రైతుల సంక్షేమంపై చిత్తశుద్ధేదీ ?
పెదకాకాని: రైతుల రుణమాఫీ విషయంలో ప్రభుత్వాలు, బ్యాంకర్ల తీరుతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని మాజీ రాజ్యసభ సభ్యుడు యలమంచిలి శివాజీ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం జరగనున్న జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా ఆయన సోమవారం పెదకాకానిలో విలేకరులతో మాట్లాడారు. విజయ్‌మాల్యా లాంటి పారిశ్రామికవేత్తలకు వందల కోట్లు సునాయాసంగా రుణాలిచ్చే బ్యాంకర్లు పేదవాళ్ల విషయంలో సవాలక్ష నిబంధనలు పెడుతున్నారన్నారు.
దీంతో సాగుకు అధిక వడ్డీల బారిన పడుతున్నారని పేర్కొన్నారు. బ్యాంకర్ల వేలం ప్రకటనలతో రైతులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వాలు భవిష్యత్‌లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. రైతు సంక్షేమాన్ని మరిచి రైతు దినోత్సవాల పేరుతో ఎన్ని కార్యక్రమాలు నిర్వహించినా శూన్యమేనని చెప్పారు. నేడు ఎన్నికల సమయంలో మినహా రైతుల గురించి నాయకులకు పట్టడం లేదన్నారు.