పోలీసుల స్పెషల్ డ్రైవ్‌.. రాత్రి బైకులు ఆపి ఫింగర్‌ ప్రింట్‌ టెస్టులు! | Karnataka Police checking Fingerprints Of Bikers In special Drive | Sakshi
Sakshi News home page

పోలీసుల స్పెషల్ డ్రైవ్‌.. రాత్రి బైకులు ఆపి ఫింగర్‌ ప్రింట్‌ టెస్టులు!

Published Sun, Sep 25 2022 10:58 AM | Last Updated on Sun, Sep 25 2022 11:07 AM

Karnataka Police checking Fingerprints Of Bikers In special Drive - Sakshi

బనశంకరి: సిలికాన్‌ సిటీ బెంగళూరులో రాత్రి సమయంలో చోరీలకు తెగబడే దొంగలకు అడ్డుకట్టవేయడానికి నగర పోలీసులు కొత్త పథకం రూపొందించారు. రాత్రి సమయంలో గస్తీలు, వాహనాల తనిఖీల సమయంలో అనుమానితులు, వాహనదారుల వేలిముద్రలు, వాహనాల నంబర్లు పరిశీలనకు నాంది పలికారు. ఇందులో నేరపూరిత చరిత్ర ఉంటే అక్కడే వాహనాలను లాక్‌ చేస్తారు. వాహన సమాచారం కూడా డేటా బేస్‌లో వస్తుంది కాబట్టి దొంగ వాహనమైతే సీజ్‌ చేస్తారు.  తద్వారా రాత్రి వేళల్లో దొంగలకు, అసాంఘిక శక్తులకు అడ్డుకట్ట పడుతుందని పోలీసులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.   

క్షణాల్లో తేలిపోతుంది  
పోలీసులు గస్తీ, నాకాబందీ సమయాల్లో జనం వేలిముద్రలను తమ మొబైల్‌ఫోన్లో సీసీటీఎన్‌ఎస్‌  అప్లికేషన్‌లో పరిశీలిస్తారు. సాధారణ పౌరులైతే ఏమీ ఉండదు.  నేరాల్లో భాగస్వామి అయితేనే అతని నమోదైన కేసుల వివరాలు లభ్యమౌతాయి. అదుపులోకి తీసుకుని విచారణ చేపడతారు. సరైన కారణాలు లేకపోతే తగిన  చర్యలు తీసుకుంటారు. అలాగే వాహనం నంబరును బట్టి చోరీ చేసిన వాహనమా, నేరాల్లో ఉపయోగించారా, లేదా అనేది కూడా యాప్‌ ద్వారా నిర్ధారిస్తారు.  

సీఐ, ఎస్‌ఐలకు శిక్షణ  
గత రెండు నెలలనుంచి వివిధ పోలీస్‌స్టేషన్లలో మల్లోకి  తీసుకువచ్చారు. ప్రతిపోలీస్‌ స్టేషన్‌ సీఐ, ఎస్‌ఐలకు శిక్షణ అందించి ఉపకరణాలు అందజేశారు. నిత్యం తలా 20 మందిని తనిఖీ చేయడం తప్పనిసరి. దశలవారీగా నగరవ్యాప్తంగా విస్తరిస్తారు. పోలీసులు ప్రజలు వేలిముద్రలు తీసుకుంటే వ్యక్తిగత సమాచారం చోరీకి గురి అవుతుందనే భయం వద్దని, కేవల వేలిముద్రలు స్కాన్‌ అవుతాయని, రహస్య సమాచారం సేకరణ జరగదని పోలీసులు తెలిపారు.    

జరగబోయే నేరాలను అడ్డుకోవచ్చు  
రాత్రి సమయంలో దొంగలు, నేర చరిత్ర కలవారి ఆచూకీ కనిపెట్టి, జరగబోయే నేరాలను తప్పించడానికి సీసీటీఎన్‌ఎస్‌ డేటా ద్వారా రాత్రి సమయంలో తనిఖీలు చేపడుతున్నట్లు తూర్పు విభాగం అదనపు పోలీస్‌ కమిషనర్‌ సుబ్రమణ్యేశ్వరరావ్‌ తెలిపారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement