Suddala Ashok Teja Songwriter
-
కొత్త కవిత - అంతర్జాతీయ కవి సమ్మేళనం
వంశీ ఇంటర్నేషనల్, శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్, తెలుగు కళా సమితి ఒమన్, సంతోషం ఫిలిం న్యూస్ వారి ఆధ్వర్యంలో డాక్టర్ ఆళ్ల శ్రీనివాసరెడ్డి అమెరికా సహకారంతో వర్చువల్‌గా అంతర్జాతీయ కవి సమ్మేళనం నిర్వహించారు. 12 గంటలపాటు నిర్విరామంగా నిర్వహించిన ఈ అంతర్జాతీయ కవి సమ్మేళనంలో 20 దేశాల నుంచి సుమారు 190 మంది కవులు పాల్గొని తమ కొత్త కవితలు వినిపించారు. సినారే జయంతి సందర్భంగా డాక్టర్ సీ నారాయణరెడ్డి గారి 90 వ జయంతిని పురస్కరించుకొని ఈ కవి సమ్మెళనం ఏర్పాటు చేశామని ఈ కార్యక్రమ ముఖ్య నిర్వాహకులు వంశీ రామరాజు అన్నారు. వంశీ ప్రచురణలో ప్రతి సంవత్సరం వస్తున్న "కొత్త కథలు" సంకలనం తరహాలో ఇక నుంచి కొత్త కవిత పేరుతో కవితా సంకలనం తీసుకువస్తామన్నారు. ముఖ్య అతిధిగా ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు కేవీ రమణ ముఖ్య అతిథిగా ప్రారంభోపన్యాసం అందించారు. గౌరవ అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పూర్వ ఉపసభాపతి మండలి బుద్ధ ప్రసాద్ , ప్రత్యేక అతిథులుగా తెలంగాణ సారస్వత పరిషత్ కార్యదర్శి జె. చెన్నయ్య, వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా అధ్యక్షులు వంగూరి చిట్టెన్ రాజు, ఒమన్ తెలుగు కళా సమితి కన్వీనర్ అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. న్యూజిలాండ్ నుంచి శ్రీలత మగతల, సౌదీ అరేబియా నుండి రావి దీపిక మరియు వివిధ దేశాల తెలుగు సంఘాల అధ్యక్షులు పాల్గొని కవులకు శుభాభినందనలు తెలియజేశారు. ప్రత్యేక అతిధులు భారతదేశం నుండి ప్రత్యేక ఆహ్వానితులుగా ప్రముఖ సినీ కవులు భువనచంద్ర, సుద్దాల అశోక్ తేజ, రసరాజు, వడ్డేపల్లి కృష్ణ, కాసర్ల శ్యామ్ తదితరులు పాల్గొని నారాయణ రెడ్డి గారికి కవితానివాళులు అర్పించారు. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, సింగపూర్, మలేషియా, హాంకాంగ్, ఇండోనేషియా, ఒమాన్, ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్, బహ్రెయిన్, మారిషస్, దక్షిణాఫ్రికా, యుగాండా, యునైటెడ్ కింగ్డమ్, నార్వే, కెనడా, అమెరికా దేశాలనుండి ఎంతో మంది కవులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆనందంగా ఉంది తొలిసారి నిర్వహించిన అంతర్జాతీయ కవి సమ్మేళనంలో పెద్ద ఎత్తున కవులు, కవయిత్రులు పాల్గొనడం తమ సంస్థకు గర్వకారణంగా ఉందని శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్ అధ్యక్షులు కవుటూరు రత్న కుమార్ ఆనందం వ్యక్తం చేశారు. -
నా ఎదుట... ఆత్రేయ పాట... ఓ చందమామా!
పాట నాతో మాట్లాడుతుంది నా తండ్రి ఆత్రేయ గురించి ఏం చెప్పను. నిముషం సుఖపడితే నెలరోజులు కన్నీళ్లు ఒక్కసారి నవ్వితే - వందసార్లు ఏడ్పులు- రాయక నిర్మాతలను - రాసి ప్రేక్షకులను ఏడిపించడం నేను చూడలేదు కానీ - రాస్తూ - ఏడుస్తున్నప్పుడు చూశాను అంటూ ఆత్రేయ పాట నాతో సంభాషణ మొదలెట్టింది. ‘‘దేవుడు - దయ్యము నాలో నావాసము సేయుచుండి అటునిటు లాగన్ జీవితమతి సంకులమై నావికుడే లేని నావ నడకలు నడిచెన్, ...అని తన జీవితపు ప్రయాణ నిడివి సారాంశాన్ని చిన్ని పద్యంలో నిజాయితీగా నిర్వచించిన బ్రష్ట యోగి’’ - అంది. ‘ఆత్రేయ జీవితం ఇంత తెలిసినట్టు మాట్లాడుతున్నావు - నీవు ‘మనసు గతి ఇంతే’ పాటవా అన్నాను. ‘కాదు’ అంది. శ్రీశ్రీ రాశారని భ్రమపడిన ‘కారులో షికారుకెళ్లె’ పాటవా. ‘‘కాదులే’’ ‘ఎవరీ పాట’ అని నాలో ఆలోచనలు గిలకొడుతుండగా జాలిపడి... నీ ఊహకందను గానీ, తేనె మనసులు ‘చందమామా అందాల మామా’ పాటను అంది. ‘ఔరా’ అనుకున్నాను. సంపాదకీయానికైనా సమ్మోహనపరిచే బాణి ఇవ్వగలిగే మహాదేవన్ సంగీతం. ఆయన... కవికి ట్యూన్ ఇవ్వడం మహాపాపం అని నమ్మిన బోళా సంగీత మహా(దేవుడు) దేవన్. ‘పెళ్లిచూపుల్లో ఎందుకు నచ్చాడో ఆ నచ్చిన తనతో నా సహజీవనమెపుడు...’ అనే భావనను చందమామ కేంద్రబిందువుగా చెప్పాలని ఆత్రేయ తలంపు. ఆత్రేయ కన్నుపెన్ను సున్నితపు త్రాసు. కుప్పలు కుప్పలుగా గుప్పించదు. ఒక్కో అక్షరాన్ని తన నెత్తురులోనో- కన్నీళ్లలోనో అచ్చుబోసి తీసి పదాలుగా పేర్చడం ఆత్రేయ అలవాటు. తను రాయడు డిక్టేట్ చేస్తాడు. మెదడులో అల్లుకుని - తెంపేసి - మళ్లీ మళ్లీ... ఇలా కాగి కాగి... ఆగి ఆగి... వేగి వేగి... లేఖకునితో రాయిస్తాడు. తపిస్తున్నాడు ఆత్రేయ... అపుడు నేనన్నాను... ‘‘తండ్రీ! నీ ఎదుట నేనున్నాను. నన్ను మీరు చూడట్లేదు. మీ ఎదుట... ‘మీరేం చెబుతారో!’ అని మీ అసిస్టెంటు ఉన్నాడు. అందరం కలిస్తే పల్లవిగా కాగితంపై నేనుంటాను’’ అని. ఆశ్చర్యం!! క్షణంలో అల్లుకున్నాడు నా కన్నయ్య. ‘‘చందమామ... అందాల మామా! నీ ఎదుట నేను - వారెదుట నీవు మా ఎదుట ఓ మామా ఎప్పుడుంటావు...’’ తెనుగు సినీ పాటల పూదోటలో ఇలాంటి సన్నివేశానికి ఇంత అపురూపమైన పల్లవి మరొకటి లేదు. రాదు. చంద్రుడు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నా, అటు ప్రేయసికి, ఇటు ప్రియునికి దగ్గరగా కనిపిస్తాడు. ‘అటు తన ఎదురుగా, ఇటు నా ఎదురుగా ఉన్న నువ్వు మా ఎదురుగా ఎప్పుడుంటావు?’ అని అడుగుతుంది కథానాయిక. ‘‘మేమిద్దరం ఎప్పుడు కలుస్తాము’’ అనే విషయాన్ని సినిమాలో ఇంత అందంగా ఇంత కవితాసుందరంగా చందమామను అడగడం నిజంగా చందమామంత అందంగా ఉంది కదూ! ఇక తొలి చరణం ఎంత మహాద్భుతంగా, మహిళా మనస్సును ఎంత సున్నితంగా రాశాడో చూడండి. చాలామంది యువకులకు తెలియనిది ఏంటంటే, యువతులు... ఆత్రేయ కాలంలోనైనా ఈ సుద్దాల అశోక్‌తేజ కాలంలోనైనా యువకుల సౌందర్య సాంద్రత కన్నా వారిచ్చే ‘భద్రత’ను ఎక్కువ కోరుకుంటారనేది. ఆ విషయాన్ని స్త్రీ హృదయాన్ని ఆపాదించుకుని గమనిస్తే ‘గీత రచయితలు పాత్ర హృదయంలోకి వెళ్లి ఎలా పాటని ఆవిష్కరించారో తెలుస్తుంది. ‘పెళ్లిచూపులకు వారొచ్చారు (ఇప్పుడైతే వాడొచ్చాడని రాస్తాం). చూడాలని నే ఓరగ చూశా వల్లమాలిన సిగ్గొచ్చింది - కన్నుల దాక కన్నులు పోక (కళ్లలో కళ్లుపెట్టి చూళ్లేకపోయా) మగసిరి ఎడదనె చూశాను - తలదాచుకొనుటకది చాలనుకున్నాను’- అని ముగిస్తాడు. స్త్రీ హృదయావిష్కరణ - జీవిత గమనంలో ప్రయాసలు - పరుగులు - అలసటలు - ఆవేదనలు - ఆశాభంగాలు - ఆటుపోట్లుంటే ఏమి... తలదాచుకునేటంత విశాలంగా ఉంది అతని మగటిమి చూపే ఛాతీ. పురుషుని మానసిక వయస్సు కన్నా స్త్రీ ఎక్కువ పరిపక్వత కలిగి ఉంటుందని మానసిక శాస్త్రవేత్తల పరిశోధన. ఆ పరిణతి చెందిన స్త్రీ మనస్సును సాధారణ సంభాషణా రూపంలో చరణం రాసి నాలాంటి వారిని తన చరణాగతులను చేస్తాడు. మనసు కవిర్షి - నా తండ్రి ఆత్రేయ - అంటూ నా సజల నేత్రాలయంలో స్ఫటిక మూర్తిగా ఘనీభవించింది. - డా॥సుద్దాల అశోక్‌తేజ, పాటల రచయిత