హంద్రీ-నీవా ఆయకట్టుకు ఎగనామం
► జిల్లా రైతుల పొట్ట కొట్టి వేరే జిల్లాకు నీరు తీసుకెళ్లే కుట్ర
► కలసికట్టుగా జిల్లాను కాపాడుకోవాలి
► లేదంటే భావితరాలకు అన్యాయం
► ఆయకట్టు సాధన సమితి సమావేశంలో నాయకులు
► సీఎంకు బహిరంగ లేఖ
► 3న చేపట్టాల్సిన మహాధర్నా వాయిదా
అనంతపురం అర్బన్ : ‘హంద్రీ-నీవా ద్వారా జిల్లాలో 3.50 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరివ్వాల్సి ఉంది. అయితే.. చంద్రబాబు ఎగనామం పెట్టారు. పొలాలకు నీరిచ్చే డిస్ట్రిబ్యూటరీ (కాలువల) పనులు నిలిపివేయాలంటూ జీవో 22 విడుదల చేశారు. జిల్లా రైతుల పొట్టకొట్టి వేరే జిల్లాకు నీరు తీసుకెళ్లేందుకు కుట్ర చేస్తున్నార’ని హంద్రీ-నీవా సాధన సమితి నాయకులు ధ్వజమెత్తారు. జిల్లాకు సాధించిన నీటిని కలసికట్టుగా కాపాడుకోకపోతేభవిష్యత్ తరాలకు అన్యాయం జరుగుతుందన్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల ద్వారా జిల్లాకు జరుగుతున్న అన్యాయంపై ప్రజలను చైతన్యవంతుల్ని చేయాల్సిన అవసరముందన్నారు. మే 3న తలపెట్టిన మహాధర్నా తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
బుధవారం అనంతపురం నగరంలోనివీకే మెమోరియల్ హాలులో హంద్రీ-నీవా ఆయకట్టు సాధన సమితి జిల్లా కన్వీనర్ జగదీశ్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.ముఖ్యఅతిథులుగా వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యద ర్శి అనంతవెంకటరామిరెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్, వైఎస్‌ఆర్‌సీపీ రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ హంద్రీ-నీవా విషయంలో చంద్రబాబుకుచిత్తశుద్ధి లేదన్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి 1996లో ఉరవకొండ వద్ద ఒకసారి, 1999లో ఆత్మకూరు వద్ద రెండోసారి శంకుస్థాపన చేశారన్నారు. టీడీపీ అధికారంలో ఉన్న 2004 వరకు ఒక్క కిలోమీటర్ మేర కూడా కాలువ పనులు ముందుకు సాగలేదన్నారు.
ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖరరెడ్డి ఉరవకొండ వద్ద ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడంతో పాటు రూ.6 వేల కోట్ల నిధులు ఇచ్చారని గుర్తు చేశారు. 2009లో వైఎస్ భౌతికంగా దూరమయ్యాక.. ఆ తరువాత సీఎంగా ఉన్న రోశయ్య, కిరణ్‌పై ఒత్తిడి చేసి మొదటి దశగా 2012లో జీడిపల్లి వరకు నీటిని తెచ్చామని వివరించారు. ఈ పథకం ద్వారా నిర్దేశించిన ఆరు లక్షల ఎకరాల్లో 3.50 లక్షల ఎకరాల ఆయకట్టు జిల్లాలోనే ఉందన్నారు. మొదటి దశ కింద 2014లోనే భూములకు నీరివ్వాల్సి ఉందన్నారు. ఎన్నికల సమయంలో ఆరు లక్షల ఎకరాలకు నీరిస్తామని టీడీపీ చెప్పిందని, అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా అతీగతీ లేదని విమర్శించారు.
ఆయకట్టుకు ఎగనామం పెడుతూ జీవో ఇచ్చిన చంద్రబాబు చెరువులకు నీరిస్తామని అంటున్నారని, ఎప్పుడు, ఎలా ఇస్తారో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. సంక్షేమ పథకాలపై వైఎస్‌ఆర్ ముద్ర ఉండటంతో వాటికి పేర్లు మారుస్తూ, చెడగొట్టేందుకు కుట్ర చేస్తున్నారనిపిస్తోందన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ జిల్లాలో శాశ్వత కరువు నివారణకు హంద్రీ-నీవా ఒక్కటే మార్గమన్నారు. అయితే.. పొలాల్లో గుంతలు తవ్వించి కరువును పారదోలతానని చంద్రబాబు ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. గోదావరి పుష్కరాలకు రూ.1600 కోట్లు ఖర్చు చేసి 30 మంది ప్రాణాలు తీశారని మండిపడ్డారు. కరువు ప్రాంతానికి మాత్రం డబ్బు ఇవ్వకుండా గుంతలు తవ్వుకోండని ఉచిత సలహా ఇస్తున్నారన్నారు.
రాష్ట్రాభివృద్ధిని విస్మరించి అమరావతి చుట్టూ తిరుగుతున్నారని దుయ్యబట్టారు. ఎమ్మెల్యే విశ్వేశ్వరెడ్డి మాట్లాడుతూ జిల్లా గురించి చంద్రబాబు బాధ్యతగా ఆలోచించడం లేదన్నారు. తుంగభద్ర నుంచి 20 టీఎంసీల నీరు కిందకు పోతుంటే ఎందుకు ఆలోచించడం లేదని ప్రశ్నించారు. సాధించుకున్న నీటిని కాపాడుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. జిల్లాలో అధికార పార్టీకి 12 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు ఉన్నారని, పట్టిసీమకు రూ.1,600 కోట్లు ఇచ్చి హంద్రీ-నీవాకు ఎందుకు ఇవ్వరని నిలదీయాలని సూచించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్ మాట్లాడుతూ చంద్రబాబుకు ఇతర పార్టీల వారిని తమ పార్టీలోకి చేర్చుకోవడంపై ఉన్న శ్రద్ధ ఇతర అంశాలపై లేదని మండిపడ్డారు. హామీలు అమలు చేయలేని వారికి జిల్లా గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ హంద్రీ-నీవా ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు కుట్ర చేస్తున్నారన్నారు. జీడిపల్లి రిజర్వాయర్‌కు వచ్చిన సమయంలో 80 వేల ఎకరాలకు నీరిచ్చే ప్యాకేజీని రద్దు చేయాలని మౌఖికంగా చెప్పారన్నారు.
హంద్రీ-నీవా డిజైన్ మార్చి కుప్పంకు నీరు తీసుకుపోయేందుకు సిద్ధపడ్డారన్నారు. దీనిపై ప్రజలను చైతన్యవంతుల్ని చేసి ఉద్యమాన్ని గ్రామ స్థాయి నుంచి తీసుకురావాలన్నారు. అనంతరం నాయకులు సీఎంకు బహిరంగ లేఖ విడుదల చేశారు. సమావేశంలో వైఎస్‌ఆర్ సీపీ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యూపీనాగిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి నయిముద్దీన్, శింగనమల నియోజకవర్గ నేత ఆలూరు సాంబశివారెడ్డి, పార్టీ నేత మహానందరెడ్డి, అనంతపురం అభివృద్ధి వేదిక అధ్యక్షుడు వీకేరంగారెడ్డి, మానవహక్కుల సంఘం నేత బాషా, కాంగ్రెస్ నాయకులు కేటీ శ్రీధర్, కేవీరమణ, మాజీ ఎమ్మెల్యే నాగరాజరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బహిరంగ లేఖలోని ప్రధానాంశాలు
‘హంద్రీ-నీవా ద్వారా జిల్లాలో 3.50 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీటిని గత ప్రభుత్వం కేటాయిస్తే, తమరు అధికారంలోకి వచ్చిన తర్వాత డిస్ట్రిబ్యూటరీ పనులను నిలిపివేస్తూ ఎందుకు ఆదేశాలిచ్చారు? తుంగభద్ర సమాంతర కాలువ ద్వారా జిల్లాను సస్యశ్యామలం చేస్తామని పెద్దపెద్ద ప్రకటలు ఇచ్చారు. రెండేళ్లు పూర్తయ్యింది. సమాంతర కాలువ ఎక్కడుంది? తుంగభద్ర ఎగువ కాలువ ఆధునికీకరణ పనులకు రూ.220 కోట్లు అవసరముంటే బడ్జెట్‌లో రూ.17 కోట్లు మాత్రమే ఇవ్వడం ఎంతవరకు సమంజసం? రూ.5 వేల కోట్లు అవసరమైన హంద్రీ-నీవాకు రూ.504 కోట్లు బడ్జెట్‌లో ఇవ్వడం న్యాయంగా ఉందా? పంటలు పండలేదని జిల్లాలోని 63 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించారు. అలాంటప్పుడు జిల్లాలోని రైతులందరికీ పెట్టుబడి రాయితీని రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. కానీ నిబంధనలు వర్తించవంటూ ఎగనామం పెట్టారు.
ఇక మీరు కరువు పీడిత రైతులకు ఇచ్చింది ఏమిటో చెప్పండి. గతంలో ఇరిగేషన్ కమిషన్, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కమిటీ సూచించిన విధంగా జిల్లాకు 100 టీఎంసీల నీరు లేదా 33 శాతం సాగు భూమికి నీరు ఇవ్వాలనే అంశాలను మీరెందుకు ఆలోచించరు? మాయ మాటలు చెబుతూ కరువు జిల్లాతో ఎందుకు పరిహాసమాడతారు? కేవలం 550 మిల్లీమీటర్ల వర్షపాతం కురుస్తున్న జిల్లాలో ఫారంపాండ్లతోనే కరువు పోతుందా? గతంలో చెక్‌డ్యాంల ద్వారా కరువు పోతుందన్నారు. ఇప్పుడు ఇంకుడు గుంతల ద్వారా కరువు పోతుందని చె బుతున్నారు. చిత్తశుద్ధిలేని ప్రకటనలతో మీరెంతో కాలం మా జిల్లా ప్రజలను మోసం చేయలేరు. ఇప్పటికైనా వాస్తవంలోకి రండి.’