ఆయకట్టు బీడే!
► హంద్రీ-నీవా అసలు ఉద్దేశాన్ని మార్చేస్తున్న సర్కార్
► డిస్ట్రిబ్యూటరీ పనులు పూర్తి చేసి కుప్పంకు నీటిని తరలించడమే లక్ష్యం
► ఇప్పుడు ఆయకట్టును పూర్తిగా డిజైన్ నుంచి తొలగిస్తున్న వైనం
► ఉద్యమానికి సిద్ధమవుతున్న ప్రతిపక్షాలు
సాక్షి ప్రతినిధి, అనంతపురం వర్షాలు లేక... సాగునీళ్లు ‘కరువై’ పంట పండించలేక లక్షలమంది ‘అనంత’లో వలసలు పోతున్నారు. ఈ రెండేళ్లలో 154 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అయినా సీఎం చంద్రబాబుకు రైతులపై కాసింత కనికరం కూడా కలగలేదు. నీళ్లిచ్చి పంట పొలాలను...పంటలు పండించి రైతులను ఆదుకుందామనే ఆలోచన రాలేదు. చిత్తూరు, కుప్పంకు నీళ్ల తరలించడమే లక్ష్యంగా హంద్రీ-నీవా పనులు చేయిస్తున్నారు. జిల్లాలో గతేడాది 4 లక్షల మంది రైతులు వలస వెళ్లారంటే జిల్లాలో కరువు ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ పరిస్థితులన్నీ కేవలం సాగునీటి వనరులు లేక తలెత్తుతున్నావే. 2003 ముందు కూడా ‘అనంత’ పరిస్థితులు దుర్భరంగానే ఉండేవి.
ఈ నేపథ్యంలో 2004లో అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖరరెడ్డి హంద్రీ-నీవా ప్రాజెక్టు నిర్మాణానికి పూనుకున్నారు. 2014లోపు 85 శాతం పనులు పూర్తయ్యాయి. 2012లోనే హంద్రీ-నీవా ద్వారా జిల్లాకు కృష్ణా జలాలు వచ్చాయి. జీడిపల్లి రిజర్వాయర్‌లో తొణికిసలాడుతున్న కృష్ణమ్మను చూసి ‘అనంత’ రైతులు, ప్రజాసంఘాల ప్రతినిధులు ‘అనంత’ రాత మారుతుందని ఆశపడ్డారు. రిజర్వాయర్ నుంచి ఇక బీడు భూములకు పారడమే తరువాయి అని భావించారు.
ఆశలు అడియాసలు!
హంద్రీ-నీవా ద్వారా జిల్లాలో 3.45 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఇందులో ఫేజ్-1 ద్వారా 1.18 లక్షలు, ఫేజ్-2 ద్వారా 2.27 లక్షల ఎకరాలు నీరు అందించాలి. ఫేజ్-1లో జీడిపల్లి రిజర్వాయర్ వరకూ ప్రధాన కాలువ పనులు పూర్తయ్యాయి. అక్కడి నుండి గొల్లపల్లి రిజర్వాయర్‌కు కాలువ పనులు జరుగుతున్నాయి. అయితే ఆయకట్టు పనులు చేయవద్దని ప్రభుత్వం గతేడాది ఫిబ్రవరి 23న జీవో 22 జారీ చేసింది. ఇప్పుడు తాజాగా ఆయకట్టును ప్రాజెక్టు నుంచి తొలగిస్తోంది. 2, 3, 4, 5. 7. 25, 1 ప్యాకేజీల నుంచి 85 వేల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించాలి. అలాగే 36వ ప్యాకేజి పరిధిలోని బ్రహ్మసముద్రం, జీడిపల్లి, ఉరవకొండ, బెళుగుప్ప, కణేకల్లు, గుమ్మఘట్ట, రాయదుర్గం పరిధిలోని ఆయకట్టుకు నీళ్లివ్వాలి. ఈ ప్యాకేజీలన్నింటికీ పాత టెండర్లు రద్దు చేసి కొత్త టెండర్లు ఆహ్వానించి పనులు చేయిస్తున్నారు. అయితే 36వ ప్యాకేజి పనులు ఎవరికీ కేటాయించలేదు.
దీనికి భూసేకరణ సమస్యను సాకుగా చూపారు. వీటిలో ఆయకట్టుకు సంబంధించిన పనులు లేవు. ఆయకట్టుకు నీళ్లిచ్చేందుకు డిస్ట్రిబ్యూటరీకి ఎకరాకు రూ.4,700 కాంట్రాక్టర్‌కు ఇచ్చేందుకు ప్రభుత్వం ధర నిర్ణయించింది. ఈ ధర తెలంగాణలో రూ.12 వేల వరకూ ఉంది. దీంతో జీవో నెంబరు 22ను అడ్డుపెట్టుకుని కాంట్రాక్టర్లు తాము డిస్ట్రిబ్యూటరీ పనులు చేయలేమని ప్రభుత్వానికి నివేదించారు. అయితే ఇదంతా బూటకమని తెలుస్తోంది. ఎకరాకు రూ.9 వేలకు పెంచుతూ గతంలో జీవో 63 జారీ చేసినా, దాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇలా డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థకు అన్ని విధాలా ప్రభుత్వం అడ్డంకులు సృష్టించింది.
అసలు ఉద్దేశం ఇదే
అసలు ఆయకట్టుకు నీరిస్తే చిత్తూరు వరకూ నీళ్లు తీసుకెళ్లే అవకాశాలు తక్కువ. 40 టీఎంసీల నీళ్లు ఎత్తి పోయడం అంతసులువు కాదు. పట్టిసీమ నుంచి గోదావరి నీళ్లు డెల్టాకు ఇచ్చి, శ్రీశైలం నీళ్లు మొత్తం సీమకు ఇస్తామని చెబుతున్నా, అన్ని నీళ్లు ఎత్తిపోసే అవకాశం తక్కువగా ఉండటంతోనే ఆయకట్టుకు బ్రేక్ వేశారు. మొదట కుప్పం నీళ్లు తీసుకెళ్లి కాలువ పరిధిలోని ప్రాంతాల్లో చెరువులకు నీళ్లిచ్చేందుకు సిద్ధమయ్యారు. తర్వాత నీటి లభ్యతను బట్టి ఆలోచించొచ్చని భావిస్తున్నారు. దీనికి తోడు కరెంటు బిల్లులు సాకుగా చూపి మెయింటెనెన్స్ ఎక్కువగా వస్తుందని ఆయకట్టుకు నీరిచ్చే ప్రక్రియకూ బ్రేక్ వేశారు.
దీంతో కేవలం చెరువులకు నీళ్లిచ్చే ప్రాజెక్టుగానే హంద్రీ-నీవా మిగిలే పరిస్థితి తలెత్తింది. ప్రభుత్వ వైఖరిని నిశితంగా పరిశీలిస్తున్న రాజకీయపార్టీల నేతలు, రైతు, ప్రజాసంఘాల ప్రతినిధులు ‘అనంత’కు జరుగుతున్న అన్యాయాన్ని పసిగట్టారు. హక్కుగా దక్కాల్సిన జలాలను దక్కించుకునేందుకు పోరుకు సిద్ధమయ్యారు. ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్‌సీపీతో పాటు సీపీఎం, సీపీఐ పోరుకు సిద్ధమయ్యాయి.
ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తాం
జిల్లాకు సాగునీరందించేందుకు గత ప్రభుత్వ హయూంలో హంద్రీ-నీవా ప్రాజెక్టుకు రూపకల్పన జరిగింది. 40 టీఎంసీలో 23 టీఎంసీలు జిల్లాకు కేటాయించారు. తద్వారా జిల్లాలో 3.50 లక్షల ఎకరాలకు సాగునీరు, కొన్ని పట్టణాలకు తాగునీరు అందించాలనేది ఉద్దేశం. అయితే చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం జీవో 22ని విడుదల చేసి తూట్లు పొడిచింది. కేవలం చెరువులకు అడపాదడపా నీరు ఇస్తే సరిపోతుందనే ఉద్దేశం ఉన్నట్లుగా కనిపిస్తోంది. దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. నిర్దేశించిన విధంగా 3.50 లక్షల ఎకరాలకు, జిల్లాలోని అన్ని చెరువులకు నీరివ్వాలి. లేకపోతే ప్రతిపక్ష పార్టీలను, ప్రజాసంఘాలను కలుపుకుని పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం నిర్మిస్తాం. -డి.జగదీశ్, సీపీఐ జిల్లా కార్యదర్శి
పోరాటం సాగిస్తాం
గత ప్రభుత్వం నిర్ణయించిన విధంగా హంద్రీ-నీవా ద్వారా జిల్లాలో 3.50 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలి. ఆయకట్టును తొలగించడం అంటే జిల్లా రైతాంగానికి తీరని ద్రోహం చేయడమే అవుతుంది. హంద్రీ-నీవా ప్రాజెక్టు ఉద్దేశానికి తూట్లు పొడిచి మొక్కుబడిగా కొద్ది చెరువులకు నీరిస్తే సరిపోతుందనే ఆలోచనలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నట్లుగా కనిపిస్తోంది. జిల్లా అభివృద్ధే ధ్యేయమని చంద్రబాబు పదేపదే చెప్పే మాటలకు చేతలకు పొంతన ఇసుమంతైనా కనిపించడం లేదు. హంద్రీ-నీవా కింద నిర్దేశించిన ఆయకట్టుకు కచ్చితంగా నీరు ఇవ్వాల్సిందే. లేని పక్షంలో ఈ ప్రభుత్వంపై ప్రజా పోరాటం సాగిస్తాము. వి.రాంభూపాల్, సీపీఎం జిల్లా కార్యదర్శి