రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా మహానేత 75వ జయంత్యుత్సవం
వివిధ రాష్ట్రాలు, దేశాల్లోనూ దివంగత సీఎంకు ఘన నివాళి
పేదలకు వస్త్ర, అన్నదానం చేసిన అభిమానులు, వైఎస్సార్‌సీపీ శ్రేణులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమానంగా ముందుకు తీసుకెళ్తూ పరిపాలనలో సమానత్వాన్ని చాటుకుంటూ ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుని పాలకుడంటే ఎలా ఉండాలో చాటిచెప్పిన మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి అని ప్రజలు, అభిమానులు, వైఎస్సార్‌సీపీ శ్రేణులు కొనియాడారు. దివంగత వైఎస్ 75వ జయంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా సోమవారం ఘనంగా నివాళులర్పించారు. ‘జోహార్ వైఎస్సార్.. వైఎస్సార్ అమర్ రహే’ అంటూ వాడవాడలా నినదించారు.
ఈ సందర్భంగా మహానేత అందించిన పథకాలను ప్రజలు గుర్తుచేసుకున్నారు. గ్రామ గ్రామాన, వాడవాడలా కేక్‌లు కట్‌చేసి, పేదలకు వస్త్ర, అన్నదానం చేసి మహానేతపై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. రాష్ట్రంలో 26 జిల్లాలు, 175 నియోజకవర్గాల్లో వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలను వైఎస్సార్‌సీపీ శ్రేణులు, అభిమానులు, ప్రజలు పండుగలా నిర్వహించారు. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ సహా వివిధ రాష్ట్రాల్లో మహానేతకు ఘనంగా నివాళులర్పించారు. ఢిల్లీలోని పార్లమెంట్ ఆవరణలో ఉన్న వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ తదితరులు కేక్ కట్‌చేసి వైఎస్సార్ చిత్రపటానికి నివాళులర్పించారు.
ఇడుపులపాయలో..
ఇక ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 75వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, మాజీ సీఎం వైఎస్ జగన్ తన తండ్రికి ఘన నివాళులర్పించారు. ఆయనతోపాటు వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతి, కుటుంబ సభ్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మహానేతకు నివాళులర్పించారు. అలాగే, పామర్రు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ కైలే అనిల్‌కుమార్ ఆధ్వర్యంలో వైఎస్సార్ విగ్రహాలకు భారీ పూలమాలలు వేసి నివాళులర్పించారు.
విదేశాల్లోనూ ఘనంగా..
వివిధ దేశాల్లోనూ ప్రవాసాంధ్రులు వైఎస్‌కు ఘనంగా నివాళులు అర్పించారు. అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా, యూకే, జర్మనీ, దక్షిణాఫ్రికా, సింగపూర్, మలేసియా, ఒమన్, యూఏఈ, సౌదీ అరేబియా తదితర దేశాల్లో ప్రవాసాంధ్రులు, భారతీయులు వైఎస్సార్ సేవలను గుర్తుచేసుకున్నారు. మెల్‌బోర్న్‌లో వైఎస్సార్‌సీపీ ఆస్ట్రేలియా కన్వీనర్ చింతలచెరువు సూర్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో కేక్‌ను కట్ చేశారు.
తెలుగు ప్రజల గుండెల్లో వైఎస్సార్: డాక్టర్ ప్రదీప్ చింతా
తెలుగుజాతి ఉన్నంత వరకు తెలుగు ప్రజల హృదయాల్లో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి పదిలంగా ఉంటారని వైఎస్సార్‌సీపీ యూకే కన్వీనర్ డాక్టర్ ప్రదీప్ చింతా తెలిపారు. పేదల దేవుడు వైఎస్సార్ అని, మనసున్న మారాజు వైఎస్సార్‌కు నీరాజనం పలుకుతున్నామన్నారు. ఇక యూకే టీం ఆధ్వర్యంలో నంద్యాలలోని పరివర్తన్ లైఫ్ సెంటర్‌లోనూ వైఎస్సార్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పిల్లలకు మందులు, దుస్తులు, ఫ్రిజ్, మంచాలు, బెడ్స్ పంపిణీ చేసి అన్నదానం చేశారు. అలాగే, ఆయన కుటుంబసభ్యుల ఆధ్వర్యంలో వైఎస్సార్ జిల్లా ముద్దనూరులోని సాంఘిక సంక్షేమ హాస్టల్‌లో కేక్ కట్‌చేసి దుప్పట్లు పంపిణీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment