అది బాబు స్వీయ తప్పిదమే..! | Kommineni Srinivasa Rao Manasulo mata with KV Ramana chary | Sakshi
Sakshi News home page

అది బాబు స్వీయ తప్పిదమే..!

Published Wed, Sep 6 2017 12:54 AM | Last Updated on Sun, Sep 17 2017 6:26 PM

అది బాబు స్వీయ తప్పిదమే..!

అది బాబు స్వీయ తప్పిదమే..!

మనసులో మాట
కొమ్మినేని శ్రీనివాసరావుతో విశ్రాంత ఐఏఎస్‌ అధికారి కె.వి.రమణాచారి
ఓటుకు కోట్లు కేసు చంద్రబాబు స్వయంగా చేసుకున్న ఖర్మపలితమే తప్ప మరెవ్వరూ దానికి బాధ్యులు కారని విశ్రాంత ఐఏఎస్‌ అధికారి, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కె.వి. రమణాచారి పేర్కొన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించడమే తప్పటడుగు అని, ఆ ఆలోచనలోంచే పుట్టిన అపజయాన్ని చంద్రబాబు కేసురూపంలో ఎదుర్కోవలసి వచ్చిందన్నారు. విభజన విషయంలో చంద్రబాబు నేటికీ చేస్తున్న ప్రచారం కేవలం ఏపీ ప్రజల సానుభూతిని పొందడానికి చేస్తున్న ఉక్రోషమేనని, ఒక ముఖ్యమంత్రి స్థాయికి అది తగదని విమర్శించారు. ప్రజల పట్ల, నమ్మినవారి పట్ల ప్రేమ అనేది తెలుగు ముఖ్యమంత్రులలో ఒక్క ఎన్టీఆర్, వైఎస్సార్, కేసీఆర్‌లకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేస్తున్న కె.వి. రమణాచారి అభిప్రాయాలు ఆయన మాటల్లోనే...

మీ సర్వీసులో చాలామంది సీఎంలతో సన్నిహితంగా పనిచేశారు. మీ విజయ రహస్యం?
నా దృష్టికి వచ్చిన నిజాల్ని ప్రభుత్వానికి చెప్పాలన్నదే నా పాలసీ. ప్రభుత్వం ఏదైనా, ఎవరిదైనా వారికి విధేయంగా, వినమ్రంగా ఉండాలని నా భావన. ఐఏఎస్‌ అధికారిగా ఏది మాట్లాడాలో అదే మాట్లాడాలి. అంతకుమించి మాట్లాడకూడదు అని తెలుసుకున్నాను. ఏ విషయంలో ఎక్కడ ఎంతమేరకు సలహా ఇవ్వాలో అంతే ఇవ్వాలి కాని నేను సలహాదారును, ఐఏఎస్‌ అధికారిని కదా అని అతిగా మాట్లాడకూడదు.

ఎన్టీఆర్‌ ఇంటిమీదే చంద్రబాబు నిఘా పెట్టారన్నారు. ఎలా చేశారు?
చంద్రబాబును ఎన్టీఆర్‌ తమ కుమారుడిలాగా చూసుకున్నారు. అన్నిరకాలుగా నాకు అండగా ఉంటాడు అని భావించి బాబును ప్రోత్సహించిన ఎన్టీఆర్‌ తన వెనుక జరుగుతున్న పరిణామాలను నమ్మలేదు, పట్టించుకోలేదు. ఏదో జరుగుతోందని ఆయన దృష్టికి తీసుకెళితే హుంకరించారు. ఇలాంటి విషయాన్ని నా దృష్టికి తీసుకురావటం ఆశ్చర్యకరంగా ఉంది. ‘అదేమిటి కులీకుతుబ్‌ షా’ అని నన్ను ప్రశ్నించారాయన. నన్ను ఆయన కులీకుతుబ్‌షా అని పిలిచేవారు. ‘‘పరి స్థితులు అంత బాగాలేవు. బయట గమ్మత్ము గమ్మత్తుగా మాటలు విని పిస్తున్నాయి. కడప జిల్లాలో పనిచేశాను కాబట్టి కోడూరు ఎమ్మెల్యే నా దృష్టికి తీసుకొచ్చిన విషయాలను మీ దృష్టికి తెస్తున్నాను. అయినా మీకు తెలీకుండా ఉంటుందని నేను భావించలేను’’ అని చెప్పాను. ఇలా జరుగుతుందంటావా అని నన్ను ప్రశ్నించిన ఎన్టీఆరే తర్వాత ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు రమణా అన్నారు.

అల్లుడు తనకు వ్యతిరేకంగా పని చేస్తున్నాడని ఆయన గమనించారా?
మీ వెనుక ఏదో జరుగుతున్నట్లుంది అని నేను సూచన చేసినప్పుడు లక్ష్మీపార్వతి దాని కొనసాగింపుగా తాను విచారించి తన వద్దకు వచ్చిన సమాచారాన్ని కూడా ఎన్టీఆర్‌కి అందించి ఉంటారు. కాని చంద్రబాబు మీద ఆయనకు ఉన్న నమ్మకం చివరివరకు సడలలేదు. 1995 ఆగస్టు చివరలో జరిగిన పరిణామాల్లో పదవీచ్యుతుడు అయిన తర్వాత కూడా ఎన్టీఆర్‌ నన్ను ఇంటికి పిలిపించుకుని ‘ఇలా ఎందుకు జరిగి ఉంటుందంటావు రమణా’ అని అడిగారు. నిజంగా ఆయనది పిల్లవాడి మనస్తత్వం. గొప్ప హీరో, గొప్ప దర్శకుడు. పైగా హృదయం ఉన్న మనిషి. ‘సర్‌ రాజకీయాల్లో ఇవి సాధారణంగా జరిగే ఘటనలే. మీరు అనేక సినిమాలు తీశారు. ఔరంగజేబులను చూసిన చరిత్ర మనది. విజయనగర సామ్రాజ్యాలు, మొగలాయి సామ్రాజ్యాలు పోయాయి. ఆ చరిత్ర మొత్తం మీకు తెలీంది కాదు కదండీ’ అంటూ ఆయనకు తెలిసిన విషయాన్ని ఆయనకే తెలిపే రీతిలో చెప్పాను. అయితే అంత జరిగినప్పటికీ ఆయన ఎవరి గురించి కూడా వ్యక్తిగతంగా మాట్లాడలేదు. కానీ ఆయన బాధలో నేను పాలు పంచుకున్నాను. కానీ సొంత అల్లుడు ఇలా చేస్తాడని ఎన్టీఆర్‌ ఏ కోశానా ఊహించలేదు.  నమ్మలేదు.

ఎన్టీరామారావు దుస్థితికి బాబు కుట్రలా లేక లక్ష్మీపార్వతి తప్పిదాలా.. ఏవి కారణం?
రాజకీయాల్లో ఇది తప్పిదం, ఇది తప్పిదం కాదు అనుకోవడానికి వీల్లేదు. ఎనీ థింగ్‌ ఈజ్‌ ఫేర్‌ ఇన్‌ లవ్‌ అండ్‌ వార్‌. రాజకీయం అంతకంటే మించింది. ఒక్క విషయం మాత్రం నిజం. కుర్చీ మీద కూర్చున్నప్పుడు పరిస్థితి వేరు. కుర్చీ దిగిన తర్వాత పరిస్థితి వేరు. ఎన్టీఆర్‌ శ్రీమతిగా లక్ష్మీపార్వతిని చూసిన కళ్లు నావి. అంతకుముందు ఆమెతో నాకున్న పరిచయం వేరు. కానీ శ్రీమతి ఎన్టీఆర్‌ స్థానంలోకి ఆమె వచ్చిన తర్వాత రాజకీయాల్లో ఉండే వారందరూ ప్రవర్తించిన తీరును చాలా దగ్గరగా చూశాను. ఆ ఇంట్లో పొద్దున నాలుగున్నర నుంచి ఏడింటి వరకు జరిగిన పరిణామాలన్నింటినీ చూశాను.

చంద్రబాబు తెలివిగా తన మనుషులను ఆపరేట్‌ చేసి దెబ్బతీశాడంటారా?
రాజకీయాల్లో ఆపరేట్‌ చేయడం అనేది ఒక్కొక్కరి నైపుణ్యం బట్టి ఉంటుంది. చంద్రబాబు అలాంటి పరిస్థితిని తప్పకుండా వినియోగించుకున్నారనే చెప్పాలి.

బాబుకోసం ఎన్టీఆర్‌ తన కుటుంబాన్నే దూరం చేసుకున్నారు కదా. మరి తప్పు ఎవరిది?
ఎన్టీఆర్‌ ఆత్మాభిమానానికి మారుపేరు. ఒక దశలో తాను ఒంటరిగా ఉన్నాను అనే ఫీలింగుకు వచ్చేశారు. అలాంటి పరిస్థితి వచ్చాక, నదీ ప్రవాహంలో పడి కొట్టుకుపోతున్న వ్యక్తి ఎవరైనా సరే పూచికపుల్ల దొరికినా సరే.. ఇది నాకు ఆసరా అవుతుందేమో అనే అభిప్రాయానికి వచ్చేస్తారు. ఎన్టీఆర్‌ అలాంటి స్థితిలోకి ఒక సమయంలో వచ్చేశారని నా అభిప్రాయం. అప్పుడే లక్ష్మీపార్వతి ఆయన జీవితంలోకి అడుగుపెట్టారు. ఎన్టీఆర్‌ కుటుంబం దానికి వ్యతిరేకత తెలిపింది. ఆ పరిస్థితిని రాజకీయంగా కొద్దిమందిమాత్రమే తమకు అనుకూలంగా మార్చుకోగలుగుతారు. చంద్రబాబు అక్కడే కృతకృత్యులై ఉంటారు. మాలాంటివాళ్లు చూచాయగా చెప్పినా ఎన్టీఆర్‌ గమనించలేదు.

బంగారు తెలంగాణ వస్తున్నట్లు కనబడుతోందా?
ఆశయం చాలా గొప్పది. దాన్ని సాధించడానికి కృషి చేసే దిశలో ముఖ్యమంత్రి, ప్రభుత్వం ప్రయత్నిస్తున్నారు. ఈ మూడేళ్లలోనే జరుగుతున్న ప్రయత్నాలు చూస్తే.. తెలం గాణ ప్రజల్లో గతంలో లేని ఆత్మవిశ్వాసం ఇప్పుడు పెరిగింది. 60 ఏళ్లుగా ఎవరూ పట్టించుకోని తెలంగాణను ఇప్పుడు ఉద్యమనేతే పాలిస్తున్నారు కాబట్టి భవిష్యత్తుపై నమ్మకం ఏర్పడింది.

తెలంగాణలో కుటుంబ పాలన సాగుతోందంటున్నారు... నిజమేనా?
ఉద్యమనేతలు మంత్రులుగా ఉంటున్నప్పుడు ముఖ్యమంత్రి కుమారుడో మరో బంధువో మంత్రిగా పనిచేస్తూ సరిగ్గా వ్యవహరించకపోతే అప్పుడు విమర్శించవచ్చు. కానీ సీఎం కుమారుడే అయినా అందరినీ కలుపుకుపోతూ, చురుకుగా పాల్గొంటూ అందరినీ గౌరవిస్తున్న యువకిశోరం తారకరామారావు. కుమారుడు సమర్ధంగా పనిచేస్తున్నప్పుడు ప్రతిపక్షాలు, రాజకీయ నేతలు అనకపోతే, విమర్శించకపోతే బాగుండదు కదా.

కేసీఆర్, చంద్రబాబు.. ఇద్దరిలో విశ్వసనీయత ఎవరికి ఎక్కువగా ఉంటుంది?
విశ్వసనీయత అంటే కేసీఆరే. చంద్రబాబు విషయానికి వచ్చినప్పుడు తాను పుట్టి పెరిగిన వైనం ఎప్పుడూ ఆయనకు గుర్తుకు వస్తూనే ఉంటుంది కాబట్టి, ఎంతవరకు విశ్వసనీయంగా ఉండాలి, అవిశ్వసనీయంగా ఉండాలి అని బేరీజు వేసుకుంటూ ప్రభుత్వం నడుపుకుంటూ ఉంటారు. ఎవర్ని ఎంతమేరకు నమ్మాలి, నమ్మకూడదు అనే విషయంలో బాబుకు పూర్తి స్పష్టత ఉంది.

రాజశేఖరరెడ్డి, చంద్రబాబు వీరిద్దరినీ ఎలా పోలుస్తారు?
వైఎస్సార్‌ వైఎస్సారే.. దాదాపు 28 ఏళ్లపాటు రాజకీయాల్లో ఉంటూ అన్ని రకాల పరిస్థితులను అధిగమిస్తూ, ఎంతోమంది ఎదుగుదలకు కారణమౌతూ, తాను ముఖ్యమంత్రిగా ఎదిగిన నేపథ్యం రాజశేఖరరెడ్డిది. ఆయన పాలనలో జరిగాయని చెబుతున్న లోపాలు, లోటుపాట్లు ఆయనకు తెలిసి జరిగాయా, తెలీకుండానే జరిగిపోయాయా అనేది నాకు డౌటే. కాని పాలించినతీరు, అందరినీ అభిమానించి, ప్రేమించిన తీరు వైఎస్‌లో తప్ప మరే ముఖ్యమంత్రిలోనూ నేను చూడలేదు. ఇలాంటి ప్రేమ భావం చంద్రబాబు వంటి వారి వద్ద ఉండటం కష్టం.

ఓటుకు కోట్లు కేసు పేరుతో చంద్రబాబును హడలుగొట్టింది కేసీఆరే కదా?
చంద్రబాబు చేసుకున్న ఖర్మకు మరెవరో బాధ్యులు ఎందుకవుతారు? మీడియా వార్తల బట్టి చూసినా ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించారని తేలింది కదా. ఆ విషయంలోకి ఆయన వెళ్లకుండా ఉంటే బాగుండేది. కొన్ని ఆలోచనలు కొన్ని అపజయాలను పట్టుకొస్తాయి. దాన్నే బాబు నేడు ఎదుర్కోవలసి వస్తోంది.

ఏపీ విభజనపై చంద్రబాబు తీరును మీరెలా విశ్లేషిస్తారు?
విభజన విషయంలో చంద్రబాబుది ఎక్కువగా ఆక్రోశం. ఉక్రోషంతో వచ్చే ఆక్రోశం. నిజాన్ని మాత్రం కాదనలేడు. మమ్మల్ని నడిరోడ్డుపై పడేశారు అనే రీతిలో ప్రజల సానుభూతి పొందడానికి ఆయన చేసిన ప్రయత్నం ఒక ముఖ్యమంత్రి స్థాయిలో లేదని నా అభిప్రాయం. విభజన జరిగింది. కేంద్రం ఒప్పుకుంది. ప్రజలు అటూ ఇటూ మాటలు అనుకున్నారు. రాజకీయంగా జరిగిన ఈ పరిణామాలను సామరస్యంగా తీసుకుని ఉంటే అన్నీ సమసిపోయేవి. కాని ఇప్పుడూ కూడా దాన్ని సొమ్ము చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారే తప్ప.. పరవాలేదు. రాజకీయంగా మనం ఉన్నాం. తప్పకుండా ముందుకు పోదాం అనే సానుకూల స్థితిలో చంద్రబాబు మాట్లాడడం లేదు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement