నేరమయ పాలనకు మారుపేరు | kommineni srinivasarao manasulo mata with posani | Sakshi
Sakshi News home page

నేరమయ పాలనకు మారుపేరు

Published Wed, Aug 2 2017 12:32 AM | Last Updated on Tue, Sep 18 2018 8:13 PM

నేరమయ పాలనకు మారుపేరు - Sakshi

నేరమయ పాలనకు మారుపేరు

కొమ్మినేని శ్రీనివాసరావుతో నట, దర్శకుడు పోసాని కృష్ణమురళి ప్రజారాజ్యాన్ని చిరంజీవి కాంగ్రెస్‌లో కలిపేసినప్పుడే నాకు రాజకీయాలపై విరక్తి కలిగింది. ఇక జీవితంలో నేను ఎంపీగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా పోటీ చేయను. కానీ ఎన్నికల్లో మాత్రం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికే సపోర్టు చేస్తా, ఓటేస్తా అని నిర్ణయించుకున్నాను. గతంలో వైఎస్‌ జగన్‌ ఎంపీగా, విజయమ్మ ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు కడపలో క్యాంపెయిన్‌లో పాల్గొని ప్రచారం చేసివచ్చాను. నాకు వైఎస్సార్‌ అంటే ఇష్టం. జగన్‌లో ఆయన పోలికలున్నాయి. నడవడిక ఉంది.

ప్రభుత్వాన్ని ఎవరైనా నడపవచ్చు. ముఖ్యమంత్రి సీటులో ఎవరైనా కూర్చోవచ్చు.. కానీ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం చేస్తున్నన్ని తప్పులను ఎవరూ చేయకూడదని ప్రముఖ సినీ రచయిత, నట దర్శకుడు పోసాని కృష్ణ మురళి చెప్పారు. భూకబ్జాలు, లంచాలు, కమీషన్లు, తప్పుల్ని నిలదీసిన అధికారులను కొట్టడం, నిలదీసిన ప్రజలను లారీల్తో గుద్దేయడం. ప్రతిపక్ష నేతలపై ఎస్సీ, ఎస్టీ వేధింపు కేసులను పెట్టి బలవంతంగా ఫిరాయింపులకు గురిచేయడం.. ఒక్కమాటలో చెప్పాలంటే ఏపీలో ప్రస్తుత పాలకులు లెక్కలేని నేరాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో పవర్‌ఫుల్‌ ఆయుధాన్ని మాకిచ్చారు. అదే ఓటు. మేం దాంతో చెబుతాం సమాధానం అని ఏపీలో జనం ఘోషిస్తున్నారంటున్న పోసాని అభిప్రాయాలు ఆయన మాటల్లోనే...

మీకు రచన అంటే ఇష్టమా పాత్ర పోషణ అంటే ఇష్టమా?
నాకు రైటరంటేనే ఇష్టం. ఎందుకంటే దానివల్లే బతికాను కదా. అదే నాకు అన్నం పెట్టింది. ఎంఏ తెలుగు అనే నా క్వాలిఫికేషనే నన్ను కాపాడింది. ఆ సర్టిఫికెట్‌ చూసే పరుచూరి గోపాలకృష్ణ నన్ను వాళ్ల అన్నయ్యకు పరిచయం చేసి ఈ కుర్రాడిని మనం పెట్టుకుందాం అని చెప్పి తీసుకున్నారు.

మీకు సినిమాల్లో మొదట్లో రాసే అవకాశం ఎలా ఇచ్చారు?
గుంటూరు బస్టాండు నుంచి కనిపించిన బస్సు పట్టుకుని మద్రాసుకు వెళ్లి పరుచూరి బ్రదర్స్‌ని కలిస్తే ఎంఏ తెలుగు కదా... కొటేషన్లు నీకు నచ్చినవి రాయి అన్నారు. వారు భోజనం చేసి వచ్చేలోపు పేకాట ముక్కలపై 70 కొటేషన్లు రాసి చూపించాను. బాగా రాశావే. నువ్వు రైటర్‌ అవుతావు. మాలాగా కష్టపడు అన్నారు. మేనేజర్ని పిలిచి నాలుగు జతల బట్టలు కొనిచ్చారు. బుద్ధిగా ఉండు. బుద్ధిగా పనిచేసుకోపో అన్నారు. అలా నాలుగున్నర ఏళ్లు వారివద్ద ఉన్నాను. 50 సినిమాలకు కథలు రాశాను. మౌనపౌరాటం, కర్తవ్యం వంటి సినిమాలకు రాశాను. పీపుల్స్‌ ఎన్‌కౌంటర్‌ సినిమాకు కథ రాస్తే అవార్డు వచ్చింది.

మీరు రాసిన ఏదైనా మంచి డైలాగు చెబుతారా?
పీపుల్స్‌ ఎన్‌కౌంటర్‌ సినిమాలో పోలీసు అధికారి ఒక నక్సలైటు లీడర్ని పట్టుకుని ఇంటరాగేషన్‌ చేస్తాడు. నెలరోజులలోపు మీ జిల్లాలో నక్సలైట్లను ఏరిపారేస్తానంటాడు. అప్పుడా నక్సలైట్‌ అంటాడు. ఏరిపారేయడానికి బియ్యంలో రాళ్లు కాదు బిడ్డా నక్సలైట్లు అంటే, తూర్పునుంచి పడమరకు.. పడమరనుంచి తూర్పుకు మార్చింగ్‌ చేస్తూ ప్రపంచానికే పహారా కాస్తున్నవాడే నక్సలైట్‌ అంటాడు. ఇలాంటి పంచ్‌ డైలాగులు ఎన్ని రాశానో లెక్క లేదు.

పెద్ద కష్టం లేకుండానే మీరు వారి ఆదరణ సంపాదించారు కదా?
ఇద్దరు పెద్దమనుషుల మధ్య పెరిగాను నేను. ఏ చెడు అలవాటూ లేని మనుషుల మధ్య పెరిగాను. అదే వ్యసనాలు ఉన్నవారి వద్ద పని చేసి ఉంటే సాయంత్రం ఆరు గంటలకు మందు బాటిల్, ఏడు గంటలకు మరొకటి, పది గంటలకు మరొకటి ఇలా ఎంత గబ్బు పట్టాలో అంత గబ్బుపట్టిపోయి ఉండేవాడిని.

డ్రగ్స్‌ కేసులో సినిమావాళ్లు ఇంతమందా?
దేశంలో ప్రతి వ్యవస్థలోనూ లోపాలున్నాయి. విద్యా వ్యవస్థ పాడైపోయింది. అన్నిరకాలుగా ప్రజాస్వామ్యాన్ని రేప్‌ చేసి మరీ గెలుస్తున్నారు కాబట్టి రాజకీయ వ్యవస్థా పాడైపోయింది. అలాగే మీడియా, ప్రభుత్వోద్యోగులు, పోలీసు వ్యవస్థ అన్నిం టిలోనూ లోపాలున్నాయి. అలాగే సినిమా వాళ్లలోనూ ఉన్నాయి కాదనను. కానీ  సినిమా రంగాన్ని మాత్రమే ఎత్తి చూపవద్దు?

పెద్ద పెద్ద నటులూ డ్రగ్స్‌కు అలవాటు పడుతున్నారు కదా.. మానసిక సమస్యలా?
ప్రభుత్వ వైఫల్యం కాబట్టే భారీ మొత్తంలో డ్రగ్స్‌ దేశంలోకి వచ్చి పడుతున్నాయి. డ్రగ్స్‌ మాత్రమే ఎందుకు ఆపాలనుకుంటున్నారు? సిగరెట్లు, బీడీలు, గుట్కా ఇంకా ఎన్నో వ్యసనాలు ఉంటున్నాయి. వాటినెందుకు ఆపరు? ప్రజలను మత్తులో, వ్యసనాల్లో ముంచే ఎన్నో అవకాశాలను ప్రభుత్వం కల్పిస్తోంది కదా? డ్రగ్స్‌ ఎంత ప్రమాదకరమో సిగరెట్లు, మందు, గుట్కాలు, పాన్‌ పరాగ్‌లు కూడా అంతే ప్రమాదకరం. కానీ వాటిని మాత్రం షాపుల్లో పెట్టి అమ్మిస్తారు. మనుషులను గబ్బుపట్టించే అన్నింటినీ మీరు ఓపెన్‌లో పెడతారు. కానీ డ్రగ్స్‌ మాత్రం మీకు దెయ్యంలాగ కనబడుతోంది.

డ్రగ్స్‌ చాలా ప్రమాదకరం అని ప్రభుత్వం చర్యలు చేపట్టింది మరి?
ప్రభుత్వం యాడ్‌ ఇచ్చింది. నా పేరు మహేష్‌. పొగ తాగాను, కేన్సర్‌ వచ్చింది అంటూ జలదరింపజేసే బొమ్మలతో ప్రచారం చేస్తోంది. ప్రభుత్వం పొగాకును, చుట్టలను ఎందుకు నిషేధించలేదు? పొగ తాగుట హానికరం అని యాడ్‌ వేసి కూడా మళ్లీ షాపుల్లో అమ్మడానికి ఎందుకు అనుమతిస్తున్నారు? డ్రగ్స్‌ని నిషేధించినవారికి వాటిని నిషేధిం చడం చేతకాదా?

ఇంతకూ డ్రగ్స్‌ వాడుతున్న నటీనటులను మీరు సమర్థిస్తున్నారా?
నేనొకటే చెబుతాను. డ్రగ్స్‌ ప్రమాదకరమని ఇంతగా చెబుతున్నారే.. మందు తాగి ఎంతమంది చావడంలేదు? పొగ తాగి ఎంతమందికి కేన్సర్‌ రాలేదు? కాబట్టి డ్రగ్స్‌తో పాటు వీటిని కూడా బ్యాన్‌ చేసి తర్వాత మాట్లాడండి.

సినిమా పరిశ్రమను అధికారులు టార్గెట్‌ చేస్తున్నారని మీ అభిప్రాయమా?
సిట్‌ వాళ్లు ముందే చెప్పారు. మాకు కొన్ని ఆధారాలు దొరికాయి. వాటిని ధ్రువపర్చుకునేందుకు అనుమానం కలిగినవారిని పిలిచి విచారిస్తున్నాం. అంతే కానీ మేం నోటీసులిచ్చామంటే వారిని అరెస్టు చేస్తామని కాదు అని వారు చాలా స్పష్టంగా చెప్పారు.

నోటీసులకే ఈ పరిస్థితి వస్తే రేపు నిజంగా ఏదయినా జరిగితే?
డ్రగ్స్‌ వాడుతున్నానని నాకు నోటీసులిచ్చారనుకోండి. నేను కోర్టులకు వెళ్లను. మీమీద అనుమానం ఉంది. కెల్విన్‌ పక్కన మీరు ఉన్నట్లు ఫొటో ఉంది మీరు విచారణకు రావాలి అని సిట్‌ వాళ్లు చెబితే ఒకపౌరుడిగా నేను వెళ్లాలి. నేను ఈ దేశానికి జవాబుదారిని. నా ఇంటికి మాత్రమే కాదు. అకుల్‌ సబర్వాలే కాదు.. ఎవరు పిలిచినా సరే వస్తానని చెప్పి మరీ వెళ్లి వారి ముందు కూర్చుం టాను. ఇంకా అనుమానం ఉంటే లై డిటెక్టర్‌ పరీక్ష చేసుకోండి. దొరికితే జైల్లో పెట్టండి, నన్ను క్షమించవద్దు అంటాను. సమాజాన్ని క్లీన్‌గా పెట్టడానికి వాళ్లు ప్రయత్నిస్తున్నారు.  అందుకే అర్ధరాత్రి వారు ఫోన్‌ చేసి రమ్మన్నా నేను వెళతాను.

చంద్రబాబు పాలనపై మీ అభిప్రాయం?
చంద్రబాబు పెద్ద లీడర్‌. అందులో సందేహమే లేదు. కానీ ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు తెలుగు దేశం పార్టీని అడ్వాంటేజీగా తీసుకుని చాలామంది చాలా తప్పులు చేస్తున్నారు. కులరాజకీయాలు చేస్తున్నారు. మంత్రి మా కమ్మోడు.. మేం ఏమయినా చేస్తాం అంటున్నారు. నేను దీన్ని కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ‘ప్రజాస్వామ్యంలో మాకు పవర్‌ఫుల్‌ ఆయుధం ఇచ్చారు. అదే ఓటు. మేం దాంతో చెబుతాం సమాధానం’. ఇదే జనం అభిప్రాయం. ప్రభుత్వం ఏదైనా కావచ్చు. సీఎం సీటులో ఎవరయినా కూర్చోవచ్చు. కానీ ఇన్ని తప్పులు చేయకూడదు. భూ కబ్జాలు, లంచాలు, వనజాక్షిని కొట్టడం, జనాలను లారీతో గుద్ది చంపడం, భూమానాగిరెడ్డిపై ఎస్సీఎస్టీ కేసు పెట్టి మరీ, తనను పార్టీలోకి లాక్కోవడం... ఇవన్నీ వైరుధ్యాలంటామా, వైషమ్యాలంటామా, స్వప్రయోజనమంటామా? ఒక్కమాటలో చెప్పాలంటే ఏపీలో లెక్కలేని నేరాలకు పాలకులు పాల్పడుతున్నారు.

అమరావతి రాజధానిపై మీ అభిప్రాయం?
రాళ్లలో బియ్యముంటే పక్కన పెడతాం. బియ్యంలో రాళ్లుంటే పక్కన బెడతాం. కాని రాళ్లే బియ్యమైతే దేన్ని పక్కన బెట్టగలం. నేను నిజాలు ఇలాగే చెబుతాను కాబట్టి నన్ను కూడా రేపు ఆ పార్టీవాళ్లు వచ్చి కొట్టినా కొట్టవచ్చు. గతంలోనే నన్ను బెదిరించారు. అదిచేస్తాం ఇది చేస్తాం అన్నారు. ఎవరికీ భయపడేదే లేదు.

(పోసాని కృష్ణమురళితో ఇంటర్వ్యూ పూర్తి పాఠం కింది లింకుల్లో చూడండి)
https://goo.gl/yhaRAA
https://goo.gl/qt6rGT

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement