Horticulture Department officials
-
మేము ఇక్కడ పనిచేయలేం
► తెలంగాణ నాలుగో తరగతి ఉద్యోగుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహం ► పిల్లలతో వచ్చి ఇక్కడ ఎలా బతకాలని నిలదీత ► సెలవులో వెళ్లిపోతామని హెచ్చరిక ► మార్గంమధ్యలో రామచందర్ అనే ఉద్యోగికి గుండెనొప్పి సాక్షి, అమరావతి : ఉద్యానవన శాఖ అధికారులను హైదరాబాద్ నుంచి గురువారం గుంటూరుకు తరలించారు. ఇందుకోసం ప్రభుత్వం మూడు ప్రత్యేక బస్సులను ఏర్పాటుచేసింది. గుంటూరు చుట్టుగుంట సెంటర్లోని పాత మార్కెట్ యార్డులో ఏర్పాటుచేసిన ఆ శాఖ నూతన కార్యాలయానికి వీరు రాత్రి 7 గంటలకు చేరుకున్నారు. మార్గంమధ్యలో రామచందర్ అనే ఉద్యోగికి గుండెనొప్పి రావడంతో చికిత్స చేయించుకుని వచ్చేసరికి వీరి ప్రయాణం ఆలస్యమైంది. ఉదయం 11 గంటలకు బయలుదేరిన ఉద్యోగులు రాత్రి 7 గంటలకు చేరడం గమనార్హం. తెలంగాణకు చెందిన నాలుగో తరగతి ఉద్యోగులు నూతన కార్యాలయానికి చేరుకోగానే వారిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. పిల్లలను తీసుకొచ్చి ఇక్కడ ఎలా బతకాలని అందోళన వ్యక్తం చేశారు. చివరి క్షణం వరకు తమను తెలంగాణలోనే ఉంచుతామని మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఇక్కడ పనిచేయలేమని, ఆత్మహత్యలే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. సెలవు పెట్టి తిరిగి హైదరాబాద్‌కు వెళ్లి ఆందోళన చేస్తామని ఉద్యోగులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వారి ఆవేదన వారి మాటల్లోనే... వారం రోజుల్లో రిటైరయ్యేవారిని పంపారు... రెండు, మూడేళ్ల సర్వీసు ఉండేవారిని పంపం.. ఇక్కడే ఉంచుతామని చెప్పారు...అయితే వారం రోజుల్లో రిటైర్ అయ్యేవారిని ఇక్కడికి పంపారు. ఇది బాధాకరం. మా అత్తగారి ఊరు బాపట్ల కాబట్టి సొంతూరుకు వచ్చానన్న ఆనందం కలుగుతోంది. -వసుంధర దేవి, సూపరింటెండెంట్ ఇబ్బందులు పడతాం మేము క్లాస్-4 ఉద్యోగాలు చేస్తూ కుటుంబాలు పోషించుకుంటున్నాం. మా జీతభత్యాలు చాలా తక్కువ. రిటైర్మెంట్కు అతి దగ్గర్లో ఉన్న ఉద్యోగులు చాలామంది ఉన్నారు. నిర్దాక్షిణ్యంగా ఆంధ్రాకు బదిలీ చేయడంతో క్లాస్-4 ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తెలంగాణ వదిలి, ఆంధ్రాకు వచ్చి జీవనాన్ని కొనసాగించలేం. తెలంగాణలోనే ఉద్యోగ బాధ్యతలు నిర్వహించేలా చూడాలని మా యూనియన్ నేతలను కోరుతున్నా. -ఎన్.రామచందర్, క్లాస్-4 ఉద్యోగి, తెలంగాణవాసి హామీని విస్మరించారు తెలంగాణలో పుట్టిపెరిగి ఆంధ్రాలో జీవించాలంటే సాధ్యమయ్యే పని కాదు. మా బదిలీలు ఆపాలంటూ గత నెల 31 నుంచి జూన్ 9వ తేదీ వరకు హైదరాబాద్ ఎల్బీ స్టేడియం వద్ద ఉన్న మా వ్యవసాయ మార్కెట్ కార్యాలయం వద్ద ధర్నా చేశాం. ఇరు రాష్ట్రాల సీఎస్‌లు, యూనియన్ నాయకులు మా బదిలీలపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సంప్రదింపులు జరిపి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో సమ్మెను విరమించాం. కాని హఠాత్తుగా మా బదిలీ ప్రక్రియ చేయడం దారుణం. -యాదగిరి, క్లాస్-4 ఉద్యోగి, తెలంగాణ వాసి -
ఉల్లికి ప్రోత్సాహమేదీ!
ఒంగోలు టూటౌన్ : జిల్లాలో ఉల్లికి ప్రోత్సాహం కరువయింది. ఏటా విస్తీర్ణం తగ్గుతోంది. ఉల్లి ధరలు పెరుగుతున్నా ఉద్యానశాఖ అధికారులకు నిర్లక్ష్యం వహించడం పట్ల విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం జిల్లాలో ఉల్లి సాగుతోపాటు దిగుమతులూ తగ్గిపోవడంతో ధరలు ఆకాశన్నంటుతున్నాయి. కిలో రూ.25 ఉన్న ఉల్లి ధర అమాంతంగా రూ.40 పెరిగింది. నాణ్యత చూపిస్తూ కొన్ని చోట్ల రూ.45 అమ్ముతున్నారు. దీనికి కారణం గత ఐదేళ్ళుగా పంట సాగు ఆశించిన స్థాయిలో ఉండటం లేదు. ఉద్యానశాఖ అధికారుల గణాంకాల ప్రకారం 2012లో 900 హెక్టార్లలో సాగవగా 2013లో 655 హెక్టార్లకు పడిపోయింది. 2014-15కు వచ్చే సరికి 500హెక్టార్లకు కుచించుకుపోయింది. రైతులతో మాట్లాడి ప్రోత్సాహకాలు ఇవ్వడంలో ఆ శాఖ అధికారులు నిర్లక్ష్యం చూపిస్తున్నారన్న విమర్శలున్నాయి. ఉద్యాన పంటల అభివృద్ధి కోసం రైతులకు విత్తనాలపై 50 శాతం రాయితీపై ఇవ్వటానికి 2013-14లో రూ.39 లక్షలు కేటాయించారు. అప్పట్లో వీటిని ఆ శాఖ పరిధిలో ఉన్న మిర్చి పంటకు మినహా ఏ పంటకైనా ఇవ్వవచ్చునని ప్రభుత్వ సడలింపు ఇచ్చింది. అలాంటి వీలున్న ఉల్లికోసం ఇప్పటి వరకూ కేటాయించింది నామమాత్రమేనని చెప్పవచ్చు. ఏళ్ళతరబడి ఈ పంటసాగులో తగినంత ప్రోత్సాహం లేకపోవడంతో ఈ సమస్య తలెత్తిందని పలువురు భావిస్తున్నారు. -
పుట్టగొడుగుల పెంపకంపై శిక్షణ
హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ కళాశాల ప్రతి నెలా మూడో శనివారం(ఉదయం 9 నుంచి 4 గంటల వరకు) పుట్టగొడుగుల పెంపకంపై ఒక్కరోజు శిక్షణ ఇస్తోంది. ఫీజు రూ. 500. ఇక్కడ పుట్టగొడుగుల విత్తనం అందుబాటులో ఉంది. కిలో ధర రూ. 100. ఇతర వివరాలకు కార్యాలయ పనివేళల్లో సంప్రదించవలసిన ఫోన్ నం: 040-24015011, 24015462. ఒంగోలులో.. ప్రకాశం జిల్లా ఉద్యాన శాఖ పుట్టగొడుగుల పెంపకంపై ప్రతి మంగళవారం (ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు) శిక్షణ ఇస్తోంది. ఫీజు రూ. 130. వారం రోజులు ముందుగా ఆర్డర్ ఇచ్చిన వారికి విత్తనాలు అమ్ముతారు. కిలో రూ. 100. స్థలం: ఒంగోలులోని కలెక్టరేట్ ఎదురుగా ఉన్న ఉద్యాన శాఖ కార్యాలయం (రూమ్ నం. 1). వివరాలకు 08592-231518, ఉద్యానశాఖ అధికారి శ్రీనివాసరావు 83744 49166. -
రాయితీ విత్తనం.. బహుదూరం
యాచారం: రైతులకు రాయితీ కూరగాయల విత్తనాలు అందే విషయంలో అయోమయం నెలకొంది. ఉద్యాన శాఖ కార్యాలయం ఇబ్రహీంపట్నంలో ఉండడంతో కూరగాయల విత్తనాలు ఎప్పుడు వస్తున్నాయో... విక్రయాలు ఎప్పుడు జరుగుతున్నాయో రైతులకు సమాచారం తెలియడంలేదు. వారికి ప్రభుత్వం నుంచి వచ్చే 50 శాతం రాయితీ విత్తనాలు దక్కని పరిస్థితి ఏర్పడింది. దీంతో వారు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేట్ దుకాణాల్లో విత్తనాలు కొనుగోలు చేసి నష్టపోతున్నారు. యాచారంలోనే ఉద్యాన శాఖ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి కూరగాయల రాయితీ విత్తనాలను అందించాలని స్థానిక రైతులు పలుమార్లు కోరినా ఫలితం లేకుండాపోతోంది. యాచారరం నుంచి ఇబ్రహీంపట్నం 15 కిలోమీటర్ల దూరంలో ఉండడం, పైగా ప్రయాణ ఖర్చులు రూ. 50కి పైగా కావడం, కాల యాపన అయ్యే అవకాశం ఉన్న దృష్ట్యా రైతులు ధరలు ఎక్కువగా ఉన్నా ప్రైవేట్ దుకాణాల్లోనే విత్తనాలు కొనుగోలు చేసుకుంటున్నారు. ప్రభుత్వం నుంచి రాయితీ అందుకునే అవకాశాన్ని కోల్పోతున్నారు. వంద హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో.. మండలంలోని యాచారం, గునుగల్, మొండిగౌరెల్లి, తాడిపర్తి, నందివనపర్తి, గడ్డమల్లయ్యగూడ, మాల్ తదితర గ్రామాల్లోని రైతులు 100 హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో వివిధ రకాల కూరగాయల తోటల ను సాగు చేయడానికి పొలాలను సిద్ధం చేశారు. దుక్కులు దున్ని సిద్ధంగా ఉంచుకున్నారు. ప్రైవేట్ దుకాణాల్లో కూరగాయల ధరలు భగ్గుమనడం, ఉద్యాన శాఖ నుంచి రాయితీ విత్తనాలు అందకపోవడం వల్ల రైతుల్లో ఆందోళన మొదలైంది. ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించి తక్షణమే రాయితీ కూరగాయల విత్తనాలు అందుబాటులో ఉండేలా కృషి చేయాలని రైతులు కోరుతున్నారు. ఈ విషయమై ఉద్యాన శాఖ ఇబ్రహీంపట్నం క్షేత్రస్థాయి అధికారి యాదగిరిని సంప్రదించగా మరికొద్ది రోజుల్లో రైతులకు రాయితీ విత్తనాలు పంపిణీ చేస్తామన్నారు. -
సోకిందా... గోవిందా!
దొండసాగు లాభాలు తెచ్చిపెడుతోంది. దీంతో రావులపాలెం పరిసర ప్రాంతాల్లో రైతులు ఈ సాగును సుమారు 600 ఎకరాల్లో చేపట్టారు. అయితే విరామం లేకుండా ఈ సాగు చేయడంతో వైరస్ వ్యాపించి పంట మొత్తం ఎందుకూ పనికి రాకుండా పోతోంది. రూ. లక్షలు పెట్టుబడి పెట్టిన రైతన్నలు ఈ పంటను ఎలా కాపాడుకోవాలోనని ఆందోళన చెందుతున్నాడు. పంట చేతికొచ్చే సమయానికి వైరస్ సోకి, కాయల దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతోందని లోలోపల కుమిలిపోతున్నారు. అయితే మార్కెట్లో ధర బాగుందని... విరామం లేకుండా దొండసాగు చేపట్టడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ఉద్యానశాఖాధికారులు చెబుతున్నారు. ఒక సారి పంట వేసిన తర్వాత పదేపదే అదే పంటను వేస్తే మొదటికే మోసం వస్తుందని హెచ్చరిస్తున్నారు. దీనికి పంట మార్పిడియే సరైన మందని సూచిస్తున్నారు. దొండసాగులో యాజమాన్యపద్ధతులు, వైరస్ బారిన పడకుండా పంటను ఎలా కాపాడుకోవాలి? తదితర విషయాలను వివరిస్తున్నారు కొత్తపేట ఉద్యానవనశాఖాధికారిణి ఎం.బబిత(83329 90547). ఆ సూచనలు ఆమె మాటల్లోనే... - రావులపాలెం ►దొండసాగును పీడిస్తున్న వైరస్ ►ఒక్కసారి సోకితే చాలు ఆపడం కష్టమే ►దిగుబడిపై తీవ్ర ప్రభావం ►పంట మార్పిడే సరైన మందు అంటున్న ఉద్యానశాఖాధికారులు ఏళ్ల తరబడి ఒకే పొలంలో దొండ సాగు చేస్తే సాగు మొదటిలో వ్యాపించిన వైరస్, ఇతర శిలీంధ్రాలు, ధాతువులు అదే నేలలో ఉండిపోయి బలం పుంజుకుంటాయి. దీంతో అవి తదుపరి పంటపై ప్రభావాన్ని చూపుతాయి. ఈ వైరస్ తాలూకూ అవశేషాలు నశించడానికి మందులు పెద్దగా పని చేయవు. అందుకే పంటమార్పిడి చేయాలి. దీని వల్ల సాగు సమయంలో దొండపై ప్రభావం చూపే వైరస్, ఇతర శిలీంధ్ర అవశేషాలకు పోషణ అందవు. దొండ సాగుపై ఎరువుల యాజమాన్య పద్ధతులు కోస్తాంధ్ర ప్రాంతాల్లో ఏడాది పొడవునా దొండసాగు చేపట్టవచ్చు. దొండ విత్తనం చూపుడు వేలు లావు ఉన్న కొమ్మలు నాలుగు కనుపులు ఉన్నవి రెండు చొప్పున ఒకటి నుంచి రెండు సెంటీమీటర్ల లోతులో నాటాలి. నాటే సమయంలో విత్తన శుద్ధికి కిలో విత్తనానికి మూడు గ్రాముల చొప్పున థైరమ్ ఒకసారి అరగంట విరామం అనంతరం ఐదు గ్రాముల ఇమిడాక్లోప్రిడ్ ఒకసారి కలిపి శుద్ధి చేయాలి. విత్తే ముందు ఎకరాకు ఆరు - ఎనిమిది టన్నుల పశువుల ఎరువు, 32 - 40 కిలోల భాస్వరం, 16 - 20 కిలోల పొటాష్ నిచ్చే ఎరువులను గుంటలలో వేయాలి. నత్రజని 32- 40 కిలోలు రెండు సమపాళ్లుగా చేసి విత్తిన 25 నుంచి 30 రోజుల్లో ఒకసారి, పూత పిందె దశలో ఒకసారి వేసుకోవాలి. మొక్కకు దగ్గరలో ఎరువును వేయకూడదు. ఎరువును వేసిన వెంటనే నీరు పెట్టాలి. కలుపు నివారణకు ఎకరాకు పెండిమిథాలిన్ 1.2 మీ.లీ 200 లీటర్ల నీటికి కలిపి విత్తిన 24 నుంచి 48 గంటల లోపు పిచికారీ చేయాలి. మొక్కలు రెండు - నాలుగు ఆకుల దశలో ఉన్నప్పుడు లీటరు నీటికి మూడు గ్రాముల బోరాక్స్ కలిపి ఆకులపై పిచికారీ చేస్తే ఆడపువ్వులు ఎక్కువగా పూచి పంట దిగుబడి బాగా ఉంటుంది. దొండకు వచ్చే తెగుళ్లు, సస్యరక్షణ చర్యలు ► వైరస్ నివారణకు కచ్చితంగా పంట మార్పిడి చే యాలి. పండు ఈగ(ఫ్రూట్‌ఫ్లై) సమస్యకు మిథైక్యూజనాల్, వెనిగర్, పంచదారద్రవం పది మిల్లీలీటర్లు చొప్పున కలిపి ఎకరానికి పది ఎరలు పెట్టాలి. ►కలుపు మొక్కలు లేకుండా జాగ్రత్త తీసుకోవాలి. ట్రైకోడెర్మా విరిడి దుక్కిలో వేసుకోవడం వల్ల తెగులు రాకుండా ముందుగా నివారించవచ్చు. ► బూడిద తెగులు నివారణకు డైనోక్యాప్ ఒక మిల్లీలీటరు, ఒక లీటరు నీటికి కలిపి పది రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి. నులుపురుగులు ఉన్న చోట కార్భోసల్ఫాన్ మూడు గ్రాము కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేయాలి. ► ఆకుల ఈనెల మధ్య చారలు ఏర్పడి, పెలుసుగా మారి గిడసబారిపోయి పూత, పిందె ఆగిపోతే అది వెర్రి తెగులుగా గుర్తించాలి. ఈ తెగులు సోకిన మొక్కలను నాశనం చేయాలి. ఈ తెగులు వ్యాపిస్తే బరక పురుగులను నివారించడానికి రెండు మిల్లీ లీటర్ల డైమిథాయేట్ లేదా మిథైల్ డెమటాన్ కలిపి పిచికారీ చేయాలి. ► వేరు కుళ్లు తెగులు ఉన్నట్టయితే తెగులు సోకిన తీగలు వడలిపోయి అకస్మాత్తుగా పండిపోయి ఆకులు వాడిపోతాయి. దీని నివారణకు బొర్డోమిశ్రమం ఒక శాతం లేదా కాపర్ ఆక్సీక్లోరైడ్ మందు లీటరు నీటికి మూడు గ్రాముల కలిపి ద్రావణాన్ని మొక్క మొదలు చుట్టూ నేల తడిచేలా పోయాలి. దీనిని పది రోజుల వ్యవధిలో రెండు, మూడు సార్లు చేయాలి. ► ఆఖరి దుక్కిలో వేపపండి 250 కిలోలు ఎకరాకు వేసి కలియదున్నాలి. పంట వేసిన తరువాత ట్రైకోడెర్మా విరిడి కల్చర్‌ను భూమిలో పాదుల దగ్గర వేయాలి. ► ‘తీగ’ పంటలపై గంధకం సంబంధిత పురుగు, తెగులు మందులు వాడకూడదు.