పార్టీలు మారిన చట్టసభల సభ్యులు తమ పదవులకు రాజీనామా చేయాలని, అలా చేయకుండా మరోపార్టీలో చేరితే వారిపై తప్పక చర్యలు తీసుకోవాలని తెలంగాణ బీజేపీ శాసనసభాపక్ష నేత కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. నిర్దిష్టంగా ఆధారాలు సమర్పిస్తే ఫిరాయించిన ఎంపీలపై తప్పకుండా వేటు వేయాలనే అంశంలో బీజేపీ వైఖరి మారదన్నారు. ఓటుకు కోట్లు విషయంలో చట్టప్రకారం చర్యలు తీసుకోవలసిందేనని, ఆ విషయంలో చంద్రబాబును కూడా తప్పించే ప్రశ్నేలేదన్నారు. చంద్రబాబు తెలంగాణ ఎమ్మెల్సీతో మాట్లాడినట్లు చెబుతున్న సీడీ నిజమే అయితే దానిపై ఏ చర్య అయినా సరే తీసుకోక తప్పదని, అది తెలంగాణా ప్రభుత్వ బాధ్యతని చెప్పారు. కేసీఆర్, చంద్రబాబు మధ్య రాజీ కుదిర్చామని బీజేపీ అధిష్టానం తమకు ఎన్నడూ చెప్పలేదన్నారు. సంక్షేమ పథకాలకు సంబంధించి కొత్త ఒరవడి సృష్టించిన ఘనత వైఎస్సార్‌దేననీ.. ఫీజు రీయింబర్స్ మెంట్, ఆరోగ్యశ్రీ, ఫించన్లు.. ఇలా జీవితం పట్ల జనంలో నమ్మకం కలిగించిన గొప్ప మనిషి ఆయన అంటున్న కిషన్ రెడ్డి అభిప్రాయాలు ఆయన మాటల్లోనే...
పాతికేళ్లుగా మీ ఆకారంలో మార్పులేదు. మీ ఆరోగ్య రహస్యం ఏమిటి?
రహస్యం ఒక్కటేనండి. గత పదిహేనేళ్లుగా నా నియోజకవర్గంలో ప్రతిరోజూ ఏదో ఒక బస్తీలో పర్యటిస్తున్నాను. అలాగే తప్పకుండా ఉదయం పూట నడుస్తాను. ఇంట్లో కూడా ఆహారం మీద నియంత్రణ ఉంటుంది. ఇంట్లో ఉదయం పూట ఒకే ఒక జొన్న రొట్టె తింటాను. తిని బయటకు వెళితే రాత్రి 11 గంటలకే మళ్లీ ఇంటికి వస్తాను. నాకు ఇంట్లో ప్రధాన ప్రత్యర్థులు నా పిల్లలే. స్కూల్ ఫంక్షన్‌కు రమ్మని, ఇతరత్రా అడుగుతుంటారు. అంతకుమించి నా శ్రీమతిని ఇంకా ఇబ్బంది పెట్టి ఉంటాను. మద్యాహ్నం బయట తిన్నా పప్పు, సాంబారు, పెరుగు తప్ప మరేమీ తీసుకోను. రాత్రి ఇంటికి వస్తే మళ్లీ రొట్టె తింటాను. అప్పటికే పిల్లలు నిద్రపోయి ఉంటారు. ఆమెను కూడా లేపకుండా నేనే ఏదో ఒకటి పెట్టుకుని తినేస్తాను. పేదింట్లో తిన్నా, స్టార్ హోటల్‌లో తిన్నా పప్పు, సాంబారు, పెరుగు తప్ప మరేమీ తీసుకోను. ఇదే నా ఆరోగ్య రహస్యం.
రాష్ట్రం కోసం రథయాత్రలు చేశారు. తెలంగాణ ఇప్పుడెలా ఉంది?
తెలంగాణ ప్రజలు ఇవ్వాళ సంతృప్తిగా లేరు. టీఆర్ ప్రభుత్వం ఎన్ని పథకాలు ప్రవేశపెట్టినా, ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు, ప్రచారాలు చేసినా ప్రజల్లో ఎక్కడో అసంతృప్తి కనిపిస్తోంది. ఇంతమందిమి తెలంగాణ కోసం బలిదానాలు చేసింది కేసీఆర్ కుటుంబం కోసమా? మావాళ్లు ఇంతమందిమి చనిపోయింది ఆ కుటుంబ పెత్తనం కింద పనిచేయడం కోసమా? నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర కలిగిన తెలంగాణలో నిజాం ఆలోచనా విధానంతో కేసీఆర్ ప్రభుత్వం పనిచేస్తోందన్న ఆలోచన ప్రజల్లో ఉంది. అన్ని వర్గాల్లో తెలియని అసంతృప్తి. ఎస్టీ యువతలో అసంతృప్తి, రైతుల్లో అసంతృప్తి, నిరుద్యోగ యువత, పట్టణ పేదప్రజల్లో వ్యతిరేకత గూడు కట్టుకుని ఉంది.
శాసనసభా పక్ష నేత అయిన మీకే కేసీఆర్ అప్పాయింట్మెంట్ ఇవ్వలేదా?
కోదండరామ్‌కే ఈ రోజువరకు అప్పాయింట్మెంట్ లేదు. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు ఉదయం అడిగితే సాయంత్రానికి అప్పాయింట్మెంట్ ఇచ్చేవారు. వైఎస్సార్ అయితే చాలామందిమి వెళితే గేటువద్దకే వచ్చి కలిసి మాట్లాడేవారు. అంత గొప్ప సంప్రదాయం పాటించేవారాయన. ఆంద్రాపాలకులే సీఎంలుగా ఉన్నప్పుడు వాళ్ల చాంబర్‌లో రాజకీయనేతలే కాదు. వామపక్ష భావాలున్న ప్రజాసంఘాల నేతలు, విద్యార్థి నాయకులు, కార్మిక నేతలు, కుల సంఘాల నేతలు కూడా స్వేచ్చగా వెళ్లి కూర్చోవడానికి అవకాశం ఇచ్చారు. ఈరోజు ఒక్కటంటే ఒక్క ఘటన అలాంటిది కేసీఆర్ చాంబర్‌లో జరిగిందేమో చూడండిమరి. ఎవ్వరినైనా సరే కేసీఆర్ కలిసే ప్రసక్తే లేదు. దశాబ్దాలుగా సమస్యలపై పోరాడుతున్న కమ్యూనిస్టు కార్మిక నేతలను కూడా కేసీఆర్ కలవడానికి ఇష్టపడటం లేదు.
తెలంగాణలో పత్రికా స్వేచ్ఛపై మీ అభిప్రాయం?
ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించినప్పుడు పత్రికాస్వేచ్ఛపై ఎలాంటి నియంత్రణ అమల్లో ఉండిందో అలాంటి స్థితిని తెలంగాణ కొంతకాలం క్రితం చవిచూసింది. కొన్ని టీవీ చానెళ్లనే మూసివేయించారు. ఆ సందర్భంగా కేసీఆర్ ఏమన్నారు. పది కిలోమీటర్ల పరిధిలో మాకు వ్యతిరేకంగా ఎవరైనా రాస్తే భూమిలోకి తొక్కుతాను అన్న ముఖ్యమంత్రిని ఈ దేశంలో ఎప్పుడైనా చూశామా? కానీ దీనికి వ్యతిరేకంగా ఒక్క పేపర్ మాట్లాడలేదు. ఒక్క టీవీ కూడా మాట్లాడలేదు. తెలంగాణ మొత్తంగా ఒక బ్లాక్ మెయిలింగ్ వాతావరణం, నియంత్రత్వ వాతావరణం ఆవరించింది. ఎంతోమంది సీనియర్ పాత్రికేయులు ఉన్నప్పటికీ యాజమాన్యాలు చెప్పాయి కాబట్టి కేసీఆర్‌కి వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడలేకపోయారు. అందర్నీ నేను దారిలోకి తెచ్చుకున్నాను కదా. నాకు వ్యతిరేకంగా రాసేదెవరు ఇప్పుడు అని ఇప్పటికీ కేసీఆర్ దర్పంగా అంటున్నారు.? టీవీల్లో ఏదైనా చర్చ జరుగుతుంటే, ముఖ్యమంత్రే స్వయంగా ఫోన్ చేసి ఆ చర్చ ఇక ఆపేయ్ అని ఆదేశిస్తుంటే దీన్ని ఏమని అర్థం చేసుకోవాలి?
వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో ఫలితాలు ఎలా ఉంటాయి?
సర్వేల ఫలితాల గురించి ఎవరేం చెప్పుకున్నా, ఒకటి మాత్రం నిజం, వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో హంగ్ తప్పదు. మేం అధికారంలోకి రావడం కష్టసాధ్యమైన కేసీఆర్ ప్రభుత్వానికి మాత్రం మెజారిటీ రాదు.
ఫిరాయింపుల మీద బీజేపీకి ఒక నిర్దిష్ట వైఖరి ఏమైనా ఉందా?
ఫిరాయింపులు చాలా తప్పు. అలా పార్టీలు మారితే ముందుగా తమ పదవులకు రాజీనామా చేయాలనేది మా విధానం. అలా రాజీనామా చేయకుండా మరో పార్టీలో చేరితే వారిపై చర్యలు తీసుకోవాల్సిందే.
వైఎస్సార్‌సీపీ నుంచి ఎన్నికై టీడీపీలో చేరిన ముగ్గురు ఎంపీల సభ్యత్వాన్ని ఎందుకు రద్దు చేయలేదు?
వెంకయ్య నాయుడు ఇటీవలే ఫిరాయింపులపై స్పష్టమైన ప్రకటన చేస్తూ నిర్దిష్టంగా ఆధారాలు సమర్పిస్తే ఫిరాయించిన ఎంపీలపై తప్పకుండా వేటు వేస్తామని చెప్పారు. ఆ విషయంలో మా పార్టీ వైఖరి మారదు. మారబోదు కూడా.
ఓటుకు కోట్లు ఇచ్చి ఎమ్మెల్సీలను టీడీపీ కొనబోయి దొరికిపోతే కేంద్రంలో బీజేపీ వాళ్లే కేసీఆర్‌కీ చంద్రబాబుకీ రాజీ చేశారని వార్తలు?
ఓటుకు కోట్లు విషయంలో చట్టప్రకారం చర్యలు తీసుకోవలసిందే. ఆ విషయంలో చంద్రబాబును కూడా తప్పించే ప్రశ్నేలేదు. రేవంత్ రెడ్డి డబ్బు ఇస్తూ దొరికిపోయినట్లుగానే, చంద్రబాబు తెలంగాణ ఎమ్మెల్సీతో మాట్లాడినట్లు చెబుతున్న సీడీ నిజమే అయితే దానిపై ఏ చర్య అయినా సరే తీసుకోక తప్పదు. అది తెలంగాణా ప్రభుత్వ బాధ్యత. మా అధిష్టానం మాత్రం కేసీఆర్, చంద్రబాబు మధ్య రాజీ కుదిర్చామనే మాట ఇంతవరకు మాకు చెప్పలేదు. అది నిజం కాకపోవచ్చు. ఈ విషయం మీద నిజం ఏమిటన్నది చెప్పాల్సింది కేసీఆర్, చంద్రబాబులే.
విభజన హామీలు అమలు చేయలేదంటూ చంద్రబాబు మోదీని భ్రష్టుపట్టించారు. అయినా మీరు మౌనంగా ఉంటున్నారే?
మిత్రపక్షం కాబట్టి మేము సంయమనంతో ఉంటున్నాం. మేం కూడా వారిలాగా మీడియాకు ఎక్కలేం కదా. దేశంలో ఏయే రాష్ట్రాలకు ఎంతమేరకు కేటాయింపులు ఉన్నాయో ఆ మేరకు కేటాయింపులు జరుపడంలో కేంద్రం ఎవరికీ అన్యాయం చేయలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్టానికి ఏమేం జరగాలో ఆ న్యాయం తప్పకుండా జరుగుతుంది. ఈరోజు కాకపోవచ్చు కానీ ఆ తన బాధ్యతను నెరవేర్చడంలో కేంద్రం వెనక్కి తగ్గదు.
కేసీఆర్ పాలనపై మీ అభిప్రాయం?
టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై తీవ్రమైన అసంతృప్తి ఉంది. ప్రభుత్వం ప్రకటిస్తున్న పథకాలన్నింటిలో అవినీతి రాజ్యమేలుతోంది. మాకోసం పథకాలు ప్రకటించారట కదా. పేపర్లలో బాగానే చూసుకుంటున్నాంలే అంటూ జనం ఈసడించుకుంటున్నారు. పైకి చెప్పేదొకటి. లోపల చేసేదొకటిగా ఉన్న కేసీఆర్ ప్రభుత్వ వ్యవహారం జనంకు బాగానే అర్థమవుతోంది.
(కిషన్ రెడ్డితో ఇంటర్వ్యూ పూర్తి పాఠం కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
Comments
Please login to add a commentAdd a comment