రాజధాని ముసుగులో ‘రియల్‌ ఎస్టేట్‌’: ఆర్కే | KSR Interview with MLA alla ramakrishna reddy | Sakshi
Sakshi News home page

రాజధాని ముసుగులో ‘రియల్‌ ఎస్టేట్‌’: ఆర్కే

Published Wed, Sep 27 2017 1:04 AM | Last Updated on Tue, Aug 14 2018 11:26 AM

KSR Interview with MLA alla ramakrishna reddy - Sakshi

పైకి ఎన్నిమాటలైనా చెప్పవచ్చు కానీ అమరావతిలో రాజధాని నిర్మాణం కలే కాదు కల్ల కూడా అంటూ మంగళగిరి ఎమ్మెల్యే, వైఎస్సార్సీపి నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి తేల్చి చెప్పారు. ఆ విషయం రాజధాని ప్రాంత రైతులకు పూర్తిగా అర్థమైపోయింది కాబట్టే తాము ఇచ్చివేసిన భూముల్లో కూడా వారు ఇప్పటికీ పంటలు వేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కేంద్రం పైసా విదల్చకుండా, ప్రపంచ బ్యాంకు నిధులు రాకుండా, నాలుగైదు భవనాలు కూడా కట్టని ప్రభుత్వం రాజధాని పేరుతో రియల్‌ ఎస్టేట్‌కి తెరతీస్తోందన్నారు. చంద్రబాబు చేస్తున్నదల్లా సంవత్సరానికి రెండు మూడు శంకుస్థాపనలు చేయడమేగానీ, ఒక్క శాశ్వత భవనం కూడా కట్టలేదని జనంలో ఒకరకమైన అనుమానం, భయం కలుగుతూ వస్తున్నాయంటున్న ఆళ్ల రామకృష్ణారెడ్డి అభిప్రాయం ఆయన మాటల్లోనే...

ప్రశ్న: ల్యాండ్‌ పూలింగ్‌ సక్రమ విధానమని, పలువురు మద్దతిచ్చారని బాబు అంటున్నారే?
జవాబు: దేశంలో ఇంతకుముందు ఎక్కడా ల్యాండ్‌ పూలింగ్‌ని పెట్టలేదు. ఆ విధంగా అది అక్రమం. మరొకటి. ల్యాండ్‌ అక్విజిషన్‌ యాక్ట్‌ అనేది ఉన్నప్పుడు ల్యాండ్‌ పూలింగ్‌ పెట్టాల్సిన అవసరం లేదు. పైగా మీకిష్టమైతేనే భూమి ఇవ్వండి ఇష్టం లేకుంటే ఇవ్వొద్దని ల్యాండ్‌ పూలింగ్‌ చట్టంలో చాలా స్పష్టంగా ఉంది. కానీ మా భూమిని ఇవ్వం అని చెప్పిన రైతుల మీద బాబు పోలీసులను పురమాయించి కేసులు పెట్టించారు. కొట్టించారు. పంటలు దహనం కూడా చేయించారు. కాబట్టి ఎన్ని దీక్షలూ, ధర్నాలూ చేసినప్పటికీ మాకు ఉపయోగం లేకుండా పోతోంది. అందుకే న్యాయపోరాటం మాత్రమే మాకు దారి చూపిస్తుంది అని భావించే పోరాటం ప్రారంభించాం. ప్రభుత్వంపై సుమారుగా 50 వరకు కేసులు వేసి ఉంటాం. హైకోర్టులో కొట్టివేసినవి మినహా 98 శాతం కేసులు మేమే గెలిచాం.

ప్ర: నమ్మశక్యంగా లేదు. న్యాయవ్యవస్థ అంత బాగా పనిచేస్తోందా?
జ: రాష్ట్రాన్ని అడ్డం పెట్టుకుని బాబు చేస్తున్న అవినీతి వ్యవహారాలపై మేము వేసిన ప్రతి కేసు విషయంలో సక్సెస్‌ అయ్యాం. ఆయన అక్రమంగా నివాసం ఉండే ప్రాంతంలోనే ఇసుకను దారుణంగా కొల్లగొడుతుంటే, ప్రొక్లెయిన్లతో తోడేస్తుంటే మేం అడ్డుకున్నాము. కేసు వేస్తే ఆ దోపిడీ ఆగిపోయింది. నా అమరావతి, నా రాజధాని, నా ఇటుక అంటూ స్కూలు పిల్లలు కూడా పది రూపాయలు తప్పక ఇవ్వాల్సిందే అని సర్క్యులర్‌ పంపి వసూలు చేయడంపై మేం కోర్టు మెట్లెక్కితే.. ప్రభుత్వానికి మొట్టికాయలు పడ్డాయి. ఓటుకు కోట్లు, సదావర్తి కేసుల విషయంలోనూ ఇంతే.

ప్ర: రైతులు స్వచ్ఛందంగానే భూములిచ్చారా?
జ: దానివెనుక కూడా రహస్యం ఉంది. ఇక్కడ కూడా తాడికొండ, తుళ్లూరు, తాడేపల్లి రూరల్, మంగళగిరి రూరల్‌.. ఈ నాలుగు మండలాల్లోనే 29 గ్రామాలూ ఉన్నాయి. వీటిలో తాడికొండ పూర్తిగా మెట్ట ప్రాంతం. ఇక్కడ మునుపు ఎకరా ధర రూ. 5 లక్షలు ఉండేది. వర్షం పడితేనే పంట కాబట్టి వాళ్లు ఆనందంగా ఇచ్చేశారు. 1,400 గజాలు మాకొస్తుంది కదా. ఈ ప్రాంతంలోనే రాజధాని ఉంటే బాగుంటుందని అక్కడి రైతులు అనుకోవడం సబబే. కానీ తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి ప్రాంతాలు పూర్తిగా సారవంతమైన పంట భూముల్ని కలిగి ఉన్నాయి. అందుకే ఇక్కడ భూముల్ని మేం ఇవ్వం అని చాలామంది రైతులు వ్యతిరేకించారు. ఇవ్వాళ్టికి కూడా తుళ్లూరు మండలంలో చాలా మంది మా భూముల్ని ఇవ్వమనే అంటున్నారు. భూములిచ్చిన రైతులకు 32 ఫాంలు లిచ్చింది ప్రభుత్వం. ఫాం 18లో సంతకం చేస్తే ఇక రైతుకు భూమితో ఎలాంటి సంబంధం ఉండదు. పూర్తిగా ప్రభుత్వాధీనంలోకి వెళ్లిపోతుంది. పైగా బాబు రాజధానిని కట్టలేక పోతున్నారు. మోదీ రాజధానికోసం పైసా కూడా ఇవ్వలేదని రైతుల భయం.

ప్ర: మరి రూ.2,500 కోట్లు ఇచ్చామని కేంద్రం అంటోందే?
జ: ఆ రూ. 2,500 కోట్లను ఏం చేశారనే లెక్కలు ఇంతవరకు బాబు ప్రభుత్వం కేంద్రానికి ఇవ్వలేదు. కాబట్టి రాజధానికి డబ్బులు లేవు అనేది ఒక అంశం. కాగా, 13 జిల్లాల ప్రజలు చూడలేకపోవచ్చు కానీ, బాబు రాజధాని విషయంలో ఏం చేస్తున్నారనేది ఆ నాలుగు మండలాల ప్రజలు నిత్యం చూస్తూనే ఉన్నారు. ఇప్పటివరకు 6 లక్షల చదరపుటడుగుల్లో ఒక తాత్కాలిక బిల్డింగ్‌ కట్టగలిగారు తప్ప రాజధానికి మేం ఇది చేస్తున్నాం, ఇది పూర్తయింది అని చెప్పలేదు. కానీ బాబు చేస్తున్నదల్లా సంవత్సరానికి రెండు మూడు శంకుస్థాపనలు చేయడం.

ప్ర: మరి భూములిచ్చిన, ఇవ్వని రైతుల పరిస్థితి ఏమిటి?
జ: ఒకటిమాత్రం నిజం. బాబు రాజధానిని కట్టలేరు అని రైతులకు పూర్తిగా అర్థమైపోయింది. ముఖ్యంగా సమయం లేదు. డబ్బుల్లేవు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసుకోవడానికే బాబు తమ భూములను తీసేసుకున్నాడని అందరికీ అర్థమైపోయింది. పవన్‌ కల్యాణ్‌ చాలాసార్లు రాజధాని ప్రాంతానికి వచ్చారు. ల్యాండ్‌ అక్విజిషన్‌ నోటిఫికేషన్‌ ఇస్తే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ఆయన చెప్పారు. కానీ రాజధాని ప్రాంతంలో దాదాపు అన్ని చోట్లా ఆ నోటిఫికేషన్‌ ఇచ్చేశారు. అయినా పవన్‌ ఏ దీక్షలకు పూనుకోలేదు.

ప్ర: ప్రపంచ బ్యాంకు రాజధాని ప్రాంతాన్ని సందర్శించింది కదా?
జ:  ఏపీలో రాజధాని నిర్మాణం కల్లేనండి. బాబు చేయలేడు. సెక్రటేరియట్, అసెంబ్లీని కూడా శాశ్వత స్థాయిలో కట్టలేకపోయారు. కేంద్రం నుంచి ఎలాంటి సహాయమూ లేదు. ప్రపంచ బ్యాంకు రెండుసార్లు రాజధానిని సందర్శించినా, పైసా విదల్చలేదు. నిజంగా రాజధానిని కడుతున్నారు అని తలిస్తే వాళ్లు అమెరికాలో కూర్చునే నిధులు విడుదల చేసేవారు. క్షేత్రస్థాయికి వచ్చి తనిఖీ చేయవలసిన అవసరం ఉండేది కాదు.  రాజధాని ఒక కల మాత్రమే. ప్రజారాజధానిని చంద్రబాబు కట్టలేరు.

ప్ర: డిజైన్లు అంటూ హడావుడి చేస్తున్నారు కదా?
ఇంతవరకు నాలుగైదు దేశాలకు ప్రత్యేక విమానాల్లో వెళ్లి కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుబారా చేసి డిజైన్లు తీసుకొచ్చారు. అవి చెల్లవని పక్కన పెట్టేశారు. గతంలోనే విజయవాడకు చెందిన ఇంజనీరింగ్‌ విద్యార్థులు ఒక డిజైన్‌ ఇచ్చారు. దాన్నీ పక్కన పెట్టేశారు. ఇక జపాన్‌కి చెందిన మాకీ సంస్థ ఈ ముడుపులు, అవినీతి వ్యవహారాలు మేము పడలేమని ఆరోపించి మరీ పక్కకు తప్పుకుంది.

ప్ర: రహదారుల, శంకుస్థాపనల గతి ఏంటి?
జ: ఇంతవరకు ఎవరైతే పొలాలనిచ్చారో వారికి ప్లాట్‌ కేటాయింపులే జరగలేదు. వాటిలో కూడా కార్నర్‌ బిట్లు, మెయిన్‌ రోడ్డుకు వచ్చే బిట్లను మొత్తంగా తెలుగుదేశం మంత్రులు ఒక బిట్‌గా వాళ్లకు వాళ్లే కేటాయింపు చేసుకున్నారని సాక్ష్యాధారాలతో సహా చూపించాం. రోడ్లు వేసి, ప్లాన్‌ చేసి జోనింగ్‌ చేసుకుని ఏమీ లేకుండా వాటిని అమ్మేసుకుందాం అనే అభిప్రాయానికి చంద్రబాబు వచ్చేశారు.

రాజధానికోసం ఊరూరునుంచి మట్టి నీళ్లు తీసుకొచ్చారు కదా ఏమయ్యాయి?
నీళ్లు తీసుకొచ్చారు.. వాటిని ఆరోజే, అక్కడే పారేశారు. మట్టి తీసుకురమ్మన్నారు. దాన్ని ఒక కుప్పలాగా పోశారు. ఇక ప్రతి ఊరినుంచి బిందెలతో నీళ్లు తీసుకురమ్మన్నారు కొన్ని వేల ఇత్తడి బిందెలు అలా తెప్పించారు. మొత్తం ఎన్ని బిందెలు కొన్నారు? ఇవ్వాళ అక్కడ ఎన్ని ఉన్నాయో చూపించమనండి చాలు.

(ఆళ్ల రామకృష్ణారెడ్డితో ఇంటర్వ్యూ పూర్తి పాఠం కింది లింకుల్లో చూడండి)
https://goo.gl/kHwqc8
https://goo.gl/RjyjCD

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement