రాష్ట్రంలో ఎక్కడ ఏ చిన్న గొడవ జరిగినా, దానికి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి లింకు పెట్టి.. రాజకీయంగా లబ్ధి పొందాలనుకోవడం ప్రతిపక్ష నేత చంద్రబాబుకు, ఆయన కుమారుడు లోకేష్‌కు అలవాటైపోయింది. ఎలాగైనా సరే అధికారంలోకి రావాలని.. ఉన్నవి, లేనివి కల్పించి ప్రజల మనసుల్లో విషం నింపడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. ప్రతిపక్ష నేతననే విషయాన్ని మరచి, చిల్లర గొడవల్లోనూ దూరిపోతున్నారు. పొగలా అనిపిస్తే చాలు.. నిప్పు అంటించి ఆనందం పొందుతున్నారు.
తాజాగా తాడేపల్లిలో మూడు సెంట్ల స్థల వివాదం చోటుచేసుకుంటే.. దాంతోనూ సీఎం వైఎస్ జగన్‌కు ముడిపెడుతూ తండ్రీ కొడుకులు శనివారం ట్వీట్ చేస్తూ సమస్యను పెద్దది చేశారు. వాస్తవానికి ఆ వివాదంలో బాధితుడు సాక్షి విలేకరి కావడమే పాపమైపోయింది. అంతా తెలిసీ.. నిస్సిగ్గుగా.. దుర్మార్గంగా.. అన్యాయంగా.. రాజకీయ పరమపద సోపానంలో అడ్డదారుల్లో నిచ్చెన కోసం వెతుకుతున్నారు. బాబు దయనీయ పరిస్థితిని పాపం అనాలా.. లేక మరేమనాలో ఆ పార్టీ శ్రేణులే నిర్ణయించాలి. ఇంతకూ తాడేపల్లిలో వివాదం వివరాలు ఇలా ఉన్నాయి.
– మంగళగిరి
బాబూ ఇదీ సంగతి..
తాడేపల్లి పోలకంపాడులో స్థల వివాదంపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడితే బాగుండేది. స్థానికంగా సుబ్బారావు అనే వ్యక్తి 1994లో ఏడు సెంట్ల స్థలాన్ని కొనుగోలు చేశాడు. 2010లో పెద్దకుమారుడు కోటేశ్వరరావుకు నాలుగు సెంట్లు, చిన్న కుమారుడు శ్రీనివాసరావుకు మూడు సెంట్లు చొప్పున ఇచ్చాడు. ఈ క్రమంలో కోటేశ్వరరావు తన స్థలంలో ఇల్లు నిర్మించుకోగా, శ్రీనివాసరావు ఆర్థిక సమస్యలతో ఇంటిని నిర్మించుకోలేదు. ఈ స్థలాన్ని ఈనెల 16వ తేదీన శ్రీనివాసరావు వద్ద నుంచి సాక్షి విలేకరి నాగిరెడ్డి పెద్ద మనుషుల సమక్షంలో కొనుగోలు చేశాడు. ఇది గిట్టని కోటేశ్వరరావు గొడవకు దిగాడు. అతనికి ఆపద కలిగి ఉంటే పోలీసులనో, స్థానికులనో పిలవకుండా ‘అయ్యా.. చంద్రబాబూ.. నన్ను కాపాడండి... టీడీపీ నేతలూ.. నన్ను కాపాడండి’ అని కేకలు వేశాడు. దీన్ని బట్టి ఇక్కడ ఏం జరిగిందనేది అందరికీ అర్థమవుతోంది. ఈ విషయం తెలుసుకోకుండా చంద్రబాబు.. సీఎంను, ప్రభుత్వాన్ని, సాక్షి యాజమాన్యాన్ని తిట్టిపోయడం ఎంత వరకు సమంజసం?
– ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే), మంగళగిరి ఎమ్మెల్యే
వాస్తవాలు తెలుసుకోవాలి
పోలకంపాడులో మా నాన్న సుబ్బారావు మా ఇద్దరి అన్నదమ్ములకు స్థలాన్ని విభజించి ఇచ్చారు. నేను నా స్థలాన్ని అమ్ముకున్నాను. మా అన్న అట్లా కోటేశ్వరరావు మాట్లాడేవన్నీ అవాస్తవాలు. యాదవ సంఘం నాయకులు, ఇతర పెద్దలు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి. ఇది కుల సమస్య కాదు. 150 కుటుంబాల వరకు పోలకంపాడులో నివాసముంటున్నాయి. ఇక్కడి వారందరికీ నిజం ఏమిటో తెలుసు. నేను ఆర్థికంగా చితికిపోవడంతో మా తండ్రికి ఆరోగ్యం బాగుండకపోవడంతో, మా అన్నయ్య, వదినలు పెట్టే వేధింపులు తట్టుకోలేకే నా స్థలాన్ని నాగిరెడ్డికి అమ్ముకున్నాను. నాగిరెడ్డి మాకు సాక్షి విలేకరిగా పరిచయం కాదు. మా అందరిలో ఒకడిగా ఉంటాడు. పోలకంపాడు వచ్చి వాస్తవాలు తెలుసుకోవచ్చు.
– అట్లా శ్రీనివాసరావు, స్థలం విక్రేత
స్థలం అమ్మిన మాట వాస్తవం
అట్లా శ్రీనివాసరావు స్థలం అమ్ముతున్నాడని మా అందరితో చెప్పాడు. మా అందరి సమక్షంలోనే నాగిరెడ్డికి స్థలాన్ని విక్రయించాడు. అట్లా శ్రీను స్థలం నాగిరెడ్డికి అమ్మగానే అందులో గోడను కూల్చివేశారు. అప్పుడు నాగిరెడ్డి మాకు తెలియజేశాడు. కేసు పెడతామంటే వద్దులే అని చెప్పాం. మళ్లీ గోడ కట్టుకున్నాడని పదేపదే అతడిని దూషించడం, నాగిరెడ్డి స్థలంలో ఉన్నపుడు గొడవ పెట్టుకోవడం.. నన్న చంపొద్దు అంటూ ప్రాధేయ పడడం చూస్తుంటే పకడ్బందీ ప్లాన్ ప్రకారం చేసినట్లుంది.
– ప్రభాకర్, మధ్యవర్తి
స్థలాన్ని కొనుక్కున్నాను
అట్లా శ్రీనివాసరావు నుంచి నేను స్థలం కొనుగోలు చేసేటప్పుడు సాక్షులను, యాదవ సంఘం పెద్దలను విచారించి కొనుగోలు చేశాను. ఎన్నోసార్లు నాపై దాడిచేసినా నేను ఎప్పుడూ వారిని ఏమీ అనలేదు. అట్లా కోటేశ్వరరావు భార్య నా కుటుంబ సభ్యుల్ని, నన్ను అనేకమార్లు నోటికి వచ్చిన బూతులు తిడుతూ అవమాన పరిచింది. చివరకు వారు పెట్టిన వీడియోలో నా చొక్కా పట్టుకుని లాక్కెళ్లేందుకు ప్రయత్నం చేసినట్లు కనిపిస్తోంది. నేను విడిపించుకోవడానికి విశ్వప్రయత్నం చేసినా నాపై దాడి చేశారు. ఇది పూర్తిగా మా వ్యక్తిగత వివాదం. అయినా దీనికి రాజకీయ రంగు పులమడం బాధాకరం.
– నాగిరెడ్డి, స్థలం కొనుగోలు చేసిన వ్యక్తి
Comments
Please login to add a commentAdd a comment