భయపెట్టి.. ప్రభుత్వ భూములూ హాంఫట్‌! | Chandrababu gang assigned land robbery in Amaravati | Sakshi
Sakshi News home page

భయపెట్టి.. ప్రభుత్వ భూములూ హాంఫట్‌!

Published Sat, Jan 20 2024 5:27 AM | Last Updated on Sat, Jan 20 2024 3:09 PM

Chandrababu gang assigned land robbery in Amaravati - Sakshi

సాక్షి, అమరావతి : టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు భూదాహానికి బడుగు, బలహీన వర్గాల అసైన్డ్‌ భూములు సమిధలయ్యాయి. ప్రభుత్వ భూములూ గల్లంతయ్యాయి. చంద్రబాబు, నారాయణ, వారి బినామీలు, సన్నిహితుల హస్తగతమయ్యాయి.

ఏకంగా రూ.4,239.75 కోట్ల విలువైన భూసమీకరణ ప్యాకేజీ వర్తించే 1,072 ఎకరాల అసైన్డ్‌ భూములు.. రూ.760.25 కోట్ల ప్యాకేజీ వర్తించే 328 ఎకరాల ప్రభుత్వ భూములు.. వెరసి భూసమీకరణ ప్యాకేజీ కింద అమరావతిలో దాదాపు రూ.5వేల కోట్ల విలువైన స్థలాలను చంద్రబాబు, నారాయణలు తమ గుప్పెట పట్టడం నమ్మలేని నిజం. సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) దర్యాప్తులో ఆధారాలతో సహా ఆ భూదోపిడీ బట్టబయలైంది. దీంతో సీఐడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. 

రూ.5వేల కోట్ల భూదోపిడీ.. 
ఇలా నాలుగు కేటగిరీల కింద దోపిడీ చేసిన 1,072 ఎకరాల అసైన్డ్‌ భూములకు ప్యాకేజీ ద్వారా చంద్రబాబు, నారాయణ గ్యాంగ్‌ ఏకంగా రూ.4,239.75 కోట్ల విలువైన భూములను హస్తగతం చేసుకుంది. ప్రభుత్వ భూములను హస్తగతం చేసుకుని మరో రూ.760.25 కోట్ల భూసమీకరణ ప్యాకేజీ పొందారు. మొత్తం భూసమీకరణ ప్యాకేజీ కింద రూ.5వేల కోట్ల భూములు కొల్లగొట్టారు.  

జీఓ–1తో భయపెట్టి.. జీఓ–41తో భూదోపిడీ.. 
2014లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాజధాని పేరిట భారీ భూదోపిడీకి చంద్రబాబు స్కెచ్‌ వేశారు. అందుకోసం రాజధాని భూసమీకరణ ప్యాకేజీని నిర్ణయిస్తూ 2015, జనవరి 1న జారీచేసిన జీఓ–1ను జారీచేశారు. అందులో అమరావతిలో ప్రైవేటు భూములకే భూసమీకరణ ప్యాకేజీ ప్రకటించారు. అసైన్డ్‌ భూములకు ఎలాంటి ప్యాకేజీ ప్రకటించలేదు. అనంతరం చంద్రబాబు, నారాయణ తమ బినామీలు, ఏజెంట్లను అమరావతి గ్రామాల్లోకి పంపి ప్రభుత్వం అసైన్డ్‌ భూములను ఎలాంటి ప్యాకేజీ ఇవ్వకుండా ఉచితంగా తీసుకుంటుందని ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద రైతులను భయపెట్టారు. దాంతో తీవ్ర ఆందోళన చెందిన వారు అత్యంత తక్కువ ధరకు అంటే ఎకరాకు కేవలం రూ.2లక్షల నుంచి రూ.5 లక్షలకే చంద్రబాబు, నారాయణ, ఇతర టీడీపీ పెద్దల బినామీలకు అసైన్డ్‌ భూములను సేల్‌డీడ్ల ద్వారా విక్రయిం­చేలా కథ నడిపారు.

అనంతరం.. అసైన్డ్‌ భూములను కూడా ఆరు కేటగిరీల కింద విభజించి భూసమీకరణ ప్యాకేజీ ప్రకటిస్తూ 2016, ఫిబ్రవరి 17న జీఓ–41 జారీచేశారు. ఉన్నతాధికారుల అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ.. కనీసం కేబినెట్‌ ఆమోదం కూడా లేకుండా ఈ జీఓను తీసుకొచ్చారు. అంతేకాదు.. ఏకంగా కోర్టును కూడా మోసంచేసి తమ పన్నాగాన్ని అమలుచేశారు. చట్ట ప్రకారం.. 1954 తరువాత పంపిణీ చేసిన భూములను విక్రయించడం, కొనుగోలు చేయకూడదు. కాబట్టి అమరావతి పరిధిలోని రెవెన్యూ కార్యాలయాల్లో అసైన్డ్‌ భూముల రికార్డులను మాయం చేశారు.

1954 తరువాత భూపంపిణీ రికార్డులు ఏమీలేవని అమరావతి పరిధిలోని మంగళగిరి, తుళ్లూరు, తాడికొండ మండల రెవెన్యూ అధికారులతో ఓ నివేదిక ఇప్పించి న్యాయస్థానానికి సమర్పించారు. అప్పటికే అసైన్డ్‌ భూములు చంద్రబాబు, నారాయణ బినామీల పేరిట ఉండటంతో వారికే భూసమీకరణ ప్యాకేజీ దక్కేలా చేశారు. అందుకోసం కేబినెట్‌ ఆమోదం లేకుండానే ఆ జీఓను జారీ
చేయడం గమనార్హం. 

ప్రభుత్వ భూములూ హాంఫట్‌.. 
ఇక రాజధాని కోసం అమరావతి పరిధిలోని ప్రభుత్వ భూములను కూడా చంద్రబాబు, నారాయణ ముఠా కొల్లగొట్టింది. ఎవరి ఆ«దీనంలోనూ లేని ప్రభుత్వ భూములను గుర్తుతెలియని వ్యక్తుల ఆధీనంలో ఉన్నట్లుగా రికార్డుల్లో చూపించారు. ఆ భూములకు భూసమీకరణ ప్యాకేజీని ప్రకటించారు. అనంతరం అసలు కథను తెరపైకి తెచ్చారు. మొత్తం 328 ఎకరాల ప్రభుత్వ భూములు తమ బినామీలు 522 మంది ఆ«దీనంలో ఉన్నట్లుగా చూపించి భూసమీకరణ ప్యాకేజీ వర్తింపజేశారు. తద్వారా రూ.760.25 కోట్ల విలువైన స్థలాలు కొల్లగొట్టారు.  

బినామీల ద్వారా అసైన్డ్‌ భూములను కొల్లగొట్టిన టీడీపీ పెద్దలు.. 
నారా చంద్రబాబు (టీడీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి) 
నారా లోకేశ్‌  (టీడీపీ ప్రభుత్వంలో మంత్రి) 
పొంగూరు నారాయణ (టీడీపీ ప్రభుత్వంలో మంత్రి) 
గంటా శ్రీనివాసరావు (టీడీపీ ప్రభుత్వంలో మంత్రి) 
దేవినేని ఉమామహేశ్వరరావు (టీడీపీ ప్రభుత్వంలో మంత్రి) 
ప్రత్తిపాటి పుల్లారావు (టీడీపీ ప్రభుత్వంలో మంత్రి) 
రావెల కిశోర్‌బాబు (టీడీపీ ప్రభుత్వంలో మంత్రి) 
తెనాలి శ్రావణ్‌కుమార్‌ (టీడీపీ మాజీ ఎమ్మెల్యే) 
గుమ్మడి సురేశ్‌ (టీడీపీ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావు వియ్యంకుడు) 
మండల ఎస్‌ఎస్‌ కోటేశ్వరరావు (రియల్టర్‌) 
మండల రాజేంద్ర (రియల్టర్‌) టకేవీపీ అంజనీకుమార్‌ (రియల్టర్‌) 
దేవినేని రమేశ్‌ (రియల్టర్‌) టబొబ్బా హరిచంద్రప్రసాద్‌ (రియల్టర్‌) 
హరేంద్రనాథ్‌ చౌదరి (రియల్టర్‌) టపొట్లూరి సాయిబాబు (సిటీ కేబుల్‌) 
దోనేపూడి దుర్గాప్రసాద్‌ (రియల్టర్‌)  

అసైన్డ్‌ భూదోపిడీలో నిందితులు 
ఏ1 : నారా చంద్రబాబు
ఏ2 : పొంగూరు నారాయణ మరో 38 మంది 
సెక్షన్లు : ఐపీసీ సెక్షన్లు 420, 506, 166, 167, 217, 120 (బి) రెడ్‌విత్‌ 34, 35, 36, 37లతోపాటు ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం, అసైన్డ్‌ భూముల అన్యాక్రాంత నిరోధక చట్టం–1977 కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement