ఆ కేసుల్లో ఒక్కటీ నిలబడదు..!
కొమ్మినేని శ్రీనివాసరావుతో టి. కాంగ్రెస్ ఎమ్మెల్యే టి. జీవన్ రెడ్డి (మనసులో మాట)
వైఎస్ రాజశేఖరరెడ్డి తీసుకున్న నిర్ణయాలు ఆయన తనయుడు జగన్‌మోహన్ రెడ్డికి లబ్ధి చేకూర్చాయి అనే ప్రాతిపదికన జగన్‌పై ఆరోపించిన కేసులు ఏవీ కోర్టులో నిరూపణ కావు అని ఘంటాపథంగా చెబుతున్నారు మాజీ మంత్రి, ప్రస్తుతం టి. కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే టి. జీవన్ రెడ్డి. నాటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కక్షసాధింపు చర్యతో వైఎస్ కుటుంబంపై పెట్టిన కేసుల వల్ల అంతిమంగా నష్టపోయింది కాంగ్రెస్ పార్టీయేనని స్పష్టం చేశారు.
సీఎం స్థానంలో నాడు వైఎస్ నిబంధనలకు విరుద్ధంగా ఎవరికైనా లాభం చేకూర్చి ఉంటే అది మంత్రిమండలి బాధ్యత కిందికి వస్తుంది కాబట్టి కేబినెట్టే ఆరోపణలను ఎదుర్కోవాల్సి ఉందని, ఇలాంటి అంశాలు రేపు వైఎస్ జగన్‌కి చక్కగా తోడ్పడతాయని జీవన్ రెడ్డి చెబుతున్నారు. ఏపీలో చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల్లో ఏర్పడిన తీవ్ర అసమ్మతి వైఎస్సార్ కాంగ్రెస్‌కి తప్పక మేలు చేకూరుస్తుందని మనసులో మాట చెబుతున్న టి.జీవన్ రెడ్డి అభిప్రాయాలు ఆయన మాటల్లోనే..
మీ జీవితంలో సంతోషకరమైన సన్నివేశాలు ఏమిటి?
తొలిసారి పంచాయతీ ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యాను. ప్రజాజీవితంలో తొలి అడుగు కాబట్టి అది మర్చిపోలేనట్టి అనుభూతి. 1983లో తొలిసారి నేను ఎమ్మెల్యేగా గెలిచాను. వెంటనే మంత్రిగా కూడా ఎన్నికయ్యాను.
కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికైన ముఖ్యమంత్రుల పని తీరుపై మీ అభిప్రాయం?
విజయభాస్కరరెడ్డి స్టేట్స్‌మన్. పెద్దాయన. ప్రేమాస్పదుడు. కానీ ప్రజాజీవి తంలో వైఎస్సార్ అంతటి సానుకూల దృక్పథం కలిగిన నాయకుడిని నేను చూడలేదు. తనవద్దకు ఏ పార్టీ నేతలొచ్చినా వారు ప్రతిపాదించిన సమస్యకు ఎలా పరిష్కారం చూపాలి అనే ఆలోచించేవారు తప్ప వచ్చినవారు ఎవరు అని అలోచించేవాడు కాదాయన. తనవద్దకు వచ్చిన ఇష్యూనే చూసేవారు తప్ప దాన్ని తీసుకొచ్చిన ప్రతినిధిని చూసేవాడు కాదు. తాను నంబర్‌వన్ అని రోశయ్య ఎన్నడూ భావించలేదు. నంబర్‌వన్‌గా నాయకత్వంలో కొనసాగుతాననే విశ్వాసం లోపించడంతోనే ఆయన తప్పుకున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి కష్టపడే తత్వం కలవారు. కాని తెలంగాణకి వ్యతిరేకంగా ఆయన ఆలోచనలు కొనసాగాయి.
తెలంగాణ రాష్ట్రం కంటే తెలంగాణ అభివృద్ధి ముఖ్యం అనేవారని మీపై ఆరోపణ?
రాజశేఖరరెడ్డి వ్యక్తిగతంగా తెలుగు ప్రజలు ఐక్యంగా ఉండాలని కోరుకున్నప్పటికీ అంతిమంగా కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయాలను అంగీకరించాలనే క్రమశిక్షణ గల సైనికుడిగానే ఉండేవాడు. అధిష్టానం తీసుకునే ఏ నిర్ణయాన్నయినా సరే సీఎంగా అమలు చేయాల్సిన బాధ్యత ఆయనపై ఉండేది. మాపై కూడా అదే బాధ్యతే ఉండేది. కేసీఆర్ కూడా ఇప్పుడు అభివృద్ధి అనే అంటున్నారు కదా. తెలంగాణ అభివృద్ధి అనేది మా పౌరహక్కు. తెలంగాణ అనేది మా జన్మహక్కు. తెలంగాణలో మా ప్రభుత్వం ఆధ్వర్యంలో అభివృద్ధి జరుగుతున్నప్పటికీ తెలంగాణ రాష్ట్రంపై మా జన్మహక్కును వదులుకోమన్నదే మేం చెబుతూ వచ్చాం.
వైఎస్సార్ మరణం తర్వాత పరిణామాలపై మీ అభిప్రాయం?
ఆయన మరణం రాష్ట్రానికే దురదృష్టకరమైన ఘటన. అయితే వైఎస్సార్ బతికి ఉంటే తెలంగాణ వచ్చేది కాదు అనడం తప్పు. తెలుగు ప్రజలు సమైక్యంగా ఉండాలనే కోరుకున్నారు తప్ప అధిష్టానం నిర్ణయాన్ని ధిక్కరించే తత్వం కాదు ఆయనది.
వైఎస్ కుటుంబంపైనే కేసులు పెట్టడం సమంజసమేనా?
సీఎం స్థానంలో ఉండి వైఎస్సార్ తీసుకున్న ఏ నిర్ణయమైనా కేబినెట్ నిర్ణయం. పైగా అది సమష్టి నిర్ణయం. దాని బాధ్యతను ఒక్కరిపైనే ఆపాదించడానికి వీల్లేదు. వైఎస్ జగన్‌పై ఇవ్వాళ క్విడ్ ప్రో కో అనీ, వైఎస్ తీసుకున్న నిర్ణయాలు జగన్‌కి లబ్ధి చేసిన నిర్ణయాలు అని చెబుతున్నవి ఏవీ కోర్టులో నిరూపణ కావు. పైగా శంకర్రావు వ్యక్తిగతంగా కేసు వేశారే కాని అధిష్టానానికి దాంతో సంబంధం లేదు. కిరణ్‌కుమార్ రెడ్డి మాత్రమే ఈ విషయంలో కొంత పొరపాటు చేశాడు. సీఎంగా ఉండి కూడా కోర్టులో ప్రభుత్వం తరఫున ఈ కేసుల్లో ఎలాంటి ఫైలూ కౌంటర్ చేయలేదు.
ఇదంతా కావాలని చేశారా? అధిష్టానమే చేయించిందా?
ప్రతి చిన్న విషయంలో అధిష్టానం జోక్యం చేసుకుంటుందని నేననుకోవడం లేదు. కిరణ్ ఈ విషయంలో దూకుడుగా వ్యవహరించారని చెప్పాలి. జగన్ అప్పటికే పార్టీనుంచి వెళ్లిపోయి కొత్త పార్టీ పెట్టుకున్నారు కాబట్టి ఆయన అలా చేసి ఉండవచ్చు. కక్షసాధింపుగా, జగన్ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేవిధంగా అలా చేసి ఉండవచ్చు.
ఆ దెబ్బతో కాంగ్రెస్ పార్టీయే గందరగోళంలో పడిపోయింది కదా?
అంతిమంగా నష్టపోయింది కాంగ్రెస్ పార్టీయే కదా.వైఎస్సార్‌పై అవినీతి ముద్ర వేయాలని భావిస్తే, అది అంతిమంగా కాంగ్రెస్‌కే తగులుతుంది. వైఎస్‌ఆరే అవినీతి పరుడిగా ఎస్టాబ్లిష్ అయితే, కాంగ్రెస్సే అవినీతికరమైన పార్టీగా నిలిచిపోతుంది కదా.
వైఎస్ జగన్ కేసులో ఏదీ నిలబడదంటారా? మరి సీబీఐ ఆయన్ని ఎందుకు వేధించింది?
జగన్‌పై ఏ కేసూ నిలబడేది కాదు. అయితే కోర్టునుంచి డైరెక్షన్ రావడంతో అలా కేసులు పెట్టడం జరిగింది తప్పితే ఏదీ నిలబడేది కాదు. క్విడ్ ప్రో కో అనేదాంట్లో ఎవరికైనా లబ్ధి చేకూరి ఆ క్రమంలో భాగంగా జగన్ కూడా లబ్ధి పొంది ఉంటే, వాళ్లకు అతడు చేకూర్చిన లబ్ధి ఏమేరకు జరిగింది అనేది ముందు చూడాలి. వందకోట్లు లబ్ధి చేకూరి అందులో.. పది కోట్లు క్విడ్ ప్రో కో జరిగిందంటే అర్థముంది. కానీ వందకోట్ల విలువైన ప్రాజెక్టులో వెయ్యికోట్ల విలువైన క్విడ్ ప్రో కో జరిగి ఉండటానికి అవకాశమే లేదుకదా. ఇది సింపుల్ లాజిక్. ఉద్దేశపూర్వకంగా నిబంధనలకు విరుద్ధంగా ఎవరికైనా లాభం చేకూర్చి ఉంటే మొదట అది కేబినెట్ దృష్టికి వస్తుంది. మంత్రివర్గానికి తెలియకుండా అదెలా సాధ్యమవుతుంది?
మరి సీబీఐ మంత్రివర్గం జోలికి ఎందుకు వెళ్లలేదు?
అదే నాకు అర్థం కానిది కూడా. ఇవన్నీ రేపు రేపు జగన్‌కి చక్కగా తోడ్పడతాయి.
తెలంగాణ విషయంలో సోనియా గాంధీ వ్యూహం లేకుండా పావులు కదిపారా?
అదేం కాదండి. ఒక మాతృ హృదయంతో ఆమె తెలంగాణ విషయంలో వ్యవహరించారు. ఒక తల్లిగా, మహిళగా తెలంగాణ కోసం ఈ ఆత్మత్యాగాలు, బలిదానాలు చూసి తట్టుకోలేక చలించిపోయారు. రాజకీయంగా లాభనష్టాలను బేరీజు చేసుకుని ఉంటే తెలంగాణ ఇచ్చేవారు కాదు. తెలంగాణ ఇచ్చిన వెంటనే సీమాంధ్రలోని 25 ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ తన ఉనికిని కోల్పోతుందన్నది ఎవరైనా ఊహించగలరు. తెలంగాణ అంశానికి శాశ్వత పరిష్కారం చూపాలని సోనియా అనుకున్నారు. ఆ క్షణంలోనే తెలంగాణ లక్ష్యం సాకారమైంది.
తెలంగాణలో నోట్ల రద్దు ప్రభావం ఎంత?
చాలా దుష్పరిణామాలున్నాయి. దీన్ని రాజకీయ అంశం కంటే కూడా ఒక ప్రజా
సమస్యగానే అన్ని పార్టీలూ ఆలోచించాలి. ఇవ్వాళ వాస్తవంగానే 50 శాతం జనాభా రోడ్లమీదే ఉంది. 90 శాతం ఏటీఎంలు ఇవాళ పనిచేయడం లేదు. నా డబ్బు నేను తీసుకోవడానికి అవకాశం లేకుంటే ఎలా?
నోట్ల రద్దు ప్రభావం ఎవరికి ఉపయోగపడుతుంది? మీకా టీఆర్‌ఎస్‌కా?
టీఆర్‌ఎస్ ఇవ్వాళ బీజేపీలోనే జాయిన్ అయిపోయింది కదా. మొదట్లో నోట్ల రద్దును వ్యతిరేకించినప్పటికీ ఇప్పుడు సాక్షాత్తూ కేసీఆరే స్వైపింగ్ మిషన్ పట్టుకుని తిరుగుతున్నాడు కదా. ఇవన్నీ మాకు భవిష్యత్తులో రాజకీయంగా ఉపయోగపడతాయి.
ఏపీలో జగన్ భవిష్యత్తుపై మీ అభిప్రాయం?
చంద్రబాబు గత ఎన్నికల్లో ఎన్నెన్ని వాగ్దానాలు చేసిండో అవి ఏవీ నెరవేర్చలేదు. వాస్తవంగానే ప్రభుత్వ వ్యతిరేకత అనేది కచ్చితంగా ప్రతిపక్ష పార్టీకి ఉపయోగపడుతుంది. ఏపీలో టీడీపీ, కేంద్రంలో ఎన్డీఏ మిత్రపక్షాలు కాబట్టి వాటిపై ప్రజల వ్యతిరేకత ప్రతిపక్షానికే ఎక్కువగా తోడ్పడుతుంది. నిజంగా కూడా వైఎస్ జగన్ అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. మీడియాలో గమనిస్తున్నదాని ప్రకారం తనది అలుపెరుగని పోరాటమే. ఎన్నికలకు ముందూ, తర్వాత కూడా అధికారంలో నేను లేనన్న భావన ఆయనలో కనిపించడం లేదు. ప్రజాజీవితంలో ఒక బాధ్యత కల పార్టీ నాయకుడిగా ఆయన తన బాధ్యత నిర్వర్తిస్తున్నట్లే కనబడుతోంది.