కృష్ణా జలాల కోసం ఉద్యమించండి
పార్టీ శ్రేణులకు సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీశ్ పిలుపు
అనంతపురం అర్బన్ : హంద్రీ-నీవా నుంచి ఆయకట్టు భూములకు కృష్ణా జలాలను మళ్లించేందుకు ఉద్యమించాలని పార్టీ శ్రేణులకు సీపీఐ జిల్లా కార్యదర్శి డి.జగదీశ్ పిలుపునిచ్చారు. స్థానిక సీపీఐ కార్యాలయంలో బుధవారం జరిగిన రాప్తాడు నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే అనంతపురం జిల్లాలో ప్రభుత్వం చేపట్టిన ఫారంపాండ్‌లు, రెయిన్ గన్‌ల ద్వారా వ్యవసాయం ఆశించిన ఫలితాన్ని ఇవ్వబోదని స్పష్టం చేశారు. జిల్లాకు కృష్ణా జలాలు మళ్లించి నిర్దేశించిన నాలుగు లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు అందించడంతో పాటు జిల్లాలోని చెరువులన్నింటిని నింపాలని డిమాండ్ చేశారు. జిల్లావ్యాప్తంగా 3.50 లక్షల ఎకరాలకు హంద్రీ-నీవా ద్వారా సాగునీటిని గత ప్రభుత్వం కేటాయించిందని గుర్తు చేశారు.
అయితే దీనికి గండి కొడుతూ సాగునీరు అందించే పిల్లకాలువల నిర్మాణాన్ని ప్రస్తుత తెలుగుదేశం ప్రభుత్వం నిలిపి వేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేరూరు, బీటీ ప్రాజెక్టులకు కృష్ణా జలాలు అందించే నిర్మాణ పనులకు నిధులను కేటాయించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధిని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందన్నారు.
వలసలు, ఆత్మహత్యలను నివారించేందుకు ఎలాంటి చర్య లూ చేపట్టలేదని ఆరోపించారు. సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు సి.మల్లికార్జున, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కాటమయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కేశవరెడ్డి, మహిళ సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.పద్మావతి, గిరిజన సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి రామాంజినేయులు, రాప్తాడు నియోజకవర్గ కార్యదర్శి రామకృష్ణ, మండల కార్యదర్శి నాగరాజు పాల్గొన్నారు.