సామాన్యుడి స్వరం వినిపిస్తా.. | Sakshi Interview With Bapatla YSRCP MP Candidate Nandigam Suresh Babu | Sakshi
Sakshi News home page

సామాన్యుడి స్వరం వినిపిస్తా

Published Wed, Apr 10 2019 2:49 PM | Last Updated on Wed, Apr 10 2019 2:49 PM

Sakshi Interview With Bapatla YSRCP MP Candidate Nandigam Suresh Babu

సాక్షి, బాపట్ల (శ్రీకాకుళం)‘బాపట్ల పార్లమెంట్‌ అభ్యర్థిగా నేను నిలబడాలని జగనన్న చెబితే మొదట్లో అర్థం కాలేదు. సామాన్యుడినైన నాకు ఎంపీ టికెట్టా అని అడిగితే.. ఏ..? సామాన్యుడు ఎంపీ కాకూడదా అంటూ జగనన్న చిరునవ్వుతో బదులిచ్చారు. మా అధినేత నింపిన స్ఫూర్తితో బాపట్ల ఎంపీగా గెలుస్తా. బాపట్ల గల్లీ వాణిని ఢిల్లీ వేదికగా దేశ ప్రజలకు వినిపిస్తా’... అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ బాపట్ల పార్లమెంట్‌ అభ్యర్థి నందిగం సురేష్‌బాబు పేర్కొన్నారు.

ఈ నియోజకవర్గం పరిధిలో సాగు, తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉందని.. తాను ఎంపీగా గెలుపొందిన వెంటనే నీటి సమస్యలు పరిష్కరించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని చెప్పారు. ఒక సామాన్యుడు ఎంపీ స్థాయికి ఎదగడం అంటే కోహినూర్‌ వజ్రాన్ని సొంతం చేసుకున్నట్లేనని పేర్కొన్నారు. ఎంతో మంది సామాన్యులు తామే ఎంపీ అభ్యర్థిగా ఉన్నామని భావిస్తూ తన గెలుపు కోసం కష్టపడి పనిచేస్తున్నారని సురేష్‌బాబు సంతోషం వ్యక్తం చేశారు. ‘సాక్షి’ ఇంటర్వ్యూలో పలు అంశాలను ఆయన వెల్లడించారు. ఆ వివరాలు...

సాక్షి : బాపట్ల పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీచేయడాన్ని ఏ విధంగా భావిస్తున్నారు?
సురేష్‌బాబు : ఎంతో మంది ప్రముఖులు గెలుపొందిన ఈ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహించేందుకు అవకాశం రావడాన్ని గొప్పగా భావిస్తున్నా. బాపట్ల పార్లమెంటు నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు శక్తివంచన లేకుండా పనిచేస్తా. బాపట్లను కచ్చితంగా అభివృద్ధివైపు పరుగులు తీయిస్తా.

సాక్షి : ప్రస్తుత ఎన్నికల్లో మీ గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి?
సురేష్‌బాబు : రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఫ్యాన్‌ గాలి బలంగా వీస్తోంది. సీఎం చంద్రబాబునాయుడు పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. ఎక్కడకు వెళ్లినా మా అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన నవరత్నాలపైనే జోరుగా చర్చ సాగుతోంది. ప్రజలు కూడా నవరత్నాలపైనే విశ్వాసంగా ఉన్నారు. సామాన్యుడినైనా నాకు ఎంపీగా అవకాశం రావడంతో నేను ఎక్కడికి వెళ్లినా మంచి ఆదరణ కనిపిస్తోంది. నా గెలుపు కోసం పార్టీ శ్రేణులు ఎంతో కష్టపడుతున్నాయి. కచ్చితంగా గెలిచి తీరుతా.

సాక్షి : బాపట్ల పార్లమెంటు నియోజకవర్గంలో సమస్యలను గుర్తించారా?
సురేష్‌బాబు : బాపట్ల పార్లమెంటు నియోజకవర్గంపై నాకు ఎంతో పట్టు ఉంది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఈ పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్తగా బాధ్యతలు నిర్వర్తించి పట్టుసాధించా. ఈ నియోజకవర్గంలో తాగు, సాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. నీటి ఎద్దడిని పరిష్కరించేందుకు కృషి చేస్తా. నిరుద్యోగ సమస్య కూడా ఎక్కువగానే కనిపిస్తోంది. నిరుద్యోగులకు ఉపాధి చూపేందుకు పారిశ్రామికంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందేలా శ్రమిస్తా.

సాక్షి : ఎన్నికల ప్రచారం ఎలా సాగింది?
సురేష్‌బాబు : ఎన్నికల ప్రచారం చాలా చక్కగా జరిగింది. ఎక్కడికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. బాపట్ల పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచారం పూర్తిచేశా. ఎక్కడ చూసినా ఫ్యాన్‌ జోర్‌ తెలుస్తోంది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ వస్తేనే సంక్షేమ పాలన అందుతుందని ప్రజలు భావిస్తున్నారు. నవరత్నాలు ఎప్పుడు అందుతాయా అని ఆశగా ఎదురుచూస్తున్నారు.

సాక్షి : నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి? 
సురేష్‌బాబు : బాపట్ల పార్లమెంటు స్థానాన్ని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కచ్చితంగా సొంతం చేసుకుంటుంది. తెలుగుదేశం పార్టీ నుంచి బరిలో ఉన్న శ్రీరామ్‌మాల్యాద్రి ఐదేళ్లుగా ఎంపీగా ఉన్నారు. గత ఎన్నికల్లో ప్రజలను కలిసి ఓట్లు అడిగారు.. ఆ తర్వాత కనిపించలేదు. దీంతో ప్రజలు ఆయనపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. ఇది నాకు కలిసొచ్చే అంశం. ప్రజలు చంద్రబాబు ప్రభుత్వంపై కూడా తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. రాష్ట్రానికి దిక్సూచి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమేనని భావిస్తున్నారు.

సాక్షి : ఎంపీగా గెలిచాక ఎలా ఉంటారు? 
సురేష్‌బాబు : బాపట్ల పార్లమెంటు నియోజకవర్గ చరిత్రలోనే ఒక సామాన్యుడు ఎంపీ అభ్యర్థిగా వస్తాడని ప్రజలు ఊహించలేదు. నేను ఒక సామాన్యుడిగా ప్రజల ముందుకు వచ్చాను. నన్ను ప్రజలు గెలిపిస్తే వారి మధ్యనే ఉంటా. వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటా. బాపట్ల గల్లీ వాణిని ఢిల్లీలో వినిపిస్తా. ఒక నాయకుడు ఏ విధంగా ఉండాలో అదే విధంగా ఉండి చూపిస్తా. ప్రత్యేక హోదా సాధన కోసం పార్లమెంట్‌ వేదికగా పోరాడతా. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement