వంశీ ఇంటర్నేషనల్, శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్, తెలుగు కళా సమితి ఒమన్, సంతోషం ఫిలిం న్యూస్ వారి ఆధ్వర్యంలో డాక్టర్ ఆళ్ల శ్రీనివాసరెడ్డి అమెరికా సహకారంతో వర్చువల్‌గా అంతర్జాతీయ కవి సమ్మేళనం నిర్వహించారు. 12 గంటలపాటు నిర్విరామంగా నిర్వహించిన ఈ అంతర్జాతీయ కవి సమ్మేళనంలో 20 దేశాల నుంచి సుమారు 190 మంది కవులు పాల్గొని తమ కొత్త కవితలు వినిపించారు.
సినారే జయంతి సందర్భంగా
డాక్టర్ సీ నారాయణరెడ్డి గారి 90 వ జయంతిని పురస్కరించుకొని ఈ కవి సమ్మెళనం ఏర్పాటు చేశామని ఈ కార్యక్రమ ముఖ్య నిర్వాహకులు వంశీ రామరాజు అన్నారు. వంశీ ప్రచురణలో ప్రతి సంవత్సరం వస్తున్న "కొత్త కథలు" సంకలనం తరహాలో ఇక నుంచి కొత్త కవిత పేరుతో కవితా సంకలనం తీసుకువస్తామన్నారు.
ముఖ్య అతిధిగా
ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు కేవీ రమణ ముఖ్య అతిథిగా ప్రారంభోపన్యాసం అందించారు. గౌరవ అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పూర్వ ఉపసభాపతి మండలి బుద్ధ ప్రసాద్ , ప్రత్యేక అతిథులుగా తెలంగాణ సారస్వత పరిషత్ కార్యదర్శి జె. చెన్నయ్య, వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా అధ్యక్షులు వంగూరి చిట్టెన్ రాజు, ఒమన్ తెలుగు కళా సమితి కన్వీనర్ అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. న్యూజిలాండ్ నుంచి శ్రీలత మగతల, సౌదీ అరేబియా నుండి రావి దీపిక మరియు వివిధ దేశాల తెలుగు సంఘాల అధ్యక్షులు పాల్గొని కవులకు శుభాభినందనలు తెలియజేశారు.
ప్రత్యేక అతిధులు
భారతదేశం నుండి ప్రత్యేక ఆహ్వానితులుగా ప్రముఖ సినీ కవులు భువనచంద్ర, సుద్దాల అశోక్ తేజ, రసరాజు, వడ్డేపల్లి కృష్ణ, కాసర్ల శ్యామ్ తదితరులు పాల్గొని నారాయణ రెడ్డి గారికి కవితానివాళులు అర్పించారు. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, సింగపూర్, మలేషియా, హాంకాంగ్, ఇండోనేషియా, ఒమాన్, ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్, బహ్రెయిన్, మారిషస్, దక్షిణాఫ్రికా, యుగాండా, యునైటెడ్ కింగ్డమ్, నార్వే, కెనడా, అమెరికా దేశాలనుండి ఎంతో మంది కవులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఆనందంగా ఉంది
తొలిసారి నిర్వహించిన అంతర్జాతీయ కవి సమ్మేళనంలో పెద్ద ఎత్తున కవులు, కవయిత్రులు పాల్గొనడం తమ సంస్థకు గర్వకారణంగా ఉందని శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్ అధ్యక్షులు కవుటూరు రత్న కుమార్ ఆనందం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment