మేము ఇక్కడ పనిచేయలేం
► తెలంగాణ నాలుగో తరగతి ఉద్యోగుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహం
► పిల్లలతో వచ్చి ఇక్కడ ఎలా బతకాలని నిలదీత
► సెలవులో వెళ్లిపోతామని హెచ్చరిక
► మార్గంమధ్యలో రామచందర్ అనే ఉద్యోగికి గుండెనొప్పి
సాక్షి, అమరావతి : ఉద్యానవన శాఖ అధికారులను హైదరాబాద్ నుంచి గురువారం గుంటూరుకు తరలించారు. ఇందుకోసం ప్రభుత్వం మూడు ప్రత్యేక బస్సులను ఏర్పాటుచేసింది. గుంటూరు చుట్టుగుంట సెంటర్‌లోని పాత మార్కెట్ యార్డులో ఏర్పాటుచేసిన ఆ శాఖ నూతన కార్యాలయానికి వీరు రాత్రి 7 గంటలకు చేరుకున్నారు. మార్గంమధ్యలో రామచందర్ అనే ఉద్యోగికి గుండెనొప్పి రావడంతో చికిత్స చేయించుకుని వచ్చేసరికి వీరి ప్రయాణం ఆలస్యమైంది. ఉదయం 11 గంటలకు బయలుదేరిన ఉద్యోగులు రాత్రి 7 గంటలకు చేరడం గమనార్హం.
తెలంగాణకు చెందిన నాలుగో తరగతి ఉద్యోగులు నూతన కార్యాలయానికి చేరుకోగానే వారిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. పిల్లలను తీసుకొచ్చి ఇక్కడ ఎలా బతకాలని అందోళన వ్యక్తం చేశారు. చివరి క్షణం వరకు తమను తెలంగాణలోనే ఉంచుతామని మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఇక్కడ పనిచేయలేమని, ఆత్మహత్యలే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. సెలవు పెట్టి తిరిగి హైదరాబాద్‌కు వెళ్లి ఆందోళన చేస్తామని ఉద్యోగులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వారి ఆవేదన వారి మాటల్లోనే...
వారం రోజుల్లో రిటైరయ్యేవారిని పంపారు...
రెండు, మూడేళ్ల సర్వీసు ఉండేవారిని పంపం.. ఇక్కడే ఉంచుతామని చెప్పారు...అయితే వారం రోజుల్లో రిటైర్ అయ్యేవారిని ఇక్కడికి పంపారు. ఇది బాధాకరం. మా అత్తగారి ఊరు బాపట్ల కాబట్టి సొంతూరుకు వచ్చానన్న ఆనందం కలుగుతోంది. -వసుంధర దేవి, సూపరింటెండెంట్
ఇబ్బందులు పడతాం
మేము క్లాస్-4 ఉద్యోగాలు చేస్తూ కుటుంబాలు పోషించుకుంటున్నాం. మా జీతభత్యాలు చాలా తక్కువ. రిటైర్మెంట్‌కు అతి దగ్గర్లో ఉన్న ఉద్యోగులు చాలామంది ఉన్నారు. నిర్దాక్షిణ్యంగా ఆంధ్రాకు బదిలీ చేయడంతో క్లాస్-4 ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తెలంగాణ వదిలి, ఆంధ్రాకు వచ్చి జీవనాన్ని కొనసాగించలేం. తెలంగాణలోనే ఉద్యోగ బాధ్యతలు నిర్వహించేలా చూడాలని మా యూనియన్ నేతలను కోరుతున్నా.
-ఎన్.రామచందర్, క్లాస్-4 ఉద్యోగి, తెలంగాణవాసి
హామీని విస్మరించారు
తెలంగాణలో పుట్టిపెరిగి ఆంధ్రాలో జీవించాలంటే సాధ్యమయ్యే పని కాదు. మా బదిలీలు ఆపాలంటూ గత నెల 31 నుంచి జూన్ 9వ తేదీ వరకు హైదరాబాద్ ఎల్‌బీ స్టేడియం వద్ద ఉన్న మా వ్యవసాయ మార్కెట్ కార్యాలయం వద్ద ధర్నా చేశాం. ఇరు రాష్ట్రాల సీఎస్‌లు, యూనియన్ నాయకులు మా బదిలీలపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సంప్రదింపులు జరిపి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో సమ్మెను విరమించాం. కాని హఠాత్తుగా మా బదిలీ ప్రక్రియ చేయడం దారుణం.
-యాదగిరి, క్లాస్-4 ఉద్యోగి, తెలంగాణ వాసి