ఆగస్టు నాటికి ఏయే చెరువులకు నీళ్లిస్తారో చెప్పాలి
► ఇవ్వకపోతే రాజీనామా చేస్తారా?
► మంత్రి పరిటాల సునీతకు తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి సవాల్
అనంతపురం: హంద్రీ-నీవా కాలువ నిర్మాణాలను పూర్తి చేసి ఆగస్టు నాటికి జిల్లాలోని చెరువులకు నీళ్లిస్తామని మంత్రి పరిటాల సునీత చెబుతున్నారని, రాప్తాడు నియోజకవర్గంలో ఏయే చెరువులకు నీళ్లిస్తారో బహిర్గతం చేయాలని వైఎస్సార్‌సీపీ రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి డిమాండ్ చేశారు. జిల్లా పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రెండేళ్లుగా అందుబాటులో లేని మంత్రి ఈరోజు నియోజకవర్గ ప్రజల్లో ఉండేందుకు తాపత్రయపడుతున్నారని ఎద్దేవా చేశారు. హంద్రీ-నీవా నీటిని కుప్పం తరలించేందుకు కుట్ర పన్నిన వైనంపై హంద్రీ-నీవా జలసాధన సమితి ఆధ్వర్యంలో ఉభయ కమ్యూనిస్టు పార్టీలతో కలిసి తాము ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేశామన్నారు.
దీనిపై అనవసరంగా ప్రజలకు అపోహాలు కల్పిస్తున్నారంటూ మంత్రి మాట్లాడుతున్నారన్నారు. అధికార పార్టీ చే స్తున్న నీటి చౌర్యంపై ప్రజలు ఎక్కడ తిరగబడుతారోనని భయపడి భూములకు అంచనాలు వేసి ప్రతిపాదనలు పంపామని ఈనెల రెండో వారంలో అధికారులకు చెప్పార న్నారు. అయితే ఇప్పటి దాకా చెరువులు, పిల్లకాలువల తవ్వకాలకు ప్రతిపాదనలు ఇవ్వలేదన్నారు. ఈ సందర్భంగా ఆయన మంత్రి సునీతకు కొన్ని ప్రశ్నలు సంధించారు. వాటిపై రైతులకు సూటిగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
సమావేశంలో జెడ్పీ ఫ్లోర్‌లీడర్ వెన్నపూస రవీంద్రరెడ్డి, కనగానపల్లి జెడ్పీటీసీ బిల్లే ఈశ్వరయ్య, కనగానపల్లి సింగిల్‌విండో అధ్యక్షులు లక్ష్మారెడ్డి, ఆత్మకూరు మండల కన్వీనర్ నరసింహారెడ్డి, నగర అధ్యక్షులు రంగంపేట గోపాల్‌రెడ్డి, రైతు విభాగం రాష్ట్ర ప్రధానకార్యదర్శి యూపీ నాగిరెడ్డి, విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి మద్దిరెడ్డి నరేంద్రరెడ్డి, జిల్లా ప్రధానకార్యదర్శి బాబా సలాం, కార్యదర్శి సునీల్‌దత్తరెడ్డి పాల్గొన్నారు.
►జీఓ 22ను అడ్డుపెట్టుకుని రాప్తాడు నియోజకవర్గం పరిధిలోని ఆయకట్టును తొలిగించిన మాట వాస్తవం కాదా? లేదంటే ఉత్తర్వులు బహిరంగపరచండి.
►2,3,4,5,7 ప్యాకేజీల్లో రాప్తాడు నియోజకవర్గంలోని సుమారు 80 కిలోమీటర్ల ప్రధానకాలువలో ఒక ఎకరా నీరివ్వడానికైనా డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థ ఏర్పాటు చేశారా? తూములు, చెరువులకు నీళ్లిచ్చేందుకు, సప్లయ్‌చానళ్లకు ప్రొవిజన్ లేదని చెప్పిన మాట వాస్తవం కాదా? మీరు ఒప్పుకుంటారా.. లేదంటే తాము బహిర్గ పరచాలా?
► జిల్లాలో 1263 చెరువులకు ఆగస్టులోగా నీళ్లిస్తామని చెబుతున్నారు. ఏయే చెరువులకు నీళ్లిస్తారో చెప్పాలి.
►చెరువులు, ఆయకట్టుకు నీళ్లివ్వక ప్రధానకాలువను పూర్తిచేసి నీటిని కుప్పం తరలించడమే మీ ఉద్ధేశం కాదా?
►కుప్పం నియోజకవర్గంలోని ఆయకట్టుకు నీళ్లు ఇవ్వాలని చూస్తున్నారు తప్ప రాప్తాడు రైతులకు నీళ్లు అవసరం ఉందా? లేదా?
►హంద్రీ నది నుంచి నీవా నది వరకు కాలువ పూర్తి చేసి, తర్వాత ఆయకట్టుకు నీళ్లిస్తామని మంత్రి చెబుతున్నారని నీవా దిగువ సుమారు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న కుప్పం వరకు కాలువ తవ్వడం వెనుక మర్మమేమిటో?
► బద్ధలాపురం చెరువుకు నీరు ఏవిధంగా ఇస్తారో చెప్పాలి
►పేరూరు డ్యాంకు హంద్రీ-నీవా నుంచి నీరిస్తామని సర్వే అంచనాలు సిద్ధం చేశామని చెబుతున్నారు. ఆ వివరాలు బహిర్గ పరచాలి
► హంద్రీ-నీవా సృష్టికర్త శివరామకృష్ణయ్య డీపీఆర్ కంటే కూడా మీరు చేస్తున్న సర్వే గొప్పదా అని ప్రశ్నించారు. ఈ అంశాలన్నింటిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.