లోటుపాట్లు సరిచేసుకుంటూ పార్టీ బలోపేతానికి అందరం పనిచేద్దాం
వైఎస్సార్ ఆశయ సాధన కోసం వైఎస్ జగన్ ఎంతో కృషిచేస్తున్నారు
హామీలు నెరవేర్చటం కష్టమని అప్పుడే చంద్రబాబు సన్నాయి నొక్కులు
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి
పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా వైఎస్సార్ జయంతి
సాక్షి, అమరావతి: ప్రజల పక్షాన పోరాటానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టంచేశారు. సమకాలీన చరిత్రను మనం ప్రత్యక్షంగా చూశామని, ఆ సంక్షోభం, ప్రజల కష్టాల్లో నుంచి పుట్టిందే వైఎస్సార్‌సీపీ అని గుర్తుచేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద సోమవారం దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 75వ జయంతిని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ.. వైఎస్సార్ రక్తం పంచుకున్న బిడ్డగానే కాకుండా ఆయన ఆశయాలకు వారసుడిగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పోరాటాల మధ్యనే ఈ పార్టీని ప్రారంభించారని గుర్తుచేశారు. ఆ రోజు నుంచి కోట్ల మందికి జగన్ ఆశాదీపం అయ్యారన్నారు. వైఎస్సార్‌కి మించి అడుగులు ముందుకు వేసే బిడ్డగా జగన్ ఈ రాష్ట్రానికి 30 ఏళ్లలో జరగాల్సిన అభివృద్ధిని తన ఐదేళ్ల పాలనా కాలంలో అందరూ గర్వపడేలా చేసి చూపించారన్నారు. వైఎస్సార్ ఆశయ సాధన కోసం జగన్ ఎంతో కృషిచేస్తున్నారన్నారు. సజ్జల ఇంకా ఏమన్నారంటే...
విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు..
రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలను అమలుచేశాం. ఎన్నికల్లో ప్రజల తీర్పును గౌరవిస్తున్నాం. అసాధ్యమైన హామీలతో ప్రత్యర్థులు అందలమెక్కారు. హామీలిచ్చి మోసం చేయటం, ప్రజలను భ్రమల్లో ఉంచటం వైఎస్ జగన్‌కి చేతకాదు. కులం, మతం, ప్రాంతం, రాజకీయాలతో పనిలేకుండా ఆయన పాలించారు. విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. ఇళ్ల ముంగిటకే ఆయన పరిపాలన అందించారు. ప్రజల్లో మమేకమైన పార్టీగా మన ప్రయాణం అనంతం. అది ఆగిపోదు. ఎన్నికల ఫలితాలపై అనుమానాలున్నా లోతుకుపోవటం సరైంది కాదు.
మరోసారి మోసానికి బాబు శ్రీకారం..
ఇక అధికారంలోకి వచ్చి నెల దాటిందో లేదో ఇచ్చిన హామీలు ఇప్పట్లో నెరవేర్చటం కష్టమని అప్పుడే చంద్రబాబు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలిసి కూడా ప్రజల్ని మోసం చేసి ఎన్నికల్లో గెలిచేందుకు ఆయన అలవిగాని హామీలిచ్చారు. ఆసాధ్యమైన హామీలిచ్చి 2014లో ప్రజలను ఎలా మోసం చేశారో ఇప్పుడు ఆదే రీతిలో మరోసారి మోసానికి బాబు శ్రీకారం చుట్టారు. ఖజానా ఇంత ఖాళీ అయి ఉంటుంది అనుకోలేదని అప్పుడే చంద్రబాబు అంటున్నారు. ఖజానా బాగాలేదు కాబట్టి హామీలు నెరవేర్చటం కష్టమని ఆయన చెప్పకనే చెబుతున్నారు. ఇది అత్యంత మోసం, దగా.
రాష్ట్రం రావణకాష్టం..
అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచి రాష్ట్రంలో ఎలా ఆరాచకం సృష్టిస్తున్నారో చూస్తున్నాం. రాష్ట్రాన్ని ఎలా రావణకాష్టం చేస్తున్నారో, ఎలా దాడులు చేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారు. సామాన్యులు తిరగలేని పరిస్థితి తీసుకొచ్చారు. ఐదేళ్లలో రూపుదిద్దుకున్న ఆరోగ్య, విద్యా వ్యవస్థలకు గండికొట్టడం ప్రారంభమైంది. వైద్యంలో స్పెషలిస్టు సేవలను నిర్వీర్యం చేస్తున్నారు. రాష్ట్రాన్ని మళ్లీ పదేళ్లు వెనక్కి తీసుకెళ్లేలా చంద్రబాబు చేస్తున్నారు. మన లోటుపాట్లు సరిదిద్దుకుని ముందుకెళ్దాం. మళ్లీ రాష్ట్రానికి పూర్వవైభవం తీసుకొద్దాం. బాబు తన గొయ్యి తానే తవ్వుకుంటున్నారు. రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లకుండా, ప్రజల దృష్టి మళ్లించేందుకు జగన్‌పైన, వైఎస్సార్‌సీపీపైన కూటమి నేతలు దాడిచేస్తున్నారు.
తాను అమలుచేయాల్సిన హామీల నుంచి తప్పించుకోవాలని బాబు చూస్తున్నారు. అది జరగకుండా.. మనం ఎక్కడా డీలాపడకుండా కలిసికట్టుగా అడుగులు వేయాలి. ప్రజల పక్షాన నిలబడే పార్టీగా మనమంతా పునరంకితం అవుదామని శపథం చేద్దాం. ఇందుకు ఇంతకంటే మంచి రోజు, వైఎస్సార్ జయంతిని మించిన రోజులేదు. అనంతరం.. మాజీమంత్రి అంబటి రాంబాబు కూడా మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో.. మాజీమంత్రి జోగి రమేష్, నాయకులు పుత్తా ప్రతాప్‌రెడ్డి, అంబటి మురళీ, మలసాని మనోహర్‌రెడ్డి, చిల్లపల్లి మోహనరావు, బత్తుల బ్రహ్మానందరెడ్డి, చల్లా మధు, కొమ్మూరి కనకారావు, ఎ.నారాయణమూర్తి, బందెల కిరణ్‌రాజ్, న్యాయవాది కొమ్మసాని శ్రీనివాస్‌రెడ్డి, మహిళా నేతలు నారమల్లి పద్మ, రజనీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘అపర భగీరథుడు వైఎస్సార్’ పుస్తకాన్ని సజ్జల ఆవిష్కరించారు.
పార్టీ కార్యాలయంలో సేవా కార్యక్రమాలు..
ఇదిలా ఉంటే.. వైఎస్ జయంతి సందర్భంగా పుత్తా ప్రతాప్‌రెడ్డి ఏర్పాటుచేసిన భారీ కేక్‌ను సజ్జల రామకృష్ణారెడ్డి కట్ చేశారు. పేదలకు వస్త్ర, అన్నదానం నిర్వహించారు. వికలాంగులకు, వృద్ధులకు చేతి కర్రలను పంపిణీ చేశారు. తొలుత.. వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి అందరూ ఘనంగా నివాళులర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment