manasulo mata
-
సేవకుడిలా పని చేస్తా..
సాక్షి, పలమనేరు : మంత్రి నియోజకవర్గమని పేరేగానీ గ్రామాల్లో కాని, పట్టణంలో కానీ తాగేందుకు నీళ్లులేవు. అందుకే పలమనేరులో ఇంటింటికీ నళ్లా, గ్రామాల్లో తాగునీటి సౌకర్యం కల్పించడమే తన ధ్యేయమని పలమనేరు అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్సార్సీపీ అభ్యర్థి ఎన్.వెంకటేశగౌడ తెలిపారు. ఆయన శనివారం ‘సాక్షి’ తో మాట్లాడారు. అభివృద్ధి కోసమే పార్టీ మారానని టీడీపీలో చేరి మంత్రి పదవిని దక్కించుకున్న అమరనాథ రెడ్డి నియోజకవర్గంలో చేసిందేమీలేదన్నారు. రూ.900 కోట్లతో అభివృద్ది చేశామంటూ గొప్పలు చెబుతున్నారేగానీ దాంట్లో రూ.300 కోట్లదాకా అక్రమాలు జరిగాయని ఆరోపించారు. రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖమంత్రిగా తన సొంత నియోజకవర్గంలో కనీసం కుటీర పరిశ్రమైనా కల్పించారా అని సూటిగా ప్రశ్నించారు. దివంగత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి స్ఫూర్తి, పెద్దిరెడ్డి అండతో తాను రాజీయాల్లోకి వచ్చానన్నారు. తనను గెలిపిస్తే పేదల కష్టాలు తెలిసినా వానిగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని తెలిపారు. ప్రశ్న: రాజకీయాల్లోకి ఎలా వచ్చారు? జవాబు: నేను ఏడేళ్లుగా నియోజకవర్గంలో ఎన్వీజీ ట్రస్టు ద్వారా సేవా కార్యక్రమాలను చేస్తున్నా. పెద్దిరెడ్డి కుటుంబ అండదండలతో నా రాజకీయ ప్రస్థానం మొదలైంది. గత ఎన్నికల్లో ఇక్కడి అభ్యర్థిని గెలిపించడం నుంచి స్థానికంగానే ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషిచేస్తున్నా. వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్రను చూసి స్ఫూర్తి పొందాను. నాయకుడు అంటే అలానే ఉండాలనుకున్నా. ఇందులో భాగంగానే నియోజకవర్గంలో ఇంటింటికీ వెళ్లి వారి సమస్యలను తెలుసుకున్నా. ప్రశ్న: కుటుంబ నేపథ్యం గురించి జవాబు:మాది పలమనేరు నియోజకవర్గంలోని వీకోటమండలం తోటకనుమ . తండ్రిపేరు చెంగేగౌడ. నా సతీమణి పావణి గృహిణి. నాకు ఇద్దరు సంతానం. నా విద్యాభ్యాసం పక్కనే ఉన్న వీ.కోటలో సాగింది. 9వతరగతి దాకా చదువుకున్నా. ఇంట్లో ఆర్థిక పరిస్థితులు సహకరించకపోవడంతో బెంగళూరుకు వెళ్లా. అక్కడ తాపీ పనులు చేశా. ఈ ప్రాంతం నుంచి వెళ్లిన కూలీలను గ్రూపుగా చేసి చిన్నచిన్న పనులు ఒప్పుకున్నాను. అదే రంగంలో అంచలంచెలుగా ఎదిగి బిల్డర్‌గా స్థిరపడ్డాను. ప్ర: ఐదేళ్ల టీడీపీ పాలనపై ఏమంటారు జ: టీడీపీ నాయకులు నిధులు దోచుకోవడానికే సరిపోయింది. నియోజకవర్గంలో చాలా గ్రామాల్లో తాగేందుకు నీళ్లు కూడా లేవు. మంత్రి లేనిపోని మాటలు, ప్రజలను ఏమార్చేందుకు శిలాఫలకాలు తప్పా ఇక్కడ చేసిందేమీ లేదు. ప్ర:నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలు గుర్తించారు... జ: నియోజకవర్గంలో ప్రధానంగా తాగునీటి సమస్య ఉంది. ఇది మెట్టప్రాంతం కాబట్టి రైతుల సాగునీటికి ఇబ్బందులున్నాయి. పెండింగ్‌లోని గంగన్న శిరస్సు, కైగల్ ఎత్తిపోతల, హంద్రీనీవాతో చెరువుల అనుసంధానం చేయాల్సి ఉంది. ఏనుగుల సమస్య, టమాటా రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించడం ఇలా చాలా సమస్యలున్నాయి. ప్ర: ఎన్నికల్లో గెలిస్తే ఏం చేస్తారు? జ: నిత్యం నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటా. ఇంతవరకు మా సొంత మండలానికి ఏ రాజకీయపార్టీలోనూ ప్రాతినిధ్యం వహించే అవకాశం రాలేదు. ఇప్పుడు వైఎస్సార్సీపీ నా ద్వారా ఆ అవకాశం కల్పించింది. వెంకటగౌడ ఎమ్మెల్యేగా బాగా పనిచేశాడబ్బా అని జనం చెప్పుకుంటే చాలు. ఏడాదికి ఒక్కసారి .. ఐదేళ్లలో కనీసం ఐదుసార్లు ఇంటింటికీ వెళతాను. వాళ్ల యోగక్షేమాలు తెలుసుకుంటాను. వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా. -
నటుటు పృధ్వీతో మనసులో మాట
-
బీజేపీ నాయకురాలు కవితతో మనసులో మాట
-
అమరావతి ఒక విధ్వంసం
అమరావతి పేరుతో ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు జరుపుతున్న వ్యవహారం మహా విధ్వంసకరమని విప్లవరచయితల సంఘం వ్యవస్థాపక సభ్యుడు వరవరరావు విమర్శిం చారు. చంద్రబాబు విధానాలనే కేసీఆర్ పాటిస్తున్నారని, ఏ విషయంలోనూ వీళ్లిద్దరికీ తేడా లేదని ఆరోపించారు. రాష్ట్ర సహజవనరులను అప్పనంగా పెట్టుబడిదారులకు అప్పగించడంలో ఇద్దరు చంద్రులూ ఒకే తానుముక్కలేనని పేర్కొన్నారు. మూడు లక్షల మంది ఆదివాసులను ముంచేస్తున్న ప్రాజెక్టులు ఎవరి అభివృద్ధిలో భాగమని ప్రశ్నిస్తున్న వరవరరావు అభిప్రాయాలు ఆయన మాటల్లోనే... రాని విప్లవాల కోసం మీ జీవితాలను అర్పిస్తున్నారే? రైతు వ్యవసాయం చేయడం మానుకున్నాడా? ఈ ఏడాది పంటపోవచ్చు, వచ్చే ఏడాదీ, ఆ మరుసటి ఏడాదీ పోవచ్చు కానీ రైతు నమ్ముకున్నదే వ్యవసాయాన్నే కదా. ఇక్కడి కమ్యూనిస్టు పార్టీ నమ్ముకున్నదే వ్యవసాయ విప్లవాన్ని. ఆప్తులు ఎన్కౌంటర్లలో పోతుంటే భయమనిపించదా? మానవ సహజ లక్షణాల్లో బాధ ఉంటుంది. నిజానికి క్రిస్టఫర్ కాడ్వెల్ ‘ఒక కంట్లో కన్నీరు ఉంది కాబట్టి మరోకంట్లో కత్తి మొలిచింది’ అంటాడు. తోటివారి బాధను చూసి కమ్యూనిస్టులు బాధ చెందేటట్లు మరెవ్వరూ చెందలేరు. పార్వతీపురం కుట్రకేసులో ముద్దాయిలపై విచారణ సమయంలో కాళోజీ, నేనూ కోర్టుకు వెళ్లాం. ఆరేడేళ్లుగా జైల్లో ఉన్నవాళ్లను చూసి కాళోజీ కన్నీరు కార్చాడు. ఆ తర్వాత వారే ఉత్తరం రాశారు. ‘కాళోజీ కన్నీళ్లను కత్తులుగా మార్చుకోవడం నేర్చుకో’ అని. ఆ బాధనుంచే జీవితమంతా అంత ఆగ్రహంతో జీవించారాయన. అలాగే పెట్టుబడి, అది చేసే దోపిడీపై మార్క్స్ తీవ్ర వేదన చెందారు. మనిషి నెత్తురూ, చెమటా పోసి సరుకును ఉత్పత్తి చేస్తే ఆ సరుకుకే ఆ మనిషి పరాయివాడైపోతున్నాడని బాధ. తెలంగాణ రాష్ట్రం వచ్చింది కదా. ఇప్పుడెలా ఉంది? ఇట్ల ఉంటుందని ఎవరనుకున్నారు అన్నాడు కాళోజీ 1952లోనే. తెలంగాణలో ఉంటూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడాలని కోరుకుని ఉద్యమించినవాడు కాళోజీ. శ్రీశ్రీతో కలిసి 1943లోనే వరంగల్‌లో ఆకారం నరసింగరావు తోటలో విశాలాంధ్ర కావాలని సభ పెట్టించి, టాంగాలో పోతుంటే ప్రత్యేక తెలంగాణ వాదులు వారిపై రాళ్లు విసిరారు. అయినా సరే... విశాలాంధ్ర తీర్మానం చేశారు. తర్వాత 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడితే విశాలాంధ్ర ఇట్ల ఉంటుందని ఎవరనుకున్నారు అని రాశారు అదే కాళోజీ. అప్పటికీ ఇప్పటికీ తేడా ఏమిటంటే కాళోజీ ఆరోజు ఇట్లవుతుందని ఎవరనుకున్నారన్నారుగానీ నేటి తెలంగాణ ఇట్లవుతుందనే మేమనుకున్నాం. కేసీఆర్ తెలంగాణ ఇట్లే అవుతుందనుకున్నారా? బాబు గతంలో చెయ్యంది కేసీఆర్ ఇప్పుడు ఏం చేస్తున్నాడు? టీడీపీకి ఇప్పుడు రెండు రాష్ట్రాలు, రెండు ప్రభుత్వాలు ఏర్పడ్డాయని రాశాను. తెరాస ప్రభుత్వంలో 12 మంది టీడీపీకి చెందినవారు మంత్రు లుగా ఉంటున్నారు. నేటి తెలంగాణను ఈ రూపంలో కోరుకోలేదు. బాబు అనుసరించిన ఏ దోపిడీ విధానాలను కేసీఆర్ అనుసరించకుండా ఉన్నారో చెప్పండి. అదే సామ్రాజ్యవాద ప్రపంచీకరణ, అదే ప్రపంచబ్యాంక్ ఆర్థిక విధానం అమలవుతోందిప్పుడు. అసలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడటంలోనే ద్రోహం ఉంది. ఏమిటి ఈ ప్యాకేజీలు? మీకు తెలంగాణను ప్యాకేజీగా ఇస్తాం. వాళ్లకు పోలవరం ప్యాకేజీగా ఇస్తాం. కానీ, మీ ప్యాకేజీల మాయలో ఆదివాసులు 3 లక్షలమందికి పైగా చచ్చిపోతున్నారు అక్కడ. ఏ ప్రజలను కొట్టి ఏ ప్రజలకోసం మీరు ప్యాకేజీలను ఇస్తున్నారు? ప్రాజెక్టులే లేకపోతే అభివృద్ధి ఎలా? ప్రజలు కోరుకునే పద్ధతిలో ప్రాజెక్టులు ఉండటం లేదు. జల్, జంగిల్, జమీన్ మాకు కావాలి అని ప్రజలు కోరుకున్నారు. అధికారం వస్తే జల్ని, జంగిల్‌ని, జమీన్ని ఏంచేయాలని ప్రజలు నిర్ణయిం చుకోవాలి కానీ మీరెవరు ప్రజలకు ఏది కావాలో నిర్ణయించడానికి? పోలవరం ప్రాజెక్టుకు అనుమతిస్తే నేను అక్కడ కుర్చీ వేసుకుని కూర్చుని దాన్ని అడ్డుకుంటాను అని ప్రగల్భాలు పలికిన కేసీఆర్ ఇవ్వాళ ఏమైపోయాడు? నీళ్లు రావు, నెత్తురు పారుతుందన్న అదే కేసీఆర్ ఆ ప్యాకేజీమీదే సంతకాలు చేసేసి తెలం గాణ తెచ్చుకున్నాడు. వెంకయ్య, జైరాం రమేష్, చంద్రబాబు ముగ్గురూ చేసిన కుట్ర పథకానికి కేసీఆర్ లోబడి ఏడు మండలాలూ వదులుకున్నాడు. ప్రాజెక్టుకూ సమ్మతించిండు. 3 లక్షల మందిని ముంపునకు అర్పించేశాడు. అక్కడితో ఆగకుండా ఇవ్వాళ గోదావరి నదిమీద ప్రాజెక్టుల పేరుతో ఒక్కో ప్రాంతంలో డజన్ల కొద్దీ ఆదివాసీ గ్రామాలను నీళ్లలో ముంచేయబోతున్నారు. ప్రాజెక్టులతో తెలంగాణ సస్యశ్యామలం కాదా? ఎవరికోసం సస్యశ్యామలం చేస్తున్నారు అనేది ప్రశ్న. లోచన్ అనే కవి భాక్రానంగల్, నాగార్జున సాగర్ ప్రాజెక్టులు ఇప్పుడు పెద్దవాళ్ల ఇళ్లల్లో షవర్ బాత్ లుగా పనిచేస్తున్నాయని కవిత్వం రాశారు. మరి ఈ ప్రాజెక్టులన్నీ ఎవరికోసం వస్తున్నాయంటారు? భూమిని పంచకుండా ఈ ప్రాజెక్టులేంటి? మీ మోడల్ ప్రకారం అసలు అభివృద్ధి ఎలా? అభివృద్ధి గురించి చీమలను అడగండి. చీమల్లాంటి ప్రజలను అడగండి. అంతే కానీ పాములను అడగొద్దు. పాములకోసం అభివృద్ధి చేయవద్దు. ఆదివాసులను అడగండి. వాళ్ల కాళ్లకింది నేలను లాగేస్తున్న వారిని అడగొద్దు. చీమలనుకున్నవే.. పాములుగా మారుతున్న రోజులివి. కేసీఆర్, చంద్రబాబు పాలనపై మీ అభిప్రాయం? ఇద్దరి ప్రభుత్వాలలో ఏమీ తేడా లేదండి. వాస్తవంగా చెప్పాలంటే చంద్రబాబు ప్రభుత్వం రెండో కొనసాగింపే కేసీఆర్ ప్రభుత్వం. బాబు తొమ్మిదిన్నరేళ్ల కొనసాగింపు తర్వాత ఈ నాలుగేళ్ల కొనసాగింపు కేసీఆర్‌ది. ఎన్టీఆర్ టీడీపీ నుంచి పుట్టినవాడు కేసీఆర్. లాటిన్ అమెరికన్ పాలనలోని రాక్షసత్వాన్ని అమలు చేసిన దుర్మార్గ పాలన ఎన్టీఆర్‌ది. ప్రపంచీకరణ విధానాలను ఒక రిహార్సల్‌గా అమలు చేసినవారు రాజీవ్ గాంధీ, ఎన్టీఆర్. కేసీఆర్ ఆ విధానాలనే అమలు చేస్తున్నారు. మరి చంద్రబాబు పాలనపై..? ఇక చెప్పాల్సిన పనిలేదు. వాస్తవానికి చంద్రబాబు చెప్పుకుంటున్న అమరావతి రాజధాని ఒక భయంకరమైన విధ్వంసం. రాజకీయం అనే భావననే భ్రష్టుపట్టించింది చంద్రబాబు కాగా సరిగ్గా ఆ విధానాలనే కేసీఆర్ పాటిస్తున్నాడు. ఏ విషయంలోనూ వీరిద్దరికీ తేడా లేదు. రైతు బంధు అని కేసీఆర్ తీసుకొచ్చాడు కదా? నమ్మక ద్రోహం ఇది. ఏ రైతులకు ఇస్తున్నాడు, భూమ్మీద సేద్యం చేసే రైతులకు ఇచ్చాడా, సేద్యం చేయని భూ యజమానులకు ఇచ్చాడా. -
ఫిరాయింపులను ఎన్నడూ సమర్థించం
పార్టీలు మారిన చట్టసభల సభ్యులు తమ పదవులకు రాజీనామా చేయాలని, అలా చేయకుండా మరోపార్టీలో చేరితే వారిపై తప్పక చర్యలు తీసుకోవాలని తెలంగాణ బీజేపీ శాసనసభాపక్ష నేత కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. నిర్దిష్టంగా ఆధారాలు సమర్పిస్తే ఫిరాయించిన ఎంపీలపై తప్పకుండా వేటు వేయాలనే అంశంలో బీజేపీ వైఖరి మారదన్నారు. ఓటుకు కోట్లు విషయంలో చట్టప్రకారం చర్యలు తీసుకోవలసిందేనని, ఆ విషయంలో చంద్రబాబును కూడా తప్పించే ప్రశ్నేలేదన్నారు. చంద్రబాబు తెలంగాణ ఎమ్మెల్సీతో మాట్లాడినట్లు చెబుతున్న సీడీ నిజమే అయితే దానిపై ఏ చర్య అయినా సరే తీసుకోక తప్పదని, అది తెలంగాణా ప్రభుత్వ బాధ్యతని చెప్పారు. కేసీఆర్, చంద్రబాబు మధ్య రాజీ కుదిర్చామని బీజేపీ అధిష్టానం తమకు ఎన్నడూ చెప్పలేదన్నారు. సంక్షేమ పథకాలకు సంబంధించి కొత్త ఒరవడి సృష్టించిన ఘనత వైఎస్సార్దేననీ.. ఫీజు రీయింబర్స్ మెంట్, ఆరోగ్యశ్రీ, ఫించన్లు.. ఇలా జీవితం పట్ల జనంలో నమ్మకం కలిగించిన గొప్ప మనిషి ఆయన అంటున్న కిషన్ రెడ్డి అభిప్రాయాలు ఆయన మాటల్లోనే... పాతికేళ్లుగా మీ ఆకారంలో మార్పులేదు. మీ ఆరోగ్య రహస్యం ఏమిటి? రహస్యం ఒక్కటేనండి. గత పదిహేనేళ్లుగా నా నియోజకవర్గంలో ప్రతిరోజూ ఏదో ఒక బస్తీలో పర్యటిస్తున్నాను. అలాగే తప్పకుండా ఉదయం పూట నడుస్తాను. ఇంట్లో కూడా ఆహారం మీద నియంత్రణ ఉంటుంది. ఇంట్లో ఉదయం పూట ఒకే ఒక జొన్న రొట్టె తింటాను. తిని బయటకు వెళితే రాత్రి 11 గంటలకే మళ్లీ ఇంటికి వస్తాను. నాకు ఇంట్లో ప్రధాన ప్రత్యర్థులు నా పిల్లలే. స్కూల్ ఫంక్షన్‌కు రమ్మని, ఇతరత్రా అడుగుతుంటారు. అంతకుమించి నా శ్రీమతిని ఇంకా ఇబ్బంది పెట్టి ఉంటాను. మద్యాహ్నం బయట తిన్నా పప్పు, సాంబారు, పెరుగు తప్ప మరేమీ తీసుకోను. రాత్రి ఇంటికి వస్తే మళ్లీ రొట్టె తింటాను. అప్పటికే పిల్లలు నిద్రపోయి ఉంటారు. ఆమెను కూడా లేపకుండా నేనే ఏదో ఒకటి పెట్టుకుని తినేస్తాను. పేదింట్లో తిన్నా, స్టార్ హోటల్లో తిన్నా పప్పు, సాంబారు, పెరుగు తప్ప మరేమీ తీసుకోను. ఇదే నా ఆరోగ్య రహస్యం. రాష్ట్రం కోసం రథయాత్రలు చేశారు. తెలంగాణ ఇప్పుడెలా ఉంది? తెలంగాణ ప్రజలు ఇవ్వాళ సంతృప్తిగా లేరు. టీఆర్ ప్రభుత్వం ఎన్ని పథకాలు ప్రవేశపెట్టినా, ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు, ప్రచారాలు చేసినా ప్రజల్లో ఎక్కడో అసంతృప్తి కనిపిస్తోంది. ఇంతమందిమి తెలంగాణ కోసం బలిదానాలు చేసింది కేసీఆర్ కుటుంబం కోసమా? మావాళ్లు ఇంతమందిమి చనిపోయింది ఆ కుటుంబ పెత్తనం కింద పనిచేయడం కోసమా? నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర కలిగిన తెలంగాణలో నిజాం ఆలోచనా విధానంతో కేసీఆర్ ప్రభుత్వం పనిచేస్తోందన్న ఆలోచన ప్రజల్లో ఉంది. అన్ని వర్గాల్లో తెలియని అసంతృప్తి. ఎస్టీ యువతలో అసంతృప్తి, రైతుల్లో అసంతృప్తి, నిరుద్యోగ యువత, పట్టణ పేదప్రజల్లో వ్యతిరేకత గూడు కట్టుకుని ఉంది. శాసనసభా పక్ష నేత అయిన మీకే కేసీఆర్ అప్పాయింట్మెంట్ ఇవ్వలేదా? కోదండరామ్‌కే ఈ రోజువరకు అప్పాయింట్మెంట్ లేదు. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు ఉదయం అడిగితే సాయంత్రానికి అప్పాయింట్మెంట్ ఇచ్చేవారు. వైఎస్సార్ అయితే చాలామందిమి వెళితే గేటువద్దకే వచ్చి కలిసి మాట్లాడేవారు. అంత గొప్ప సంప్రదాయం పాటించేవారాయన. ఆంద్రాపాలకులే సీఎంలుగా ఉన్నప్పుడు వాళ్ల చాంబర్లో రాజకీయనేతలే కాదు. వామపక్ష భావాలున్న ప్రజాసంఘాల నేతలు, విద్యార్థి నాయకులు, కార్మిక నేతలు, కుల సంఘాల నేతలు కూడా స్వేచ్చగా వెళ్లి కూర్చోవడానికి అవకాశం ఇచ్చారు. ఈరోజు ఒక్కటంటే ఒక్క ఘటన అలాంటిది కేసీఆర్ చాంబర్లో జరిగిందేమో చూడండిమరి. ఎవ్వరినైనా సరే కేసీఆర్ కలిసే ప్రసక్తే లేదు. దశాబ్దాలుగా సమస్యలపై పోరాడుతున్న కమ్యూనిస్టు కార్మిక నేతలను కూడా కేసీఆర్ కలవడానికి ఇష్టపడటం లేదు. తెలంగాణలో పత్రికా స్వేచ్ఛపై మీ అభిప్రాయం? ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించినప్పుడు పత్రికాస్వేచ్ఛపై ఎలాంటి నియంత్రణ అమల్లో ఉండిందో అలాంటి స్థితిని తెలంగాణ కొంతకాలం క్రితం చవిచూసింది. కొన్ని టీవీ చానెళ్లనే మూసివేయించారు. ఆ సందర్భంగా కేసీఆర్ ఏమన్నారు. పది కిలోమీటర్ల పరిధిలో మాకు వ్యతిరేకంగా ఎవరైనా రాస్తే భూమిలోకి తొక్కుతాను అన్న ముఖ్యమంత్రిని ఈ దేశంలో ఎప్పుడైనా చూశామా? కానీ దీనికి వ్యతిరేకంగా ఒక్క పేపర్ మాట్లాడలేదు. ఒక్క టీవీ కూడా మాట్లాడలేదు. తెలంగాణ మొత్తంగా ఒక బ్లాక్ మెయిలింగ్ వాతావరణం, నియంత్రత్వ వాతావరణం ఆవరించింది. ఎంతోమంది సీనియర్ పాత్రికేయులు ఉన్నప్పటికీ యాజమాన్యాలు చెప్పాయి కాబట్టి కేసీఆర్‌కి వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడలేకపోయారు. అందర్నీ నేను దారిలోకి తెచ్చుకున్నాను కదా. నాకు వ్యతిరేకంగా రాసేదెవరు ఇప్పుడు అని ఇప్పటికీ కేసీఆర్ దర్పంగా అంటున్నారు.? టీవీల్లో ఏదైనా చర్చ జరుగుతుంటే, ముఖ్యమంత్రే స్వయంగా ఫోన్ చేసి ఆ చర్చ ఇక ఆపేయ్ అని ఆదేశిస్తుంటే దీన్ని ఏమని అర్థం చేసుకోవాలి? వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో ఫలితాలు ఎలా ఉంటాయి? సర్వేల ఫలితాల గురించి ఎవరేం చెప్పుకున్నా, ఒకటి మాత్రం నిజం, వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో హంగ్ తప్పదు. మేం అధికారంలోకి రావడం కష్టసాధ్యమైన కేసీఆర్ ప్రభుత్వానికి మాత్రం మెజారిటీ రాదు. ఫిరాయింపుల మీద బీజేపీకి ఒక నిర్దిష్ట వైఖరి ఏమైనా ఉందా? ఫిరాయింపులు చాలా తప్పు. అలా పార్టీలు మారితే ముందుగా తమ పదవులకు రాజీనామా చేయాలనేది మా విధానం. అలా రాజీనామా చేయకుండా మరో పార్టీలో చేరితే వారిపై చర్యలు తీసుకోవాల్సిందే. వైఎస్సార్సీపీ నుంచి ఎన్నికై టీడీపీలో చేరిన ముగ్గురు ఎంపీల సభ్యత్వాన్ని ఎందుకు రద్దు చేయలేదు? వెంకయ్య నాయుడు ఇటీవలే ఫిరాయింపులపై స్పష్టమైన ప్రకటన చేస్తూ నిర్దిష్టంగా ఆధారాలు సమర్పిస్తే ఫిరాయించిన ఎంపీలపై తప్పకుండా వేటు వేస్తామని చెప్పారు. ఆ విషయంలో మా పార్టీ వైఖరి మారదు. మారబోదు కూడా. ఓటుకు కోట్లు ఇచ్చి ఎమ్మెల్సీలను టీడీపీ కొనబోయి దొరికిపోతే కేంద్రంలో బీజేపీ వాళ్లే కేసీఆర్‌కీ చంద్రబాబుకీ రాజీ చేశారని వార్తలు? ఓటుకు కోట్లు విషయంలో చట్టప్రకారం చర్యలు తీసుకోవలసిందే. ఆ విషయంలో చంద్రబాబును కూడా తప్పించే ప్రశ్నేలేదు. రేవంత్ రెడ్డి డబ్బు ఇస్తూ దొరికిపోయినట్లుగానే, చంద్రబాబు తెలంగాణ ఎమ్మెల్సీతో మాట్లాడినట్లు చెబుతున్న సీడీ నిజమే అయితే దానిపై ఏ చర్య అయినా సరే తీసుకోక తప్పదు. అది తెలంగాణా ప్రభుత్వ బాధ్యత. మా అధిష్టానం మాత్రం కేసీఆర్, చంద్రబాబు మధ్య రాజీ కుదిర్చామనే మాట ఇంతవరకు మాకు చెప్పలేదు. అది నిజం కాకపోవచ్చు. ఈ విషయం మీద నిజం ఏమిటన్నది చెప్పాల్సింది కేసీఆర్, చంద్రబాబులే. విభజన హామీలు అమలు చేయలేదంటూ చంద్రబాబు మోదీని భ్రష్టుపట్టించారు. అయినా మీరు మౌనంగా ఉంటున్నారే? మిత్రపక్షం కాబట్టి మేము సంయమనంతో ఉంటున్నాం. మేం కూడా వారిలాగా మీడియాకు ఎక్కలేం కదా. దేశంలో ఏయే రాష్ట్రాలకు ఎంతమేరకు కేటాయింపులు ఉన్నాయో ఆ మేరకు కేటాయింపులు జరుపడంలో కేంద్రం ఎవరికీ అన్యాయం చేయలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్టానికి ఏమేం జరగాలో ఆ న్యాయం తప్పకుండా జరుగుతుంది. ఈరోజు కాకపోవచ్చు కానీ ఆ తన బాధ్యతను నెరవేర్చడంలో కేంద్రం వెనక్కి తగ్గదు. కేసీఆర్ పాలనపై మీ అభిప్రాయం? టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రమైన అసంతృప్తి ఉంది. ప్రభుత్వం ప్రకటిస్తున్న పథకాలన్నింటిలో అవినీతి రాజ్యమేలుతోంది. మాకోసం పథకాలు ప్రకటించారట కదా. పేపర్లలో బాగానే చూసుకుంటున్నాంలే అంటూ జనం ఈసడించుకుంటున్నారు. పైకి చెప్పేదొకటి. లోపల చేసేదొకటిగా ఉన్న కేసీఆర్ ప్రభుత్వ వ్యవహారం జనంకు బాగానే అర్థమవుతోంది. (కిషన్ రెడ్డితో ఇంటర్వ్యూ పూర్తి పాఠం కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
జగన్ మాట తప్పడు.. ఆశీర్వదించండి
ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న తన బిడ్డ వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఆశీర్వదించాలని ఆయన తల్లి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ విజ్ఞప్తి చేశారు. తన తండ్రిలాగే ప్రజల కోసం మంచి పనులు చేసి చరిత్రలో నిలిచిపోవాలన్న తపన జగన్‌లో ఉందన్నారు. ఇచ్చిన మాట తప్పే మనిషి కాదని అన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నందుకే తాము కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్లిపోయే పరిస్థితులు సృష్టించారని చెప్పారు. మూడు దశాబ్దాలకుపైగా కాంగ్రెస్ పార్టీకి సేవ చేసిన వైఎస్సార్ కుమారుడిపై కేసులు పెట్టడం బాధ కలిగించిందని అన్నారు. ముఖ్యమంత్రి కావాలని జగన్ ఏనాడూ కోరుకోలేదని తెలిపారు. సీఎం చంద్రబాబు జనం కోసం ఏం చేశారని వచ్చే ఎన్నికల్లో మళ్లీ ఓట్లు వేయాలని ప్రశ్నించారు. వైఎస్సార్ పాలన చూశారు కనుక జగన్ పాలన రావాలన్న కోరిక ప్రజల్లో కనిపిస్తోందని పేర్కొన్నారు. విజయమ్మ ‘సాక్షి’ టీవీ ప్రతినిధి కొమ్మినేని శ్రీనివాసరావుకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు... – సాక్షి, హైదరాబాద్ అప్పుడే తొమ్మిదేళ్లు అయిపోయాయి. కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు ఎదుర్కొంటూ వస్తున్నారు? వీటిని తలచుకుంటే ఏమనిపిస్తోంది? విజయమ్మ: రాజశేఖరరెడ్డి పోవడమే మాకు పెద్ద షాక్. ఆయన దాదాపు 35 ఏళ్లపాటు కాంగ్రెస్ పార్టీకి సేవ చేశారు. మరణించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వారికి రాజశేఖరరెడ్డి నచ్చలేదు. జగన్ నచ్చలేదు. ఆయన ద్వారా పైకి వచ్చినవారు, సహచరులు, ఆయనతో చాలా దగ్గరగా ఉన్న వారు ఎవరూ ఈ కుటుంబ పక్షంగా నిలబడకపోవడం చాలా బాధగా అనిపించింది. అన్యాయంగా కేసులు పెట్టి జగన్‌ను వేధించారు. జైలులో పెట్టించారు. ఎన్నో ఇబ్బందులను ఈ కుటుంబం ఎదుర్కొంది. అయినా జగన్ ధైర్యంగా ముందుకెళ్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్లాలని జగన్ ఎప్పుడూ అనుకోలేదు. పొమ్మనలేక పొగబెడతారన్నట్లుగా బయటకు వెళ్లాల్సిన పరిస్థితులు సృష్టించారు. కేంద్ర మంత్రి పదవి ఇస్తానన్నా వద్దన్నాడు. ఓదార్పు యాత్రకు అనుమతి తప్ప మరేమీ అడగలేదు. అందరూ మాతో బాగానే ఉండేవారు. కానీ సోనియా గాంధీకి, కేంద్రంలోని వాళ్లకు తప్పుడు సమాచారం ఇచ్చారు. సంతకాలు జగనే పెట్టించాడన్నట్లుగా ఆమెకు రిపోర్టులు పంపించినట్లు ఉన్నారు. ఆమె దాన్నే చాలా సీరియస్‌గా తీసుకున్నట్లున్నారు. ఒక్క విషయంలో రాజీపడి ఉంటే మీకు ఇన్ని ఇబ్బందులు వచ్చేవి కాదు కదా విజయమ్మ: ఓదార్పు యాత్రను మధ్యలో ఆపేశారు. రాజశేఖరరెడ్డికి అంత మంచి పేరు ఉందని కాంగ్రెస్ వారు కూడా ఊహించలేదనుకుంటా. ఒక జిల్లాలో యాత్ర చేయడానికి అనుమతించారు. ఆ జిల్లాలో ప్రజలు రాజశేఖరరెడ్డిపై ఉన్న ప్రేమనంతా జగన్‌పై చూపించారు. ఇది కాంగ్రెస్ వారికి నచ్చలేదనుకుంటా. అందుకే ఓదార్పు యాత్ర వద్దని ఆపించారు. తర్వాత మేం పరిస్థితులను వివరించడానికి అవకాశం ఇవ్వడంటూ సోనియా గాంధీకి లేఖ రాశాం. ఐదు వారాల తర్వాత సోనియాగాంధీ పిలిచారు. దీంతో నేను, షర్మిళ, జగన్, భారతమ్మ కలిసి వెళ్లాం. ‘మీరు రాష్ట్రమంతా ఓదార్పు యాత్ర చేయడానికి వీల్లేదు. ఒకేచోటకు అందరినీ పిలవండి. ఒక విగ్రహమే పెట్టండి. అంతకు మించి తిరగొద్దు. ఇది పార్టీ నిర్ణయం’ అని సోనియా చెప్పారు. షర్మిళ కళ్లల్లో నీరు పెట్టుకుని అడిగారు. ‘నాన్న మరణవార్త విని తట్టుకోలేక మరణించిన వారి ఇళ్లకు వెళ్లి పరామర్శించడమే సరైన పద్ధతి’ అని షర్మిళ నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. మరణించిన వారి కుటుంబాలను ఒకచోటకు పిలవాలనడం మాకు నచ్చలేదు. అందుకే ఇచ్చిన మాట మేరకు జగన్ ఓదార్పు యాత్ర చేయాల్సిందేనని నిర్ణయించుకుని బయటకు వచ్చారు. ఓదార్పు యాత్ర మొదలు పెట్టారు. యాత్రకు వెళ్లొద్దు, సహకరించొద్దంటూ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలను కట్టడి చేశారు. తర్వాత పరిస్థితులన్నీ మారిపోయాయి. పార్టీ నుంచి బయటకు వెళితే ఇబ్బంది పడాల్సి వస్తుందని కేవీపీ లాంటి వారు చెప్పారట కదా? విజయమ్మ: చెప్పారు. వీరందరూ చెప్పారు. ఈ పార్టీలోనే ఉంటే ముఖ్యమంత్రిని చేస్తారు, బయటకు వెళ్లవద్దని చెప్పారు. అయితే పార్టీ నుంచి జగన్ బయటకు వెళ్లక తప్పని పరిస్థితి సృష్టించారు. కడప జిల్లాకే పరిమితం చేశారు. మా ఇంట్లో తన నుంచి చిన్నాన్నను విడదీసేందుకు జరిగిన కుట్ర జగన్‌కు నచ్చలేదు. ఇక ఆ పార్టీలో మనం మన్నన పొందలేమమ్మా, బయటకు వెళ్లిపోదామని అన్నాడు. కొత్త పార్టీ పెట్టడానికి మీరు అంగీకరించారా? విజయమ్మ: ఆ సమయంలో అదే సమంజసం అనిపించింది. జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర చేస్తుండడం మీకు ఎట్లా అనిపిస్తోంది? విజయమ్మ: ఈ కుటుంబంలో నేను ముగ్గురి (వైఎస్సార్, షర్మిళ, జగన్) పాదయాత్రలు చూశా. అందరిదీ ఒకే లక్ష్యం. వాళ్ల నాన్న లాగా ప్రజలతో ఉండాలని, వారికి మేలు చేయాలనే తపన జగన్‌లో చాలా ఎక్కువగా ఉంది. అతడు రాజకీయాల్లోకి రావడానికి కూడా ఇదే కారణం. ప్రజలు తన దగ్గరకు వచ్చి సమస్యలు చెప్పుకున్నప్పుడు జగన్ భరోసా ఇస్తున్న తీరు చూస్తుంటే నాకు రాజశేఖరరెడ్డి గుర్తొస్తారు. మీ అబ్బాయిని చూడు, మా అబ్బాయిని చూడు ఎలా పెంచానో... అని అసెంబ్లీలో చంద్రబాబు అన్నారు కదా! విజయమ్మ: ఎవరినీ విమర్శించడం నాకు ఇష్టముండదు. నా బిడ్డకు ఒక్క దురలవాటు కూడా లేదు. చిన్న అబద్దం కూడా చెప్పడం తెలియదు. సిగరెట్ ముట్టడు. పబ్‌లకు వెళ్లే అలవాటు లేదు. నా బిడ్డకు పని చేయడం, ఇంట్లో అందరితో సంతోషంగా ఉండటమే తెలుసు. చంద్రబాబు విమర్శించినప్పుడు మీకు ఎలా అనిపించేది? విజయమ్మ: అసెంబ్లీలో జగన్‌ను మంత్రులు రెచ్చగొట్టినప్పుడు, కొందరు నేతలు జగన్ గురించి ఏదేదో మాట్లాడినప్పుడు, అసత్య ఆరోపణలు చేసినప్పుడు నాకు తెలియకుండానే కన్నీళ్లొచ్చేవి. చాలా బాధ కలిగేది. జగన్ మాత్రం ధైర్యంగా ఎదుర్కొన్నాడు. వాళ్లు అలా అనకుండా ఇంకేమంటారమ్మా.. అంటూ నన్ను సముదాయించేవాడు. ప్రజాసంకల్ప యాత్రకు వస్తున్న స్పందన చూస్తే మీకేమనిపిస్తోంది? విజయమ్మ: జగన్ పాదయాత్రకు లక్షలాది మంది వస్తున్నారు. నా దృష్టిలో ఎన్ని కిలోమీటర్లు నడిచారనేది పెద్ద ప్రాతిపదిక కాదు. మనం ఎన్ని లక్షల మందిని కలిశాం? ఎంతమందికి విశ్వాసం కల్పించాం? ఎంతమందికి ధైర్యం కల్పించగలుగుతున్నామనే అంశాలనే ప్రాతిపదికగా తీసుకోవాలి. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి కావడానికి 25 ఏళ్లు పట్టింది. అన్ని రోజులూ జనం ఆయనను నాయకుడిగా నమ్మారు. ఆయనపై అభిమానం చూపారు. ప్రజలకు తాను రుణపడి ఉన్నానని రాజశేఖరరెడ్డి అనుకునేవారు. ఈ రోజు ఆ జనం కోసం నా బిడ్డ నిలబడుతున్నాడని తలచుకుంటే ఎంతో గర్వంగా అనిపిస్తోంది. ఎమ్మెల్యేలతో జగన్ సంతకాలు పెట్టించాడన్న అపవాదు చాలా తప్పు. రాజశేఖరరెడ్డి మరణంతో మేము షాక్‌లో ఉన్నాం. సంతకాలు పెట్టించిన సంగతి కూడా జగన్‌కు తెలియదు. సీఎం కావాలని జగన్ అనుకోలేదు. కాబట్టే రోశయ్య గారిని ముఖ్యమంత్రి చేద్దామంటే ఒప్పుకున్నారు. రఘువీరారెడ్డి, మరికొందరు వచ్చి ఒప్పుకోవద్దని చెప్పారు. జగన్ భవిష్యత్తు, వైఎస్సార్సీపీ భవితవ్యంపై మీరేమనుకుంటున్నారు? విజయమ్మ: ప్రజలు విజ్ఞులు. వారికి అన్నీ తెలుసు. ఈ రోజు వారి కష్టాలను జగన్ వింటున్నాడు. అవి తీరుస్తానంటున్నారు. జగన్ కూడా తండ్రిలా మంచి చేస్తారనే నమ్మకం ప్రజల్లో ఉంది. చంద్రబాబు నాయుడిని ప్రజలు నమ్మడం లేదు. వైఎస్ కుటుంబం ఒక మాట ఇస్తే చేస్తుందని ప్రజలు నమ్ముతారనే ప్రగాఢ విశ్వాసం నాకుంది. రాజశేఖరరెడ్డి రక్తం కాబట్టి జగన్ చెప్పింది కచ్చితంగా చేస్తారనే విశ్వాసం ప్రజల్లో ఉంది. అందువల్ల తప్పకుండా జగన్ ప్రభుత్వం వస్తుందని, వాళ్ల తండ్రి చేసిన పనులను తప్పకుండా చేస్తారని నమ్ముతున్నా. జగన్ పాదయాత్రలో ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా? సలహాలేవైనా ఇచ్చారా? విజయమ్మ: వాళ్ల నాన్న చనిపోయినప్పటి నుంచి జగన్ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. తాను ఎన్ని కష్టాల్లో ఉన్నప్పటికీ ప్రజలు ఎక్కడ బాధల్లో ఉన్నా నేనున్నానంటూ వెళ్లడం జగన్‌కు ఉన్న ప్రత్యేక లక్షణం. అతడికి సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదనుకుంటా. జగన్‌పై కేసులు పెట్టినప్పుడు తల్లిగా మీరు ఎలా ఫీలయ్యారు? విజయమ్మ: చాలా బాధ కలిగింది. వైఎస్ మూడు దశాబ్దాలకు పైగా కాంగ్రెస్‌కు సేవ చేశారు. ఆయన తన పేరు ఎక్కడా వాడుకోలేదు. ఎక్కడైనా కార్యకర్తలు రాజశేఖరరెడ్డి జిందాబాద్ అంటే రాజీవ్ గాంధీ జిందాబాద్ అనాలని సూచించేవారు. అంత సేవ చేసిన నాయకుడి కుమారుడిపై కేసులు పెట్టడం బాధ అనిపించింది. జగన్‌పై పెట్టిన కేసుల్లో పస ఉందనుకుంటున్నారా? విజయమ్మ: కాంగ్రెస్‌లో ఉన్నంత కాలం రాజశేఖరరెడ్డి, జగన్ మంచివాళ్లు. పార్టీ పెట్టాలని నిర్ణయించడంతోనే కాంగ్రెస్ వారికి చెడ్డవాళ్లయిపోయారు. అలా అనుకున్న వారంలోనే నోటీసులు వచ్చాయి, ఆ వెంటనే కేసులు పెట్టారు. ఈ రోజు ‘ఓటుకు కోట్లు’ కేసులో ఆధారాలున్నా ఏమీ చేయడం లేదు. కానీ ఆ రోజు కోర్టుకెవరో లేఖ రాస్తే దాన్ని సీరియస్‌గా తీసుకొని ఈ కేసులన్నీ నడిపించారు. కాంగ్రెస్, టీడీపీలు కలిసి కేసులు పెట్టాయి. ఇలాంటి సమయంలో రాజకీయాలెందుకని బాధపడ్డారా? విజయమ్మ: చాలా బాధపడ్డాను. జగన్‌కు కూడా చెప్పాను. వాళ్లకు వ్యతిరేకంగా వెళ్తే కష్టపడతావని అన్నాను. అలా అంటే న్యాయం, ధర్మం అనేవాడు. అబద్ధం చెప్పడం జగన్‌కు రాదు. న్యాయంగా వెళ్తూ కేసులన్నీ ధైర్యంగా ఎదుర్కొంటున్నాడు. అన్నిటికీ దేవుడున్నాడనేది అతడి నమ్మకం. మనం తప్పు చేయనప్పుడు భయపడాల్సిన పని లేదంటాడు. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ నేను ఒక్కటే చెబుతున్నాను. జగన్ మాట తప్పే మనిషికాదు. ఒక తల్లిగా అతడి వ్యక్తిత్వం నాకు తెలుసు. మాట ఇస్తే పూర్తిగా కట్టుబడి ఉంటాడు. జగన్‌ను ఆశీర్వదించండి. ఒక్కసారి అవకాశమివ్వండి. జగన్ అన్నీ చేస్తాడని మాట ఇస్తున్నా. జగన్‌కు జీవితమే అన్నీ నేర్పిస్తోంది. ఎక్కడ బస్సు, రైలు ప్రమాదం జరిగినా, వరదలొచ్చి ఎవరైనా చనిపోయినా వెంటనే అక్కడికి వెళ్లి బాధితులను ఓదార్చుతాడు. ప్రయాణాల్లోనే గడుపుతున్నాడు. ఇంట్లో ఉండేది ఎప్పుడని అడిగితే, మన బాధ్యత మనం నెరవేర్చాలి కదమ్మా అంటుంటాడు. వైఎస్సారే మనకు ఆదర్శం. ఆయన ఏనాడూ అబద్ధం ఆడలేదు. ఆయన చెప్పినవి చేశారు. చెప్పనివీ చేశారు. ప్రజల్లో నమ్మకం కలిగించి వెళ్లారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అవుతారని మీరు ఊహించారా? విజయమ్మ: ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు కాంగ్రెస్ పార్టీ వైఎస్‌ను చిన్న వయసులోనే పీసీసీ అధ్యక్షుడిని చేసింది. కాంగ్రెస్ నుంచి పెద్ద పెద్ద నాయకులు వెళ్లిపోయారు. అప్పుడు చిన్న వాడిని పీసీసీ అధ్యక్షుడిని చేసినందుకు పెద్ద వారికి కోపం వచ్చింది. సహాయ నిరాకరణ చేశారు. చిన్న మీటింగ్ పెట్టాలన్నా కష్టంగా ఉండేది. అలాంటి పరిస్థితుల్లో వైఎస్ అందరినీ కలుపుకుని వెళ్లి పార్టీని పటిష్టం చేశారు. ‘రాజశేఖరరెడ్డి అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే రాజశేఖరరెడ్డి’ అనే స్థితికి పార్టీని తీసుకొచ్చారు. పదేళ్ల ముందే రాజశేఖరరెడ్డి సీఎం అవుతారనే ప్రచారం సాగింది. రాజకీయాలపై నాకు అంతగా ఆసక్తి లేదు. సీఎం అయ్యాక ఆయన ఇంటికి వచ్చినా మా అందరితో సరదాగా గడిపే వారు తప్ప రాజకీయాల గురించి చెప్పేవారు కాదు. వైఎస్ చేసిన పనుల్లో మీకు బాగా నచ్చినవి? విజయమ్మ: రాజశేఖరరెడ్డిగారు చేసినవన్నీ మంచి పనులే. ఇప్పుడున్న వాళ్లు రాజశేఖరరెడ్డి పెట్టారని ఏ పథకం తీసేయాలన్నా తీయలేనివే. ఆయన ఎంతో ఆలోచన చేసి పథకాలను ప్రవేశపెట్టారు. ఇంకా ఏం చేయాలా? అని ఎప్పుడూ తపన పడేవారు. ఇప్పుడు చంద్రబాబు ప్రాజెక్టులు ప్రారంభిస్తున్నారంటే అవన్నీ రాజశేఖరరెడ్డిగారి పుణ్యమే. చంద్రబాబు ఆరోగ్యశ్రీని తీసేయగలరా? ఫీజు రీయంబర్స్మెంట్ను తీసేయగలరా? రాజశేఖరరెడ్డి పేరు లేకుండా చేయాలని వాళ్లకు ఉన్నా అలా చేయలేనివి ఆయన పథకాలు. అప్పుడు వాతావరణం బాగోలేకపోయినా రాజశేఖరరెడ్డి చిత్తూరు జిల్లా పర్యటనకు ఎందుకు వెళ్లారు. అధికారులు వద్దన్నారా? అధికారులు వద్దన్నా ఈయన వెళ్లారా? అసలేం జరిగింది? విజయమ్మ: ఆ రోజు నేను కూడా చెప్పా. వర్షం పడుతోంది, అసెంబ్లీ కూడా అయిపోయింది, ఇప్పుడు వెళ్లకుంటే ఏమవుతుంది? అన్నా. చాలా పనులున్నాయన్నారు. త్వరగా జలయజ్ఞం ప్రాజెక్టులు పూర్తి చేయాలి, రాష్ట్రానికి ఏమేం కావాలో అవన్నీ చేయాలి అని తపన పడేవారు. మూడేళ్లలో పోలవరం, ప్రాణహిత సహా ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామనేవారు. సోనియా గాంధీని కూడా వీటి గురించి అడిగి వచ్చారు. 33 మంది ఎంపీలను గెలిపించి తీసుకొస్తానంటే ఆమెకు నమ్మకం కలగలేదు. పదో, పన్నెండు మందో గెలుస్తారనుకున్నారు. వైఎస్ ఒక్కటే చెప్పారు. ఎన్నికలు అయిపోయాక డిసైడ్ చేయండమ్మా, మీరు పది 12 సీట్లు అనుకుంటున్నారు, నేను 33 నుంచి 36 మంది ఎంపీలను తీసుకొస్తాను, అప్పుడు మీరు నిర్ణయం తీసుకోండి అని అన్నారు. వైఎస్ మరణం ఒక కుట్ర అని ప్రచారం జరిగింది. హెలికాప్టర్ ప్రమాదమేని అనుకున్నారా? విజయమ్మ: నాకు కూడా ఏదో జరిగింది అన్న అనుమానం ఉండేది. జగన్‌ను చాలాసార్లు అడిగాను. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుకుంటే తప్ప ఏం జరిగినా బయటకు రాదమ్మా, రెండు ప్రభుత్వాలు దీని గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు కాబట్టి బయటకు వచ్చేది ఏమీ ఉండదు అని అన్నాడు. 2014 ఎన్నికల్లో 41 మంది ఎంపీలను గెలిపించుకొచ్చి రాహూల్ గాంధీని ప్రధానమంత్రిని చేస్తానంటూ నాన్న చెప్పిన మాటను తాను నెరవేరుస్తానన్నాడు. ఆ తర్వాతే ముఖ్యమంత్రి అవుతానని సోనియాగాంధీకి జగన్ చెప్పాడు. అప్పుడు పెద్దాయన చనిపోయారనే షాక్‌లోనే మేమున్నాం. అప్పుడు ముఖ్యమంత్రి కావాలనే ఊహ కూడా మాకు లేదు. ఎందుకొచ్చిన రాజకీయాలు, ఒకరోజు ఇంటి పట్టున అందరూ కలిసి ఉండే పరిస్థితి లేదు, నాలుగు పరిశ్రమలు పెట్టుకుని దర్జాగా కాలిమీద కాలేసుకుని ఏసీ రూముల్లో ఉండొచ్చని, రాజకీయాలు మనకు వద్దని అప్పట్లోనే జగన్‌కు చెప్పాను. ‘మా నాన్న ఎంతోమంది హృదయాల్లో ఉన్నారు. మా నాన్న ఫొటో ఇంట్లో పెట్టుకునేవారు ఎందరో ఉన్నారు. నాకు అలాంటి జీవితమే ఇష్టమమ్మా’ అని జగన్ అన్నాడు. చిన్నప్పుడు జగన్ నన్ను ఎప్పుడూ ఎలాంటి ఇబ్బంది పెట్టేవాడు కాదు. జగన్ కుమార్తె హర్షకు లండన్ స్కూల్లో సీటు వచ్చింది కదా, ఎలా ఫీలయ్యారు? విజయమ్మ: ఆమె చాలా తెలివైనది. ఎక్కడైనా సీటు వస్తుంది. బాగా చదువుతుంది. సబ్జెక్టు పుస్తకాలే కాకుండా నాలెడ్జ్ పెరిగే ఇతర పుస్తకాలు కొన్ని వేలు చదివింది. మీ బాల్యం, చదువు గురించి చెబుతారా? విజయమ్మ: ఎనిమిదో తరగతి వరకు నేను తాడిపత్రి సమీపంలోని యాడికి దగ్గరి గ్రామంలో మా నాన్నమ్మ దగ్గర పెరిగాను. ఆ తర్వాత పులివెందులకు వచ్చాను. ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరంలో ఉన్నప్పుడు రాజశేఖరరెడ్డితో పెళ్లయ్యింది. 2019 ఎన్నికల్లో మీరు, షర్మిల ప్రచారానికి వెళ్తారా? విజయమ్మ: 2014లో జగన్ లేని సమయంలో నేను, షర్మిల బయటకు రావాల్సి వచ్చింది. ఇప్పుడు చిన్న రాష్ట్రమే.. 13 జిల్లాలే కనుక అంత అవసరం ఉండకపోవచ్చు. అవసరమైతే వెళ్తాం. ఇంట్లో మీరు ఎలా వ్యవహరిస్తుంటారు? విజయమ్మ: ఇంట్లో ఉదయం అందరం కలుస్తాం. జగన్ వచ్చినప్పుడు కలుస్తాం. పిల్లలతోసహా అందరం కలిసి మాట్లాడుకుంటాం. రాజశేఖరరెడ్డి ఈ అలవాటు మాకు చేశారు. మీ మనవళ్లకు రాజకీయాలపై ఆసక్తి ఉందా? విజయమ్మ: చిన్నపిల్లలు కదా? ఇంకా వాళ్లకేమీ తెలియదు. మా కోడలు భారతి నాతో సొంత కూతురిలాగే ఉంటుంది. వాళ్లంతా మాకు దేవుడు ఇచ్చిన బిడ్డలు. ఈ కష్టాల నుంచి ఎలా గట్టెక్కగలమని అనుకుంటున్నారు? విజయమ్మ: ఎన్ని సమస్యలున్నా దేవుడే అధిగమింపజేస్తాడని అనుకుంటాం. సమస్యలను ఎదుర్కొనే ధైర్యం మనిషికి దేవుడే ఇస్తాడు. జగన్‌కు ఆ ధైర్యం ఉంది. మనమెన్ని మాటలు మాట్లాడినా చివరకు దేవుడికి జవాబుదారీగా ఉండాలి. ప్రజలకు రాజశేఖరరెడ్డితో మర్చిపోలేని అనుబంధం ఏర్పడింది. జగన్ కూడా తండ్రిలాగే జనానికి ఇస్తున్న భరోసా, ధైర్యం చూస్తుంటే చాలా గర్వంగా అనిపిస్తోంది. అయితే తీవ్రంగా కష్టపడుతుండడం వల్ల జ్వరం వచ్చిందని, కాళ్లు బొబ్బలు వచ్చాయని తెలిసినప్పుడు మనసు కలుక్కుమంటోంది. చంద్రబాబు 1978లో గెలిచాక అప్పట్లో రాజశేఖరరెడ్డికి మిత్రుడట కదా? చంద్రబాబుకు మంత్రి పదవి ఇప్పించడంలో రాజశేఖరరెడ్డి పాత్ర ఉందంటారు. నిజమేనా? విజయమ్మ: అప్పుడు ఎక్కడికి వెళ్లినా వాళ్లు కలిసి వెళ్లేవారు. కేఈ కృష్ణమూర్తి, చంద్రబాబు కలిసి ఉండేవారు. ఇంటికి కూడా బాగా వస్తుండేవారు. అంజయ్య గారితో పోట్లాడి మరీ చంద్రబాబుకు మంత్రి పదవి ఇప్పించారు. రాజశేఖరరెడ్డి, చంద్రబాబు మధ్య తేడాను ఎట్లా పోల్చుతారు. విజయమ్మ: ఆయనకు, ఈయనకు పోలికే లేదు. నక్కకూ, నాగలోకానికున్నంత తేడా ఉంది. వైఎస్‌తో చంద్రబాబును పోల్చాల్సిన అవసరం కూడా లేదు. చంద్రబాబు కాకుండా జగన్ సీఎం కావాలని ప్రజలు ఎందుకు కోరుకోవాలనుకుంటున్నారు? విజయమ్మ: ఎవరైనా ప్రజలకు మంచి చేయాలి. మంచి పనులు చేస్తామనే వారికి కాకుండా వేరేవాళ్లకు ప్రజలు ఎందుకు ఓటు వేస్తారు. మంచి చేస్తానంటున్న జగన్‌కే తప్పకుండా ఓటు వేస్తారు. వైఎస్ పాలన చూశారు కనుక జగన్ పాలన రావాలన్న కోరిక ప్రజల్లో నాకు కనిపిస్తోంది. చంద్రబాబు దగ్గర అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలుంటే, మా దగ్గర ప్రజలున్నారు. వైఎస్ ఒక మాట చెప్పేవారు. ప్రజల్లో నిలబడి ఉంటే నాయకులు వాళ్లంతట వాళ్లే వస్తారనేవారు. జగన్ ఇలా రాజకీయాల్లోకి వస్తారని అనుకునేవారా? విజయమ్మ: 2009లో ఎంపీగా నిలబడాల్సి వచ్చినప్పుడు తాను నిలబడనని జగన్ చెప్పాడు. చిన్నాన్నతో పోటీ చేయించండని అన్నాడు. అలా మాట్లాడొద్దు, నా 30 ఏళ్ల అనుభవం నీకు ఉపయోగపడుతుంది, ఎక్కువ మంది ప్రజలకు మంచి చేయాలంటే అధికారంలో ఉంటేనే చేయగలుగుతావు అని వైఎస్ చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా గురించి ఏమని భావిస్తున్నారు? విజయమ్మ: విభజన వల్ల హైదరాబాద్ పోయింది కనుక ప్రత్యేక హోదా ఎంతో అవసరం. ఏపీలో పరిశ్రమలు లేవు, ఆసుపత్రులు లేవు. ఏపీకి హైదరాబాద్ లాంటి రాజధాని రావాలంటే కష్టమే. మహిళలపై జరుగుతున్న దురాగతాల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ఒకటి, రెండు స్థానాల్లో ఉంది. ఇక చంద్రబాబు ఏ వర్గానికి కూడా న్యాయం చేయడం లేదు. నాలుగేళ్లవుతోంది. చంద్రబాబు అసెంబ్లీ కట్టారా? హైకోర్టు కట్టారా? ఆయన ఎవరికి మేలు చేశారు? ఎంతమందికి మేలు చేశారు? తన పేరు గుర్తుండిపోయేలా చంద్రబాబు ఒక్క పనైనా చేశారా? ఏదీ లేదు. ప్రజలే ఆయనకు తగిన సమాధానం చెబుతారు. చంద్రబాబు కంటే జగన్ మేలు, ఆయనకు ఓటేయాలని ప్రజలకు ఎలా చెప్పగలుగుతారు? విజయమ్మ: గతంలో వైఎస్ ఎంపీల మీటింగ్‌లో చంద్రబాబుకు చెప్పారు. 2000వ సంవత్సరం కంటే ముందు ప్రాజెక్టులు కట్టి ఉంటే నికర జలాలు కేటాయిస్తారు, ప్రాజెక్టులు మొదలు పెట్టు అని బాబుకు సూచించారు. దేవుడు అవకాశం ఇచ్చి 14 ఏళ్ల అధికారంలో ఉన్నా చంద్రబాబు ప్రజలకు ఏమీ చేయనప్పుడు చరిత్రలో అలాంటి వ్యక్తిని మళ్లీ ఎన్నుకోవాల్సిన అవసరం లేదని అనుకుంటున్నా. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు చాలా డబ్బు ఖర్చు పెడతారంటున్నారు. వాటిని ధీటుగా ఎదుర్కొనే పరిస్థితి మీ పార్టీలో ఉందా? మీ పార్టీ నడుస్తున్న తీరుపై మీరేమంటారు? విజయమ్మ: అనుభవం కొంతమేర ఉపయోగపడవచ్చేమో గానీ నాయకుడు కావాలనుకొనే వ్యక్తికి మానవత్వం చాలా ముఖ్యం. అలా ఉన్నప్పుడే ఏమైనా చేయగలుగుతారు. అది జగన్‌లో ఉంది. చంద్రబాబులో లేదు. అనుభవం అంటున్నారు. దేనిలో చూపించారు. హైకోర్టు కట్టారా? అసెంబ్లీ కట్టారా? ఏం చేశారు? జగన్‌ను ప్రజలకు అప్పగించానని మీరంటున్నారు. ప్రజలు ఆయనను ఎట్లా చూస్తున్నారు? విజయమ్మ: ఓదార్పు యాత్రలో జగన్‌ను చూసేందుకు బయటకు రానివారు ఎవ్వరూ లేరు. నేను ప్రచారానికి వెళ్లినప్పుడూ అంతే. ఎంతో ప్రేమ చూపించారు. వాళ్లకు ఈ కుటుంబం ఎంత రుణపడి ఉందో వారు కూడా అదే విధంగా ప్రేమను చూపిస్తున్నారు. నా బిడ్డ అందరికీ మంచి చేస్తాడు. చంద్రబాబుకు దేవుడు చాలా సమయం ఇచ్చాడు. ఇంతకు ముందు తొమ్మిదేళ్లు, ఇప్పుడు ఐదేళ్లు. చంద్రబాబు సద్వినియోగం చేసుకోవడం లేదెందుకో అర్థం కావడం లేదు. రాజశేఖరెడ్డి ఏం చేశారు, ఆయన పోయాక కూడా జనం ఎందుకు గుర్తు పెట్టుకుంటున్నారన్న ఆలోచన సైతం చంద్రబాబుకు కలగడం లేదు. -
నమ్మకం ఇచ్చిన మనిషి వైఎస్సార్
♦ మనసులో మాట రాజకీయనేతగా కంటే వ్యక్తిగా వైఎస్ రాజశేఖరరెడ్డి చాలా మంచిమనిషని, ఈ మనిషి ఉంటే చాలు అనే నమ్మకం ప్రజ లకు ఇచ్చిన గొప్పనేత అని శతాధిక చిత్ర దర్శకుడు కోడి రామకృష్ణ పేర్కొన్నారు. ఏ రంగంలో అయినా పొగిడేవారి కంటే విమర్శించే వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. సరైన విధంగా నచ్చచెప్పగలిగితే ఎంతటి ప్రముఖులైనా మనం చెప్పింది వింటారనేది చిత్రజీవితంలో తాను పొందిన మంచి అనుభవమన్నారు. రాజకీయ జీవితంలో క్షణం కూడా ఖాళీగా గడపకుండా వైఎస్ జగన్ అందరి అభిమానాన్ని చూరగొంటున్నారని, ఆయన కృషి ఫలిస్తుందని చెబుతున్న కోడి రామకృష్ణ అభిప్రాయాలు ఆయన మాటల్లోనే... సినిమాకు చెందిన అన్ని శాఖల్లోనూ ఇంత అనుభవం ఎలా సాధించారు? దర్శకుడికి బాయ్ చేసే పని నుంచి దర్శకుడు చేసే పనివరకు అన్నీ తెలిసి ఉండాలి. మనవద్ద పనిచేసే బాయ్ కష్టం కూడా తెలియాలి. అందుకే కాఫీ అనగానే బాయ్‌ని కేకేయకూడదు. తను ఏ కష్టంలో ఉన్నాడో చూసి అడగాలి. అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్నప్పటినుంచి నేను ఎడిటర్ పనేమింటి, అసిస్టెంట్ పనేమిటి, మ్యూజిక్ ఏమిటి, ఎలా చేస్తారు.. రైటర్ ఎవరు అని అన్నీ తెలుసుకుం టాను. వారినుంచి సహాయం తీసుకుంటాను. ప్రతి రంగంలోనూ ఒక సమర్థుడిని పెట్టుకుంటాను. సమర్థుడు అంటే నన్ను విమర్శించాలి. ఇది బాగా లేదు సార్ అనగలగాలి. అప్పుడే మళ్లీ వెనక్కు చూసుకుంటాం. సినీరంగంలో పొగడ్తలు తప్పవు కదా? పొగడటం అనేది విషం లాంటిది. మన తప్పును మనకు చెప్పే విమర్శ అద్దం లాంటిది. నాకు పొగిడేవారంటే భయం. విమర్శ మనం వెళ్లే దారిలో ఒక సిగ్నల్ లాంటిది. లేదు సార్, బాగా లేదు సర్, మనం పలాని అంశంలో రాజీపడిపోతున్నాం డైరెక్టర్ గారూ అని ఎవరన్నా అంటే వెంటనే అమ్మా అనుకుని అతడికి షేక్ హ్యాండ్ ఇచ్చి మరీ జాగ్రత్త పడాలి. పెద్ద డైరెక్టర్లు, నటులను కూడా మీరు విమర్శించేవారా? ప్రతి ఒక్కరికీ ఒక సైకాలజీ ఉంటుంది. కానీ నేరుగా విమర్శించకూడదు. భానుమతి గారున్నారు. ఆమె డైరెక్టర్, రచయిత, నటి. ఆమెకు ఒక సీన్ చెప్పామంటే తన సూచన చెబుతారు. ఒకే మేడమ్ బాగుంది పెడతాము అని చెప్పి పది నిమిషాలు ఆగి, ఇక్కడ ఇలా వచ్చింది మేడం. ఫరవాలేదా అని అడిగితే అలా వచ్చిందా, అయితేవద్దు తీసేద్దాం అని ఆమె సమాధానపడేవారు. అదే వెంటనే చెబితే కోపం వచ్చేస్తుంది కదా. మంగమ్మగారి మనవడు స్క్రిప్ట్ వినిపించాను. ఆ సినిమాలో ఆవిడ పాత్రకి డబుల్ మీనింగ్ డైలాగులు ఎక్కువ ఉంటాయి. గోపాల్‌రెడ్డిగారు, గణేష్ పాత్రో గారు నేను ఆమె వద్దకు వెళ్లి స్క్రిప్టు చదివి వినిపించగానే సర్రున లేచి వెళ్లిపోయిందామె. ‘వెళ్లిపోండి మీరు బయటకు, కాఫీలు ఇవ్వ డం కూడా దండగ మీకు. భానుమతి అంటే ఏమనుకున్నారు’ అంటూ మండిపడ్డారు. లేదమ్మా, తప్పకుండా స్క్రిప్టు మారుస్తాము అని ఒప్పించాము. సరే మార్చండి అన్నారు. ఆ తర్వాతి రోజు పొద్దున్నే కోడూరులో షూటింగ్. అన్నీ సరిగా ఉన్నాయా లేదా అని ఆమె టెన్షన్ పడుతున్నారు. ఆమె ముందుకు వెళ్లి డైలాగ్ చూపిం చాను. ఫస్ట్ షాట్. చుట్టూ జనం. ‘భయంకర బల్లి బట్టల్లేకుండా స్నానం చేస్తూ బావగారు వచ్చారని లేచి నిలబడిందట’ అని డైలాగ్. ఏకధాటిగా చెప్పేసింది. షాట్ ఓకే. జనమంతా చప్పట్లు కొట్టేశారు. ఆమెకు ఆశ్చర్యమేసింది. నిన్న మీరు వద్దన్న డైలాగ్ ఇదే అని చెప్పాను. అన్ని డైలాగులూ ఇదేరకంగా చెప్పండి మీరు. సినిమా సంవత్సరం ఆడుతుందన్నాను. అలాగే చెబుతాను అని ఒక్క డైలాగ్ కూడా మార్చకుండా అన్నీ చెప్పేశారామె. నచ్చచెప్పడంలోనే ఉందండి అసలు విషయం. ఎన్టీఆర్ పరాభవానికి తప్పు మామదా? లేక అల్లుడిదా? మన ఇంట్లో ఏం జరుగుతోంది, మన చుట్టూ ఏం జరుగుతోందని నిత్యం పరిశీలించుకోవాలి. పనిమనిషి నమ్మకంగా పనిచేస్తూ మన ఇంట్లోనే దొంగతనం చేసిందంటే కారణం ఆమె పరిస్థితులను, ఇబ్బందులను మనం అర్థం చేసుకోకపోవడమే. అవసరాలు వారిని డామినేట్ చేసినప్పుడు అందుబాటులో ఉన్న వస్తువు ఏదైనా సరే తీసుకోవాలనిపిస్తుంది. అందుకే పరిస్థితుల ప్రాబల్యమే రామారావు అలా కావడానికి కారణం అని నమ్ముతాను. వైఎస్సార్ పాలనపై మీ అభిప్రాయం? వైఎస్ రాజశేఖరరెడ్డి నాకు మంచి స్నేహితుడు. సాయిబాబా పెట్టెను మద్రాసు నుంచి హైద్రాబాదుకు విమానంలో తీసుకొస్తుంటే, మా ఆవిడ బరువు మోస్తోం దని చూసి అమ్మా ఆ పెట్టె ఇవ్వు అని అడిగి తీసుకున్నారు వైఎస్సార్. ప్రయాణం ముగిసే దాకా బాబా పెట్టె పట్టుకుని వచ్చారు. ఆరోజు బాబా పెట్టె పట్టుకున్నారు కాబట్టే మీరు సీఎం అయ్యారు అని మా అమ్మ తర్వాత కలిసినప్పుడు చెబితే అవునమ్మా అంటూ నవ్వేశారాయన. వ్యక్తిగా చాలా మంచి మనిషి. ఆయన పాలన కూడా చక్కగా చేశారు. ఈ మనిషి ఉంటే చాలు అనే నమ్మకం ప్రజలకు ఇచ్చారు వైఎస్సార్. వైఎస్ జగన్ పాదయాత్రపై మీ అభిప్రాయం ఏమిటి? వైఎస్ జగన్మోహన్రెడ్డి బాగా కష్టపడుతున్నారు. రాజ కీయాల్లో అసలు తీరికన్నదే లేకుండా, ఎప్పుడూ ఏదో ఒకటి చేస్తూనే ఉన్నారు. ఎప్పటికైనా ఆయన కృషి ఫలిస్తుంది. పైగా ప్రతి ఒక్కరూ ఆయనను ఇష్టపడుతున్నారు. యువనేతగా ఆయన శ్రమిస్తున్న తీరు చూసి, రాజకీయనేతలు కూడా బాగా ఇష్టపడుతున్నారు. కృషి ఉంటే కానీ మనిషి పైకి రాడు అని ఆయన చేసి చెబుతున్నారు. రాజకీయాల కంటే ఆయనలో ఆ తత్వమే నాకు బాగా ఇష్టం. (ఇంటర్వ్యూ పూర్తి పాఠం కింది లింకులో) https://goo.gl/tBWCH9 -
లక్ష్మీపార్వతితో మనసులో మాట
-
రాజధాని ముసుగులో ‘రియల్ ఎస్టేట్’: ఆర్కే
పైకి ఎన్నిమాటలైనా చెప్పవచ్చు కానీ అమరావతిలో రాజధాని నిర్మాణం కలే కాదు కల్ల కూడా అంటూ మంగళగిరి ఎమ్మెల్యే, వైఎస్సార్సీపి నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి తేల్చి చెప్పారు. ఆ విషయం రాజధాని ప్రాంత రైతులకు పూర్తిగా అర్థమైపోయింది కాబట్టే తాము ఇచ్చివేసిన భూముల్లో కూడా వారు ఇప్పటికీ పంటలు వేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కేంద్రం పైసా విదల్చకుండా, ప్రపంచ బ్యాంకు నిధులు రాకుండా, నాలుగైదు భవనాలు కూడా కట్టని ప్రభుత్వం రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్‌కి తెరతీస్తోందన్నారు. చంద్రబాబు చేస్తున్నదల్లా సంవత్సరానికి రెండు మూడు శంకుస్థాపనలు చేయడమేగానీ, ఒక్క శాశ్వత భవనం కూడా కట్టలేదని జనంలో ఒకరకమైన అనుమానం, భయం కలుగుతూ వస్తున్నాయంటున్న ఆళ్ల రామకృష్ణారెడ్డి అభిప్రాయం ఆయన మాటల్లోనే... ప్రశ్న: ల్యాండ్ పూలింగ్ సక్రమ విధానమని, పలువురు మద్దతిచ్చారని బాబు అంటున్నారే? జవాబు: దేశంలో ఇంతకుముందు ఎక్కడా ల్యాండ్ పూలింగ్‌ని పెట్టలేదు. ఆ విధంగా అది అక్రమం. మరొకటి. ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ అనేది ఉన్నప్పుడు ల్యాండ్ పూలింగ్ పెట్టాల్సిన అవసరం లేదు. పైగా మీకిష్టమైతేనే భూమి ఇవ్వండి ఇష్టం లేకుంటే ఇవ్వొద్దని ల్యాండ్ పూలింగ్ చట్టంలో చాలా స్పష్టంగా ఉంది. కానీ మా భూమిని ఇవ్వం అని చెప్పిన రైతుల మీద బాబు పోలీసులను పురమాయించి కేసులు పెట్టించారు. కొట్టించారు. పంటలు దహనం కూడా చేయించారు. కాబట్టి ఎన్ని దీక్షలూ, ధర్నాలూ చేసినప్పటికీ మాకు ఉపయోగం లేకుండా పోతోంది. అందుకే న్యాయపోరాటం మాత్రమే మాకు దారి చూపిస్తుంది అని భావించే పోరాటం ప్రారంభించాం. ప్రభుత్వంపై సుమారుగా 50 వరకు కేసులు వేసి ఉంటాం. హైకోర్టులో కొట్టివేసినవి మినహా 98 శాతం కేసులు మేమే గెలిచాం. ప్ర: నమ్మశక్యంగా లేదు. న్యాయవ్యవస్థ అంత బాగా పనిచేస్తోందా? జ: రాష్ట్రాన్ని అడ్డం పెట్టుకుని బాబు చేస్తున్న అవినీతి వ్యవహారాలపై మేము వేసిన ప్రతి కేసు విషయంలో సక్సెస్ అయ్యాం. ఆయన అక్రమంగా నివాసం ఉండే ప్రాంతంలోనే ఇసుకను దారుణంగా కొల్లగొడుతుంటే, ప్రొక్లెయిన్లతో తోడేస్తుంటే మేం అడ్డుకున్నాము. కేసు వేస్తే ఆ దోపిడీ ఆగిపోయింది. నా అమరావతి, నా రాజధాని, నా ఇటుక అంటూ స్కూలు పిల్లలు కూడా పది రూపాయలు తప్పక ఇవ్వాల్సిందే అని సర్క్యులర్ పంపి వసూలు చేయడంపై మేం కోర్టు మెట్లెక్కితే.. ప్రభుత్వానికి మొట్టికాయలు పడ్డాయి. ఓటుకు కోట్లు, సదావర్తి కేసుల విషయంలోనూ ఇంతే. ప్ర: రైతులు స్వచ్ఛందంగానే భూములిచ్చారా? జ: దానివెనుక కూడా రహస్యం ఉంది. ఇక్కడ కూడా తాడికొండ, తుళ్లూరు, తాడేపల్లి రూరల్, మంగళగిరి రూరల్.. ఈ నాలుగు మండలాల్లోనే 29 గ్రామాలూ ఉన్నాయి. వీటిలో తాడికొండ పూర్తిగా మెట్ట ప్రాంతం. ఇక్కడ మునుపు ఎకరా ధర రూ. 5 లక్షలు ఉండేది. వర్షం పడితేనే పంట కాబట్టి వాళ్లు ఆనందంగా ఇచ్చేశారు. 1,400 గజాలు మాకొస్తుంది కదా. ఈ ప్రాంతంలోనే రాజధాని ఉంటే బాగుంటుందని అక్కడి రైతులు అనుకోవడం సబబే. కానీ తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి ప్రాంతాలు పూర్తిగా సారవంతమైన పంట భూముల్ని కలిగి ఉన్నాయి. అందుకే ఇక్కడ భూముల్ని మేం ఇవ్వం అని చాలామంది రైతులు వ్యతిరేకించారు. ఇవ్వాళ్టికి కూడా తుళ్లూరు మండలంలో చాలా మంది మా భూముల్ని ఇవ్వమనే అంటున్నారు. భూములిచ్చిన రైతులకు 32 ఫాంలు లిచ్చింది ప్రభుత్వం. ఫాం 18లో సంతకం చేస్తే ఇక రైతుకు భూమితో ఎలాంటి సంబంధం ఉండదు. పూర్తిగా ప్రభుత్వాధీనంలోకి వెళ్లిపోతుంది. పైగా బాబు రాజధానిని కట్టలేక పోతున్నారు. మోదీ రాజధానికోసం పైసా కూడా ఇవ్వలేదని రైతుల భయం. ప్ర: మరి రూ.2,500 కోట్లు ఇచ్చామని కేంద్రం అంటోందే? జ: ఆ రూ. 2,500 కోట్లను ఏం చేశారనే లెక్కలు ఇంతవరకు బాబు ప్రభుత్వం కేంద్రానికి ఇవ్వలేదు. కాబట్టి రాజధానికి డబ్బులు లేవు అనేది ఒక అంశం. కాగా, 13 జిల్లాల ప్రజలు చూడలేకపోవచ్చు కానీ, బాబు రాజధాని విషయంలో ఏం చేస్తున్నారనేది ఆ నాలుగు మండలాల ప్రజలు నిత్యం చూస్తూనే ఉన్నారు. ఇప్పటివరకు 6 లక్షల చదరపుటడుగుల్లో ఒక తాత్కాలిక బిల్డింగ్ కట్టగలిగారు తప్ప రాజధానికి మేం ఇది చేస్తున్నాం, ఇది పూర్తయింది అని చెప్పలేదు. కానీ బాబు చేస్తున్నదల్లా సంవత్సరానికి రెండు మూడు శంకుస్థాపనలు చేయడం. ప్ర: మరి భూములిచ్చిన, ఇవ్వని రైతుల పరిస్థితి ఏమిటి? జ: ఒకటిమాత్రం నిజం. బాబు రాజధానిని కట్టలేరు అని రైతులకు పూర్తిగా అర్థమైపోయింది. ముఖ్యంగా సమయం లేదు. డబ్బుల్లేవు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికే బాబు తమ భూములను తీసేసుకున్నాడని అందరికీ అర్థమైపోయింది. పవన్ కల్యాణ్ చాలాసార్లు రాజధాని ప్రాంతానికి వచ్చారు. ల్యాండ్ అక్విజిషన్ నోటిఫికేషన్ ఇస్తే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ఆయన చెప్పారు. కానీ రాజధాని ప్రాంతంలో దాదాపు అన్ని చోట్లా ఆ నోటిఫికేషన్ ఇచ్చేశారు. అయినా పవన్ ఏ దీక్షలకు పూనుకోలేదు. ప్ర: ప్రపంచ బ్యాంకు రాజధాని ప్రాంతాన్ని సందర్శించింది కదా? జ: ఏపీలో రాజధాని నిర్మాణం కల్లేనండి. బాబు చేయలేడు. సెక్రటేరియట్, అసెంబ్లీని కూడా శాశ్వత స్థాయిలో కట్టలేకపోయారు. కేంద్రం నుంచి ఎలాంటి సహాయమూ లేదు. ప్రపంచ బ్యాంకు రెండుసార్లు రాజధానిని సందర్శించినా, పైసా విదల్చలేదు. నిజంగా రాజధానిని కడుతున్నారు అని తలిస్తే వాళ్లు అమెరికాలో కూర్చునే నిధులు విడుదల చేసేవారు. క్షేత్రస్థాయికి వచ్చి తనిఖీ చేయవలసిన అవసరం ఉండేది కాదు. రాజధాని ఒక కల మాత్రమే. ప్రజారాజధానిని చంద్రబాబు కట్టలేరు. ప్ర: డిజైన్లు అంటూ హడావుడి చేస్తున్నారు కదా? ఇంతవరకు నాలుగైదు దేశాలకు ప్రత్యేక విమానాల్లో వెళ్లి కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుబారా చేసి డిజైన్లు తీసుకొచ్చారు. అవి చెల్లవని పక్కన పెట్టేశారు. గతంలోనే విజయవాడకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థులు ఒక డిజైన్ ఇచ్చారు. దాన్నీ పక్కన పెట్టేశారు. ఇక జపాన్‌కి చెందిన మాకీ సంస్థ ఈ ముడుపులు, అవినీతి వ్యవహారాలు మేము పడలేమని ఆరోపించి మరీ పక్కకు తప్పుకుంది. ప్ర: రహదారుల, శంకుస్థాపనల గతి ఏంటి? జ: ఇంతవరకు ఎవరైతే పొలాలనిచ్చారో వారికి ప్లాట్ కేటాయింపులే జరగలేదు. వాటిలో కూడా కార్నర్ బిట్లు, మెయిన్ రోడ్డుకు వచ్చే బిట్లను మొత్తంగా తెలుగుదేశం మంత్రులు ఒక బిట్‌గా వాళ్లకు వాళ్లే కేటాయింపు చేసుకున్నారని సాక్ష్యాధారాలతో సహా చూపించాం. రోడ్లు వేసి, ప్లాన్ చేసి జోనింగ్ చేసుకుని ఏమీ లేకుండా వాటిని అమ్మేసుకుందాం అనే అభిప్రాయానికి చంద్రబాబు వచ్చేశారు. రాజధానికోసం ఊరూరునుంచి మట్టి నీళ్లు తీసుకొచ్చారు కదా ఏమయ్యాయి? నీళ్లు తీసుకొచ్చారు.. వాటిని ఆరోజే, అక్కడే పారేశారు. మట్టి తీసుకురమ్మన్నారు. దాన్ని ఒక కుప్పలాగా పోశారు. ఇక ప్రతి ఊరినుంచి బిందెలతో నీళ్లు తీసుకురమ్మన్నారు కొన్ని వేల ఇత్తడి బిందెలు అలా తెప్పించారు. మొత్తం ఎన్ని బిందెలు కొన్నారు? ఇవ్వాళ అక్కడ ఎన్ని ఉన్నాయో చూపించమనండి చాలు. (ఆళ్ల రామకృష్ణారెడ్డితో ఇంటర్వ్యూ పూర్తి పాఠం కింది లింకుల్లో చూడండి) https://goo.gl/kHwqc8 https://goo.gl/RjyjCD -
అది బాబు స్వీయ తప్పిదమే..!
మనసులో మాట కొమ్మినేని శ్రీనివాసరావుతో విశ్రాంత ఐఏఎస్ అధికారి కె.వి.రమణాచారి ఓటుకు కోట్లు కేసు చంద్రబాబు స్వయంగా చేసుకున్న ఖర్మపలితమే తప్ప మరెవ్వరూ దానికి బాధ్యులు కారని విశ్రాంత ఐఏఎస్ అధికారి, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కె.వి. రమణాచారి పేర్కొన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించడమే తప్పటడుగు అని, ఆ ఆలోచనలోంచే పుట్టిన అపజయాన్ని చంద్రబాబు కేసురూపంలో ఎదుర్కోవలసి వచ్చిందన్నారు. విభజన విషయంలో చంద్రబాబు నేటికీ చేస్తున్న ప్రచారం కేవలం ఏపీ ప్రజల సానుభూతిని పొందడానికి చేస్తున్న ఉక్రోషమేనని, ఒక ముఖ్యమంత్రి స్థాయికి అది తగదని విమర్శించారు. ప్రజల పట్ల, నమ్మినవారి పట్ల ప్రేమ అనేది తెలుగు ముఖ్యమంత్రులలో ఒక్క ఎన్టీఆర్, వైఎస్సార్, కేసీఆర్‌లకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేస్తున్న కె.వి. రమణాచారి అభిప్రాయాలు ఆయన మాటల్లోనే... మీ సర్వీసులో చాలామంది సీఎంలతో సన్నిహితంగా పనిచేశారు. మీ విజయ రహస్యం? నా దృష్టికి వచ్చిన నిజాల్ని ప్రభుత్వానికి చెప్పాలన్నదే నా పాలసీ. ప్రభుత్వం ఏదైనా, ఎవరిదైనా వారికి విధేయంగా, వినమ్రంగా ఉండాలని నా భావన. ఐఏఎస్ అధికారిగా ఏది మాట్లాడాలో అదే మాట్లాడాలి. అంతకుమించి మాట్లాడకూడదు అని తెలుసుకున్నాను. ఏ విషయంలో ఎక్కడ ఎంతమేరకు సలహా ఇవ్వాలో అంతే ఇవ్వాలి కాని నేను సలహాదారును, ఐఏఎస్ అధికారిని కదా అని అతిగా మాట్లాడకూడదు. ఎన్టీఆర్ ఇంటిమీదే చంద్రబాబు నిఘా పెట్టారన్నారు. ఎలా చేశారు? చంద్రబాబును ఎన్టీఆర్ తమ కుమారుడిలాగా చూసుకున్నారు. అన్నిరకాలుగా నాకు అండగా ఉంటాడు అని భావించి బాబును ప్రోత్సహించిన ఎన్టీఆర్ తన వెనుక జరుగుతున్న పరిణామాలను నమ్మలేదు, పట్టించుకోలేదు. ఏదో జరుగుతోందని ఆయన దృష్టికి తీసుకెళితే హుంకరించారు. ఇలాంటి విషయాన్ని నా దృష్టికి తీసుకురావటం ఆశ్చర్యకరంగా ఉంది. ‘అదేమిటి కులీకుతుబ్ షా’ అని నన్ను ప్రశ్నించారాయన. నన్ను ఆయన కులీకుతుబ్‌షా అని పిలిచేవారు. ‘‘పరి స్థితులు అంత బాగాలేవు. బయట గమ్మత్ము గమ్మత్తుగా మాటలు విని పిస్తున్నాయి. కడప జిల్లాలో పనిచేశాను కాబట్టి కోడూరు ఎమ్మెల్యే నా దృష్టికి తీసుకొచ్చిన విషయాలను మీ దృష్టికి తెస్తున్నాను. అయినా మీకు తెలీకుండా ఉంటుందని నేను భావించలేను’’ అని చెప్పాను. ఇలా జరుగుతుందంటావా అని నన్ను ప్రశ్నించిన ఎన్టీఆరే తర్వాత ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు రమణా అన్నారు. అల్లుడు తనకు వ్యతిరేకంగా పని చేస్తున్నాడని ఆయన గమనించారా? మీ వెనుక ఏదో జరుగుతున్నట్లుంది అని నేను సూచన చేసినప్పుడు లక్ష్మీపార్వతి దాని కొనసాగింపుగా తాను విచారించి తన వద్దకు వచ్చిన సమాచారాన్ని కూడా ఎన్టీఆర్‌కి అందించి ఉంటారు. కాని చంద్రబాబు మీద ఆయనకు ఉన్న నమ్మకం చివరివరకు సడలలేదు. 1995 ఆగస్టు చివరలో జరిగిన పరిణామాల్లో పదవీచ్యుతుడు అయిన తర్వాత కూడా ఎన్టీఆర్ నన్ను ఇంటికి పిలిపించుకుని ‘ఇలా ఎందుకు జరిగి ఉంటుందంటావు రమణా’ అని అడిగారు. నిజంగా ఆయనది పిల్లవాడి మనస్తత్వం. గొప్ప హీరో, గొప్ప దర్శకుడు. పైగా హృదయం ఉన్న మనిషి. ‘సర్ రాజకీయాల్లో ఇవి సాధారణంగా జరిగే ఘటనలే. మీరు అనేక సినిమాలు తీశారు. ఔరంగజేబులను చూసిన చరిత్ర మనది. విజయనగర సామ్రాజ్యాలు, మొగలాయి సామ్రాజ్యాలు పోయాయి. ఆ చరిత్ర మొత్తం మీకు తెలీంది కాదు కదండీ’ అంటూ ఆయనకు తెలిసిన విషయాన్ని ఆయనకే తెలిపే రీతిలో చెప్పాను. అయితే అంత జరిగినప్పటికీ ఆయన ఎవరి గురించి కూడా వ్యక్తిగతంగా మాట్లాడలేదు. కానీ ఆయన బాధలో నేను పాలు పంచుకున్నాను. కానీ సొంత అల్లుడు ఇలా చేస్తాడని ఎన్టీఆర్ ఏ కోశానా ఊహించలేదు. నమ్మలేదు. ఎన్టీరామారావు దుస్థితికి బాబు కుట్రలా లేక లక్ష్మీపార్వతి తప్పిదాలా.. ఏవి కారణం? రాజకీయాల్లో ఇది తప్పిదం, ఇది తప్పిదం కాదు అనుకోవడానికి వీల్లేదు. ఎనీ థింగ్ ఈజ్ ఫేర్ ఇన్ లవ్ అండ్ వార్. రాజకీయం అంతకంటే మించింది. ఒక్క విషయం మాత్రం నిజం. కుర్చీ మీద కూర్చున్నప్పుడు పరిస్థితి వేరు. కుర్చీ దిగిన తర్వాత పరిస్థితి వేరు. ఎన్టీఆర్ శ్రీమతిగా లక్ష్మీపార్వతిని చూసిన కళ్లు నావి. అంతకుముందు ఆమెతో నాకున్న పరిచయం వేరు. కానీ శ్రీమతి ఎన్టీఆర్ స్థానంలోకి ఆమె వచ్చిన తర్వాత రాజకీయాల్లో ఉండే వారందరూ ప్రవర్తించిన తీరును చాలా దగ్గరగా చూశాను. ఆ ఇంట్లో పొద్దున నాలుగున్నర నుంచి ఏడింటి వరకు జరిగిన పరిణామాలన్నింటినీ చూశాను. చంద్రబాబు తెలివిగా తన మనుషులను ఆపరేట్ చేసి దెబ్బతీశాడంటారా? రాజకీయాల్లో ఆపరేట్ చేయడం అనేది ఒక్కొక్కరి నైపుణ్యం బట్టి ఉంటుంది. చంద్రబాబు అలాంటి పరిస్థితిని తప్పకుండా వినియోగించుకున్నారనే చెప్పాలి. బాబుకోసం ఎన్టీఆర్ తన కుటుంబాన్నే దూరం చేసుకున్నారు కదా. మరి తప్పు ఎవరిది? ఎన్టీఆర్ ఆత్మాభిమానానికి మారుపేరు. ఒక దశలో తాను ఒంటరిగా ఉన్నాను అనే ఫీలింగుకు వచ్చేశారు. అలాంటి పరిస్థితి వచ్చాక, నదీ ప్రవాహంలో పడి కొట్టుకుపోతున్న వ్యక్తి ఎవరైనా సరే పూచికపుల్ల దొరికినా సరే.. ఇది నాకు ఆసరా అవుతుందేమో అనే అభిప్రాయానికి వచ్చేస్తారు. ఎన్టీఆర్ అలాంటి స్థితిలోకి ఒక సమయంలో వచ్చేశారని నా అభిప్రాయం. అప్పుడే లక్ష్మీపార్వతి ఆయన జీవితంలోకి అడుగుపెట్టారు. ఎన్టీఆర్ కుటుంబం దానికి వ్యతిరేకత తెలిపింది. ఆ పరిస్థితిని రాజకీయంగా కొద్దిమందిమాత్రమే తమకు అనుకూలంగా మార్చుకోగలుగుతారు. చంద్రబాబు అక్కడే కృతకృత్యులై ఉంటారు. మాలాంటివాళ్లు చూచాయగా చెప్పినా ఎన్టీఆర్ గమనించలేదు. బంగారు తెలంగాణ వస్తున్నట్లు కనబడుతోందా? ఆశయం చాలా గొప్పది. దాన్ని సాధించడానికి కృషి చేసే దిశలో ముఖ్యమంత్రి, ప్రభుత్వం ప్రయత్నిస్తున్నారు. ఈ మూడేళ్లలోనే జరుగుతున్న ప్రయత్నాలు చూస్తే.. తెలం గాణ ప్రజల్లో గతంలో లేని ఆత్మవిశ్వాసం ఇప్పుడు పెరిగింది. 60 ఏళ్లుగా ఎవరూ పట్టించుకోని తెలంగాణను ఇప్పుడు ఉద్యమనేతే పాలిస్తున్నారు కాబట్టి భవిష్యత్తుపై నమ్మకం ఏర్పడింది. తెలంగాణలో కుటుంబ పాలన సాగుతోందంటున్నారు... నిజమేనా? ఉద్యమనేతలు మంత్రులుగా ఉంటున్నప్పుడు ముఖ్యమంత్రి కుమారుడో మరో బంధువో మంత్రిగా పనిచేస్తూ సరిగ్గా వ్యవహరించకపోతే అప్పుడు విమర్శించవచ్చు. కానీ సీఎం కుమారుడే అయినా అందరినీ కలుపుకుపోతూ, చురుకుగా పాల్గొంటూ అందరినీ గౌరవిస్తున్న యువకిశోరం తారకరామారావు. కుమారుడు సమర్ధంగా పనిచేస్తున్నప్పుడు ప్రతిపక్షాలు, రాజకీయ నేతలు అనకపోతే, విమర్శించకపోతే బాగుండదు కదా. కేసీఆర్, చంద్రబాబు.. ఇద్దరిలో విశ్వసనీయత ఎవరికి ఎక్కువగా ఉంటుంది? విశ్వసనీయత అంటే కేసీఆరే. చంద్రబాబు విషయానికి వచ్చినప్పుడు తాను పుట్టి పెరిగిన వైనం ఎప్పుడూ ఆయనకు గుర్తుకు వస్తూనే ఉంటుంది కాబట్టి, ఎంతవరకు విశ్వసనీయంగా ఉండాలి, అవిశ్వసనీయంగా ఉండాలి అని బేరీజు వేసుకుంటూ ప్రభుత్వం నడుపుకుంటూ ఉంటారు. ఎవర్ని ఎంతమేరకు నమ్మాలి, నమ్మకూడదు అనే విషయంలో బాబుకు పూర్తి స్పష్టత ఉంది. రాజశేఖరరెడ్డి, చంద్రబాబు వీరిద్దరినీ ఎలా పోలుస్తారు? వైఎస్సార్ వైఎస్సారే.. దాదాపు 28 ఏళ్లపాటు రాజకీయాల్లో ఉంటూ అన్ని రకాల పరిస్థితులను అధిగమిస్తూ, ఎంతోమంది ఎదుగుదలకు కారణమౌతూ, తాను ముఖ్యమంత్రిగా ఎదిగిన నేపథ్యం రాజశేఖరరెడ్డిది. ఆయన పాలనలో జరిగాయని చెబుతున్న లోపాలు, లోటుపాట్లు ఆయనకు తెలిసి జరిగాయా, తెలీకుండానే జరిగిపోయాయా అనేది నాకు డౌటే. కాని పాలించినతీరు, అందరినీ అభిమానించి, ప్రేమించిన తీరు వైఎస్‌లో తప్ప మరే ముఖ్యమంత్రిలోనూ నేను చూడలేదు. ఇలాంటి ప్రేమ భావం చంద్రబాబు వంటి వారి వద్ద ఉండటం కష్టం. ఓటుకు కోట్లు కేసు పేరుతో చంద్రబాబును హడలుగొట్టింది కేసీఆరే కదా? చంద్రబాబు చేసుకున్న ఖర్మకు మరెవరో బాధ్యులు ఎందుకవుతారు? మీడియా వార్తల బట్టి చూసినా ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించారని తేలింది కదా. ఆ విషయంలోకి ఆయన వెళ్లకుండా ఉంటే బాగుండేది. కొన్ని ఆలోచనలు కొన్ని అపజయాలను పట్టుకొస్తాయి. దాన్నే బాబు నేడు ఎదుర్కోవలసి వస్తోంది. ఏపీ విభజనపై చంద్రబాబు తీరును మీరెలా విశ్లేషిస్తారు? విభజన విషయంలో చంద్రబాబుది ఎక్కువగా ఆక్రోశం. ఉక్రోషంతో వచ్చే ఆక్రోశం. నిజాన్ని మాత్రం కాదనలేడు. మమ్మల్ని నడిరోడ్డుపై పడేశారు అనే రీతిలో ప్రజల సానుభూతి పొందడానికి ఆయన చేసిన ప్రయత్నం ఒక ముఖ్యమంత్రి స్థాయిలో లేదని నా అభిప్రాయం. విభజన జరిగింది. కేంద్రం ఒప్పుకుంది. ప్రజలు అటూ ఇటూ మాటలు అనుకున్నారు. రాజకీయంగా జరిగిన ఈ పరిణామాలను సామరస్యంగా తీసుకుని ఉంటే అన్నీ సమసిపోయేవి. కాని ఇప్పుడూ కూడా దాన్ని సొమ్ము చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారే తప్ప.. పరవాలేదు. రాజకీయంగా మనం ఉన్నాం. తప్పకుండా ముందుకు పోదాం అనే సానుకూల స్థితిలో చంద్రబాబు మాట్లాడడం లేదు. -
కె వి రమణాచారితో మనసులో మాట
-
టీఆర్ఎస్ ఎమ్మెల్యే రామలింగారెడ్డితో మనసులో మాట
-
నేరమయ పాలనకు మారుపేరు
కొమ్మినేని శ్రీనివాసరావుతో నట, దర్శకుడు పోసాని కృష్ణమురళి ప్రజారాజ్యాన్ని చిరంజీవి కాంగ్రెస్‌లో కలిపేసినప్పుడే నాకు రాజకీయాలపై విరక్తి కలిగింది. ఇక జీవితంలో నేను ఎంపీగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా పోటీ చేయను. కానీ ఎన్నికల్లో మాత్రం వైఎస్ జగన్మోహన్రెడ్డికే సపోర్టు చేస్తా, ఓటేస్తా అని నిర్ణయించుకున్నాను. గతంలో వైఎస్ జగన్ ఎంపీగా, విజయమ్మ ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు కడపలో క్యాంపెయిన్‌లో పాల్గొని ప్రచారం చేసివచ్చాను. నాకు వైఎస్సార్ అంటే ఇష్టం. జగన్‌లో ఆయన పోలికలున్నాయి. నడవడిక ఉంది. ప్రభుత్వాన్ని ఎవరైనా నడపవచ్చు. ముఖ్యమంత్రి సీటులో ఎవరైనా కూర్చోవచ్చు.. కానీ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం చేస్తున్నన్ని తప్పులను ఎవరూ చేయకూడదని ప్రముఖ సినీ రచయిత, నట దర్శకుడు పోసాని కృష్ణ మురళి చెప్పారు. భూకబ్జాలు, లంచాలు, కమీషన్లు, తప్పుల్ని నిలదీసిన అధికారులను కొట్టడం, నిలదీసిన ప్రజలను లారీల్తో గుద్దేయడం. ప్రతిపక్ష నేతలపై ఎస్సీ, ఎస్టీ వేధింపు కేసులను పెట్టి బలవంతంగా ఫిరాయింపులకు గురిచేయడం.. ఒక్కమాటలో చెప్పాలంటే ఏపీలో ప్రస్తుత పాలకులు లెక్కలేని నేరాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో పవర్ఫుల్ ఆయుధాన్ని మాకిచ్చారు. అదే ఓటు. మేం దాంతో చెబుతాం సమాధానం అని ఏపీలో జనం ఘోషిస్తున్నారంటున్న పోసాని అభిప్రాయాలు ఆయన మాటల్లోనే... మీకు రచన అంటే ఇష్టమా పాత్ర పోషణ అంటే ఇష్టమా? నాకు రైటరంటేనే ఇష్టం. ఎందుకంటే దానివల్లే బతికాను కదా. అదే నాకు అన్నం పెట్టింది. ఎంఏ తెలుగు అనే నా క్వాలిఫికేషనే నన్ను కాపాడింది. ఆ సర్టిఫికెట్ చూసే పరుచూరి గోపాలకృష్ణ నన్ను వాళ్ల అన్నయ్యకు పరిచయం చేసి ఈ కుర్రాడిని మనం పెట్టుకుందాం అని చెప్పి తీసుకున్నారు. మీకు సినిమాల్లో మొదట్లో రాసే అవకాశం ఎలా ఇచ్చారు? గుంటూరు బస్టాండు నుంచి కనిపించిన బస్సు పట్టుకుని మద్రాసుకు వెళ్లి పరుచూరి బ్రదర్స్‌ని కలిస్తే ఎంఏ తెలుగు కదా... కొటేషన్లు నీకు నచ్చినవి రాయి అన్నారు. వారు భోజనం చేసి వచ్చేలోపు పేకాట ముక్కలపై 70 కొటేషన్లు రాసి చూపించాను. బాగా రాశావే. నువ్వు రైటర్ అవుతావు. మాలాగా కష్టపడు అన్నారు. మేనేజర్ని పిలిచి నాలుగు జతల బట్టలు కొనిచ్చారు. బుద్ధిగా ఉండు. బుద్ధిగా పనిచేసుకోపో అన్నారు. అలా నాలుగున్నర ఏళ్లు వారివద్ద ఉన్నాను. 50 సినిమాలకు కథలు రాశాను. మౌనపౌరాటం, కర్తవ్యం వంటి సినిమాలకు రాశాను. పీపుల్స్ ఎన్కౌంటర్ సినిమాకు కథ రాస్తే అవార్డు వచ్చింది. మీరు రాసిన ఏదైనా మంచి డైలాగు చెబుతారా? పీపుల్స్ ఎన్కౌంటర్ సినిమాలో పోలీసు అధికారి ఒక నక్సలైటు లీడర్ని పట్టుకుని ఇంటరాగేషన్ చేస్తాడు. నెలరోజులలోపు మీ జిల్లాలో నక్సలైట్లను ఏరిపారేస్తానంటాడు. అప్పుడా నక్సలైట్ అంటాడు. ఏరిపారేయడానికి బియ్యంలో రాళ్లు కాదు బిడ్డా నక్సలైట్లు అంటే, తూర్పునుంచి పడమరకు.. పడమరనుంచి తూర్పుకు మార్చింగ్ చేస్తూ ప్రపంచానికే పహారా కాస్తున్నవాడే నక్సలైట్ అంటాడు. ఇలాంటి పంచ్ డైలాగులు ఎన్ని రాశానో లెక్క లేదు. పెద్ద కష్టం లేకుండానే మీరు వారి ఆదరణ సంపాదించారు కదా? ఇద్దరు పెద్దమనుషుల మధ్య పెరిగాను నేను. ఏ చెడు అలవాటూ లేని మనుషుల మధ్య పెరిగాను. అదే వ్యసనాలు ఉన్నవారి వద్ద పని చేసి ఉంటే సాయంత్రం ఆరు గంటలకు మందు బాటిల్, ఏడు గంటలకు మరొకటి, పది గంటలకు మరొకటి ఇలా ఎంత గబ్బు పట్టాలో అంత గబ్బుపట్టిపోయి ఉండేవాడిని. డ్రగ్స్ కేసులో సినిమావాళ్లు ఇంతమందా? దేశంలో ప్రతి వ్యవస్థలోనూ లోపాలున్నాయి. విద్యా వ్యవస్థ పాడైపోయింది. అన్నిరకాలుగా ప్రజాస్వామ్యాన్ని రేప్ చేసి మరీ గెలుస్తున్నారు కాబట్టి రాజకీయ వ్యవస్థా పాడైపోయింది. అలాగే మీడియా, ప్రభుత్వోద్యోగులు, పోలీసు వ్యవస్థ అన్నిం టిలోనూ లోపాలున్నాయి. అలాగే సినిమా వాళ్లలోనూ ఉన్నాయి కాదనను. కానీ సినిమా రంగాన్ని మాత్రమే ఎత్తి చూపవద్దు? పెద్ద పెద్ద నటులూ డ్రగ్స్‌కు అలవాటు పడుతున్నారు కదా.. మానసిక సమస్యలా? ప్రభుత్వ వైఫల్యం కాబట్టే భారీ మొత్తంలో డ్రగ్స్ దేశంలోకి వచ్చి పడుతున్నాయి. డ్రగ్స్ మాత్రమే ఎందుకు ఆపాలనుకుంటున్నారు? సిగరెట్లు, బీడీలు, గుట్కా ఇంకా ఎన్నో వ్యసనాలు ఉంటున్నాయి. వాటినెందుకు ఆపరు? ప్రజలను మత్తులో, వ్యసనాల్లో ముంచే ఎన్నో అవకాశాలను ప్రభుత్వం కల్పిస్తోంది కదా? డ్రగ్స్ ఎంత ప్రమాదకరమో సిగరెట్లు, మందు, గుట్కాలు, పాన్ పరాగ్‌లు కూడా అంతే ప్రమాదకరం. కానీ వాటిని మాత్రం షాపుల్లో పెట్టి అమ్మిస్తారు. మనుషులను గబ్బుపట్టించే అన్నింటినీ మీరు ఓపెన్‌లో పెడతారు. కానీ డ్రగ్స్ మాత్రం మీకు దెయ్యంలాగ కనబడుతోంది. డ్రగ్స్ చాలా ప్రమాదకరం అని ప్రభుత్వం చర్యలు చేపట్టింది మరి? ప్రభుత్వం యాడ్ ఇచ్చింది. నా పేరు మహేష్. పొగ తాగాను, కేన్సర్ వచ్చింది అంటూ జలదరింపజేసే బొమ్మలతో ప్రచారం చేస్తోంది. ప్రభుత్వం పొగాకును, చుట్టలను ఎందుకు నిషేధించలేదు? పొగ తాగుట హానికరం అని యాడ్ వేసి కూడా మళ్లీ షాపుల్లో అమ్మడానికి ఎందుకు అనుమతిస్తున్నారు? డ్రగ్స్‌ని నిషేధించినవారికి వాటిని నిషేధిం చడం చేతకాదా? ఇంతకూ డ్రగ్స్ వాడుతున్న నటీనటులను మీరు సమర్థిస్తున్నారా? నేనొకటే చెబుతాను. డ్రగ్స్ ప్రమాదకరమని ఇంతగా చెబుతున్నారే.. మందు తాగి ఎంతమంది చావడంలేదు? పొగ తాగి ఎంతమందికి కేన్సర్ రాలేదు? కాబట్టి డ్రగ్స్‌తో పాటు వీటిని కూడా బ్యాన్ చేసి తర్వాత మాట్లాడండి. సినిమా పరిశ్రమను అధికారులు టార్గెట్ చేస్తున్నారని మీ అభిప్రాయమా? సిట్ వాళ్లు ముందే చెప్పారు. మాకు కొన్ని ఆధారాలు దొరికాయి. వాటిని ధ్రువపర్చుకునేందుకు అనుమానం కలిగినవారిని పిలిచి విచారిస్తున్నాం. అంతే కానీ మేం నోటీసులిచ్చామంటే వారిని అరెస్టు చేస్తామని కాదు అని వారు చాలా స్పష్టంగా చెప్పారు. నోటీసులకే ఈ పరిస్థితి వస్తే రేపు నిజంగా ఏదయినా జరిగితే? డ్రగ్స్ వాడుతున్నానని నాకు నోటీసులిచ్చారనుకోండి. నేను కోర్టులకు వెళ్లను. మీమీద అనుమానం ఉంది. కెల్విన్ పక్కన మీరు ఉన్నట్లు ఫొటో ఉంది మీరు విచారణకు రావాలి అని సిట్ వాళ్లు చెబితే ఒకపౌరుడిగా నేను వెళ్లాలి. నేను ఈ దేశానికి జవాబుదారిని. నా ఇంటికి మాత్రమే కాదు. అకుల్ సబర్వాలే కాదు.. ఎవరు పిలిచినా సరే వస్తానని చెప్పి మరీ వెళ్లి వారి ముందు కూర్చుం టాను. ఇంకా అనుమానం ఉంటే లై డిటెక్టర్ పరీక్ష చేసుకోండి. దొరికితే జైల్లో పెట్టండి, నన్ను క్షమించవద్దు అంటాను. సమాజాన్ని క్లీన్‌గా పెట్టడానికి వాళ్లు ప్రయత్నిస్తున్నారు. అందుకే అర్ధరాత్రి వారు ఫోన్ చేసి రమ్మన్నా నేను వెళతాను. చంద్రబాబు పాలనపై మీ అభిప్రాయం? చంద్రబాబు పెద్ద లీడర్. అందులో సందేహమే లేదు. కానీ ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు తెలుగు దేశం పార్టీని అడ్వాంటేజీగా తీసుకుని చాలామంది చాలా తప్పులు చేస్తున్నారు. కులరాజకీయాలు చేస్తున్నారు. మంత్రి మా కమ్మోడు.. మేం ఏమయినా చేస్తాం అంటున్నారు. నేను దీన్ని కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ‘ప్రజాస్వామ్యంలో మాకు పవర్ఫుల్ ఆయుధం ఇచ్చారు. అదే ఓటు. మేం దాంతో చెబుతాం సమాధానం’. ఇదే జనం అభిప్రాయం. ప్రభుత్వం ఏదైనా కావచ్చు. సీఎం సీటులో ఎవరయినా కూర్చోవచ్చు. కానీ ఇన్ని తప్పులు చేయకూడదు. భూ కబ్జాలు, లంచాలు, వనజాక్షిని కొట్టడం, జనాలను లారీతో గుద్ది చంపడం, భూమానాగిరెడ్డిపై ఎస్సీఎస్టీ కేసు పెట్టి మరీ, తనను పార్టీలోకి లాక్కోవడం... ఇవన్నీ వైరుధ్యాలంటామా, వైషమ్యాలంటామా, స్వప్రయోజనమంటామా? ఒక్కమాటలో చెప్పాలంటే ఏపీలో లెక్కలేని నేరాలకు పాలకులు పాల్పడుతున్నారు. అమరావతి రాజధానిపై మీ అభిప్రాయం? రాళ్లలో బియ్యముంటే పక్కన పెడతాం. బియ్యంలో రాళ్లుంటే పక్కన బెడతాం. కాని రాళ్లే బియ్యమైతే దేన్ని పక్కన బెట్టగలం. నేను నిజాలు ఇలాగే చెబుతాను కాబట్టి నన్ను కూడా రేపు ఆ పార్టీవాళ్లు వచ్చి కొట్టినా కొట్టవచ్చు. గతంలోనే నన్ను బెదిరించారు. అదిచేస్తాం ఇది చేస్తాం అన్నారు. ఎవరికీ భయపడేదే లేదు. (పోసాని కృష్ణమురళితో ఇంటర్వ్యూ పూర్తి పాఠం కింది లింకుల్లో చూడండి) https://goo.gl/yhaRAA https://goo.gl/qt6rGT -
కోట శ్రీనివాసరావుతో మనసులో మాట
-
ఫిరాయింపులు తప్పు కాదు తప్పున్నర!
కొమ్మినేని శ్రీనివాసరావుతో సీనియర్ బీజేపీ నేత నాగం జనార్దన్ రెడ్డి రాజకీయాల్లో ఫిరాయింపులు తప్పు మాత్రమే కాదు... చాలా పెద్దపొరపాటు. తెలంగాణలో కానీ, ఏపీలో కానీ రాజ్యాంగాన్నే అవహేళన చేస్తూ జరుగుతున్న ఘటనలు అనైతికమే కాదు.. అసహ్యించుకోవలసిన అంశమని మాజీ మంత్రి, ప్రస్తుత బీజేపీ సీనియర్ నేత నాగం జనార్దన్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఏర్పడటానికి ప్రధాన కారకుడు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడేనని, తెలంగాణకు అనుకూలంగా ప్రధాన ప్రతిపక్ష నేతగా ఆరోజు ఆయన నిర్ణయం తీసుకోకపోతే, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు అనుకూలంగా ఆ నిర్ణయం తీసుకోవడానికి ముందుకు వచ్చేది కాదని నాగం తేల్చి చెప్పారు. తెలంగాణలో మంత్రులు జీవచ్ఛవాలని, ముఖ్యమంత్రి కుమారుడికి తప్ప మరే మంత్రికి అధికారాలు లేవని, ఏపీలో చంద్రబాబు తనయుడు లోకేశ్ అలా జోక్యం చేసుకుంటున్నా తప్పే. తప్పు ఎక్కడ జరిగినా తప్పేనని అంటున్న నాగం అభిప్రాయాలు ఆయన మాటల్లోనే... ప్రస్తుతం మీరు రాజకీయ సంక్షోభంలో ఉన్నట్లున్నారే? నా రాజకీయ జీవితంలో నేనెప్పుడూ సంక్షోభంలో లేను. ఎన్టీ రామారావు నన్ను రాజకీయాల్లోకి ఆహ్వానించినప్పటినుంచే నా రాజకీయ జీవితం ప్రారంభమైంది. టీడీపీలో ఉంటూనే నిర్మొహమాటంగా మాట్లాడేవాడిని. అదే నాకు 1989లో టికెట్ రాకుండా చేసింది. స్వతంత్రంగా పోటీ చేశాను. పార్టీ అధ్యక్షుడు ఎన్టీఆర్‌తో సహా మాలో ఏ ఒక్కరం ఆ ఎన్నికల్లో గెలవలేదు. 1991లో ఎన్టీఆర్ పిలిచి మరీ ఎంపీ సీటు ఇచ్చారు. నాది కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయ పునాది కాబట్టి ఎన్టీఆర్ మళ్లీ నన్ను పార్టీలోకి తీసుకున్నారు. 2011లో బాబు నన్ను సస్పెండ్ చేసేవరకు టీడీపీలోనే ఉన్నాను. తెలంగాణను మేమే సాధించామని టీడీపీ వాళ్లు, కేసీఆర్ అంటున్నారు? కేసీఆర్ ఈరోజు ఏమైనా మాట్లాడవచ్చు. కానీ 1969లో 369 మందికి పైగా పోలీసు కాల్పుల్లో బలై, ఇందిరాగాంధీ అర్ధరాత్రి హుటాహుటిన ఢిల్లీనుంచి బయలుదేరి బేగంపేట విమానాశ్రయంలో దిగినా తెలం గాణ రాలేదు. అంత మహాఉద్యమం అది. ఆరోజు పోలీసు తూటాలకు బలైతే ఇప్పుడు ఆత్మబలిదానం చేసుకున్నారు. కానీ తేడా ఏమిటంటే ఇవ్వాళ రాజ్యాంగ ప్రక్రియ ద్వారా తెలంగాణ వచ్చింది. కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు పూర్తిగా మద్దతు ఇవ్వబట్టి తెలంగాణ వచ్చింది. తెలంగాణ రావడానికి చంద్రబాబే కారణమంటారా? పొలిట్‌బ్యూరోలో తెలంగాణపై తీర్మానం చేపించింది నేను కాదా? చంద్రబాబుతోనే చెప్పాము. సార్ ఇవ్వాళ తెలంగాణపై తీర్మానం చేస్తున్నాం. మేం వెనక్కు పోము. ఒకసారి అడుగు ముందుకేశామంటే ఇక వెనక్కు వచ్చేదే లేదు అని చెప్పేశాను. అంటే చంద్రబాబు వల్ల తెలంగాణ వచ్చిందంటారు అంతేనా? ఆయన కూడా దానికి బాధ్యుడే. తెలంగాణకు అనుకూలంగా ప్రధాన ప్రతిపక్ష నేతగా ఆరోజు ఆయన నిర్ణయం తీసుకోకపోతే, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు అనుకూలంగా ఆ నిర్ణయం తీసుకోవడానికి ముందుకు వచ్చేది కాదు. ఏపీని నాశనం చేశారు. మేం కోరుకోని విభజన చేశారని బాబు అంటున్నారే? చంద్రబాబు ఉద్దేశం ఏమిటంటే రాష్ట్ర రాజ ధాని ఏపీకి లేకుండా పోతుంది కదా. కాబట్టి కొత్త రాజధాని నిర్మాణం కోసం 5 లక్షల కోట్లు అలా పెట్టమన్నారు. ఆ ఉద్దేశంతోటే ఆయన అలా అన్నారు. కేసీఆర్‌ని ఎదిరించగల సత్తా మీలో ఎంతమందికి ఉంది? కేసీఆర్‌ని కాదు.. కేసీఆర్ అవినీతిని ఎదుర్కునే సత్తా మా పార్టీకి ఉంది. ఆయన అవి నీతిని ఎండగట్టే ఆధారాలు మొత్తంగా మావద్ద ఉన్నాయి. ఇప్పటికే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్‌కి, సీబీఐకి కొన్ని ఆధారాలు ఇచ్చాము. నీతి ఆయోగ్‌కి ఇచ్చాము. ఇక్కడ రాష్ట్రంలో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంటుకు ఇచ్చాము. ఫిరాయింపులపై మీరేమంటారు? చాలా తప్పు. చాలా పెద్ద పొరపాటు. ఇక్కడ తెలంగాణలో కానీ, అక్కడ ఏపీలో కానీ రాజ్యాంగాన్నే అవహేళన చేస్తూ జరుగుతున్న ఘటనలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఒక పార్టీ సింబల్ మీద గెలిచి మరో ప్రభుత్వంలో మంత్రులుగా కొనసాగడం అంటే.. అనైతికతే కాదు అసహ్యించుకోవలసిన పని. కేసీఆర్, చంద్రబాబు పాలనపై మీ అభిప్రాయం? పక్క రాష్ట్రం గురించి నాకెందుకండీ. గతంలో చంద్రబాబు పాలన గురించి తెలుసు. మంత్రిగా పనిచేశాను కూడా. కానీ ఇప్పుడు అక్కడ జరుగుతున్న పాలనగురించి తెలుసుకోకుండా మాట్లాడలేను. ఇక కేసీఆర్ పాలన అంటారా అహగాహన లేనితనం కొట్టొచ్చినట్లు కనబడుతుంది. రీడిజైనింగ్, రివైజ్డ్ అంచనాల పేరిట వేల కోట్ల రూపాయలు దండుకుంటున్నారు. అవగాహన లేని, మొత్తం అవినీతిమయమైపోయిన పాలన అది. కుటుంబ పాలన జరుగుతోంది. ఒకరిద్దరికి తప్ప ఏ ఒక్క మంత్రికీ అధికారం లేని ప్రభుత్వం దేశం మొత్తం మీద తెలంగాణలోనే సాగుతోంది. నిజంగా దురదృష్టకరం. తెలంగాణలో మంత్రులెవరికీ స్వేచ్ఛ లేదంటారా? ఏ ఒక్కరికీ లేదు. నేను తెలంగాణ మంత్రులు జాంబీలు అంటున్నాను. అంటే జీవచ్ఛవాలు అని. వారికేమీ చలనం ఉండదు. స్వతంత్ర నిర్ణయాలు తీసుకోలేరు. ముఖ్యమంత్రి కుమారుడైతే మాత్రం వేరే మంత్రిత్వ శాఖల్లో తలదూర్చి ప్రారంభోత్సవాలు కూడా తనే చేస్తాడా.. ఇలాంటిది ఎక్కడైనా జరుగుతుందా? మరి ఏపీలో కూడా చంద్రబాబు తనయుడు లోకేశ్ ఇలాగే చేయడం లేదా? ఏపీలో చంద్రబాబు తనయుడు అలా జోక్యం చేసుకుంటున్నా తప్పే. దాన్ని కూడా నేను సమర్థించను. తప్పు ఎక్కడ జరిగినా తప్పే. తెలంగాణలో ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్‌ని చూస్తే నిజంగా బాధేస్తుంది. ఉద్యమం కోసం బలిదానాలు అర్పించిన వారికి దండలేసి మొక్కడం తప్పితే ఆయన చేసేది ఏదైనా ఉందా? ఆయన నియోజకవర్గంలో ఒక పోలీసు అధికారిని బదిలీ చేయించే అధికారం కూడా లేదు. సీఎం అయినా చెప్పాలి. లేదా ఆయన కొడుకైనా చెప్పాలి. పైగా తెలంగాణలో ఇప్పుడు జరుగుతున్న అవినీతిని మునుపెన్నడూ చూడలేదు. ప్రతి ఆఫీసు అవినీతి కంపుతో నిండిపోయింది. రోగం ఒక తావున ఉంటే మందు ఒక తావున పెడుతున్నాడు కేసీఆర్. అవినీతి ఎక్కడ జరిగిందో ఆ సబ్ రిజిస్ట్రార్ల జోలికి పోకుండా 70 మందిని ఇక్కడికీ అక్కడికీ బదిలీ చేసేస్తే అవినీతి మాయమైపోతుందా? ఓటుకు నోటు కేసుపై మీ అభిప్రాయం? చంద్రబాబు ఆ కేసులో తప్పు చేశారా లేదా? కేసు కోర్టులో ఉంది. ఏసీబీ విచారణ చేస్తోంది. దాని గురించి నేను మాట్లాడటం మంచిది కాదు. విషయం కోర్టులో ఉంది. దాని గురించి వ్యాఖ్యానించడం ఎందుకు? ఓటుకు నోటు కేసులో అభిప్రాయం చెప్పడానికి కూడా ధైర్యం లేని స్థితిలో ఉన్నారా? నూటికి నూరు శాతం అది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి నేనేమీ మాట్లాడలేను. చంద్రబాబు వాయిస్ రికార్డు అయింది కదా. చార్జిషీటులో పేరు వచ్చింది కదా. కేసు నడుస్తోంది. సాగనివ్వండి. బాబు వచ్చిన తర్వాత ఎన్నికల వ్యయం బాగా పెరిగిందంటే ఒప్పుకుంటారా? నేను ఉన్నప్పుడయితే అలా జరగలేదు. ఇప్పుడు తెలీదు. ఎన్టీఆర్, చంద్రబాబు ఇద్దరికీ తేడా ఏమిటి? ఎన్టీఆర్ అంటే ఎన్టీఆరే. ఆయన గ్రేట్ మ్యాన్. చంద్రబాబు ష్రూడ్ పొలిటీషియన్. అంటే రాజకీయాల్లో ఆరితేరిపోయిన వాడు. చంద్రబాబును తెలంగాణ ద్రోహిగా చూస్తారా, మిత్రుడిగా చూస్తారా? ఆరోజు మేం గట్టిగా పట్టుబట్టి ఉంటే తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరోలో తెలంగాణ రిజల్యూషన్ తప్పకుండా పాస్ చేసేవారు. కానీ, మేం పట్టుబట్టకుండానే తెలంగాణ ఏర్పాటుకు మేం ఒప్పుకుంటున్నామని అశోక్ గజపతిరాజుతో చెప్పించారు. చంద్ర బాబు నాయుడి మనసులో ఏముందో తెలీదు కానీ విభజన బిల్లు పెట్టండి మేం మద్దతిస్తాం అనే మాటను అశోక్ గజపతిరాజు చేత చెప్పించారు. మరి అదే అశోక్ గజపతిరాజు సమైక్యాంద్ర ఉద్యమానికి నాయకత్వం వహించారు కదా? మరుసటి రోజే. తెలంగాణకు అనుకూలంగా ప్రకటించిన మరుసటి రోజే ఆయన తన క్వార్టర్ ఖాళీ చేసి నేరుగా విజయనగరం వెళ్లిపోయారు. చంద్రబాబు ఆరోజు తీసుకున్న నిర్ణయమే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ విషయంలో ముందుకెళ్లడానికి దోహదపడింది. (నాగం జనార్దన్ రెడ్డితో ఇంటర్వ్యూ పూర్తి పాఠం: ఇక్కడ క్లిక్ చేయండి) -
ఏ ఒక్కరూ సంతోషంగా లేరు..!
కొమ్మినేని శ్రీనివాసరావుతో కర్నూలు ఎంపీ బుట్టా రేణుక రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో ప్రజలు సంతోషంగా లేరని వైఎస్సార్ సీపీ కర్నూలు ఎంపీ బుట్టా రేణుక పేర్కొన్నారు. నియోజకవర్గాల్లో కొన్ని కోట్లు వెచ్చిస్తే పూర్తయ్యే చిన్న చిన్న పనులు కూడా పూర్తి కావడంలేదని, వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో దాదాపు 80 శాతం పూర్తి చేసిన పనులు కూడా గత మూడేళ్లుగా అలాగే ఉన్నాయన్నారు. సాగునీటి, తాగునీటి రిజర్వాయర్ల తుది నిర్మాణ పనులను కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆమె ఆరోపించారు. ప్రజలకు చేరాల్సిన పథకాలు వారికి అందడం లేదని, ఎన్నోసార్లు బాబుకు పిటిషన్లు పెట్టినా పరిష్కరించడం మాటేమో గానీ, కనీసం పిటిషన్ తమవద్దకు చేరిందన్న అక్నాలెడ్జ్మెంట్ కూడా తిరిగి పంపలేదని విమర్శించారు. ఒక పార్టీ వారిని కోట్లు పెట్టి కొనేయడం చట్టవిరుద్ధం, రాజ్యాంగ విరుద్ధమని చెప్పారు. రాజకీయ నేతలు చేసే వ్యాపారాలపై ఒత్తిడి చేసి ఇబ్బంది పెట్టే అలవాటు ప్రభుత్వాలకు ఉందంటున్న బుట్టా రేణుక అభిప్రాయాలు ఆమె మాటల్లోనే... రాజకీయాల్లోకి రావాలనే ఆసక్తి ఎలా వచ్చింది? నా భర్త ప్రోత్సాహమే కారణం. ఆయన, మా సోదరుడు యుగేందర్ కూడా నన్ను రాజకీయాల్లోకి ప్రోత్సహించారు. విద్యతో పాటు రిటైల్, ఆటోమొబైల్ బిజినెస్‌లో ఉన్నాం. బిజినెస్ ఫ్యామిలీ నుంచి వచ్చాం కాబట్టి రాజకీయాలపై అంత ఆసక్తి చూపేవాళ్లం కాదు. వైఎస్ జగన్ అన్న కొత్తగా అభ్యర్థుల కోసం చూస్తున్న సమయంలో కొంతమంది రాజకీయ స్నేహితుల వల్ల పరిచయాలు పెరిగాయి. నా భర్తకు ఆఫర్ వచ్చింది. రాజకీయాల్లోకి నాకంటే నీవే ఉత్తమం అని చెప్పి నా భర్త నన్ను ప్రోత్సహించారు. అంతకుముందు పూర్తిగా విద్యపైనే దృష్టి పెట్టాను. ఎంపీగా ఎన్నికైన వెంటనే కాస్త గడబిడి అయినట్లుంది కదా? అది అనుకోకుండా జరిగిన సందర్భం. ఎస్పీవైరెడ్డి ఎంపీగా గెలిచిన తర్వాత చంద్రబాబు ఇంటికి వెళ్లారు. అక్కడ ఆయన పార్టీ మారి టీడీపీలో చేరిన సమయంలో నా భర్త అక్కడే ఉన్నారు. ఆ క్షణంలో అలా జరిగింది. నేను వెళ్లలేదు. ఆయన ఏ పార్టీలోనూ చేరలేదు. నేను వైఎస్సార్ సీపీలో ఉన్నాను. మా ఆయన టీడీపీలో ఉండటం అసంభవం. ఆయన గైడెన్స్ నాకు అవసరం కదా. ఆయనకు బాబుతో ఎలాంటి సంబంధం లేదు. మీరు ఇక్కడ, మీవారు టీడీపీలో ఉంటే సేఫ్ గేమ్ ఆడొచ్చుకదా..? లేదండి. అంత గేమ్స్ ఆడే స్థాయికి నేనింకా ఎదగలేదు (నవ్వుతూ), నా భర్త గైడెన్స్ వల్లే నియోజకవర్గంలో ఏదైనా చేయగలుగుతున్నాను. ఆయన ఎప్పుడూ నన్ను ప్రోత్సహిస్తుంటారు. నియోజకవర్గంలో ఇలా తిరగాలి, ప్రజలను ఇలా చేరాలి, వారి పనులు ఏవిధంగా చేయాలి. ఎలాంటి మేలు చేయాలి అనే అంశాల పట్ల ఆయన నాకు వెనుక నుంచి మార్గనిర్దేశనం చేస్తుంటారు. చాలాసార్లు ఆయన పార్టీ మీటింగులకు వస్తూ, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. పార్టీ మారమని మీపై ఒత్తిడి చేయలేదా? లేదండి. పార్టీనుంచి ఎమ్మెల్యేలను ఫిరాయింపజేసి తీసుకోవడం అనేది రాజ్యాంగబద్ధం కాదు. చట్టబద్ధం కాదు. ఒక పార్టీ నుంచి ఎన్నికయినప్పుడు దానికే కట్టుబడి ఉండాలి. ప్రజలకు అలా సందేశం కూడా ఇవ్వాలి. మనలో మారాలనే సంసిద్ధతను బట్టి అవతలివాళ్లు ఆఫర్లు చేస్తారు. మీకలాంటి ఆఫర్లు పంపలేదా? ప్రలోభాల వల్లే మీ జిల్లాలో 5 గురు పార్టీ మారారా? నా నియోజకవర్గం విషయం చూస్తే మావాళ్లపై కొంచెం ఒత్తిడి ఉంటుంది. ఎందుకంటే ఏ పనులూ జరగలేదు. ప్రత్యేకించి ఎమ్మెల్యే స్థాయిలో మా పార్టీ కేడర్‌ను ఇబ్బంది పెట్టడం, కొన్ని సందర్భాల్లో ఏకపక్షంగా వ్యవహరించడం.. ఇలాంటివి కొన్ని నా నోటీసుకు వచ్చాయి. ఇలాంటి ఒత్తిళ్లు ఎదుర్కోవడం ఎమ్మెల్యేలకు కొంచె కష్టం. చంద్రబాబు పాలన ఎలా ఉందనుకుంటున్నారు? కచ్చితంగా ప్రజలు సంతోషంగా లేరు. పథకాలు తీసుకోండి. చేసిన వాగ్దానాలు తీసుకోండి.. చిన్న చిన్న పనులు కూడా జరగడం లేదు. నిజం చెప్పాలంటే నా నియోజకవర్గం వరకు చూస్తే ఎలాంటి అభివృద్ధీ కనిపించడం లేదు. నా నియోజకవర్గంలో ఒక చిన్న ప్రాజెక్టు.. రిజర్వాయర్ ఉంది. దానికి 20 కోట్లు ఖర్చుపెడితే చాలు వస్తుంది. సాగునీరు, మంచినీరు సమస్యలు తీరిపోతాయి. 20 కోట్లు అనేది ప్రభుత్వానికి చాలా తక్కువ మొత్తం. ఇలాంటి చిన్న చిన్న పనులు కూడా నేడు పూర్తి కాని పరిస్థితులే ఉన్నాయి. రాజశేఖరరెడ్డి హయాంలో దాదాపు 80 శాతం పనులు పూర్తి చేశారు. వాటికి కూడా 25 లేక 30 కోట్లు ఖర్చుపెడితే అవి వినియోగంలోకి వస్తాయి. పార్టీ మారితే 40 కోట్లు ఇస్తున్నారు.. అంత ఖర్చుపెట్టావు. నీకేం మిగిలింది, ఏం సాధించావు అని మీ పిల్లలు మిమ్మల్ని అడగరా? లేదండి. పార్టీ మారినవారికి, పార్టీలోనే ఉన్నవారికి ప్రజల్లో ఉన్న గౌరవం, వ్యత్యాసం చూస్తే అసలు ఆ ఆలోచనే రాదు. పైగా వ్యాపార నేపథ్యం నుంచి వచ్చాం కాబట్టి రాజకీయాల్లో పార్టీలు మారడం కంటే బిజినెస్ చేసుకుంటే ఇంకా ఉత్తమం అనే ఎరుకతో ఉన్నాం. రాజకీయాల్లో కంటే బిజినెస్‌లో గౌరవప్రదమైన సంపాదన ఉంటుంది. అందుకే రాజకీయాలను బిజినెస్ చేయకూడదు. జగన్ నాయకత్వంపై మీ అభిప్రాయం? అన్నను చాలాసార్లు కలిశాను. ఎంతో సహృదయం ప్రదర్శించారు. మంచి వ్యక్తి, సమస్యలు వచ్చినప్పడు కూడా చక్కటి సలహాలు ఇస్తారు. నా విషయానికి వస్తే, ‘కొంచెం బలంగా ఉండాలమ్మా, ఇంకా గట్టిగా ఉండాలి’ అని చెబుతారు. అంటే వాయిస్‌ని కొంచెం పెంచాలి అని సూచిస్తారు. తప్పకుండా పికప్ అవుతానన్నా అంటాను. కొంచెం కొంచెంగా మార్పు వస్తోంది. విమర్శించడం నా స్వభావం కాదని కూడా అన్నతో చెప్పాను. నేనే నేరుగా చెప్పిన తర్వాత అన్న ఎందుకు ఫోర్స్ చేస్తారు? ఈ మూడేళ్లలో అన్న నన్ను చక్కగా అర్థం చేసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో మీకు టికెట్ వస్తుందా? అన్న పిలిచి చెప్పేంతవరకు నేను ఎవరి మాటా నమ్మను. ఈసారి నన్ను ఎమ్మెల్యేగా పంపే అవకాశం ఉందని కూడా ఇప్పటికే పుకార్లు ఉన్నాయి. కానీ మా అధినేత ఈ విషయంపై ఏదీ చెప్పనప్పుడు నేనెందుకు బాధపడాలి? ఇప్పటికైతే నా ఆసక్తి ఎంపీగా కావాలనే. రేపు ఏం జరుగుతుందో దేవుడికే తెలియాలి. నా ఆసక్తి, పార్టీ ఆసక్తి రెండింటిపైనే నేనేమిటి అనేది ఆధారపడి ఉంటుంది. జగనన్న ఇప్పటివరకు నా విషయంలో హ్యాపీగానే ఉన్నారు. జగన్ సీనియర్లను కూడా లెక్కచేయరని అధికార పార్టీ నేతల విమర్శ? నాకు తెలిసినంతవరకు అన్న అందరినీ గౌరవిస్తుంటారు. నా మూడేళ్ల అనుభవంలో తను మంచి వ్యక్తిగానే కనిపించారు. చిన్నవాళ్లం, తానూ మేమూ సేమ్ బ్యాచ్. మాకే అంత గౌరవం ఇస్తున్నప్పుడు పెద్దవారికి గౌరవం ఇవ్వరా? తనకంటే పెద్దవారైన నేతలకు అన్న ఎలాంటి గౌరవం ఇస్తారో కళ్లారా చూశాను కూడా. వైఎస్ రాజశేఖరరెడ్డిపై మీ అభిప్రాయం? నిజం చెప్పాలంటే ఒక్కసారి కూడా ఆయనను నేను వ్యక్తిగతంగా కలవలేదు. చూడలేదు. ఆయనని కలవకున్నా, ఇంటరాక్ట్ కాకున్నా, ప్రజలద్వారా నాకు తనపై మంచి అభిప్రాయం కలిగింది. రియల్లీ గ్రేట్ లీడర్. ప్రజల్లోకి వెళ్లినప్పుడు ఆయన పేరు చెపితేనే వారి ముఖాల్లో అంత సంతోషం కనబడుతుంది. ఒక నాయకుడు ప్రజల్లో అంత మంచి గౌరవాన్ని పొందడం నిజంగా గొప్ప విషయం. మరి మీ పార్టీ పరిస్థితి ఎలా ఉందనుకుంటున్నారు? మొత్తంమీద మా పార్టీ పరిస్థితి అన్ని ప్రాంతాల్లోనూ బాగానే ఉంది. 2014లో అతి తక్కువ మెజారిటీ ఓట్లతో మేం దెబ్బ తినడం విచారకరం. ఇప్పుడయితే ప్రజల్లో మాకు చాలా మంచి గుర్తింపు ఉంది. మంచి మంచి నేతలు మా పార్టీలోకి రావటం. మొత్తం మీద వచ్చే ఎన్నికల్లో మా పార్టీపై మాకు ఎంతో నమ్మకం ఉందండి. 2019లో తప్పకుండా మేం అధికారంలోకి వస్తాం. ప్రజల్లో కూడా ఆ నమ్మకాన్నే ఇస్తున్నాం. మేం గెలుస్తాం, పనులు చేయగలుగుతాం అని నమ్మకంగా చెబుతున్నాం. (బుట్టా రేణుకతో ఇంటర్వూ్య పూర్తి పాఠం కింది లింకుల్లో చూడండి) https://goo.gl/QoF28k https://goo.gl/uJJzMN -
కన్నా లక్ష్మీనారాయణతో మనసులో మాట
-
బొత్స సత్యనారాయణతో మనసులో మాట
-
పొన్నాల లక్ష్మయ్య తో మనసులో మాట
-
జైపాల్ రెడ్డితో మనసులో మాట
-
ఉమ్మారెడ్డితో మనసులో మాట
-
భూమనతో మనసులో మాట
-
ఆ కేసుల్లో ఒక్కటీ నిలబడదు..!
కొమ్మినేని శ్రీనివాసరావుతో టి. కాంగ్రెస్ ఎమ్మెల్యే టి. జీవన్ రెడ్డి (మనసులో మాట) వైఎస్ రాజశేఖరరెడ్డి తీసుకున్న నిర్ణయాలు ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డికి లబ్ధి చేకూర్చాయి అనే ప్రాతిపదికన జగన్‌పై ఆరోపించిన కేసులు ఏవీ కోర్టులో నిరూపణ కావు అని ఘంటాపథంగా చెబుతున్నారు మాజీ మంత్రి, ప్రస్తుతం టి. కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే టి. జీవన్ రెడ్డి. నాటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కక్షసాధింపు చర్యతో వైఎస్ కుటుంబంపై పెట్టిన కేసుల వల్ల అంతిమంగా నష్టపోయింది కాంగ్రెస్ పార్టీయేనని స్పష్టం చేశారు. సీఎం స్థానంలో నాడు వైఎస్ నిబంధనలకు విరుద్ధంగా ఎవరికైనా లాభం చేకూర్చి ఉంటే అది మంత్రిమండలి బాధ్యత కిందికి వస్తుంది కాబట్టి కేబినెట్టే ఆరోపణలను ఎదుర్కోవాల్సి ఉందని, ఇలాంటి అంశాలు రేపు వైఎస్ జగన్‌కి చక్కగా తోడ్పడతాయని జీవన్ రెడ్డి చెబుతున్నారు. ఏపీలో చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల్లో ఏర్పడిన తీవ్ర అసమ్మతి వైఎస్సార్ కాంగ్రెస్‌కి తప్పక మేలు చేకూరుస్తుందని మనసులో మాట చెబుతున్న టి.జీవన్ రెడ్డి అభిప్రాయాలు ఆయన మాటల్లోనే.. మీ జీవితంలో సంతోషకరమైన సన్నివేశాలు ఏమిటి? తొలిసారి పంచాయతీ ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యాను. ప్రజాజీవితంలో తొలి అడుగు కాబట్టి అది మర్చిపోలేనట్టి అనుభూతి. 1983లో తొలిసారి నేను ఎమ్మెల్యేగా గెలిచాను. వెంటనే మంత్రిగా కూడా ఎన్నికయ్యాను. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికైన ముఖ్యమంత్రుల పని తీరుపై మీ అభిప్రాయం? విజయభాస్కరరెడ్డి స్టేట్స్‌మన్. పెద్దాయన. ప్రేమాస్పదుడు. కానీ ప్రజాజీవి తంలో వైఎస్సార్ అంతటి సానుకూల దృక్పథం కలిగిన నాయకుడిని నేను చూడలేదు. తనవద్దకు ఏ పార్టీ నేతలొచ్చినా వారు ప్రతిపాదించిన సమస్యకు ఎలా పరిష్కారం చూపాలి అనే ఆలోచించేవారు తప్ప వచ్చినవారు ఎవరు అని అలోచించేవాడు కాదాయన. తనవద్దకు వచ్చిన ఇష్యూనే చూసేవారు తప్ప దాన్ని తీసుకొచ్చిన ప్రతినిధిని చూసేవాడు కాదు. తాను నంబర్‌వన్ అని రోశయ్య ఎన్నడూ భావించలేదు. నంబర్‌వన్‌గా నాయకత్వంలో కొనసాగుతాననే విశ్వాసం లోపించడంతోనే ఆయన తప్పుకున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి కష్టపడే తత్వం కలవారు. కాని తెలంగాణకి వ్యతిరేకంగా ఆయన ఆలోచనలు కొనసాగాయి. తెలంగాణ రాష్ట్రం కంటే తెలంగాణ అభివృద్ధి ముఖ్యం అనేవారని మీపై ఆరోపణ? రాజశేఖరరెడ్డి వ్యక్తిగతంగా తెలుగు ప్రజలు ఐక్యంగా ఉండాలని కోరుకున్నప్పటికీ అంతిమంగా కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయాలను అంగీకరించాలనే క్రమశిక్షణ గల సైనికుడిగానే ఉండేవాడు. అధిష్టానం తీసుకునే ఏ నిర్ణయాన్నయినా సరే సీఎంగా అమలు చేయాల్సిన బాధ్యత ఆయనపై ఉండేది. మాపై కూడా అదే బాధ్యతే ఉండేది. కేసీఆర్ కూడా ఇప్పుడు అభివృద్ధి అనే అంటున్నారు కదా. తెలంగాణ అభివృద్ధి అనేది మా పౌరహక్కు. తెలంగాణ అనేది మా జన్మహక్కు. తెలంగాణలో మా ప్రభుత్వం ఆధ్వర్యంలో అభివృద్ధి జరుగుతున్నప్పటికీ తెలంగాణ రాష్ట్రంపై మా జన్మహక్కును వదులుకోమన్నదే మేం చెబుతూ వచ్చాం. వైఎస్సార్ మరణం తర్వాత పరిణామాలపై మీ అభిప్రాయం? ఆయన మరణం రాష్ట్రానికే దురదృష్టకరమైన ఘటన. అయితే వైఎస్సార్ బతికి ఉంటే తెలంగాణ వచ్చేది కాదు అనడం తప్పు. తెలుగు ప్రజలు సమైక్యంగా ఉండాలనే కోరుకున్నారు తప్ప అధిష్టానం నిర్ణయాన్ని ధిక్కరించే తత్వం కాదు ఆయనది. వైఎస్ కుటుంబంపైనే కేసులు పెట్టడం సమంజసమేనా? సీఎం స్థానంలో ఉండి వైఎస్సార్ తీసుకున్న ఏ నిర్ణయమైనా కేబినెట్ నిర్ణయం. పైగా అది సమష్టి నిర్ణయం. దాని బాధ్యతను ఒక్కరిపైనే ఆపాదించడానికి వీల్లేదు. వైఎస్ జగన్‌పై ఇవ్వాళ క్విడ్ ప్రో కో అనీ, వైఎస్ తీసుకున్న నిర్ణయాలు జగన్‌కి లబ్ధి చేసిన నిర్ణయాలు అని చెబుతున్నవి ఏవీ కోర్టులో నిరూపణ కావు. పైగా శంకర్రావు వ్యక్తిగతంగా కేసు వేశారే కాని అధిష్టానానికి దాంతో సంబంధం లేదు. కిరణ్‌కుమార్ రెడ్డి మాత్రమే ఈ విషయంలో కొంత పొరపాటు చేశాడు. సీఎంగా ఉండి కూడా కోర్టులో ప్రభుత్వం తరఫున ఈ కేసుల్లో ఎలాంటి ఫైలూ కౌంటర్ చేయలేదు. ఇదంతా కావాలని చేశారా? అధిష్టానమే చేయించిందా? ప్రతి చిన్న విషయంలో అధిష్టానం జోక్యం చేసుకుంటుందని నేననుకోవడం లేదు. కిరణ్ ఈ విషయంలో దూకుడుగా వ్యవహరించారని చెప్పాలి. జగన్ అప్పటికే పార్టీనుంచి వెళ్లిపోయి కొత్త పార్టీ పెట్టుకున్నారు కాబట్టి ఆయన అలా చేసి ఉండవచ్చు. కక్షసాధింపుగా, జగన్ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేవిధంగా అలా చేసి ఉండవచ్చు. ఆ దెబ్బతో కాంగ్రెస్ పార్టీయే గందరగోళంలో పడిపోయింది కదా? అంతిమంగా నష్టపోయింది కాంగ్రెస్ పార్టీయే కదా.వైఎస్సార్‌పై అవినీతి ముద్ర వేయాలని భావిస్తే, అది అంతిమంగా కాంగ్రెస్‌కే తగులుతుంది. వైఎస్ఆరే అవినీతి పరుడిగా ఎస్టాబ్లిష్ అయితే, కాంగ్రెస్సే అవినీతికరమైన పార్టీగా నిలిచిపోతుంది కదా. వైఎస్ జగన్ కేసులో ఏదీ నిలబడదంటారా? మరి సీబీఐ ఆయన్ని ఎందుకు వేధించింది? జగన్‌పై ఏ కేసూ నిలబడేది కాదు. అయితే కోర్టునుంచి డైరెక్షన్ రావడంతో అలా కేసులు పెట్టడం జరిగింది తప్పితే ఏదీ నిలబడేది కాదు. క్విడ్ ప్రో కో అనేదాంట్లో ఎవరికైనా లబ్ధి చేకూరి ఆ క్రమంలో భాగంగా జగన్ కూడా లబ్ధి పొంది ఉంటే, వాళ్లకు అతడు చేకూర్చిన లబ్ధి ఏమేరకు జరిగింది అనేది ముందు చూడాలి. వందకోట్లు లబ్ధి చేకూరి అందులో.. పది కోట్లు క్విడ్ ప్రో కో జరిగిందంటే అర్థముంది. కానీ వందకోట్ల విలువైన ప్రాజెక్టులో వెయ్యికోట్ల విలువైన క్విడ్ ప్రో కో జరిగి ఉండటానికి అవకాశమే లేదుకదా. ఇది సింపుల్ లాజిక్. ఉద్దేశపూర్వకంగా నిబంధనలకు విరుద్ధంగా ఎవరికైనా లాభం చేకూర్చి ఉంటే మొదట అది కేబినెట్ దృష్టికి వస్తుంది. మంత్రివర్గానికి తెలియకుండా అదెలా సాధ్యమవుతుంది? మరి సీబీఐ మంత్రివర్గం జోలికి ఎందుకు వెళ్లలేదు? అదే నాకు అర్థం కానిది కూడా. ఇవన్నీ రేపు రేపు జగన్‌కి చక్కగా తోడ్పడతాయి. తెలంగాణ విషయంలో సోనియా గాంధీ వ్యూహం లేకుండా పావులు కదిపారా? అదేం కాదండి. ఒక మాతృ హృదయంతో ఆమె తెలంగాణ విషయంలో వ్యవహరించారు. ఒక తల్లిగా, మహిళగా తెలంగాణ కోసం ఈ ఆత్మత్యాగాలు, బలిదానాలు చూసి తట్టుకోలేక చలించిపోయారు. రాజకీయంగా లాభనష్టాలను బేరీజు చేసుకుని ఉంటే తెలంగాణ ఇచ్చేవారు కాదు. తెలంగాణ ఇచ్చిన వెంటనే సీమాంధ్రలోని 25 ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ తన ఉనికిని కోల్పోతుందన్నది ఎవరైనా ఊహించగలరు. తెలంగాణ అంశానికి శాశ్వత పరిష్కారం చూపాలని సోనియా అనుకున్నారు. ఆ క్షణంలోనే తెలంగాణ లక్ష్యం సాకారమైంది. తెలంగాణలో నోట్ల రద్దు ప్రభావం ఎంత? చాలా దుష్పరిణామాలున్నాయి. దీన్ని రాజకీయ అంశం కంటే కూడా ఒక ప్రజా సమస్యగానే అన్ని పార్టీలూ ఆలోచించాలి. ఇవ్వాళ వాస్తవంగానే 50 శాతం జనాభా రోడ్లమీదే ఉంది. 90 శాతం ఏటీఎంలు ఇవాళ పనిచేయడం లేదు. నా డబ్బు నేను తీసుకోవడానికి అవకాశం లేకుంటే ఎలా? నోట్ల రద్దు ప్రభావం ఎవరికి ఉపయోగపడుతుంది? మీకా టీఆర్ఎస్కా? టీఆర్ఎస్ ఇవ్వాళ బీజేపీలోనే జాయిన్ అయిపోయింది కదా. మొదట్లో నోట్ల రద్దును వ్యతిరేకించినప్పటికీ ఇప్పుడు సాక్షాత్తూ కేసీఆరే స్వైపింగ్ మిషన్ పట్టుకుని తిరుగుతున్నాడు కదా. ఇవన్నీ మాకు భవిష్యత్తులో రాజకీయంగా ఉపయోగపడతాయి. ఏపీలో జగన్ భవిష్యత్తుపై మీ అభిప్రాయం? చంద్రబాబు గత ఎన్నికల్లో ఎన్నెన్ని వాగ్దానాలు చేసిండో అవి ఏవీ నెరవేర్చలేదు. వాస్తవంగానే ప్రభుత్వ వ్యతిరేకత అనేది కచ్చితంగా ప్రతిపక్ష పార్టీకి ఉపయోగపడుతుంది. ఏపీలో టీడీపీ, కేంద్రంలో ఎన్డీఏ మిత్రపక్షాలు కాబట్టి వాటిపై ప్రజల వ్యతిరేకత ప్రతిపక్షానికే ఎక్కువగా తోడ్పడుతుంది. నిజంగా కూడా వైఎస్ జగన్ అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. మీడియాలో గమనిస్తున్నదాని ప్రకారం తనది అలుపెరుగని పోరాటమే. ఎన్నికలకు ముందూ, తర్వాత కూడా అధికారంలో నేను లేనన్న భావన ఆయనలో కనిపించడం లేదు. ప్రజాజీవితంలో ఒక బాధ్యత కల పార్టీ నాయకుడిగా ఆయన తన బాధ్యత నిర్వర్తిస్తున్నట్లే కనబడుతోంది. -
జయప్రకాశ్ నారాయణ్‌తో మనసులో మాట
-
దానం నాగేందర్‌తో మనసులో మాట
-
దత్తన్నతో మనసులో మాట
-
ఎంపీ కవితతో మనసులో మాట