సార్వత్రిక ఎన్నికల సమరం సమీపిస్తుంది. ప్రచారపర్వం పతాక స్థాయికి చేరింది. ప్రధాన పార్టీలు, వాటి అధినేతలు పోటీపడి ఒకరికి మించి మరొకరు హామీలిచ్చేస్తున్నారు. బరిలో నిలిచిన అభ్యర్థులు ఎవరికివారే తన గెలుపు ఖాయం అంటూ ధీమాను వ్యక్తం చేస్తున్నారు. తాము ఎమ్మెల్యే అయితే ఎలాంటి అభివృద్ధి పనులు చేస్తారో వివరించారు.
సాక్షి, మార్కాపురం (ప్రకాశం): ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లో నాలుగున్నర లక్షల ఎకరాలకు సాగునీరు, 16లక్షల మందికి తాగునీరు అందించే వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణమే తన ముందు ఉన్న లక్ష్యమని, జగనన్న సీఎం కాగానే ఈ ప్రాజెక్టు వేగంగా పూర్తయి పశ్చిమ ప్రకాశంలో కరువు శాశ్వతంగా పోతుందని మార్కాపురం వైఎస్సార్ సీపీ అభ్యర్థి కుందురు నాగార్జునరెడ్డి అంటున్నారు.
విద్యాభ్యాసం
ఒకటి నుంచి నాల్గో తరగతి వరకు మాత్రమే మార్కాపురం పట్టణంలోని సెయింట్ ఆన్స్ స్కూల్‌లో, 5నుంచి 10వ తరగతి వరకు నంద్యాల పబ్లిక్ స్కూల్‌లో, ఇంటర్మీడియేట్ గుంటూరు వికాస్‌లో, ఇంజినీరింగ్ కర్నాటకలోని షిమోగా యూనివర్శిటీలో, ఎం.ఎస్ అమెరికాలోని టెక్సాస్‌లో పూర్తి చేశాను. మాచర్లలో న్యూటన్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో డైరెక్టర్‌గా ఉన్నాను. సాంఘిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను.
రాజకీయ నేపథ్యం?
నేను పుట్టక ముందే నాన్న రాజకీయాల్లో ఉన్నాడు. ఇంటి నిండా ఎప్పుడు అధికారులు, ప్రజలు, కార్యకర్తలతో సందడిగా ఉండేది. ఆ ప్రభావం నా మీద పడకూడదని, నా విద్యభ్యాసం మొత్తం బయటే గడిచింది. మామ ఉడుముల శ్రీనివాసులరెడ్డి కూడా కంభం మాజీ ఎమ్మెల్యే. ఇటు పుట్టింట్లో, అటు మామ వారింట్లో రాజకీయం ఉండటంతో ప్రజా సేవ చేయాలనే ఆలోచన వచ్చింది. ఇదే సమయంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్సార్ సీపీని స్థాపించడం, ప్రజలకు ఇచ్చిన మాట కోసం ఓదార్పు యాత్ర చేస్తూ కష్టాలు పడటం, కుట్రలు, కుతంత్రాలకు ఇబ్బంది పడటం చూశాను. ఏడాదిన్నర పాటు ప్రజల కష్టాలను తెలుసుకునేందుకు 3,648 కి.మీ పాదయాత్ర చేయడం, తదితర అంశాలతో రాజకీయాల్లోకి రావాలని అనిపించింది. నా రాజకీయ గురువు తండ్రి అయిన నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పని చేసి జిల్లాలో సీనియర్ వైఎస్సార్ సీపీ నేతగా గుర్తింపు పొందిన కేపీ కొండారెడ్డి సూచనలతో మార్కాపురం వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా.
రాజకీయాల్లో గురువు
మానాన్న కొండారెడ్డే నాకు రోల్‌మోడల్, గురువు. మార్కాపురం, యర్రగొండపాలెం నియోజకవర్గాల్లోని ఏ గ్రామంలోకి వెళ్లినా, ఎమ్మెల్యేగా నాన్న చేసిన అభివృద్ధి పనులే కనిపిస్తాయి. కొండారెడ్డి కొడుకుగా నన్ను ప్రత్యేకంగా గుర్తించటం, గౌరవించటం నాకు ఆనందాన్ని ఇస్తుంది. ఇచ్చిన మాట తప్పకుండా ప్రజల కోసం ఎన్నో క ష్టాలు పడిన జగనన్న పట్టుదల నాకు స్ఫూర్తినిచ్చింది.
రాజకీయాల్లోకి రావాలని ఎందుకు అనిపించింది?
సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నప్పటికీ ఏదో అసంతృప్తి. చిన్నప్పటి నుంచి ప్రజాసేవ చేస్తున్న నాన్న నాకు ఆదర్శం. నియోజకవర్గంలోని అధికారులు, ప్రజలు ఇంటికి వచ్చి నాన్న కొండారెడ్డితో మీ వల్ల మాకు ఈ మేలు జరిగిందని చెబుతుంటే ఆయన సంతోషపడేవారు. ప్రజాసేవ చేస్తే ఇంతటి ఆనందం వస్తుందా అని నాకు అనిపించింది. నాన్నతో రాజకీయాలు మాట్లాడాలంటే భయం. ఈ నేపథ్యంలో అప్పటి కంభం ఎమ్మెల్యే ఉడుముల శ్రీనివాసులరెడ్డి కుమార్తె కల్పనతో వివాహమైంది. వారిది కూడా రాజకీయ కుటుంబమే. వాళ్ల తాత ఉడుముల వెంకటరెడ్డి ఎమ్మెల్యేగా పనిచేశారు. ఇలా రాజకీయాలపై ఆసక్తి పెరిగింది. ఇదే సమయంలో మా తమ్ముడు కృష్ణమోహన్‌రెడ్డి 2009నుంచి2014వరకు మార్కాపురం మండల ఉపాధ్యక్షుడిగా పని చేశారు.
రాజకీయాల్లో ఎలా నెగ్గు కొస్తారు?
నాన్న కొండారెడ్డి 1985, 1989, 1999, 2004లో ఎమ్మెల్యేగా పని చేశారు. ప్రతి గ్రామంలో ఆయన ఏదో ఒక అభివృద్ధి పని చేశారు. ప్రజలు ఇప్పటికీ మార్కాపురం, యర్రగొండపాలెం నియోజకవర్గాల్లో పెద్దాయనగా గౌరవిస్తారు. జగనన్న నిజాయితీ, మడమ తిప్పని నైజం. ఆయన సీఎం అయితే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాడనే ప్రజల నమ్మకం నా గెలుపుకు దోహదపడతాయి. జగనన్న, వైఎ స్సార్ ప్రజల హృదయాల్లో నిలిచిపోయారు. వారితో పాటు మాకు ప్రజల ఆశీస్సులు లభిస్తాయన్న నమ్మకం ఉంది.
ఆశయం
జగనన్న సీఎం అయితే ప్రధానంగా వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేయించి ఈ ప్రాంతంలో శాశ్వతంగా కరువు తీర్చాలన్నదే నా ఆశయం. 2004లో మా నాన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి వెలిగొండ ప్రాజెక్టు పనులను పునఃప్రారంభించారు. వైఎస్సార్ ప్రమాదంలో చనిపోవడంతో పనులు నత్తనడకన సాగుతున్నాయి. నాలుగేళ్ల నుంచి ఆశతో వెలిగొండ ప్రాజెక్టు నీళ్లు వస్తాయని ఎదురు చూస్తున్న ప్రజలకు నిరాశే మిగిలింది. చంద్రబాబు మాటలను ప్రజలు నమ్మరు.
వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయితేనే ఈ ప్రాజెక్టు పూర్తయి మార్కాపురం ప్రాంతం సస్య శ్యామలమవుతుంది. ఉగాది పండుగ రోజు విడుదల చేసిన వైఎస్సార్ సీపీ మేనిఫెస్టోలో కూడా అధికారంలోకి రాగానే వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తానని జగనన్న హామీ ఇచ్చారు. హామీకి కట్టుబడి కచ్చితంగా పూర్తి చేస్తారు. తాను ఎమ్మెల్యే కాగానే మార్కాపురం నియోజకవర్గ ప్రజల తాగునీటి సమస్యను జగనన్న సహకారంతో పరిష్కరిస్తా. పొదిలి పెద్ద చెరువు ఎస్‌ఎస్ ట్యాంక్‌గా మార్పించి అక్కడ కూడా నీటి సమస్య పరిష్కరిస్తా. మీరు ఈ నెల 11న జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించండి.
సమస్యలు పరిష్కరిస్తా
మార్కాపురం ప్రాంతంలో తాగునీటి సమస్యను పరిష్కరిస్తా. టీడీపీ ప్రభుత్వంలో వెలిగొండ ప్రాజెక్టు నిర్లక్ష్యానికి గురైంది. ఈ అంశంపై రైతుల్లో అసంతృప్తి ఉంది. ప్రాజెక్టు పూర్తి చేయలేదని ప్రజలు భావించారు. ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తుంది. మార్కాపురం ప్రాంతంలో వలసలు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడే ప్రజలు, కూలీలు ఉపాధి పని చేసుకునేందుకు కృషి చేస్తాను.
– ఇమ్మడి కాశీనాథ్ , జనసేన అభ్యర్థి
నీటి సమస్యకు పరిష్కారం
బీజేపీ అధికారంలోకి రాగానే వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రారంభించి మార్కాపురం ప్రజల నీటి సమస్యను పరిష్కరిస్తాం. మార్కాపురం చెరువులో రెండో సమ్మర్ స్టోరేజీ ట్యాంక్ నిర్మాణం చేపట్టి నీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తా.
- ఎం.చిన్నయ్య, బీజేపీ అభ్యర్థి
నియోజకవర్గ అభివృద్ధికి కృషి
మార్కాపురం నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి రాష్ట్రంలోనే మోడల్ నియోజకవర్గంగా అభివృద్ధి చేస్తాను. టీడీపీ ప్రభుత్వంలో వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణ విషయంలో నిర్లక్ష్యానికి గురైంది. అధికారంలోకి రాగానే వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం.
- షేక్ సైదా, కాంగ్రెస్ అభ్యర్థి
Comments
Please login to add a commentAdd a comment