మంచి చెడుల మేళవింపు.. రేవంత్‌ ఏడాది పాలన! | KSR Comment On CM Revanth Ruling In Telangana | Sakshi
Sakshi News home page

మంచి చెడుల మేళవింపు.. రేవంత్‌ ఏడాది పాలన!

Published Fri, Dec 6 2024 12:59 PM | Last Updated on Fri, Dec 6 2024 1:18 PM

KSR Comment On CM Revanth Ruling In Telangana

తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలనకు ఏడాది. గత ఏడాది అనూహ్యంగా అధికారంలోకి వచ్చింది మొదలు రేవంత్‌ పెద్ద ఒడిదుడుకులు లేకుండానే పాలన సాగించడం ప్రధాన విజయమని చెప్పాలి. ఆంధ్రప్రదేశ్‌లోని చంద్రబాబు నాయుడి పాలనతో పోలిస్తే రేవంత్‌ చాలా మెరుగున్న భావన ఏర్పడుతుంది. అక్కడలా ఇక్కడ మరీ అరాచక పరిస్థితులు లేవు. ప్రత్యర్థులపై ఇష్టారీతి దాడుల్లేవు. అధికారంలో ఉన్న నేతల మాదిరిగా పచ్చి అబద్దాలు చెప్పడం లేదు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఇచ్చిన ఆరు గ్యారంటీలను ఎలాగొలా అమలు చేయాలన్న తాపత్రయం తెలంగాణలో కనిపిస్తోంటే.. ఏపీలో సూపర్‌సిక్స్‌ హామీలను ఎలా ఎగవేయాలా అన్న మోసపూరిత ధోరణి కనిపిస్తోంది. అలాఅని రేవంత్ ప్రభుత్వం అంతా సక్రమంగా చేస్తోందని చెప్పలేము. లోటుపాట్లు ఇక్కడా ఉన్నాయి. ప్రజల్లో కొంత అసంతృప్తి కూడా వాస్తవమే. హైదరాబాద్ వంటి కీలకమైన ప్రాంతంలో రేవంత్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఏర్పడినట్లే కనిపిస్తోంది.

ప్రభుత్వం అన్న తర్వాత కొన్ని పాజిటివ్ పాయింట్లు, కొన్ని నెగిటివ్ పాయింట్లు ఉంటాయి. రేవంత్ ప్రభుత్వం సాధించిన విజయాలు ఎక్కువా? లేక అపజయాలు ఎక్కువా అన్న పోలికకు అప్పుడే వెళ్లజాలం. కానీ ప్రజలు అంచనా కట్టడం సహజం. కేసీఆర్‌ పాలనతో పోల్చి చూసుకోవడం కూడా మామూలే. ముందుగా రేవంత్ కు సానుకూలంగా ఉన్న అంశాల గురించి చూద్దాం...

గ్రూపు కుమ్ములాటలకు పెట్టింది పేరైన కాంగ్రెస్‌ పార్టీలో ఏడాది కాలంలో అలాంటివి జరక్కుండా రేవంత్‌ ప్రభుత్వాన్ని నడిపారు. ముఖ్యమంత్రి పదవిని ఆశించిన సీనియర్‌ నేతలు మల్లు భట్టి విక్రమార్క,  ఉత్తంకుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి వారు కూడా ప్రస్తుతానికి రేవంత్‌తో కలిసి నడుస్తున్నారు. సందర్భానుసారంగా రేవంత్‌ వారి మాటకు విలువిస్తూ కలుపుకుని పోతున్నట్లు కనిపిస్తోంది.  గతంలో రేవంత్ పై విమర్శలు చేసిన కోమటిరెడ్డి సోదరులు ఇప్పుడు ఆయనకు అనుకూలంగా మాట్లాడుతుండడమే ఇందుకు నిదర్శనం. ప్రభుత్వ ప్రచార ప్రకటనలలో ఉప ముఖ్యమంత్రి భట్టి ఫోటోకు కూడా ప్రాధాన్యం ఇస్తున్నారు. అదే ఏపీలో చంద్రబాబు ప్రభుత్వ ప్రకటనలలో ఎక్కువసార్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోటో లేకపోవడాన్ని చాలామంది బహిరంగంగానే చర్చిస్తున్నారు.

కాంగ్రెస్‌ పార్టీలో గతంలో మాదిరి సీఎంలను మార్చడానికి అధిష్టానం సిద్దంగా లేకపోవడం రేవంత్‌కు కలిసి వచ్చే అంశం. రేవంత్‌ ప్రభుత్వం తుమ్మితే ఊడిపోయే ముక్క అని ఒకప్పుడు వ్యాఖ్యానించిన బీఆర్‌ఎస్‌ నేత కేటీఆరే.. ఇప్పుడు ఐదేళ్లు ఉంటే ఉండవచ్చని అంటూండటం గమనార్హం.

ప్రజలలో కూడా ప్రభుత్వానికి అదే రీతిలో సానుకూలత ఉందా? దీనిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. హైదరాబాద్ కు దక్షిణాన ఫ్యూచర్ సిటీ పేరుతో అభివృద్దికి సంకల్పించడం, స్కిల్ యూనివర్శిటీ, చెరువుల సంరక్షణకు చర్యలు, మూసి నదీతీర అభవృద్ది, పారిశ్రామిక అనుకూల వాతావరణాన్ని కొనసాగించడం మొదలైనవి ప్రభుత్వపరంగా చెప్పుకోదగిన అంశాలు. అదే టైమ్‌లో హైడ్రా కూల్చివేతలు, మూసీ వివాదం, లగచర్లలో జిల్లా కలెక్టర్‌పై ప్రజల దాడి, ఫార్మా హబ్ భూ సేకరణ నోటిఫికేషన్ వంటివి ప్రభుత్వానికి చికాకు తెచ్చిపెట్టాయి.

కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీలలో కొన్నిటిని అమలు చేయడానికి ప్రయత్నం చేశారు. పూర్తయ్యాయా? లేదా? అన్నది ఇంకో చర్చ. రైతులకు రూ.రెండు లక్షల వరకూ రుణమాఫీ చాలావరకు చేసినట్లే కనబడుతోంది. ఇంకా కొంతమందికి కాకపోయినా, ప్రభుత్వపరంగా ఈ లక్ష్యాన్ని నెరవేర్చాలన్న సంకల్పం కనబడుతుంది. ప్రభుత్వం వచ్చిన వెంటనే మహిళలకు  ఇచ్చిన ఉచిత బస్ ప్రయాణం హామీని నెరవేర్చారు. వంట గ్యాస్ సిలిండర్లను రూ.500లకే ఇస్తామన్న హామీ అమలుకూ శ్రీకారం చుట్టారు. ఆరోగ్యశ్రీ బీమాను రూ.పది లక్షలకు పెంచారు. విద్యుత్తు వినియోగం నెలకు 200 యూనిట్లు వినియగించే కుటుంబాలకు ఉచిత కరెంట్ హామీని కూడా అమలు చేస్తున్నట్లు  ప్రభుత్వం చెబుతోంది. వీటన్నింటిలో మహిళల ఉచిత బస్ ప్రయాణమినహా మిగిలినవి ప్రజల్లో పెద్దగా ప్రభావం చూపడం లేదని అనిపిస్తోంది.  

ప్రభుత్వం అమలు చేసినట్లు చెబుతున్న హామీలకన్నా, అమలు చేయని హామీలే ఎక్కువగా ఉండడం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇబ్బంది కరమైన అంశం. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్‌ఎస్‌, మరో విపక్షమైన బీజేపీలు పదే,పదే ఆ హామీలను గుర్తు  చేస్తుంటాయి. ముఖ్యంగా మహిళలకు నెలకు రూ.2500 ఇస్తామని చేసిన వాగ్దానం గురించి! రైతుబంధు పథకం కింద గత ప్రభుత్వం రూ.పది వేలు ఇవ్వడానికి సిద్దపడితే ఎన్నికల సంఘం ఆంక్షలు పెట్టింది. ఆ సందర్భంలో తాము అధికారంలోకి రాగానే దానికి మరో ఐదువేలు జత చేసి ఇస్తామని రేవంత్ చెప్పారు. అది ఎంతవరకు అమలు అయింది చెప్పలేని పరిస్థితి. వ్యవసాయ కార్మికులకు రూ.12 వేల చొప్పున ఇస్తామని అన్నారు. వరి ధాన్యానికి బస్తాకు రూ.500ల బోనస్ ఇస్తామని ప్రకటించారు. ఇప్పుడు సన్న రకానికే  ఇస్తామని అంటున్నారన్నది విపక్షాల విమర్శ. పేదలకు ఇళ్ల స్థలాల, రూ.ఐదు లక్షల సాయంపై త్వరలో లబ్దిదారుల ఎంపిక జరుగుతుందని మంత్రులు చెబుతున్నారు.

ఇతర అంశాలను చూస్తే  రేవంత్ కొన్ని కొత్త ఆలోచన లు చేశారు. వాటిలో ఫ్యూచర్  సిటీ ముఖ్యమైనది. హైదరాబాద్ కు దక్షిణాన అంటే శ్రీశైలం రోడ్డులో కొత్త నగరం అభివృద్ది చేస్తామని చెప్పారు. తద్వారా హైదరాబాద్ ను నలువైపులా అభవృద్దికి చర్యలు తీసుకుంటామని ప్రయత్నాలు ఆరంభించారు .అంతవరకు బాగానే ఉంది. అయితే ఇది కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం మాదిరి కాకుండా వాస్తవ అభివృద్ది జరగవలసి ఉంది. స్కిల్ యూనివర్శిటీ ఏర్పాటు మంచిదే. కాకపోతే కొన్ని పారిశ్రామిక సంస్థల నుంచి విరాళాలు తీసుకోవడం వివాదం అవుతోంది. అదానీ గ్రూపుపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో వారిచ్చిన విరాళాన్ని వెనక్కి ఇచ్చేస్తున్నట్లు రేవంత్ ప్రకటించారు.

హైదరాబాద్‌లో వరదలకు కారణం అవుతున్న చెరువుల కబ్జాలను తొలగించాలని ప్రత్యేకంగా హైడ్రా అనే విభాగాన్ని ఏర్పాటు చేశారు. అది మంచి ఉద్దేశం అయినప్పటికీ, అనాలోచితంగా ఎక్కడబడితే అక్కడ కోట్ల రూపాయల విలువైన భవనాలను కూల్చివేయడం పెను వివాదమైంది.  దీనిపై ప్రజలలో మొదట ఆసక్తి కలిగినా, ఆ తర్వాత జరిగిన కూల్చివేతలతో తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. పేదల ఇళ్లు పోవడంతో వారు రోడ్డున  పడవలసి వచ్చింది. ఆ తర్వాత ప్రభుత్వం కూల్చివేతల వేగం తగ్గించినా, జరగవలసిన నష్టం జరిగిపోయిందని చెప్పాలి. దీని ప్రభావం రియల్ ఎస్టేట్ మార్కెట్ పై కూడా పడింది. స్థలం లేదా అపార్ట్‌మెంట్‌ కొనాలంటేనే జనం భయపడుతున్నారని ఈ రంగంలోని వారు చెబుతున్నారు. కేటీఆర్‌ జన్వాడ జన్వాడ్ ఫార్మ్ హౌస కూల్చాలన్న తలంపుతో ఈ పర్వం ప్రారంభం అయిందన్న అభిప్రాయం ఉంది. కాని అది చివరికి ప్రభుత్వానికే ఇబ్బందిగా మారింది.

మూసీ సుందరీకరణ అంశాన్ని రాజకీయ పక్షాలన్నీ సమర్థించినా, తదుపరి ఇళ్ల కూల్చివేతల సర్వే జరిగే సరికి, తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆశయం మంచిదే  అయినా, ప్రస్తుతం ఉన్న  పరిస్థితులను  దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోలేకపోవడం వల్ల ప్రభుత్వంపై ప్రజలలో అనుమానాలు రేకెత్తాయి. తన నియోజకవర్గం కొడంగల్ లోని లగచర్ల వద్ద ఫార్మా కంపెనీలకు స్థలం ఇవ్వాలని తలపెట్టగా, అక్కడ స్థానికంగా వ్యతిరేకత వచ్చింది. ఆ క్రమంలో జిల్లా కలెక్టర్ పై కూడా దాడి చేశారు. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే  నరేంద్ర రెడ్డిని, కొతమంది ఆందోళనకారులను అరెస్టు చేసినా, అంతిమంగా వారి డిమాండ్ ప్రకారం ప్రభుత్వ భూ సేకరణ  నోటిఫికేషన్ ను మార్చేసుకుంది. ఇతర పరిశ్రమల స్థాపనకు ప్రయత్నాలు ఆరంభించింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై రేవంత్ నోటి దురుసుతో మాట్లాడుతూ రెచ్చగొట్టే  యత్నం చేశారు. అయినా కేసీఆర్‌ ఒకటి, రెండుసార్లు మినహా అసలు స్పందించడం లేదు. విపక్షంలో తీవ్రమైన  వ్యాఖ్యలు చేస్తే దూకుడుగా ఉన్నారని అంటారు. అదే  ప్రభుత్వంలోకి వచ్చాక కూడా చేస్తే దుందుడుకు స్వభావం పోలేదని అంటారు. ఈ విషయాన్ని రేవంత్ గుర్తు ఉంచుకుంటే మంచిది.

కేసీఆర్‌ ప్రభుత్వం ఎంతకాదన్నా తెలంగాణపై గట్టి ప్రభావాన్ని  చూపింది. హైదరాబాద్ ను విశేషంగా అభివృద్ది చేయడం కాని, విద్యుత్ సమస్యను  తీర్చడం కాని, కొత్త సచివాలయం, విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం, కాళేశ్వరం వంటి ప్రాజెట్టులు చేపట్టడం కాని నిర్దిష్ట కార్చారణ  చేశారన్నది నిజం. వీటిలో కొన్ని లోటుపాట్లు, ఆరోపణలు ఉండవచ్చు. అయినా తనకంటూ ఒక ముద్ర వేసుకున్నారు.కాళేశ్వరం, విద్యుత్ ప్లాంట్ల విషయంలో న్యాయ విచారణ కమిషన్ లు వేశారు. వాటివల్ల ఎంత పలితం ఉంటుందో చెప్పలేం. రేవంత్ కూడా  ఒక ముద్ర వేసుకోవాలని చూస్తున్నప్పటికీ అది అంత సులువుగా లేదు. అలవికాని హామీలు ఇచ్చిన నేపథ్యంలో వాటిని అమలు చేయలేక, కొత్త స్కీములు తెస్తూ ప్రజలను ఆకట్టుకోవాలని రేవంత్ సర్కార్ యత్నాలు చేస్తోందా అన్న భావన ఉంది.. ఇక్కడ ఒక్కమాట చెప్పాలి.

తెలంగాణ శాసనసభలో  ప్రతిపక్షం బలంగా ఉండడం వల్ల ప్రజాస్వామిక వాతావరణం మరీ ఎక్కువగా దెబ్బతినలేదు. సోషల్ మీడియాపై ఏపీలో మాదిరి తీవ్ర స్థాయిలో  దాడులు జరగడం లేదు. అయినా ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, హరీష్ రావులను అరెస్టు చేసిన తీరు, పిచ్చి కేసులు పెడుతున్న వైనం విమర్శలకు గురి అవుతోంది. అందుకే ఇందిరమ్మ సంక్షేమ రాజ్యమా? ఇందిరమ్మ ఎమర్జన్సీనా అని బీఆర్ఎస్ ధ్వజమెత్తుతోంది. ఇటీవలి కాలంలో మాటలు తూటలు ఎక్కువగా కాంగ్రెస్, బీఆర్ఎస్‌ల మధ్యే పేలుతున్నాయి. తద్వారా బీజేపీకి స్పేస్ దొరకడం కష్టం అవుతోంది. రేవంత్ తన  ప్రభుత్వంపై వ్యతిరేకత ఎందుకు పెరుగుతోందో ప్రజాభిప్రాయం తెలుసుకోవాలి. లేకుంటే అంతా బాగుందని భ్రమ పడితే ఏమవుతుందో చెప్పడానికి పలు ఉదంతాలు ఉన్నాయి. రేవంత్ కు అయినా, మరెవ్వరికైనా ఒక్క సలహా ఇవ్వాలి.

ద్వేషంతో రాజకీయం చేస్తే  వారికే నష్టం వస్తుంది. తమకు ఉపయోగమా? కాదా?అన్నది ఆలోచించాలి తప్ప కక్షతో ఉన్న వ్యవస్థలను చెడగొట్టి, పగ, ప్రతీకారాలతో రాజకీయాలకు పాల్పడితే ప్రజలకు  మేలు జరగదు సరికదా పాలకులు  కూడా అప్రతిష్టపాలవుతారు. ఏపీలో ఇప్పుడు జరుగుతున్నది అదే. ఆ రాష్ట్ర  ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడును రేవంత్ గురువుగా అంతా  చెప్పుకుంటారు. చంద్రబాబు ప్రభుత్వం మాదిరి మరీ చెడ్డపరు తెచ్చుకోకుండా ఉంటే మంచిది.ఇంకా నాలుగేళ్ల సమయం ఉంది కనుక రేవంత్ కు ఆల్ ద బెస్ట్‌ చెబుదాం.

-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement