హరి లీలామృతం
చేతిలో చిడతలు, పట్టు ధోవతి, మెడలో హారం, కాలికి గజ్జెలవంటి వేషధారణతోసాగే సంగీతం, నృత్యం, నట కళారూపాల మేలు కలయిక హరికథాగానం. ఆధ్యాత్మిక కోణంలో సమాజంలోని కుళ్లు ఎత్తి చూపిస్తూ జనరంజకంగా కొనసాగే ప్రవాహం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె.వి. రమణాచారి 63వ జన్మదినం సందర్భంగా రవీంద్రభారతిలో పది రోజులుగా జరుగుతున్న హరికథా మహోత్సవాలు ఆహూతులను అలరిస్తున్నాయి. హరిలీలలు చెప్పే విధానమే హరికథ. దీన్ని చెప్పేవారు భాగవతారిణి, భాగవతార్ లేదా హరిదాసు. ఒకరే మూడు గంటలపాటు అన్ని పాత్రల్లోనూ జీవించి, రసవత్తరంగా నటిస్తారు. నోటితో వాచకం, పాటలు పాడుతూ, ముఖంలో సాత్వికం ఒలికిస్తూనే, క ళ్లతో నృత్యం, చేతులతో ఆంగికం ప్రదర్శిస్తారు. ఆకర్షణీయమైన ఆహార్యంతో ఏకకాలంలో ఇలా అభినయించటం ఒక్క హరికథకే చెల్లు. అంతసేపు కూర్చొని వినే ప్రేక్షకులకు విసుగు పుట్టకుండా మధ్యమధ్య హాస్యరసాన్ని పోషిస్తూ లాలింపుతోపాటు శక్తిని అందజేసేది హరికథ.
విశేష ఆకర్షణ...
సుగ్రీవ విజయం, గజేంద్రమోక్షం, పద్మవ్యూహం, అన్నమయ్య, పార్వతీ కల్యాణం, బాసర సరస్వతీ క్షేత్ర మహిమ, శ్రీకృష్ణ రాయబారం, శ్రీత్యాగయ్య, నర్తనశాల, దక్ష యజ్ఞం, ఉత్తర గోగ్రహణం, శ్రీకృష్ణ మహిమ, శ్రీ తులసి జలంధర హరికథా గానాలు... రవీంద్రభారతి ప్రాంగణంలోని ఘంటసాల వేదికపై మహాద్భుతంగా సాగాయి. హరికథ విని పరవశించిన ప్రేక్షకులు... అక్కడికక్కడే కళాకారులకు తమకు తోచిన సాయమందించారు.
కపిలేశ్వరపురంలో... సంప్రదాయం
జమీందారు, మాజీ కేంద్రమంత్రి సత్యనారాయణ తూర్పుగోదావరి జిల్లాలో హరికథ పాఠశాల ఏర్పాటు చేశారు. దీంతో ఎంతోమంది హరికథ కళాకారులకు ఉపాధి లభించింది. మన సంప్రదాయంలో భాగంగా భాసిల్లుతున్న హరికథలు మరింత విస్తృతం అవ్వాలి. ప్రభుత్వం ఆ దిశగా మరింత దృష్టి సారించాల్సి ఉంది. అయితే... ‘రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో డాక్టర్ కేవీ రమణాచారి పుట్టినరోజు ఫిబ్రవరి 8వ తేదీన హరికథాగానం జరిగేలా చూస్తాం. హరిదాసుల కష్టాలను మా కష్టాలుగా భావించి పరిష్కరిస్తాం’ అని శాసనమండలి చైర్మన్ కె.స్వామిగౌడ్ చెప్పారు.
ఈ తరానికి అందాలి...
దేశం సుభిక్షంగా ఉండాలని కాంక్షిస్తూ ఆనాడు ఊరూర హరికథలు చెప్పించేవారు. కానీ నేటి తరానికి ఇవి అందడం లేదు. వారికి దీని విశిష్టత తెలియజెప్పాలని ఎవరూ భావించడం లేదు. రెండు తెలుగు ప్రభుత్వాలు దీని గురించి ఆలోచించాలి. అన్నమయ్య ప్రాజెక్ట్ లాంటి ప్రాజెక్ట్‌లు తీసుకురావాలి. అప్పుడే హరికథ నిలబడుతుంది. విదేశాల్లో సైతం హరికథను ఆదరిస్తున్నారు. నేను అమెరికాలో కూడా హరికథాగానం చేశాను.
- వేదవ్యాస శ్రీరామభట్టార్, భాగవతార్, వరంగల్
స్కూల్స్ ఏర్పాటు చేయాలి...
ఇంటిల్లిపాది కూర్చొని విని ఆనందించే కళ హరికథ. కపిలేశ్వరపురంలోలాగా హరికథల కోసం స్కూల్స్ ఏర్పాటు చేయాలి. ప్రభుత్వం చొరవ తీసుకొని హైదరాబాద్ తెలుగు వర్సిటీలో ఉన్న హరికథ కోర్సును పరిపుష్ఠం చేయాలి. అప్పుడే ఈ కథ బతుకుతుంది. మహిళలు ఇటువైపు వచ్చేందుకు ఆసక్తి చూపుతారు.
- మొగిలిచర్ల నాగమణి, భాగవతారిణి, తెనాలి
అవే దిక్కయ్యాయి...
మా పెద్దలు హరికథలు చెబుతూనే బతికారు. పిల్లల చిన్న వయస్సులోనే నా భర్త చనిపోయారు. భుక్తి కోసం హరికథలు చెప్పటం ప్రారంభించాను. పిల్లలందరిని చదివించాను. అన్నమాచార్య ప్రాజెక్ట్ ద్వారా నెలకు ఐదారు ప్రోగ్రామ్స్ నిర్వహిస్తా. ఏ దిక్కులేని మాకు హరికథలే దిక్కయ్యాయి.
- టి.లక్ష్మీమహేష్, భాగవతారిణి, కర్నూల్
ఆదరణ ఉంది... ఉపాధే కష్టం
నిరంతరం హరినామస్మరణ ఉండే ఊరు, ఇళ్లు అష్టైశ్వర్యాలతో పరిఢవిల్లుతాయి. అలాంటి హరికథలకు ఆదరణ ఉన్నా ఉపాధి కష్టం అయింది. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత అన్నమాచార్య ప్రాజెక్ట్ నుంచి తెలంగాణ హరిదాసులను తొలగించారు. దీనివల్ల మాకు ఇల్లు గడవడం కష్టమవుతోంది. తిరుపతి అన్నమయ్య ప్రాజెక్ట్ లాగా తెలంగాణ ప్రభుత్వం కూడా హరిదాసుల కోసం ఓ ప్రాజెక్ట్ ప్రారంభించాలి.
- హెచ్‌ఎం సుధాకర్, భాగవతార్, మహబూబ్‌నగర్
చేసింది తక్కువ...
సాత్విక, వాచిక, అంగీకాభినయాలకు ఆలవాలం హరికథలు. టీటీడీలో పనిచేసేటప్పుడు తెలుగునాట హరికథలు కొనసాగించటానికి మమ్మురంగా ప్రయత్నించా. ఎండోమెంట్స్ కమిషనర్‌గా ఉన్నప్పుడు శనివారాలు వైష్ణవ, సోమవారాలు శైవ ఆలయాల్లో హరికథల ఏర్పాటుకు కృషి చేశా. దీనికి పూర్వ వైభవం తెచ్చేందుకు చేయాల్సిందింకా ఉంది. కళాకారులకు ఉపాధి, కళ విశ్వవ్యాప్తం చేయాలనే సంకల్పంతో ఈ నెల 9 నుంచి ఈ మహోత్సవాలకు శ్రీకారం చుట్టాం. దీంతో చాలా మందికి ఉపాధి లభిస్తుంది. హైస్కూల్ స్థాయిలోనే హరికథలు నిర్వహిస్తే పిల్లలకు మన సంస్కృతిని అలవాటు చేసినవారమవుతాం.
- డాక్టర్ కేవీ రమణాచారి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు
- కోన సుధాకర్‌రెడ్డి