తెలంగాణ మట్టి పరిమళం సినారె
⇒ ‘స్మరనారాయణీయం’పుస్తకావిష్కరణలో ఎంపీ కవిత
⇒ తెలంగాణ సారస్వత పరిషత్తుకు రూ.10 లక్షల ఎంపీ నిధులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మట్టిలోనే మహత్మ్యం ఉందని, ఎందరో కవులు ఈ గడ్డపై ఉద్భవించారని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత దివంగత డాక్టర్ సి నారాయణరెడ్డి తెలంగాణ గడ్డపై పుట్టిన మట్టి పరిమళం అని కొనియాడారు. తెలంగాణ ప్రభుత్వం, భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన డాక్టర్ సి నారాయణరెడ్డి 87 వ జయంతి, స్మర నారాయణీయం పుస్తకావిష్కరణ కార్యక్రమంలో కవిత మాట్లాడారు. మల్లినాథసూరి, పాల్కురికి సోమన, బమ్మెర పోతన, కాళోజీ, దాశరథి, సినారె వంటి ప్రముఖులకు తెలంగాణ జన్మస్థలమైందన్నారు. సినారె కుటుంబ విలువలకు ప్రాధాన్యత ఇచ్చిన మహోన్నత వ్యక్తి అని పేర్కొన్నారు. సినారె రచనలు పునర్ముద్రించేందుకు తెలంగాణ జాగృతి ముందుంటుందని తెలిపారు. సినారె అమితంగా ఇష్టపడే తెలంగాణ సారస్వత పరిషత్తుకు తన ఎంపీ లాడ్స్ నుంచి రూ.10 లక్షలు కేటాయిస్తానని ప్రకటించారు. సభకు అధ్యక్షత వహించిన సాహిత్య అకాడమీ అధ్యక్షుడు నందిని సిధారెడ్డి మాట్లాడుతూ సాంస్కృతిక శాఖ రూపొందించిన స్మర నారాయణీయం పుస్తకం ప్రకటనలు, సమీక్షలు, వ్యాసాల సమాహారంగా ఉందని అన్నారు.
ఒక కవికి మహోన్నత రీతిలో జరిగిన సత్కారం ఆయన అంతిమయాత్రేనని, ఆయనపై వెలువడిన ఈ సంపుటి కూడా అలాంటిదేనని చెప్పారు. తెలుగు విశ్వవిద్యాలయం ఉప కులపతి ఎస్వీ సత్యనారాయణ మాట్లాడుతూ ‘కవిత నా చిరునామా’అని సినారె తన ఉనికిని చాటారన్నారు. కొడవళ్ల కొసల చివరన రగిలిన ఎర్రజెండాలను సైతం ఆయన వర్ణించి కవిత్వాన్ని సమాజపరం చేశారన్నారు. సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్ మాట్లాడుతూ సినారెను స్మరించుకోవటమంటే మనల్ని మనం సంస్మరించుకోవటమేనన్నారు. కార్యక్రమంలో తెలుగు విశ్వవిద్యాలయం విశ్రాంత ఉపకులపతులు ఆచార్య ఎన్.గోపి, ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, సీఎం వోఎస్‌డీ దేశపతి శ్రీనివాస్, టూరిజం కార్యదర్శి బుర్రా వెంకటేశం, డాక్టర్ జె చెన్నయ్య పాల్గొన్నారు.