ఫిరాయింపులు తప్పు కాదు తప్పున్నర! | bjp leader nagam janardhan reddy interview with kommineni srinivasa rao | Sakshi
Sakshi News home page

ఫిరాయింపులు తప్పు కాదు తప్పున్నర!

Published Wed, Jul 5 2017 1:08 AM | Last Updated on Thu, Mar 28 2019 8:37 PM

ఫిరాయింపులు తప్పు కాదు తప్పున్నర! - Sakshi

ఫిరాయింపులు తప్పు కాదు తప్పున్నర!

కొమ్మినేని శ్రీనివాసరావుతో సీనియర్‌ బీజేపీ నేత నాగం జనార్దన్‌ రెడ్డి
రాజకీయాల్లో ఫిరాయింపులు తప్పు మాత్రమే కాదు... చాలా పెద్దపొరపాటు. తెలంగాణలో కానీ, ఏపీలో కానీ రాజ్యాంగాన్నే అవహేళన చేస్తూ జరుగుతున్న ఘటనలు అనైతికమే కాదు.. అసహ్యించుకోవలసిన అంశమని మాజీ మంత్రి, ప్రస్తుత బీజేపీ సీనియర్‌ నేత నాగం జనార్దన్‌ రెడ్డి అన్నారు.

తెలంగాణ ఏర్పడటానికి ప్రధాన కారకుడు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడేనని, తెలంగాణకు అనుకూలంగా ప్రధాన ప్రతిపక్ష నేతగా ఆరోజు ఆయన నిర్ణయం తీసుకోకపోతే, కేంద్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం తెలంగాణకు అనుకూలంగా ఆ నిర్ణయం తీసుకోవడానికి ముందుకు వచ్చేది కాదని నాగం తేల్చి చెప్పారు. తెలంగాణలో మంత్రులు జీవచ్ఛవాలని, ముఖ్యమంత్రి కుమారుడికి తప్ప మరే మంత్రికి అధికారాలు లేవని, ఏపీలో చంద్రబాబు తనయుడు లోకేశ్‌ అలా జోక్యం చేసుకుంటున్నా తప్పే. తప్పు ఎక్కడ జరిగినా తప్పేనని అంటున్న నాగం అభిప్రాయాలు ఆయన మాటల్లోనే...


ప్రస్తుతం మీరు రాజకీయ సంక్షోభంలో ఉన్నట్లున్నారే?
నా రాజకీయ జీవితంలో నేనెప్పుడూ సంక్షోభంలో లేను. ఎన్టీ రామారావు నన్ను రాజకీయాల్లోకి ఆహ్వానించినప్పటినుంచే నా రాజకీయ జీవితం ప్రారంభమైంది. టీడీపీలో ఉంటూనే నిర్మొహమాటంగా మాట్లాడేవాడిని. అదే నాకు 1989లో టికెట్‌ రాకుండా చేసింది. స్వతంత్రంగా పోటీ చేశాను. పార్టీ అధ్యక్షుడు ఎన్టీఆర్‌తో సహా మాలో ఏ ఒక్కరం ఆ ఎన్నికల్లో గెలవలేదు. 1991లో ఎన్టీఆర్‌ పిలిచి మరీ ఎంపీ సీటు ఇచ్చారు. నాది కాంగ్రెస్‌ వ్యతిరేక రాజకీయ పునాది కాబట్టి ఎన్టీఆర్‌ మళ్లీ నన్ను పార్టీలోకి తీసుకున్నారు. 2011లో బాబు నన్ను సస్పెండ్‌ చేసేవరకు టీడీపీలోనే ఉన్నాను.  

తెలంగాణను మేమే సాధించామని టీడీపీ వాళ్లు, కేసీఆర్‌ అంటున్నారు?
కేసీఆర్‌ ఈరోజు ఏమైనా మాట్లాడవచ్చు. కానీ 1969లో 369 మందికి పైగా పోలీసు కాల్పుల్లో బలై, ఇందిరాగాంధీ అర్ధరాత్రి హుటాహుటిన ఢిల్లీనుంచి బయలుదేరి బేగంపేట విమానాశ్రయంలో దిగినా తెలం గాణ రాలేదు. అంత మహాఉద్యమం అది. ఆరోజు పోలీసు తూటాలకు బలైతే ఇప్పుడు ఆత్మబలిదానం చేసుకున్నారు. కానీ తేడా ఏమిటంటే ఇవ్వాళ రాజ్యాంగ ప్రక్రియ ద్వారా తెలంగాణ వచ్చింది. కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు పూర్తిగా మద్దతు ఇవ్వబట్టి తెలంగాణ వచ్చింది.

తెలంగాణ రావడానికి చంద్రబాబే కారణమంటారా?
పొలిట్‌బ్యూరోలో తెలంగాణపై తీర్మానం చేపించింది నేను కాదా? చంద్రబాబుతోనే చెప్పాము. సార్‌ ఇవ్వాళ తెలంగాణపై తీర్మానం చేస్తున్నాం. మేం వెనక్కు పోము. ఒకసారి అడుగు ముందుకేశామంటే ఇక వెనక్కు వచ్చేదే లేదు అని చెప్పేశాను.

అంటే చంద్రబాబు వల్ల తెలంగాణ వచ్చిందంటారు అంతేనా?
ఆయన కూడా దానికి బాధ్యుడే. తెలంగాణకు అనుకూలంగా ప్రధాన ప్రతిపక్ష నేతగా ఆరోజు ఆయన నిర్ణయం తీసుకోకపోతే, కేంద్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం తెలంగాణకు అనుకూలంగా ఆ నిర్ణయం తీసుకోవడానికి ముందుకు వచ్చేది కాదు.

ఏపీని నాశనం చేశారు. మేం కోరుకోని విభజన చేశారని బాబు అంటున్నారే?
చంద్రబాబు ఉద్దేశం ఏమిటంటే రాష్ట్ర రాజ ధాని ఏపీకి లేకుండా పోతుంది కదా. కాబట్టి కొత్త రాజధాని నిర్మాణం కోసం 5 లక్షల కోట్లు అలా పెట్టమన్నారు. ఆ ఉద్దేశంతోటే ఆయన అలా అన్నారు.

కేసీఆర్‌ని ఎదిరించగల సత్తా మీలో ఎంతమందికి ఉంది?
కేసీఆర్‌ని కాదు.. కేసీఆర్‌ అవినీతిని ఎదుర్కునే సత్తా మా పార్టీకి ఉంది. ఆయన అవి నీతిని ఎండగట్టే ఆధారాలు మొత్తంగా మావద్ద ఉన్నాయి. ఇప్పటికే సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్‌కి, సీబీఐకి కొన్ని ఆధారాలు ఇచ్చాము. నీతి ఆయోగ్‌కి ఇచ్చాము. ఇక్కడ రాష్ట్రంలో విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంటుకు ఇచ్చాము.

ఫిరాయింపులపై మీరేమంటారు?
చాలా తప్పు. చాలా పెద్ద పొరపాటు. ఇక్కడ తెలంగాణలో కానీ, అక్కడ ఏపీలో కానీ రాజ్యాంగాన్నే అవహేళన చేస్తూ జరుగుతున్న ఘటనలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఒక పార్టీ సింబల్‌ మీద గెలిచి మరో ప్రభుత్వంలో మంత్రులుగా కొనసాగడం అంటే.. అనైతికతే కాదు అసహ్యించుకోవలసిన పని.

కేసీఆర్, చంద్రబాబు పాలనపై మీ అభిప్రాయం?
పక్క రాష్ట్రం గురించి నాకెందుకండీ. గతంలో చంద్రబాబు పాలన గురించి తెలుసు. మంత్రిగా పనిచేశాను కూడా. కానీ ఇప్పుడు అక్కడ  జరుగుతున్న పాలనగురించి తెలుసుకోకుండా మాట్లాడలేను. ఇక కేసీఆర్‌ పాలన అంటారా అహగాహన లేనితనం కొట్టొచ్చినట్లు కనబడుతుంది. రీడిజైనింగ్, రివైజ్డ్‌ అంచనాల పేరిట వేల కోట్ల రూపాయలు దండుకుంటున్నారు. అవగాహన లేని, మొత్తం అవినీతిమయమైపోయిన పాలన అది. కుటుంబ పాలన జరుగుతోంది. ఒకరిద్దరికి తప్ప ఏ ఒక్క మంత్రికీ అధికారం లేని ప్రభుత్వం దేశం మొత్తం మీద తెలంగాణలోనే సాగుతోంది. నిజంగా దురదృష్టకరం.

తెలంగాణలో మంత్రులెవరికీ స్వేచ్ఛ లేదంటారా?
ఏ ఒక్కరికీ లేదు. నేను తెలంగాణ మంత్రులు జాంబీలు అంటున్నాను. అంటే జీవచ్ఛవాలు అని. వారికేమీ చలనం ఉండదు. స్వతంత్ర నిర్ణయాలు తీసుకోలేరు. ముఖ్యమంత్రి కుమారుడైతే మాత్రం వేరే మంత్రిత్వ శాఖల్లో తలదూర్చి ప్రారంభోత్సవాలు కూడా తనే చేస్తాడా.. ఇలాంటిది ఎక్కడైనా జరుగుతుందా?

మరి ఏపీలో కూడా చంద్రబాబు తనయుడు లోకేశ్‌ ఇలాగే చేయడం లేదా?
ఏపీలో చంద్రబాబు తనయుడు అలా జోక్యం చేసుకుంటున్నా తప్పే. దాన్ని కూడా నేను సమర్థించను. తప్పు ఎక్కడ జరిగినా తప్పే. తెలంగాణలో ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్‌ని చూస్తే నిజంగా బాధేస్తుంది. ఉద్యమం కోసం బలిదానాలు అర్పించిన వారికి దండలేసి మొక్కడం తప్పితే ఆయన చేసేది ఏదైనా ఉందా? ఆయన నియోజకవర్గంలో ఒక పోలీసు అధికారిని బదిలీ చేయించే అధికారం కూడా లేదు. సీఎం అయినా చెప్పాలి. లేదా ఆయన కొడుకైనా చెప్పాలి. పైగా తెలంగాణలో ఇప్పుడు జరుగుతున్న అవినీతిని మునుపెన్నడూ చూడలేదు. ప్రతి ఆఫీసు అవినీతి కంపుతో నిండిపోయింది. రోగం ఒక తావున ఉంటే మందు ఒక తావున పెడుతున్నాడు కేసీఆర్‌. అవినీతి ఎక్కడ జరిగిందో ఆ సబ్‌ రిజిస్ట్రార్ల జోలికి పోకుండా 70 మందిని ఇక్కడికీ అక్కడికీ బదిలీ చేసేస్తే అవినీతి మాయమైపోతుందా?

ఓటుకు నోటు కేసుపై మీ అభిప్రాయం? చంద్రబాబు ఆ కేసులో తప్పు చేశారా లేదా?
కేసు కోర్టులో ఉంది. ఏసీబీ విచారణ చేస్తోంది. దాని గురించి నేను మాట్లాడటం మంచిది కాదు. విషయం కోర్టులో ఉంది. దాని గురించి వ్యాఖ్యానించడం ఎందుకు?

ఓటుకు నోటు కేసులో అభిప్రాయం చెప్పడానికి కూడా ధైర్యం లేని స్థితిలో ఉన్నారా?
నూటికి నూరు శాతం అది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి నేనేమీ మాట్లాడలేను. చంద్రబాబు వాయిస్‌ రికార్డు అయింది కదా. చార్జిషీటులో పేరు వచ్చింది కదా. కేసు నడుస్తోంది. సాగనివ్వండి.

బాబు వచ్చిన తర్వాత ఎన్నికల వ్యయం బాగా పెరిగిందంటే ఒప్పుకుంటారా?
నేను ఉన్నప్పుడయితే అలా జరగలేదు. ఇప్పుడు తెలీదు.

ఎన్టీఆర్, చంద్రబాబు ఇద్దరికీ తేడా ఏమిటి?
ఎన్టీఆర్‌ అంటే ఎన్టీఆరే. ఆయన గ్రేట్‌ మ్యాన్‌. చంద్రబాబు ష్రూడ్‌ పొలిటీషియన్‌. అంటే రాజకీయాల్లో ఆరితేరిపోయిన వాడు.

చంద్రబాబును తెలంగాణ ద్రోహిగా చూస్తారా, మిత్రుడిగా చూస్తారా?
ఆరోజు మేం గట్టిగా పట్టుబట్టి ఉంటే తెలుగుదేశం పార్టీ పొలిట్‌ బ్యూరోలో తెలంగాణ రిజల్యూషన్‌ తప్పకుండా పాస్‌ చేసేవారు. కానీ, మేం పట్టుబట్టకుండానే తెలంగాణ ఏర్పాటుకు మేం ఒప్పుకుంటున్నామని అశోక్‌ గజపతిరాజుతో చెప్పించారు. చంద్ర బాబు నాయుడి మనసులో ఏముందో తెలీదు కానీ విభజన బిల్లు పెట్టండి మేం మద్దతిస్తాం అనే మాటను అశోక్‌ గజపతిరాజు చేత చెప్పించారు.  

మరి అదే అశోక్‌ గజపతిరాజు సమైక్యాంద్ర ఉద్యమానికి నాయకత్వం వహించారు కదా?
మరుసటి రోజే. తెలంగాణకు అనుకూలంగా ప్రకటించిన మరుసటి రోజే ఆయన తన క్వార్టర్‌ ఖాళీ చేసి నేరుగా విజయనగరం వెళ్లిపోయారు. చంద్రబాబు ఆరోజు తీసుకున్న నిర్ణయమే కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ విషయంలో ముందుకెళ్లడానికి దోహదపడింది.

(నాగం జనార్దన్‌ రెడ్డితో ఇంటర్వ్యూ పూర్తి పాఠం: ఇక్కడ క్లిక్‌ చేయండి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement