సిందే. లేని పక్షంలో ఈ ప్రభుత్వంపై ప్రజా పోరాటం సాగిస్తాము. వి.రాంభూపాల్, సీపీఎం జిల్లా కార్యదర్శి -
కృష్ణా జలాల కోసం ఉద్యమించండి
పార్టీ శ్రేణులకు సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీశ్ పిలుపు అనంతపురం అర్బన్ : హంద్రీ-నీవా నుంచి ఆయకట్టు భూములకు కృష్ణా జలాలను మళ్లించేందుకు ఉద్యమించాలని పార్టీ శ్రేణులకు సీపీఐ జిల్లా కార్యదర్శి డి.జగదీశ్ పిలుపునిచ్చారు. స్థానిక సీపీఐ కార్యాలయంలో బుధవారం జరిగిన రాప్తాడు నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే అనంతపురం జిల్లాలో ప్రభుత్వం చేపట్టిన ఫారంపాండ్లు, రెయిన్ గన్ల ద్వారా వ్యవసాయం ఆశించిన ఫలితాన్ని ఇవ్వబోదని స్పష్టం చేశారు. జిల్లాకు కృష్ణా జలాలు మళ్లించి నిర్దేశించిన నాలుగు లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు అందించడంతో పాటు జిల్లాలోని చెరువులన్నింటిని నింపాలని డిమాండ్ చేశారు. జిల్లావ్యాప్తంగా 3.50 లక్షల ఎకరాలకు హంద్రీ-నీవా ద్వారా సాగునీటిని గత ప్రభుత్వం కేటాయించిందని గుర్తు చేశారు. అయితే దీనికి గండి కొడుతూ సాగునీరు అందించే పిల్లకాలువల నిర్మాణాన్ని ప్రస్తుత తెలుగుదేశం ప్రభుత్వం నిలిపి వేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేరూరు, బీటీ ప్రాజెక్టులకు కృష్ణా జలాలు అందించే నిర్మాణ పనులకు నిధులను కేటాయించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధిని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందన్నారు. వలసలు, ఆత్మహత్యలను నివారించేందుకు ఎలాంటి చర్య లూ చేపట్టలేదని ఆరోపించారు. సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు సి.మల్లికార్జున, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కాటమయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కేశవరెడ్డి, మహిళ సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.పద్మావతి, గిరిజన సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి రామాంజినేయులు, రాప్తాడు నియోజకవర్గ కార్యదర్శి రామకృష్ణ, మండల కార్యదర్శి నాగరాజు పాల్గొన్నారు.