కమ్మనపల్లెలో టెన్షన్..టెన్షన్ | tension... tension... in Kammanapalle | Sakshi
Sakshi News home page

కమ్మనపల్లెలో టెన్షన్..టెన్షన్

Published Mon, Dec 15 2014 3:13 AM | Last Updated on Sat, Sep 2 2017 6:10 PM

tension... tension... in Kammanapalle

 పలమనేరు: పలమనేరు నియోజకవర్గం బెరైడ్డిపల్లె మండలం కమ్మనపల్లెలో ఆదివారం టెన్షన్ నెలకొంది. కమ్మనపల్లెకు చెందిన ఓ అదృశ్యమైన వివాహిత కర్ణాటక రాష్ట్రంలోని ముల్‌బాగల్ వద్ద శవమై బయటపడిందంటూ పుకార్లు వినిపించాయి. దానికితోడు గంగవరం పోలీసులు ఆ ప్రాంతంలో అన్వేషణ జరపడం, ఇందుకు సంబంధించి పలువురిని అదుపులోకి తీసుకోవడం అనుమానాలను బలపరిచాయి.

అదృశ్యమైన వివాహిత ఏమైందనే సమాచారం తెలియనప్పటికీ కమ్మనపల్లె పంచాయతీలోని అన్ని గ్రామాల్లో దీని గురించే చర్చ జరిగింది. కమ్మనపల్లె పంచాయతీ ఎర్రకదిరేపల్లెకు చెందిన శిల్పతో వారి బంధువైన కీలతొరిడి గ్రామానికి చెందిన కుమార్‌రాజాకు పెళ్లయింది. వీరికి పిల్లలు లేరు. ఈ సాకుతో అత్తమామలు వేధిస్తున్నారని, ఇందుకు భర్త సహకరిస్తున్నాడని బాధితురాలు గతంలో పలమనేరు కోర్టులో కేసు వేసింది.

విచారణ జరుగుతుండగానే కమ్మనపల్లెకు చెందిన కొందరు తాము కేసును రాజీ చేస్తామంటూ ప్రయత్నాలు చేసినట్టు తెలిసింది. ఆ తర్వాత కోర్టుకు హాజరైన శిల్ప అదృశ్యమైంది. కుటుంబ సభ్యులు గంగవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కర్ణాటక రాష్ట్రంలోని ముల్‌బాగల్ సమీపంలో గల ఓ చెరువులో పూడ్చి పెట్టిన ఒక గుర్తు తెలియని మహిళ శవం బయటపడిందనే విషయం దావానలంలా వ్యాపించింది. దుస్తులు దాదాపు అలాగే ఉండడంతో ఆ మృతదేహం శిల్పాదేనని కుటుంబ సభ్యులు అనుమానించారు.

విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికెళ్లి కర్ణాటక పోలీసులతో చర్చించారు. భర్త కుమార్‌రాజాను అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. అతను ఇచ్చిన సమాచారం మేరకు కమ్మనపల్లెకు చెందిన ప్రస్తుత సర్పంచ్ కుమారుడు, మాజీ సర్పంచ్‌తో పాటు మరికొంధరిని ఆదివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ విషయమై పలమనేరు డీఎస్పీ హరినాథరెడ్డిని వివరణ కోరగా శిల్ప అదృశ్యమైందని తమకు గతంలో ఫిర్యాదు వచ్చిందని, ముల్‌బాగల్ ప్రాంతం లో వెలుగు చూసిన మహిళ శవం ఆమెదేనా అన్న అనుమానంతో విచారణ జరుపుతున్నామని తెలిపారు. వివరాలు తెలిశాక సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement