పేరు మార్చి.. పథకాన్ని ఏ మార్చి.. | TDP Govt welfare programs name change | Sakshi
Sakshi News home page

పేరు మార్చి.. పథకాన్ని ఏ మార్చి..

Published Mon, Aug 24 2015 1:31 AM | Last Updated on Sat, Jul 7 2018 2:56 PM

TDP Govt welfare programs name change

 ఏలూరు (అర్బన్ ) :ప్రజలకు పలు వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు సంక్షేమ కార్యక్రమాలకు మంగళం పాడుతున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పేదల సంక్షేమమే ధ్యేయంగా ప్రవేశ పెట్టిన పలు పథకాలకు తూట్లు పొడుస్తున్నారు. దానిలో భాగంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా నీరుగార్చే పనిలో పడ్డారు. పేదలకు సైతం కార్పొరేట్ వైద్యసేవలు అందించిన ఆరోగ్యశ్రీ పథకానికి పేరు మార్చడంతో పాటు లెక్కలేని వింత నిబంధనలు అమలు చేస్తుండడంతో పేదలు క్రమేపీ కార్పొరేట్ వైద్యానికి దూరమౌతున్నారు. వైఎస్ పాలనలో పేద రోగులకు ఎంత ఖర్చుతో కూడిన వైద్యం చేయించుకోవలసిన అవసరం వచ్చినా ఆరోగ్యశ్రీ కార్డు ఉందనే భరోసా ఉండేది.
 
  కాని నేడు అదే ఆరోగ్యశ్రీ పథకానికి ఎన్టీఆర్ వైద్య సేవ అనే పేరు పెట్టి తెలుగుదేశం ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు పేదలకు శాపంగా మారాయి. గతంలో ఆరోగ్యశ్రీ కార్డు పట్టుకుని ఏ కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లినా పైసా ఖర్చు లేకుండా రూ.లక్షలు ఖరీదు చేసే వైద్యం అందించిన ఆసుపత్రులు ఎన్టీఆర్ వైద్య సేవ కార్డు పేరు వింటేనే ఉచితంగా వైద్య సేవలందించలేమంటూ తిప్పి పంపుతున్నారని పేదలు వాపోతున్నారు. దాంతో నిరాశ చెందుతున్న పేదలు ఈ మోసకారి ప్రభుత్వం కూలిపోవాలని శాపనార్థాలు పెడుతున్నారు. ఎన్టీఆర్ వైద్య సేవ పథకంలో మరో 104 వ్యాధులను కలిపామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నా అసలు ఈ కార్డునే కొన్ని కార్పొరేట్ ఆసుపత్రులు పరిగణనలోకి తీసుకోని కారణంగా ఎన్ని వ్యాధులను కలిపితే ప్రయోజనమేమిటని పలువురు పెదవి విరుస్తున్నారు.
 
 దివంగత మహానేత వైఎస్ ప్రారంభించిన ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 2013 ఏప్రిల్ నుంచి 2014 మార్చి నెలాఖరు వరకూ రూ.70 కోట్ల వ్యయంతో  25,095 మందికి వివిధ శస్త్ర చికిత్సలు చేశారు. కాగా 2014 ఏప్రిల్ నుంచి ఎన్టీఆర్ వైద్యసేవ పథకం ద్వారా 2015 మార్చి నెలాఖరునాటికి రూ. 73.47 కోట్ల వ్యయంతో 26,327 మందికి శస్త్ర చికిత్సలు చేశారు. కాగితంపై లెక్కలు బాగానే చూపిస్తున్నప్పటికీ ఆ మేరకు వైద్య చికిత్సలు జరగలేదని తెలుస్తోంది. కేవలం టీడీపీ నాయకులకుచెందిన కార్పొరేట్ ఆసుపత్రులు ప్రభుత్వ సొమ్మును దిగమింగడానికి కాకమ్మ లెక్కలు చెబుతోందని, కొందరు లబ్ధిదారుల నుంచి కార్డులు సేకరించి తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో వైద్యం చేసినట్టుగా చెప్పి ప్రభుత్వం నుంచి లక్షల్లో దండుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి.
 
 మందులివ్వరు, చికిత్స చెయ్యరు
 నాకు రాజశేఖరరెడ్డి హయాంలో ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చారు. ఈ సమయంలో నాకు మెదడులో కంతి రావడంతో ఆరోగ్యశ్రీ కార్డుపై వైద్యం చేశారు. చాలాకాలం మందులు కూడా ప్రతినెలా ఉచితంగా ఇచ్చారు. ఆ మందులతోనే ఇప్పటి దాకా బతికాను. తరువాత కొత్తగా ఎన్టీఆర్ వైద్య సేవ అనే కార్డు ఇచ్చారు. అది తీసుకుని ఆసుపత్రుల చుట్టూ తిరిగినా మందులు ఇవ్వడం లేదు. ఈ కార్డు చెల్లదంటున్నారు. సొంత డ బ్బులు పెట్టి మందులు కొనుక్కునే స్థోమత లేదు. మందులు లేకుండా బతకలేను. ఈ పరిస్థితులలో ఏం చేయాలో అర్థం కావడం లేదు.
 - ముస్సే సత్యనారాయణ బాధితుడు,
 శనివారపు పేట, ఏలూరు మండలం.
 
 ఈ కార్డు పనికిరాదంటున్నారు
 మా వదిన  ఇటీవల ఇంటిలో పనిచేసుకుంటూ హఠాత్తుగా గుండెనొప్పితో పడిపోయింది. దాంతో వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లాం. పరీక్ష చేసిన వైద్యులు ఇది గుండె సంబంధిత వ్యాధి అని ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చేర్చమన్నారు. మా దగ్గర ఎన్టీఆర్ ైవె ద్య సేవ కార్డు ఉందనే భరోసాతో సరే అన్నాం. ఐతే వెంటనే డబ్బులు కట్టండి అని డాక్టర్లు అన్నారు. మా దగ్గర ఎన్టీఆర్ వైద్యసేవ కార్డుంది డబ్బులింకెందుకు అన్నాం. దానికి డాక్టర్లు ఈ వైద్యానికి ఆ కార్డు పనికిరాదు. డబ్బులు కట్టాలి లేదా తీసుకుపొండి అన్నారు. మరి ఏం చేయాలి ప్రాణం దక్కించుకోవాలి కదా అందుకని అప్పుతెచ్చుకుని డబ్బులు కట్టి మా వదినను ఆసుపత్రిలో చేర్పించాం.
 - పాలెపు ప్రసాద్, తంగెడమూడి, ఏలూరు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement