KV ramana chary
-
కొత్త కవిత - అంతర్జాతీయ కవి సమ్మేళనం
వంశీ ఇంటర్నేషనల్, శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్, తెలుగు కళా సమితి ఒమన్, సంతోషం ఫిలిం న్యూస్ వారి ఆధ్వర్యంలో డాక్టర్ ఆళ్ల శ్రీనివాసరెడ్డి అమెరికా సహకారంతో వర్చువల్‌గా అంతర్జాతీయ కవి సమ్మేళనం నిర్వహించారు. 12 గంటలపాటు నిర్విరామంగా నిర్వహించిన ఈ అంతర్జాతీయ కవి సమ్మేళనంలో 20 దేశాల నుంచి సుమారు 190 మంది కవులు పాల్గొని తమ కొత్త కవితలు వినిపించారు. సినారే జయంతి సందర్భంగా డాక్టర్ సీ నారాయణరెడ్డి గారి 90 వ జయంతిని పురస్కరించుకొని ఈ కవి సమ్మెళనం ఏర్పాటు చేశామని ఈ కార్యక్రమ ముఖ్య నిర్వాహకులు వంశీ రామరాజు అన్నారు. వంశీ ప్రచురణలో ప్రతి సంవత్సరం వస్తున్న "కొత్త కథలు" సంకలనం తరహాలో ఇక నుంచి కొత్త కవిత పేరుతో కవితా సంకలనం తీసుకువస్తామన్నారు. ముఖ్య అతిధిగా ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు కేవీ రమణ ముఖ్య అతిథిగా ప్రారంభోపన్యాసం అందించారు. గౌరవ అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పూర్వ ఉపసభాపతి మండలి బుద్ధ ప్రసాద్ , ప్రత్యేక అతిథులుగా తెలంగాణ సారస్వత పరిషత్ కార్యదర్శి జె. చెన్నయ్య, వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా అధ్యక్షులు వంగూరి చిట్టెన్ రాజు, ఒమన్ తెలుగు కళా సమితి కన్వీనర్ అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. న్యూజిలాండ్ నుంచి శ్రీలత మగతల, సౌదీ అరేబియా నుండి రావి దీపిక మరియు వివిధ దేశాల తెలుగు సంఘాల అధ్యక్షులు పాల్గొని కవులకు శుభాభినందనలు తెలియజేశారు. ప్రత్యేక అతిధులు భారతదేశం నుండి ప్రత్యేక ఆహ్వానితులుగా ప్రముఖ సినీ కవులు భువనచంద్ర, సుద్దాల అశోక్ తేజ, రసరాజు, వడ్డేపల్లి కృష్ణ, కాసర్ల శ్యామ్ తదితరులు పాల్గొని నారాయణ రెడ్డి గారికి కవితానివాళులు అర్పించారు. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, సింగపూర్, మలేషియా, హాంకాంగ్, ఇండోనేషియా, ఒమాన్, ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్, బహ్రెయిన్, మారిషస్, దక్షిణాఫ్రికా, యుగాండా, యునైటెడ్ కింగ్డమ్, నార్వే, కెనడా, అమెరికా దేశాలనుండి ఎంతో మంది కవులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆనందంగా ఉంది తొలిసారి నిర్వహించిన అంతర్జాతీయ కవి సమ్మేళనంలో పెద్ద ఎత్తున కవులు, కవయిత్రులు పాల్గొనడం తమ సంస్థకు గర్వకారణంగా ఉందని శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్ అధ్యక్షులు కవుటూరు రత్న కుమార్ ఆనందం వ్యక్తం చేశారు. -
వెండితెరకు కాళోజీ జీవితం
ప్రజాకవి, ప్రముఖ రచయిత, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత స్వర్గీయ కాళోజీ నారాయణరావు జీవితం వెండితెరపై ఆవిష్కృతం కానుంది. ప్రభాకర్ జైనీ దర్శకత్వంలో జైనీ క్రియేషన్స్ పతాకంపై శ్రీమతి విజయలక్ష్మీ జైనీ ‘ప్రజాకవి–కాళోజీ’ పేరుతో ఈ బయోపిక్‌ను నిర్మిస్తున్నారు. తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి చేతుల మీదుగా ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది. ‘‘కాళోజీగారి జీవితమంతా పోరాటమే. ఆ పోరాటాన్ని ‘ప్రజాకవి– కాళోజీ’గా తెరకెక్కిస్తున్నాం. కాళోజీ పాత్రలో శ్రీ మూలవిరాట్, మాజీ ప్రధాని పీవీ నరసింహారావుగారి పాత్రను వారి తమ్ముడు మనోహర రావుగారు పోషిస్తున్నారు. కాళోజీ భార్యగా విజయలక్ష్మీ జైనీ కనిపిస్తారు. ఈ సినిమాకు ఎస్ఎస్. ఆత్రేయ సంగీతదర్శకుడు’’ అని చిత్రబృందం తెలిపింది. కాళోజీ ఫౌండేషన్ సభ్యులు అంపశయ్య నవీన్, నాగిళ్ళ రామశాస్త్రి, వీఆర్ విద్యార్థి, పొట్టపల్లి శ్రీనివాసరావు, కవి అన్వర్ పాల్గొన్నారు. -
3న ఎస్వీఆర్ శత జయంతి ఉత్సవాలు
ఎంతమంది నటీనటులు ఉన్నా ‘విశ్వ నట చక్రవర్తి’ ఒక్కరే. వెండితెర విలక్షణ నటునిగా సినీ పరిశ్రమతో పాటు తెలుగు, తమిళ ప్రేక్షకులందరూ బ్రహ్మరథం పట్టిన ఆ మహానటుడు యస్వీ రంగారావు. 1918 జూలై 3న ఆయన జన్మించారు. జూలై 3వ తేదీకి 100 సంవత్సరాలు పూర్తవుతాయి. ఈ సందర్భంగా ‘సంగమం’ సంస్థ ఆధ్వర్యంలో యస్వీఆర్ శత జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ‘సంగమం’ ఫౌండేషన్ సంస్థ అధ్యక్షులు, సినీ పరిశోధకులు సంజయ్ కిశోర్ ఓ ప్రకటన రిలీజ్ చేశారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో జూలై 3న సాయంత్రం 5 గంటలకు ఎస్వీఆర్ శతజయంతి వేడుకలు నిర్వహిస్తున్నాం. మండలి బుద్ధప్రసాద్‌గారు, కె.వి.రమణాచారిగార్ల నేతృత్వంలో ఏర్పాటైన ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వేడుకలకు భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుగారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. యస్వీఆర్తో కలిసి నటించిన వారితో పాటు తర్వాత కాలంలో పేరు తెచ్చుకున్న క్యారెక్టర్ ఆర్టిస్టులను సత్కరిస్తున్నాం’’ అన్నారు. -
ఆర్.నారాయణమూర్తికి కొమరం భీమ్ పురస్కారం
సాక్షి, హైదరాబాద్ : సినీ దర్శకుడు, నిర్మాత, నటుడు ఆర్.నారాయణ మూర్తికి ప్రతిష్టాత్మక ‘కొమరం భీమ్ జాతీయ పురస్కారం’ లభించింది. తెలంగాణ టెలివిజన్ డెవలప్మెంట్ ఫోరమ్, ఆదివాసి సాంస్కృతిక పరిషత్, గోండ్వానా సాంస్కృతిక పరిరక్షణ దళం, భారత్ కల్చరల్ అకాడమీ సంయుక్తంగా ప్రతి ఏడాది అందించే ఈ అవార్డుకు... ఈ ఏడాది ఆర్.నారాయణమూర్తిని ఎంపికి చేసినట్లు అవార్డు కమిటీ చైర్మన్, తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు కేవీ రమణాచారీ తెలిపారు. ఈ నెల 3వ వారం జరిగే అవార్డు ప్రదానోత్సవంలో 51 వేల రూపాయల నగదుతో పాటు, జ్ఞాపిక, ప్రశంస పత్రం, శాలువాతో సత్కరిసున్నట్టు కన్వీనర్ నాగబాల సురేష్ కుమార్ పేర్కొన్నారు. గతంలో ఈ అవార్డును కొమరం భీమ్ చిత్ర నిర్మాత, దర్శకుడు అల్లాణి శ్రీధర్, గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ అందుకున్నారు. కాగా ప్రజలను చైతన్యపరిచేలా ఆర్. నారాయణమూర్తి పలు చిత్రాలను నిర్మించారు. అర్థరాత్రి స్వతంత్రం, అడివి దివిటీలు, లాల్ సలాం, దండోరా, ఎర్ర సైన్యం, చీమల దండు, దళం, చీకటి సూర్యులు, ఊరు మనదిరా, వేగు చుక్కలు, అరణ్యం, ఎర్రోడు, సింగన్న లాంటి పలు చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. -
అది బాబు స్వీయ తప్పిదమే..!
మనసులో మాట కొమ్మినేని శ్రీనివాసరావుతో విశ్రాంత ఐఏఎస్ అధికారి కె.వి.రమణాచారి ఓటుకు కోట్లు కేసు చంద్రబాబు స్వయంగా చేసుకున్న ఖర్మపలితమే తప్ప మరెవ్వరూ దానికి బాధ్యులు కారని విశ్రాంత ఐఏఎస్ అధికారి, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కె.వి. రమణాచారి పేర్కొన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించడమే తప్పటడుగు అని, ఆ ఆలోచనలోంచే పుట్టిన అపజయాన్ని చంద్రబాబు కేసురూపంలో ఎదుర్కోవలసి వచ్చిందన్నారు. విభజన విషయంలో చంద్రబాబు నేటికీ చేస్తున్న ప్రచారం కేవలం ఏపీ ప్రజల సానుభూతిని పొందడానికి చేస్తున్న ఉక్రోషమేనని, ఒక ముఖ్యమంత్రి స్థాయికి అది తగదని విమర్శించారు. ప్రజల పట్ల, నమ్మినవారి పట్ల ప్రేమ అనేది తెలుగు ముఖ్యమంత్రులలో ఒక్క ఎన్టీఆర్, వైఎస్సార్, కేసీఆర్‌లకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేస్తున్న కె.వి. రమణాచారి అభిప్రాయాలు ఆయన మాటల్లోనే... మీ సర్వీసులో చాలామంది సీఎంలతో సన్నిహితంగా పనిచేశారు. మీ విజయ రహస్యం? నా దృష్టికి వచ్చిన నిజాల్ని ప్రభుత్వానికి చెప్పాలన్నదే నా పాలసీ. ప్రభుత్వం ఏదైనా, ఎవరిదైనా వారికి విధేయంగా, వినమ్రంగా ఉండాలని నా భావన. ఐఏఎస్ అధికారిగా ఏది మాట్లాడాలో అదే మాట్లాడాలి. అంతకుమించి మాట్లాడకూడదు అని తెలుసుకున్నాను. ఏ విషయంలో ఎక్కడ ఎంతమేరకు సలహా ఇవ్వాలో అంతే ఇవ్వాలి కాని నేను సలహాదారును, ఐఏఎస్ అధికారిని కదా అని అతిగా మాట్లాడకూడదు. ఎన్టీఆర్ ఇంటిమీదే చంద్రబాబు నిఘా పెట్టారన్నారు. ఎలా చేశారు? చంద్రబాబును ఎన్టీఆర్ తమ కుమారుడిలాగా చూసుకున్నారు. అన్నిరకాలుగా నాకు అండగా ఉంటాడు అని భావించి బాబును ప్రోత్సహించిన ఎన్టీఆర్ తన వెనుక జరుగుతున్న పరిణామాలను నమ్మలేదు, పట్టించుకోలేదు. ఏదో జరుగుతోందని ఆయన దృష్టికి తీసుకెళితే హుంకరించారు. ఇలాంటి విషయాన్ని నా దృష్టికి తీసుకురావటం ఆశ్చర్యకరంగా ఉంది. ‘అదేమిటి కులీకుతుబ్ షా’ అని నన్ను ప్రశ్నించారాయన. నన్ను ఆయన కులీకుతుబ్‌షా అని పిలిచేవారు. ‘‘పరి స్థితులు అంత బాగాలేవు. బయట గమ్మత్ము గమ్మత్తుగా మాటలు విని పిస్తున్నాయి. కడప జిల్లాలో పనిచేశాను కాబట్టి కోడూరు ఎమ్మెల్యే నా దృష్టికి తీసుకొచ్చిన విషయాలను మీ దృష్టికి తెస్తున్నాను. అయినా మీకు తెలీకుండా ఉంటుందని నేను భావించలేను’’ అని చెప్పాను. ఇలా జరుగుతుందంటావా అని నన్ను ప్రశ్నించిన ఎన్టీఆరే తర్వాత ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు రమణా అన్నారు. అల్లుడు తనకు వ్యతిరేకంగా పని చేస్తున్నాడని ఆయన గమనించారా? మీ వెనుక ఏదో జరుగుతున్నట్లుంది అని నేను సూచన చేసినప్పుడు లక్ష్మీపార్వతి దాని కొనసాగింపుగా తాను విచారించి తన వద్దకు వచ్చిన సమాచారాన్ని కూడా ఎన్టీఆర్‌కి అందించి ఉంటారు. కాని చంద్రబాబు మీద ఆయనకు ఉన్న నమ్మకం చివరివరకు సడలలేదు. 1995 ఆగస్టు చివరలో జరిగిన పరిణామాల్లో పదవీచ్యుతుడు అయిన తర్వాత కూడా ఎన్టీఆర్ నన్ను ఇంటికి పిలిపించుకుని ‘ఇలా ఎందుకు జరిగి ఉంటుందంటావు రమణా’ అని అడిగారు. నిజంగా ఆయనది పిల్లవాడి మనస్తత్వం. గొప్ప హీరో, గొప్ప దర్శకుడు. పైగా హృదయం ఉన్న మనిషి. ‘సర్ రాజకీయాల్లో ఇవి సాధారణంగా జరిగే ఘటనలే. మీరు అనేక సినిమాలు తీశారు. ఔరంగజేబులను చూసిన చరిత్ర మనది. విజయనగర సామ్రాజ్యాలు, మొగలాయి సామ్రాజ్యాలు పోయాయి. ఆ చరిత్ర మొత్తం మీకు తెలీంది కాదు కదండీ’ అంటూ ఆయనకు తెలిసిన విషయాన్ని ఆయనకే తెలిపే రీతిలో చెప్పాను. అయితే అంత జరిగినప్పటికీ ఆయన ఎవరి గురించి కూడా వ్యక్తిగతంగా మాట్లాడలేదు. కానీ ఆయన బాధలో నేను పాలు పంచుకున్నాను. కానీ సొంత అల్లుడు ఇలా చేస్తాడని ఎన్టీఆర్ ఏ కోశానా ఊహించలేదు. నమ్మలేదు. ఎన్టీరామారావు దుస్థితికి బాబు కుట్రలా లేక లక్ష్మీపార్వతి తప్పిదాలా.. ఏవి కారణం? రాజకీయాల్లో ఇది తప్పిదం, ఇది తప్పిదం కాదు అనుకోవడానికి వీల్లేదు. ఎనీ థింగ్ ఈజ్ ఫేర్ ఇన్ లవ్ అండ్ వార్. రాజకీయం అంతకంటే మించింది. ఒక్క విషయం మాత్రం నిజం. కుర్చీ మీద కూర్చున్నప్పుడు పరిస్థితి వేరు. కుర్చీ దిగిన తర్వాత పరిస్థితి వేరు. ఎన్టీఆర్ శ్రీమతిగా లక్ష్మీపార్వతిని చూసిన కళ్లు నావి. అంతకుముందు ఆమెతో నాకున్న పరిచయం వేరు. కానీ శ్రీమతి ఎన్టీఆర్ స్థానంలోకి ఆమె వచ్చిన తర్వాత రాజకీయాల్లో ఉండే వారందరూ ప్రవర్తించిన తీరును చాలా దగ్గరగా చూశాను. ఆ ఇంట్లో పొద్దున నాలుగున్నర నుంచి ఏడింటి వరకు జరిగిన పరిణామాలన్నింటినీ చూశాను. చంద్రబాబు తెలివిగా తన మనుషులను ఆపరేట్ చేసి దెబ్బతీశాడంటారా? రాజకీయాల్లో ఆపరేట్ చేయడం అనేది ఒక్కొక్కరి నైపుణ్యం బట్టి ఉంటుంది. చంద్రబాబు అలాంటి పరిస్థితిని తప్పకుండా వినియోగించుకున్నారనే చెప్పాలి. బాబుకోసం ఎన్టీఆర్ తన కుటుంబాన్నే దూరం చేసుకున్నారు కదా. మరి తప్పు ఎవరిది? ఎన్టీఆర్ ఆత్మాభిమానానికి మారుపేరు. ఒక దశలో తాను ఒంటరిగా ఉన్నాను అనే ఫీలింగుకు వచ్చేశారు. అలాంటి పరిస్థితి వచ్చాక, నదీ ప్రవాహంలో పడి కొట్టుకుపోతున్న వ్యక్తి ఎవరైనా సరే పూచికపుల్ల దొరికినా సరే.. ఇది నాకు ఆసరా అవుతుందేమో అనే అభిప్రాయానికి వచ్చేస్తారు. ఎన్టీఆర్ అలాంటి స్థితిలోకి ఒక సమయంలో వచ్చేశారని నా అభిప్రాయం. అప్పుడే లక్ష్మీపార్వతి ఆయన జీవితంలోకి అడుగుపెట్టారు. ఎన్టీఆర్ కుటుంబం దానికి వ్యతిరేకత తెలిపింది. ఆ పరిస్థితిని రాజకీయంగా కొద్దిమందిమాత్రమే తమకు అనుకూలంగా మార్చుకోగలుగుతారు. చంద్రబాబు అక్కడే కృతకృత్యులై ఉంటారు. మాలాంటివాళ్లు చూచాయగా చెప్పినా ఎన్టీఆర్ గమనించలేదు. బంగారు తెలంగాణ వస్తున్నట్లు కనబడుతోందా? ఆశయం చాలా గొప్పది. దాన్ని సాధించడానికి కృషి చేసే దిశలో ముఖ్యమంత్రి, ప్రభుత్వం ప్రయత్నిస్తున్నారు. ఈ మూడేళ్లలోనే జరుగుతున్న ప్రయత్నాలు చూస్తే.. తెలం గాణ ప్రజల్లో గతంలో లేని ఆత్మవిశ్వాసం ఇప్పుడు పెరిగింది. 60 ఏళ్లుగా ఎవరూ పట్టించుకోని తెలంగాణను ఇప్పుడు ఉద్యమనేతే పాలిస్తున్నారు కాబట్టి భవిష్యత్తుపై నమ్మకం ఏర్పడింది. తెలంగాణలో కుటుంబ పాలన సాగుతోందంటున్నారు... నిజమేనా? ఉద్యమనేతలు మంత్రులుగా ఉంటున్నప్పుడు ముఖ్యమంత్రి కుమారుడో మరో బంధువో మంత్రిగా పనిచేస్తూ సరిగ్గా వ్యవహరించకపోతే అప్పుడు విమర్శించవచ్చు. కానీ సీఎం కుమారుడే అయినా అందరినీ కలుపుకుపోతూ, చురుకుగా పాల్గొంటూ అందరినీ గౌరవిస్తున్న యువకిశోరం తారకరామారావు. కుమారుడు సమర్ధంగా పనిచేస్తున్నప్పుడు ప్రతిపక్షాలు, రాజకీయ నేతలు అనకపోతే, విమర్శించకపోతే బాగుండదు కదా. కేసీఆర్, చంద్రబాబు.. ఇద్దరిలో విశ్వసనీయత ఎవరికి ఎక్కువగా ఉంటుంది? విశ్వసనీయత అంటే కేసీఆరే. చంద్రబాబు విషయానికి వచ్చినప్పుడు తాను పుట్టి పెరిగిన వైనం ఎప్పుడూ ఆయనకు గుర్తుకు వస్తూనే ఉంటుంది కాబట్టి, ఎంతవరకు విశ్వసనీయంగా ఉండాలి, అవిశ్వసనీయంగా ఉండాలి అని బేరీజు వేసుకుంటూ ప్రభుత్వం నడుపుకుంటూ ఉంటారు. ఎవర్ని ఎంతమేరకు నమ్మాలి, నమ్మకూడదు అనే విషయంలో బాబుకు పూర్తి స్పష్టత ఉంది. రాజశేఖరరెడ్డి, చంద్రబాబు వీరిద్దరినీ ఎలా పోలుస్తారు? వైఎస్సార్ వైఎస్సారే.. దాదాపు 28 ఏళ్లపాటు రాజకీయాల్లో ఉంటూ అన్ని రకాల పరిస్థితులను అధిగమిస్తూ, ఎంతోమంది ఎదుగుదలకు కారణమౌతూ, తాను ముఖ్యమంత్రిగా ఎదిగిన నేపథ్యం రాజశేఖరరెడ్డిది. ఆయన పాలనలో జరిగాయని చెబుతున్న లోపాలు, లోటుపాట్లు ఆయనకు తెలిసి జరిగాయా, తెలీకుండానే జరిగిపోయాయా అనేది నాకు డౌటే. కాని పాలించినతీరు, అందరినీ అభిమానించి, ప్రేమించిన తీరు వైఎస్‌లో తప్ప మరే ముఖ్యమంత్రిలోనూ నేను చూడలేదు. ఇలాంటి ప్రేమ భావం చంద్రబాబు వంటి వారి వద్ద ఉండటం కష్టం. ఓటుకు కోట్లు కేసు పేరుతో చంద్రబాబును హడలుగొట్టింది కేసీఆరే కదా? చంద్రబాబు చేసుకున్న ఖర్మకు మరెవరో బాధ్యులు ఎందుకవుతారు? మీడియా వార్తల బట్టి చూసినా ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించారని తేలింది కదా. ఆ విషయంలోకి ఆయన వెళ్లకుండా ఉంటే బాగుండేది. కొన్ని ఆలోచనలు కొన్ని అపజయాలను పట్టుకొస్తాయి. దాన్నే బాబు నేడు ఎదుర్కోవలసి వస్తోంది. ఏపీ విభజనపై చంద్రబాబు తీరును మీరెలా విశ్లేషిస్తారు? విభజన విషయంలో చంద్రబాబుది ఎక్కువగా ఆక్రోశం. ఉక్రోషంతో వచ్చే ఆక్రోశం. నిజాన్ని మాత్రం కాదనలేడు. మమ్మల్ని నడిరోడ్డుపై పడేశారు అనే రీతిలో ప్రజల సానుభూతి పొందడానికి ఆయన చేసిన ప్రయత్నం ఒక ముఖ్యమంత్రి స్థాయిలో లేదని నా అభిప్రాయం. విభజన జరిగింది. కేంద్రం ఒప్పుకుంది. ప్రజలు అటూ ఇటూ మాటలు అనుకున్నారు. రాజకీయంగా జరిగిన ఈ పరిణామాలను సామరస్యంగా తీసుకుని ఉంటే అన్నీ సమసిపోయేవి. కాని ఇప్పుడూ కూడా దాన్ని సొమ్ము చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారే తప్ప.. పరవాలేదు. రాజకీయంగా మనం ఉన్నాం. తప్పకుండా ముందుకు పోదాం అనే సానుకూల స్థితిలో చంద్రబాబు మాట్లాడడం లేదు. -
హరి లీలామృతం
చేతిలో చిడతలు, పట్టు ధోవతి, మెడలో హారం, కాలికి గజ్జెలవంటి వేషధారణతోసాగే సంగీతం, నృత్యం, నట కళారూపాల మేలు కలయిక హరికథాగానం. ఆధ్యాత్మిక కోణంలో సమాజంలోని కుళ్లు ఎత్తి చూపిస్తూ జనరంజకంగా కొనసాగే ప్రవాహం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె.వి. రమణాచారి 63వ జన్మదినం సందర్భంగా రవీంద్రభారతిలో పది రోజులుగా జరుగుతున్న హరికథా మహోత్సవాలు ఆహూతులను అలరిస్తున్నాయి. హరిలీలలు చెప్పే విధానమే హరికథ. దీన్ని చెప్పేవారు భాగవతారిణి, భాగవతార్ లేదా హరిదాసు. ఒకరే మూడు గంటలపాటు అన్ని పాత్రల్లోనూ జీవించి, రసవత్తరంగా నటిస్తారు. నోటితో వాచకం, పాటలు పాడుతూ, ముఖంలో సాత్వికం ఒలికిస్తూనే, క ళ్లతో నృత్యం, చేతులతో ఆంగికం ప్రదర్శిస్తారు. ఆకర్షణీయమైన ఆహార్యంతో ఏకకాలంలో ఇలా అభినయించటం ఒక్క హరికథకే చెల్లు. అంతసేపు కూర్చొని వినే ప్రేక్షకులకు విసుగు పుట్టకుండా మధ్యమధ్య హాస్యరసాన్ని పోషిస్తూ లాలింపుతోపాటు శక్తిని అందజేసేది హరికథ. విశేష ఆకర్షణ... సుగ్రీవ విజయం, గజేంద్రమోక్షం, పద్మవ్యూహం, అన్నమయ్య, పార్వతీ కల్యాణం, బాసర సరస్వతీ క్షేత్ర మహిమ, శ్రీకృష్ణ రాయబారం, శ్రీత్యాగయ్య, నర్తనశాల, దక్ష యజ్ఞం, ఉత్తర గోగ్రహణం, శ్రీకృష్ణ మహిమ, శ్రీ తులసి జలంధర హరికథా గానాలు... రవీంద్రభారతి ప్రాంగణంలోని ఘంటసాల వేదికపై మహాద్భుతంగా సాగాయి. హరికథ విని పరవశించిన ప్రేక్షకులు... అక్కడికక్కడే కళాకారులకు తమకు తోచిన సాయమందించారు. కపిలేశ్వరపురంలో... సంప్రదాయం జమీందారు, మాజీ కేంద్రమంత్రి సత్యనారాయణ తూర్పుగోదావరి జిల్లాలో హరికథ పాఠశాల ఏర్పాటు చేశారు. దీంతో ఎంతోమంది హరికథ కళాకారులకు ఉపాధి లభించింది. మన సంప్రదాయంలో భాగంగా భాసిల్లుతున్న హరికథలు మరింత విస్తృతం అవ్వాలి. ప్రభుత్వం ఆ దిశగా మరింత దృష్టి సారించాల్సి ఉంది. అయితే... ‘రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో డాక్టర్ కేవీ రమణాచారి పుట్టినరోజు ఫిబ్రవరి 8వ తేదీన హరికథాగానం జరిగేలా చూస్తాం. హరిదాసుల కష్టాలను మా కష్టాలుగా భావించి పరిష్కరిస్తాం’ అని శాసనమండలి చైర్మన్ కె.స్వామిగౌడ్ చెప్పారు. ఈ తరానికి అందాలి... దేశం సుభిక్షంగా ఉండాలని కాంక్షిస్తూ ఆనాడు ఊరూర హరికథలు చెప్పించేవారు. కానీ నేటి తరానికి ఇవి అందడం లేదు. వారికి దీని విశిష్టత తెలియజెప్పాలని ఎవరూ భావించడం లేదు. రెండు తెలుగు ప్రభుత్వాలు దీని గురించి ఆలోచించాలి. అన్నమయ్య ప్రాజెక్ట్ లాంటి ప్రాజెక్ట్‌లు తీసుకురావాలి. అప్పుడే హరికథ నిలబడుతుంది. విదేశాల్లో సైతం హరికథను ఆదరిస్తున్నారు. నేను అమెరికాలో కూడా హరికథాగానం చేశాను. - వేదవ్యాస శ్రీరామభట్టార్, భాగవతార్, వరంగల్ స్కూల్స్ ఏర్పాటు చేయాలి... ఇంటిల్లిపాది కూర్చొని విని ఆనందించే కళ హరికథ. కపిలేశ్వరపురంలోలాగా హరికథల కోసం స్కూల్స్ ఏర్పాటు చేయాలి. ప్రభుత్వం చొరవ తీసుకొని హైదరాబాద్ తెలుగు వర్సిటీలో ఉన్న హరికథ కోర్సును పరిపుష్ఠం చేయాలి. అప్పుడే ఈ కథ బతుకుతుంది. మహిళలు ఇటువైపు వచ్చేందుకు ఆసక్తి చూపుతారు. - మొగిలిచర్ల నాగమణి, భాగవతారిణి, తెనాలి అవే దిక్కయ్యాయి... మా పెద్దలు హరికథలు చెబుతూనే బతికారు. పిల్లల చిన్న వయస్సులోనే నా భర్త చనిపోయారు. భుక్తి కోసం హరికథలు చెప్పటం ప్రారంభించాను. పిల్లలందరిని చదివించాను. అన్నమాచార్య ప్రాజెక్ట్ ద్వారా నెలకు ఐదారు ప్రోగ్రామ్స్ నిర్వహిస్తా. ఏ దిక్కులేని మాకు హరికథలే దిక్కయ్యాయి. - టి.లక్ష్మీమహేష్, భాగవతారిణి, కర్నూల్ ఆదరణ ఉంది... ఉపాధే కష్టం నిరంతరం హరినామస్మరణ ఉండే ఊరు, ఇళ్లు అష్టైశ్వర్యాలతో పరిఢవిల్లుతాయి. అలాంటి హరికథలకు ఆదరణ ఉన్నా ఉపాధి కష్టం అయింది. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత అన్నమాచార్య ప్రాజెక్ట్ నుంచి తెలంగాణ హరిదాసులను తొలగించారు. దీనివల్ల మాకు ఇల్లు గడవడం కష్టమవుతోంది. తిరుపతి అన్నమయ్య ప్రాజెక్ట్ లాగా తెలంగాణ ప్రభుత్వం కూడా హరిదాసుల కోసం ఓ ప్రాజెక్ట్ ప్రారంభించాలి. - హెచ్ఎం సుధాకర్, భాగవతార్, మహబూబ్‌నగర్ చేసింది తక్కువ... సాత్విక, వాచిక, అంగీకాభినయాలకు ఆలవాలం హరికథలు. టీటీడీలో పనిచేసేటప్పుడు తెలుగునాట హరికథలు కొనసాగించటానికి మమ్మురంగా ప్రయత్నించా. ఎండోమెంట్స్ కమిషనర్‌గా ఉన్నప్పుడు శనివారాలు వైష్ణవ, సోమవారాలు శైవ ఆలయాల్లో హరికథల ఏర్పాటుకు కృషి చేశా. దీనికి పూర్వ వైభవం తెచ్చేందుకు చేయాల్సిందింకా ఉంది. కళాకారులకు ఉపాధి, కళ విశ్వవ్యాప్తం చేయాలనే సంకల్పంతో ఈ నెల 9 నుంచి ఈ మహోత్సవాలకు శ్రీకారం చుట్టాం. దీంతో చాలా మందికి ఉపాధి లభిస్తుంది. హైస్కూల్ స్థాయిలోనే హరికథలు నిర్వహిస్తే పిల్లలకు మన సంస్కృతిని అలవాటు చేసినవారమవుతాం. - డాక్టర్ కేవీ రమణాచారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు - కోన సుధాకర్‌రెడ్డి -
లిటిల్ కలర్స్
ఇవేవో పేరుమోసిన కుంచెల్లో నుంచి జాలువారిన చిత్రరాజాలు కావు.. ఐదేళ్ల చిన్నారి చిట్టి చేతులు రంగరించిన కమనీయ దృశ్యాలు. గర్జించే మేఘం.. వర్షించే చినుకు.. హిమవన్నగం ఇలా ప్రకృతి ఏదైనా.. అదితి అపురూప చిత్రంగా మార్చేస్తుంది. కంటికి ఇంపుగా కనిపించిన ప్రతీదీ క్షణాల్లో ఈ చిన్నారి కాన్వాస్‌పై ఒదిగిపోతుంది. యూకేజీ చదువుతున్న అదితి అమరవాది ప్రవాస భారతీయులు డాక్టర్ కమలాకర్, కవితల గారాల పట్టి. మూడేళ్లకే మునివేళ్లతో బొమ్మలు గీయడం ఆరంభించింది. ఇటీవల తల్లిదండ్రులతో కలసి అదితి హైదరాబాద్ వచ్చింది. ఆ చిన్నారి గీసిన చిత్రాలను చూసిన వారంతా మురిసిపోయారు. నాంపల్లిలోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆర్ట్ గ్యాలరీలో అవే చిత్రాలతో ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి ప్రారంభించారు. గ్యాలరీలో కొలువుదీరిన అదితి గీసిన అందాలు అందర్నీ ఆకర్షిస్తున్నాయి. - నాంపల్లి -
తెలంగాణ ఉత్సవంగా పీవీ జయంతి
హైదరాబాద్: భారత మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ పీవీ నరసింహారావు జయంతిని రాష్ట్ర ఉత్సవంగా గుర్తిస్తూ తెలంగాణ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 28న తెలంగాణ వ్యాప్తంగా పీవీ జయంతిని అధికారికంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. అదే రోజు హన్మకొండలో పీవీ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్టు టీఆర్ఎస్ నాయకుడు కెప్టన్ లక్ష్మీకాంతరావు తెలిపారు. ఏకశిల విద్యాసంస్థ ఆధ్వర్యంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. కాగా, పీవీ నరసింహారావు జయంతి ఏర్పాట్లపై ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి ఈ రోజు సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. -
భవిష్యత్తులో ‘బంగారు తెలంగాణ ’: కేవీ రమణాచారి
భీమ్‌గల్, న్యూస్‌లైన్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియతోనే సరిపెట్టుకోకుండా తెలంగాణలోని వనరులను సద్వినియోగం చేసుకుంటూ అన్ని వర్గాలకు న్యాయం జరిగే లా భవిష్యత్తులో బంగారు తెలంగాణను సాధించుకుందామని టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ ఐఏఎస్ కేవీ రమణాచారి పిలుపునిచ్చారు. సోమవారం మండల కేంద్రంలోని రాయల్ ఫంక్షన్ హాల్లో నిర్వహిచిన టీఆర్ఎస్ మండల స్థాయి రాజకీయ శిక్షణ తరగతులకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. తాను చెన్నారెడ్డి నుంచి మొదలుకుని వైఎస్ రాజశేఖరరెడ్డి వరకు అందరు ముఖ్యమంత్రుల వద్ద పని చేశానన్నారు. కానీ తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని తట్టుకోలేక ఉద్యోగాన్ని వదులుకుని తెలంగాణ కోసం పోరాడుతున్నానన్నారు. 13 ఏళ్ల పో రాటాల ఫలితం చివరి దశకు చేరుకుందన్నారు. ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్రం రాలేదని, కేవలం ప్రకటన మాత్రమే వచ్చిందన్నారు. ఇలాంటి ప్రకటనలు చేయడంలో కాంగ్రెస్ మోసగాళ్లు ఆరి తేరారన్నారు. తెలంగాణ ప్రజలు ఈ ప్రకటనలకు మోసపోవద్దని, భవిష్య త్తు దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలన్నారు. కాంగ్రెస్ నాయకులు ఏం ముఖం పెట్టుకుని విజయోత్సవ సభ లు జరుపుకుంటున్నారని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నపుడు ప్రజలకు ముఖం చాటేసిన నాయకులు ఇప్పుడు తాను ముఖ్యమంత్రినంటే తానని తగువులాడుకుంటున్నారన్నారు. కాంగ్రెస్ తో పొత్తు కల అని, వారి మాటల్ని నమ్మవద్దన్నారు. తెలంగాణకు ముమ్మాటికీ సృష్టకర్తలం మనమేనన్నారు. ఓయూలో అనిల్‌ను పరిగెత్తించినం: గాజరి కిశోర్‌కుమార్ బాల్కొండ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్‌కుమార్ పదవుల కోసం పాకులాడే వ్యక్తి అని టీఆర్ఎస్వీ సెక్రటరీ జనరల్ గాజరి కిషోర్‌కుమార్ విమర్శించారు. పదవికి రాజీనామా చేయకుండా వచ్చిన అనిల్‌ను ఉస్మానియా యూనివర్సిటీలో పరిగెత్తించినట్లు చెప్పారు. దీనికి సంబంధించిన ఇప్పటికీ తమపై కేసులు ఉన్నాయన్నా రు. పదవుల కోసం కిరణ్‌కుమార్‌రెడ్డి, చిరంజీవి వద్ద మొకరిల్లే అనిల్, పచ్చి సమైక్యవాది అన్నారు. రాజీనామాల సమయంలో అమెరికాకు పారిపోయాడని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో బాల్కొండ ప్రజలు అనిల్‌ను చిత్తగా ఓడించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు బానాల లకా్ష్మరెడ్డి, విఠల్‌రావ్, వేముల ప్రశాంత్‌రెడ్డి, సురేందర్ రెడ్డి, కొండ ప్రకాష్‌గౌడ్, మండల కన్వీనర్ దొన్కంటి నర్సయ్య, సొసైటీ చెర్మైన్, వైస్ చెర్మైన్లు కోనేరు బాల గంగాధర్, చౌట్పల్లి రవి, మండలంలోని పలు గ్రామాల సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, కార్యకర్తలు పాల్గొన్నారు.