c narayanareddy
-
ఎన్టీఆర్- ఏఎన్నార్ మధ్య విబేధాలు.. సీఎం చెప్పినా వినలేదట
ఎన్టీఆర్ - ఏఎన్నార్ తెలుగు సినిమాకి రెండు కళ్ల లాంటివారు. ఎన్నో వైవిధ్యమైన చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు.పౌరాణిక పాత్రలకి ఎన్టీఆర్ చెరగనా ముద్ర వేసుకుంటేప్రేమకథా చిత్రాల్లో తనకెవరూ సాటిలేరని ఏఎన్ఆర్ నిరూపించుకున్నారు.ఇద్దరి మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండేది.అంతేకాకుండా పోటీపడి మరీ ఒకేసారి సినిమాలను రిలీజ్ చేయించుకునేవారు. కలెక్షన్ల విషయంలోనూ వీరు ఎన్నో రికార్డులు తిరగరాశారు. సాధారణంగా ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటించడం చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే జరుగుతుంది. కానీ ఎన్టీఆర్ - ఏఎన్నార్ మాత్రం 15 సినిమాల్లో కలిసి నటించారు. ఎంతో సాన్నిహిత్యంగా ఉన్న వీళ్లిద్దరి మధ్య కూడా అప్పట్లో మనస్పర్థలు వచ్చాయి. ఓసారి తన సినిమాలో కృష్ణుడి వేషాన్ని వేయాల్సిందిగా ఏఎన్నార్‌ను ఎన్టీఆర్ కోరారట. దీనికి ఆ ఒక్కమాట మాత్రం అడగకండి మహానుభావా అంటూ ఏఎన్నార్ సున్నితంగా తిరస్కరించారట. అప్పటి సీఎం జలగం వెంగళరావుతోనూ ఎన్టీఆర్ రికమెండ్ చేయించినా ఏఎన్నార్ ఒప్పుకోలేదు. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య విబేధాలు వచ్చాయని చెబుతుంటారు. దీంతో వీళ్లిద్దరు అప్పట్లో మల్టీస్టారర్ సినిమాలు చేయకూడదనే నిర్ణయానికి వచ్చారట. ఇక ఎన్టీఆర్-ఏఎన్నార్ మధ్య అభిప్రాయబేధాలపై ప్రముఖ రచయిత సి నారాయణ రెడ్డి గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఏమన్నారంటే.. ఎన్టీఆర్ గులేబకావళి అనే సినిమాకు పాటలు రాసే అవకాశం వచ్చింది. అయితే తన మొదటి సినిమా కావడంతో మొత్తం అన్ని పాటలకు రాసే అవకాశం ఇస్తేనే రాస్తాను అని కండీషన్ పెట్టాను. దీంతో ఎన్టీఆర్ ఒప్పుకొని మొత్తం 10 పాటలకు అవకాశం కల్పించారు. ఇదే క్రమంలో ఏఎన్నార్ హీరోగా 'ఇద్దరు మిత్రులు' సినిమాలో ఓ పాట రాసేందుకు అవకాశం వచ్చింది. ఆ సినిమా డైరెక్టర్ దిక్కుపాటి మధుసూదన్ రావు ఓసారి ఫోన్ చేసి అడగ్గా.. నేను సున్నితంగా తిరస్కరించాను. ఒకవేళ మీకు రాసిన మొదట విడుదలైతే, ఆ ప్రత్యేకత, క్రెడిట్ మీకే దక్కుతుంది. అప్పుడు నా మొదటి సినిమాకే మొత్తం పాటలు రాసే ఛాన్స్ ఇచ్చిన ఎన్టీఆర్‌కు ఆ క్రెడిట్ రాదు అని చెప్పి సున్నితంగా ఆ ఆఫర్‌ను తిరస్కరించాను. కానీ తర్వాతి రోజుల్లో ఎన్టీఆర్-ఏఎన్నార్‌కి మధ్య అభిప్రాయబేధాలు ఉన్న సమయంలోనూ ఇద్దరికీ పాటలు రాశాను' అంటూ చెప్పుకొచ్చారు. -
కొత్త కవిత - అంతర్జాతీయ కవి సమ్మేళనం
వంశీ ఇంటర్నేషనల్, శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్, తెలుగు కళా సమితి ఒమన్, సంతోషం ఫిలిం న్యూస్ వారి ఆధ్వర్యంలో డాక్టర్ ఆళ్ల శ్రీనివాసరెడ్డి అమెరికా సహకారంతో వర్చువల్‌గా అంతర్జాతీయ కవి సమ్మేళనం నిర్వహించారు. 12 గంటలపాటు నిర్విరామంగా నిర్వహించిన ఈ అంతర్జాతీయ కవి సమ్మేళనంలో 20 దేశాల నుంచి సుమారు 190 మంది కవులు పాల్గొని తమ కొత్త కవితలు వినిపించారు. సినారే జయంతి సందర్భంగా డాక్టర్ సీ నారాయణరెడ్డి గారి 90 వ జయంతిని పురస్కరించుకొని ఈ కవి సమ్మెళనం ఏర్పాటు చేశామని ఈ కార్యక్రమ ముఖ్య నిర్వాహకులు వంశీ రామరాజు అన్నారు. వంశీ ప్రచురణలో ప్రతి సంవత్సరం వస్తున్న "కొత్త కథలు" సంకలనం తరహాలో ఇక నుంచి కొత్త కవిత పేరుతో కవితా సంకలనం తీసుకువస్తామన్నారు. ముఖ్య అతిధిగా ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు కేవీ రమణ ముఖ్య అతిథిగా ప్రారంభోపన్యాసం అందించారు. గౌరవ అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పూర్వ ఉపసభాపతి మండలి బుద్ధ ప్రసాద్ , ప్రత్యేక అతిథులుగా తెలంగాణ సారస్వత పరిషత్ కార్యదర్శి జె. చెన్నయ్య, వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా అధ్యక్షులు వంగూరి చిట్టెన్ రాజు, ఒమన్ తెలుగు కళా సమితి కన్వీనర్ అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. న్యూజిలాండ్ నుంచి శ్రీలత మగతల, సౌదీ అరేబియా నుండి రావి దీపిక మరియు వివిధ దేశాల తెలుగు సంఘాల అధ్యక్షులు పాల్గొని కవులకు శుభాభినందనలు తెలియజేశారు. ప్రత్యేక అతిధులు భారతదేశం నుండి ప్రత్యేక ఆహ్వానితులుగా ప్రముఖ సినీ కవులు భువనచంద్ర, సుద్దాల అశోక్ తేజ, రసరాజు, వడ్డేపల్లి కృష్ణ, కాసర్ల శ్యామ్ తదితరులు పాల్గొని నారాయణ రెడ్డి గారికి కవితానివాళులు అర్పించారు. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, సింగపూర్, మలేషియా, హాంకాంగ్, ఇండోనేషియా, ఒమాన్, ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్, బహ్రెయిన్, మారిషస్, దక్షిణాఫ్రికా, యుగాండా, యునైటెడ్ కింగ్డమ్, నార్వే, కెనడా, అమెరికా దేశాలనుండి ఎంతో మంది కవులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆనందంగా ఉంది తొలిసారి నిర్వహించిన అంతర్జాతీయ కవి సమ్మేళనంలో పెద్ద ఎత్తున కవులు, కవయిత్రులు పాల్గొనడం తమ సంస్థకు గర్వకారణంగా ఉందని శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్ అధ్యక్షులు కవుటూరు రత్న కుమార్ ఆనందం వ్యక్తం చేశారు. -
డా సి.నారాయణరెడ్డి కవిత్వం అజరామరం..
మహాకవి జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డాక్టర్ సి.నారాయణరెడ్డి కవిత్వం అజరామరమైనదని వక్తలు శ్లాఘించారు. డా సినారె 4వ వర్ధంతిని పురస్కరించుకొని తెలంగాణ సారస్వత పరిషత్తు, వంశీ - డా సినారె విజ్ఞాన పీఠం, కేతవరపు పౌండేషన్, సంతోషం ఫిలిం న్యూస్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో శనివారం జరిగిన అంతర్జాల సదస్సులో సారస్వత పరిషత్తు అధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి అధ్యక్షోపన్యాసం చేస్తూ.. డా సినారె పండితులలో పండితుడు, కవులకే కవి, పరిశోధకులకే పరిశోధకుడు అన్నారు.. సినారె శబ్ద పుష్టి, శబ్ద సిద్ధి అనితర సాధ్యమని తెలిపారు. తెలుగు సాహిత్యాన్ని బోధించడంలో ఆయన ఆదర్శప్రాయులని అన్నారు. సారస్వత పరిషత్తు అధ్యక్షునిగా పరిషత్తును పునరుజ్జీవింప చేశారు. ప్రముఖ సినీ గీత కర్త భువనచంద్ర మాట్లాడుతూ సినారె అనే మహావృక్షం నీడలో వేలమంది విద్యార్థులు భాషా సాహిత్య విజ్ఞాన దాహార్తిని తీర్చుకుని సేదదీరారని అన్నారు. అటు సామాన్య రైతు కుటుంబంలో జన్మించి అనితరసాధ్యమైన కృషితో అత్యున్నత స్థానం అందుకున్న సినారె తరాలకు తరగని స్ఫూర్తి ప్రదాత అని వివరించారు. అందమైన, అర్థవంతమైన తెలుగు పలుకులను ప్రయోగించే శక్తి సినారె స్వంతమని అన్నారు. వంశీ రామరాజు స్వాగత ప్రసంగం చేస్తూ డా సి.నారాయణరెడ్డి ప్రోత్సాహంతో 50 ఏళ్లుగా వంశీ గణనీయమైన రీతిలో సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న దని, వేగేశ్న సేవా సంస్థ ద్వారా అనాధలను ఆదరించి, చదివించి ఉన్నత స్థానంలో నిలుపుతున్నామని తెలిపారు. కేతవరపు రాజ్యశ్రీ సినారె నుంచి ఎన్నో విషయాలు నేర్చుకుని ఆచరణలో పెట్టామన్నారు.. సురేష్ కొండేటి "సంతోషం ఫిలిం న్యూస్" మాట్లాడుతూ పత్రికా రచయితగా సినారె నుంచి ప్రోత్సాహం, స్ఫూర్తిని పొందామన్నారు. రసమయి స్థాపకులు డా ఎమ్ కె రాము "సినారె కవిత-- లయాత్మక" అనే అంశం పైన, డా వి ఎల్ నరసింహారావు "సినారె సినీగీతాలు పైన" డా ఎం కె పద్మావతి దేవి "డా సినారె కవితా దర్శనం - చారిత్రక కావ్యాలు- స్త్రీ పాత్ర చిత్రణ" పైన, డా సందినేని రవీందర్ "సినారె గేయనాటికల పైన" ప్రసంగించారు.. తెలంగాణ సారస్వత పరిషత్తు ప్రధానకార్యదర్శి డా జుర్రు చెన్నయ్య కార్యక్రమాన్ని నిర్వహించారు.. డాలస్(అమెరికా)లో ఉన్న ప్రముఖ హృద్రోగ నిపుణుడు డాక్టర్ శ్రీనివాస రెడ్డి ఆళ్ళ, లండన్‌లో ఉన్న అమెరికన్ తెలుగు అసోసియేషన్ సాహిత్య విభాగం అధ్యక్షురాలు సింగిరెడ్డి శారద కూడా తమ ప్రసంగాలలో డా సినారె సాహిత్య, సాంస్కృతిక విశిష్టతను ప్రస్తావించారు. -
సినారెకు సీఎం కేసీఆర్ నివాళి
సాక్షి, హైదరాబాద్: జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత, ఆచార్య డా. సినారె (సింగిరెడ్డి నారాయణ రెడ్డి) వర్థంతి సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు నివాళులు అర్పించారు. ‘సినారె తెలంగాణ సాహితీ సౌరభాలను 'విశ్వంభర'తో విశ్వవ్యాపితం చేశారు. తెలుగు కవితను మహోన్నత స్థాయిలో నిలిపిన వ్యక్తి సినారె’ అని సీఎం కేసీఆర్ ట్వీట్ చేశారు. చదవండి: ఈ నెల 19 తర్వాత రాష్ట్రవ్యాప్తంగా పల్లెలు, పట్టణాల్లో పర్యటిస్తా -
అభిమానులు గర్వపడేలా సాహితీ సదనం
జూబ్లీహిల్స్ (హైదరాబాద్): కళాభిమానులు, సాహిత్యాభిమానులు గర్వపడేలా సాధ్యమైనంత వేగంగా సినారె సాహితీ సదనం భవన నిర్మాణం పూర్తి చేస్తామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ప్రఖ్యాత కవి, సాహితీవేత్త డాక్టర్.సి.నారాయణరెడ్డి స్మృ త్యర్థం బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ సమీపంలో మూడువేల గజాల విస్తీర్ణంలో నిర్మించనున్న ‘సినా రె సాహితీ సదనం’భవన నిర్మాణానికి బుధవారం మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అతి చిన్న వయస్సులోనే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, పద్మశ్రీ అవార్డు పొందడంతో పాటు, దక్షిణాదిలోనే తొలిసారి కళాకారుల కోటాలో రాజ్యసభకు ఎంపికైన సాహితీవేత్తగా ప్రత్యేక గుర్తింపు పొందిన తెలుగుజాతి వైతాళికులు సి.నారాయణ రెడ్డి అని, ఆయన స్మృతికి చిహ్నంగా నిర్మించనున్న ఈ భవనానికి శంకుస్థాపన చేయడం గర్వకారణంగా ఉందని పేర్కొన్నారు. ‘నన్ను దోచు కుందువటే ’పాటతో తెలుగు సినీ పరిశ్రమలో ప్రవేశించి ‘సువ్వీ సువ్వీ’, ‘వటపత్రశాయికి వరహాల లాలీ’అంటూ స్వాతిముత్యం చిత్రం సహా వంద లాది చిత్రాల్లో ఆయన రాసిన పాటలు చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. సినారె కుటుంబసభ్యులు భాస్కర్‌రెడ్డి, వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ..నగరం నడిబొడ్డున సాహితీ సదనం నిర్మించడం సంతోషకరమని, సీఎంకి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో మంత్రి శ్రీనివాసగౌడ్, సాంస్కృతిక శాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు, రమణాచారి, దేశపతి శ్రీనివాస్, ఎమ్మెల్యే దానం నాగేందర్ పాల్గొన్నారు. -
ఆ పాట నా జీవితాన్నే మార్చి వేసింది!
సాక్షి ప్రతినిధి, చెన్నై: సినీ, సంగీత, సాహిత్య లోకంలో నవరసాలు పండించిన డాక్టర్ సి నారాయణరెడ్డి ’భక్త తుకారాం’ సినిమా కోసం రాసిన ‘ పూజకు వేళాయరా’ అనే పాట తన జీవితాన్నే మార్చేసిందని సీనియర్ నటి కాంచన అన్నారు. మద్రాసు విశ్వవిద్యాలయం తెలుగుశాఖ, శ్రీ ఫౌండేషన్ సంయుక్త అధ్వర్యంలో ‘సినారె సాహితీ రాజసం’ అంశంపై రెండురోజుల జాతీయ సదస్సు సోమవారం చెన్నైలో ప్రారంభమైంది. ఈ సదస్సులో ముఖ్యఅతిథిగా పాల్గొన్న కాంచన ప్రసంగిస్తూ, మనిషి జీవితంలో అందం చందం అన్నీ అశాశ్వతమంటూ ఆ గీతంలోని అర్థం, అంతరార్థం తనను ఆలోచింపజేసిందన్నారు. కఠినతరమైన నృత్యరీతులపైనే ఏకాగ్రత పెట్టిన తనను అక్కినేని నాగేశ్వరరావు పిలిచి ఈ పాట అర్థం తెలుసా అని అడిగారని, ఆ తర్వాత తాను అర్థం తెలుసుకున్నానని గుర్తు చేస్తుకున్నారు. జీవిత సత్యాన్ని విడమర్చి చెప్పిన ఆ పాటతోనే తనలో ఆధ్యాత్మికభావం మరింత పెంపొందినట్లు తెలిపారు. ప్రముఖ సినీగేయరచయిత భువనచంద్ర రచించిన మనసు పొరలు, సినారె సాహితీ రాజసం సావనీర్‌ను కాంచన ఆవిష్కరించారు. మంగళవారం నాటి ముగింపు కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా ప్రముఖ సినీ నేపధ్య గాయకులు డాక్టర్ ఎస్పీ బాలసుబ్రహ్యణం పాల్గొంటున్నారు. -
తెలంగాణ మట్టి పరిమళం సినారె
⇒ ‘స్మరనారాయణీయం’పుస్తకావిష్కరణలో ఎంపీ కవిత ⇒ తెలంగాణ సారస్వత పరిషత్తుకు రూ.10 లక్షల ఎంపీ నిధులు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మట్టిలోనే మహత్మ్యం ఉందని, ఎందరో కవులు ఈ గడ్డపై ఉద్భవించారని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత దివంగత డాక్టర్ సి నారాయణరెడ్డి తెలంగాణ గడ్డపై పుట్టిన మట్టి పరిమళం అని కొనియాడారు. తెలంగాణ ప్రభుత్వం, భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన డాక్టర్ సి నారాయణరెడ్డి 87 వ జయంతి, స్మర నారాయణీయం పుస్తకావిష్కరణ కార్యక్రమంలో కవిత మాట్లాడారు. మల్లినాథసూరి, పాల్కురికి సోమన, బమ్మెర పోతన, కాళోజీ, దాశరథి, సినారె వంటి ప్రముఖులకు తెలంగాణ జన్మస్థలమైందన్నారు. సినారె కుటుంబ విలువలకు ప్రాధాన్యత ఇచ్చిన మహోన్నత వ్యక్తి అని పేర్కొన్నారు. సినారె రచనలు పునర్ముద్రించేందుకు తెలంగాణ జాగృతి ముందుంటుందని తెలిపారు. సినారె అమితంగా ఇష్టపడే తెలంగాణ సారస్వత పరిషత్తుకు తన ఎంపీ లాడ్స్ నుంచి రూ.10 లక్షలు కేటాయిస్తానని ప్రకటించారు. సభకు అధ్యక్షత వహించిన సాహిత్య అకాడమీ అధ్యక్షుడు నందిని సిధారెడ్డి మాట్లాడుతూ సాంస్కృతిక శాఖ రూపొందించిన స్మర నారాయణీయం పుస్తకం ప్రకటనలు, సమీక్షలు, వ్యాసాల సమాహారంగా ఉందని అన్నారు. ఒక కవికి మహోన్నత రీతిలో జరిగిన సత్కారం ఆయన అంతిమయాత్రేనని, ఆయనపై వెలువడిన ఈ సంపుటి కూడా అలాంటిదేనని చెప్పారు. తెలుగు విశ్వవిద్యాలయం ఉప కులపతి ఎస్వీ సత్యనారాయణ మాట్లాడుతూ ‘కవిత నా చిరునామా’అని సినారె తన ఉనికిని చాటారన్నారు. కొడవళ్ల కొసల చివరన రగిలిన ఎర్రజెండాలను సైతం ఆయన వర్ణించి కవిత్వాన్ని సమాజపరం చేశారన్నారు. సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్ మాట్లాడుతూ సినారెను స్మరించుకోవటమంటే మనల్ని మనం సంస్మరించుకోవటమేనన్నారు. కార్యక్రమంలో తెలుగు విశ్వవిద్యాలయం విశ్రాంత ఉపకులపతులు ఆచార్య ఎన్.గోపి, ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, సీఎం వోఎస్డీ దేశపతి శ్రీనివాస్, టూరిజం కార్యదర్శి బుర్రా వెంకటేశం, డాక్టర్ జె చెన్నయ్య పాల్గొన్నారు. -
‘మరణం నను వరించి వస్తే ఏమంటాను’
జూలై 29న సినారె జయంతి ప్రణయానికి రూఢికెక్కిన గజల్‌ను మానవీయ దక్పథానికీ ప్రగతిశీలానికీ వాహికగా స్వీకరించడం సినారె గజళ్ళలోని విశేషం. గజల్ ప్రణయేతరాలను తీసుకోవడం సరికొత్త ప్రయోగం కూడా. ఉర్దూలో కూడా గజల్‌ను అధిక్షేపానికి మలుచుకున్న వాళ్ళున్నారు. ఫైజ్ అహమ్మద్ ఫైజ్, సాహిర్ లుద్యాన్వీ వంటివారు ఈ ప్రయోగంలో విజయం సాధించారు. డాక్టర్ సి.నారాయణరెడ్డి కమ్మగా పాడతారని కేవలం ఆయన కవిత్వంతోనే పరిచయం ఉన్నవారికి తెలియకపోవచ్చు. ప్రత్యక్షంగా ఆయనను వినటం తటస్థిస్తే నిజంగా అదో అనుభవం! మాటలో, పాటలో, హావభావాల్లో ఒక వింత లయను నిసర్గ రమ్యంగా కూర్చుకున్న విశిష్ట కవి సినారె. ఆయన ‘తెలుగు గజళ్ళు’ పుస్తకం 1984లో వెలువడింది. దీనిలో 35 గజళ్ళున్నాయి. ఆ రోజుల్లోనే కవి వీటిని స్వయంగా గానం చేసి బాణీలు కూడా కూర్చి క్యాసెట్ల రూపంలో విడుదల చేశారు. విడుదల సభల్లో బాష్ప తుషారాలు నిండటం అనేకుల స్మృతిపథాల్లో నిలిచిపోయింది. కవే గాయకుడుగా రవళించటం తెలుగులో ఇదే ప్రథమం. తెలుగు గజళ్ళు సంపుటిలోని అనేక చరణాలకు ఎగిరే రెక్కలున్నాయి. దూసుకుపోయే నైశిత్యముంది. ‘రాతిరియున్ పవల్ మరపురాని’ కలవరముంది. వినగానే గుర్తుండిపోయే ధారణానుకూల శిల్పముంది. కళ్ళకు కనిపించే అక్షరాల వెనక వినిపించే రాగమాలికలున్నాయి. గజల్ అంటే ఆడవాళ్ళతో మాట్లాడటం అని కొందరు రాశారు. ‘మాషో కాసే గుఫ్తగూ’ అని కొందరు విమర్శకులన్నారు. అంటే ప్రియురాలితో సల్లాపం అన్నమాట! నారాయణరెడ్డి రెండో అర్థాన్ని గ్రహించనట్టున్నది. గజల్‌కు కొన్ని లక్షణాలున్నాయి. గజల్ పల్లవిని ‘మత్లా’ అనీ, చరణాన్ని ‘మక్తా’ అనీ అంటారు. చరణం చివర రెండు రకాల ప్రాసలుంటాయి. వాటిని ‘రదీప్ కాఫియా’లంటారు. రదీప్ కాఫియాలు గజల్ ప్రధాన లక్షణాలు. రదీప్ అంటే అంత్యప్రాస. కాఫియా అంటే అంత్యప్రాసకు పూర్వపదం. ఉదాహరణకు: ‘మంచు పొగలుండేవి మరికొన్ని నిమిషాలే ఆ పిదప నిండేవి ఆదిత్య కిరణాలే’ అనేది పల్లవి. దీనిలోని ‘కిరణాలే’ అనే మాట తర్వాతి రెండు పాదాల్లో వచ్చే అంత్యప్రాసలను రూపొందిస్తుంది. ‘చరణాలే’, ‘హృదయాలే’, ‘నయనాలే’, ‘ఉదయాలే’ అనే మాటల్లో ‘అలె’ అనేది రదీప్. దీనికి పూర్వపదాలుగా భిన్నపదాలుండవచ్చు. రదీప్ను ఏక పద పునరుక్తిగా కొందరు పొరపడుతుంటారు. తెలుగు ఛంద:ప్రమాణాలు కూడా గజల్‌కు పూర్తిగా పట్టవు. ‘వసంతం’, ‘సుఖాంతం’, ‘దిగంతం’ అనే రదీపుల్లో స్థూల దృష్టికి అంత్యప్రాసలు కుదరలేదనిపిస్తుంది. ఉర్దూ తెలిసిన చెవికైతే సుఖంగా పడ్డ మాటలు అనిపిస్తాయి. ఉర్దూలో ‘దీవార్’, ‘కిర్దార్’, ‘హత్యార్’, ‘బాకార్’’ అనేవి రదీపులు. ‘ఆర్’ అంత్యప్రాస. అంత్యప్రాసకు ముఖ్యమైన స్వరం ‘ఆర్’. అంత్యప్రాస నియుక్తికి దోహదం చేసిన పరమ ధ్వనిమంతమైన యూనిట్ ఇది. అట్లాగే కాఫియా అంటే అంత్యప్రాసకు పూర్వపదం అనుకున్నాం. ఇది అంత్యప్రాసను పెంచే మారాకు. ‘ఎంత చీకటి కాల్చెనో ఇంత చల్లని తారక ఎంత వెలుగును పంచెనో ఇంత సన్నని దీపిక’ అన్న రెండో గజల్లో ‘తీయని కోరిక’, ‘మెత్తని మాలిక’, ‘తీరని వేడుక’, ‘పచ్చని వాటిక’, ‘పల్చని జీవిక’ల్లోని అంత్యప్రాస పూర్వపదాలు కాఫియాలు. మరో గజల్లో కంఠశోష, శ్వాస, ఘోష, ధ్యాస, ఆశ అనే ప్రాసలున్నాయి. ఉర్దూ సంప్రదాయం తెలియనివారికి ష, శ, స లకు ప్రాసలేమిటి అనిపిస్తుంది. ప్రణయానికి రూఢికెక్కిన గజల్‌ను మానవీయ దృక్పథానికీ ప్రగతిశీలానికీ వాహికగా స్వీకరించడం ఈ గజళ్ళలోని విశేషం. ప్రణయం గజల్ మూలతత్త్వం కాదు. అది ప్రక్రియ. గజల్ ప్రణయేతరాలను తీసుకోవడం సరికొత్త ప్రయోగం కూడా. ఉర్దూలో కూడా గజల్‌ను అధిక్షేపానికి మలుచుకున్న వాళ్ళున్నారు. ఫైజ్ అహమ్మద్ ఫైజ్, సాహిర్ లుద్యాన్వీ వంటివారు ఈ ప్రయోగంలో విజయం సాధించారు. సినారెకు ప్రణయం కొత్త కాదు. సినీ గీతాల్లో ముఖ్యంగా ‘ఏకవీర’లో గజల్ ప్రయోగాలు చేశారు. ఇక చాలనుకున్నారేమో! గజల్ పంజరంలోంచి ప్రణయాన్ని తప్పించడం వల్ల వచ్చిన ప్రళయం ఏమీ లేదు. గజళ్ళలో ఏకసూత్రత ఉండాలనే నిర్బంధం కూడా ఏమీ లేదు. అవి ముక్తకాలు. ఏ పాదానికాపాదం స్వతంత్రంగా వుంటుంది. గజళ్ళు కొసమెరుపుల్తో తీయగా కాటేస్తాయి. కాటునిండా అమృతం. వాటిలో అనుస్యూతంగా ఉండే విద్యుత్తు గానమే కాని భావం కాదు. ‘నజమ్’ అయితే వస్త్వైక్యం అవసరం. గజల్లో వచ్చిన భావమే మళ్ళీ రావొచ్చు. భావ ప్రయోగం ఐచ్ఛికం. ఇక వస్తువు విషయానికి వస్తే సినారె కవిత్వంలో ‘విశ్వంభర’కు ముందు నుంచి కూడా తాత్త్విక ఛాయలు కనపడుతున్నాయి. విశ్వంభరలో మరీ ఎక్కువ. ‘మరణం నను వరించి వస్తే’ అని పైకి సరదాగా కనిపించే ఈ గజల్‌ను చూడండి. మరణం నను వరించి వస్తే ఏమంటాను నేనేమంటాను పాలుపట్టి జోలపాడి పడుకోమంటాను ‘‘మరణం‘‘ లంచం నను భజించి వస్తే ఏమంటాను నేనేమంటాను తిరుమల గిరి హుండీలో జొరబడమంటాను ‘‘లంచం‘‘ కామం నను కలవరపెడితే ఏమంటాను నేనేమంటాను అలిగి వున్న పడుచు జంటతో కలబడమంటాను ‘‘కామం‘‘ క్రోధం నను కవ్విస్తుంటే ఏమంటాను నేనేమంటాను పస చచ్చిన పేడి జాతిలో బుసలిడమంటాను ‘‘క్రోధం‘‘ లోభం నను బులిపిస్తుంటే ఏమంటాను నేనేమంటాను తెగ వొలికే కవి పలుకుల్లో దిగబడమంటాను ‘‘లోభం‘‘ అహంకార మెదురై వస్తే ఏమంటాను నేనేమంటాను నరుని వదలి కొండనెత్తిలో స్థిరపడమంటాను ‘‘అహంకారం‘‘ కాలం పులిలా గాండ్రిస్తే ఏమంటాను నేనేమంటాను దిగులెందుకు ఓయి సినారె తెగబడమంటాను ‘‘కాలం‘‘ దీనిలో కవి మరణానికి భయపడడు. పైగా మరణంలో ప్రేయసీత్వాన్నీ సహచరీత్వాన్ని దర్శిస్తాడు. సూఫీ కవుల్లో, రవీంద్రునిలో కూడా ఈ ధోరణి కనిపిస్తుంది. దీనిలో సినారె ప్రదర్శించిన నవ్యత ఏమిటంటే మరణం అనివార్యమని గ్రహిస్తూనే తప్పని మరణాన్ని చూసి నీరుగారిపోక, దాన్ని శిశువుగా మార్చుకొని తాత్త్వికస్పర్శతో జోకొడతారు. మరణంలో మరోప్రాణి వికాసాన్ని భావించడం దీనిలో కనిపిస్తుంది. ‘చావులో చావకు చావులో జన్మించు, నిరంతర సజీవ చైతన్యవంతుడికి చావు పక్కలో నిదురపోయే పసిపాప వంటిది’ అని భావం. ‘మృతిలోనే బతుకంతా నవ్వుకుంటా’ అంటాడు ఫైజ్ ఓ చోట. గజల్‌కి చివర తఖల్లుస్ (కవి నామ ముద్ర) ఉంటుంది. గీతం చివర కవి తన్ను తాను సంబోధించుకుంటాడు. ‘సినారె’ అనేది ఈ గీతాల్లోని తఖల్లుస్. సంప్రదాయం తెలియని వారికి ఇది ఆత్మాశ్రయ ధోరణిగా తోచవచ్చు. సామాజికానికీ ఆత్మాశ్రయానికీ మధ్య స్పష్టమైన గీత గీయడం కష్టం. శ్రీశ్రీ ‘ఐ’లో వినగలిగితే సామాజిక స్పందనలు వినిపిస్తాయి. ‘వేమన’ను ఆత్మాశ్రయ కవిగా తేల్చలేము కదా! సినారె తఖల్లుస్లో ప్రగతి ధ్వనులు వినిపిస్తాయి. ‘గజల్’కు తెలుగు పేరు కాయన్ చెయ్యకుండా తెలుగు గజళ్ళు అని పేరు పెట్టడం ఉచితంగా వుంది. సానెట్‌ను సానెట్ అంటేనే బాగుంటుంది. తెలుగు గజళ్ళు తెలుగు కవితా రంగంలో మంచి ప్రయోగం. సామాజిక వస్తువుతో రాయడం అప్పటికి తెలుగులో తొలి ప్రయత్నం. డాక్టర్ ఎన్ .గోపి 040–27037585 -
ప్రముఖ కవి సి.నారాయణరెడ్డి కన్నుమూత
హైదరాబాద్: ప్రముఖ తెలుగు కవి, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత సి. నారాయణరెడ్డి(85) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. కరీంనగర్ జిల్లా హనుమాజీపేటలో జన్మించిన సింగిరెడ్డి నారాయణరెడ్డి.. సినారెగా సాహితీలోకంలో తనదైన ముద్రలు వదిలివెళ్లారు. నారాయణరెడ్డి మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. 1953లో ‘నవమి పువ్వు’ పేరుతో తొలి రచన చేసిన సి.నారాయణరెడ్డి.. 1962లో సినీరంగప్రవేశం చేసి దాదాపు మూడు వేల పాటలు రాశాలు. 1977లో పద్మ పురస్కారాన్ని అందుకున్న ఆయన.. 1978లో కళాప్రపూర్ణ, 1988లో విశ్వంభర కావ్యానికిగానూ ప్రఖ్యాత జ్ఞానపీఠ్ పురస్కారాన్ని అందుకున్నారు. 1992లో పద్మవిభూషణ్ పురస్కారాన్ని పొందారు. 1997లో రాజ్యసభ సభ్యుడిగానూ ఎన్నికయ్యారు. -
సాహిత్య అకాడమీ ఫెలోగా సినారె
న్యూఢిల్లీ: ప్రముఖ కవి, రచయిత డా. సి. నారాయణరెడ్డి(సినారె)కి కేంద్ర సాహిత్య అకాడమీ ఫెలోగా అరుదైన గౌరవం లభించింది. దేశంలోని లబ్ధప్రతిష్టులైన రచయితలకు అత్యున్నతమైన ఫెలో పురస్కారాన్ని సాహిత్య అకాడమీ ప్రకటిస్తుంది. 1970లో విశ్వనాథ సత్యనారాయణకు, 1999లో గుంటూరు శేషేంద్రశర్మకు, 2004లో భద్రిరాజు కృష్ణమూర్తికి ఈ గుర్తింపు లభించింది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత సినారె పేరును సోమవారం సాహిత్య అకాడమీ ప్రకటించింది. ప్రముఖ రచయిత కొడవటిగంటి కుటుంబరావు కుమార్తె ఆర్. శాంతకుమారికి అనువాద పురస్కారాన్ని ప్రకటించింది. హిందీ ర చయిత ప్రేమ్‌చంద్ ఆత్మకథను ఆమె తెలుగులోకి అనువదించారు. కాగా, ఢిల్లీలోని కమానీ ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో ప్రముఖ రచయిత రాచపాలెం చంద్రశేఖర్‌రెడ్డి ప్రతిష్టాత్మక సాహిత్య అకాడమీ అవార్డును అందుకున్నారు. రాచపాలెం రచించిన ‘మన నవలలు-మన కథానికలు’ అనే విమర్శనాత్మక నవలకుగాను ఈ అవార్డు ప్రకటించిన విషయం తెలిసిందే. సాహిత్య అకాడమీ చైర్మన్ విశ్వనాథ్ తివారీ చేతులమీదుగా ఆయన ఈ అవార్డును తీసుకున్నారు.