సాక్షి ప్రతినిధి, చెన్నై: సినీ, సంగీత, సాహిత్య లోకంలో నవరసాలు పండించిన డాక్టర్ సి నారాయణరెడ్డి ’భక్త తుకారాం’ సినిమా కోసం రాసిన ‘ పూజకు వేళాయరా’ అనే పాట తన జీవితాన్నే మార్చేసిందని సీనియర్ నటి కాంచన అన్నారు. మద్రాసు విశ్వవిద్యాలయం తెలుగుశాఖ, శ్రీ ఫౌండేషన్ సంయుక్త అధ్వర్యంలో ‘సినారె సాహితీ రాజసం’ అంశంపై రెండురోజుల జాతీయ సదస్సు సోమవారం చెన్నైలో ప్రారంభమైంది. ఈ సదస్సులో ముఖ్యఅతిథిగా పాల్గొన్న కాంచన ప్రసంగిస్తూ, మనిషి జీవితంలో అందం చందం అన్నీ అశాశ్వతమంటూ ఆ గీతంలోని అర్థం, అంతరార్థం తనను ఆలోచింపజేసిందన్నారు.
కఠినతరమైన నృత్యరీతులపైనే ఏకాగ్రత పెట్టిన తనను అక్కినేని నాగేశ్వరరావు పిలిచి ఈ పాట అర్థం తెలుసా అని అడిగారని, ఆ తర్వాత తాను అర్థం తెలుసుకున్నానని గుర్తు చేస్తుకున్నారు. జీవిత సత్యాన్ని విడమర్చి చెప్పిన ఆ పాటతోనే తనలో ఆధ్యాత్మికభావం మరింత పెంపొందినట్లు తెలిపారు. ప్రముఖ సినీగేయరచయిత భువనచంద్ర రచించిన మనసు పొరలు, సినారె సాహితీ రాజసం సావనీర్‌ను కాంచన ఆవిష్కరించారు. మంగళవారం నాటి ముగింపు కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా ప్రముఖ సినీ నేపధ్య గాయకులు డాక్టర్ ఎస్‌పీ బాలసుబ్రహ్యణం పాల్గొంటున్నారు.
Published Mon, Oct 30 2017 7:23 PM | Last Updated on Mon, Oct 30 2017 7:23 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment