
సాక్షి, అమరావతి: అమరావతి అసైన్డ్ భూ కుంభకోణం కేసులో గురువారం విచారణకు రావాలంటూ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి సీఐడీ బుధవారం నోటీసు అందజేసింది. అమరావతిలో ఎస్సీ, ఎస్టీల భూములను టీడీపీ నేతలు బలవంతంగా తక్కువ ధరకు గుంజుకున్నారని, అసైన్డ్ భూముల వ్యవహారంలో దళితులకు తీవ్ర అన్యాయం, నష్టం జరిగిందని, దీనిపై విచారణ జరిపి న్యాయం చేయాలని ఎమ్మెల్యే ఆర్కే సీఐడీకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై నమోదైన కేసులో ఏ1గా మాజీ సీఎం చంద్రబాబు, ఏ2గా మాజీ మంత్రి పి.నారాయణ ఉన్నారు.
చంద్రబాబు ఈ నెల 23న, నారాయణ 22న విచారణకు రావాలని ఇప్పటికే సీఐడీ నోటీసులిచ్చింది. ఈ కేసులో ఫిర్యాదుదారైన ఆర్కే వాగ్మూలం నమోదు చేసేందుకు విచారణాధికారిగా ఉన్న సీఐడీ డీఎస్పీ ఎ.లక్ష్మీనారాయణరావు సీఆర్‌పీసీ 160 నోటీసు జారీచేశారు. గురువారం ఉదయం 11 గంటలకు విజయవాడ సత్యనారాయణపురంలోని సీఐడీ రీజినల్ కార్యాలయానికొచ్చి కేసుకు సంబంధించి.. మీకు తెలిసిన వివరాలు చెప్పాలని సీఐడీ నోటీసులో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment