Assigned lands collect
-
భయపెట్టి.. ప్రభుత్వ భూములూ హాంఫట్!
సాక్షి, అమరావతి : టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు భూదాహానికి బడుగు, బలహీన వర్గాల అసైన్డ్ భూములు సమిధలయ్యాయి. ప్రభుత్వ భూములూ గల్లంతయ్యాయి. చంద్రబాబు, నారాయణ, వారి బినామీలు, సన్నిహితుల హస్తగతమయ్యాయి. ఏకంగా రూ.4,239.75 కోట్ల విలువైన భూసమీకరణ ప్యాకేజీ వర్తించే 1,072 ఎకరాల అసైన్డ్ భూములు.. రూ.760.25 కోట్ల ప్యాకేజీ వర్తించే 328 ఎకరాల ప్రభుత్వ భూములు.. వెరసి భూసమీకరణ ప్యాకేజీ కింద అమరావతిలో దాదాపు రూ.5వేల కోట్ల విలువైన స్థలాలను చంద్రబాబు, నారాయణలు తమ గుప్పెట పట్టడం నమ్మలేని నిజం. సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తులో ఆధారాలతో సహా ఆ భూదోపిడీ బట్టబయలైంది. దీంతో సీఐడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. రూ.5వేల కోట్ల భూదోపిడీ.. ఇలా నాలుగు కేటగిరీల కింద దోపిడీ చేసిన 1,072 ఎకరాల అసైన్డ్ భూములకు ప్యాకేజీ ద్వారా చంద్రబాబు, నారాయణ గ్యాంగ్ ఏకంగా రూ.4,239.75 కోట్ల విలువైన భూములను హస్తగతం చేసుకుంది. ప్రభుత్వ భూములను హస్తగతం చేసుకుని మరో రూ.760.25 కోట్ల భూసమీకరణ ప్యాకేజీ పొందారు. మొత్తం భూసమీకరణ ప్యాకేజీ కింద రూ.5వేల కోట్ల భూములు కొల్లగొట్టారు. జీఓ–1తో భయపెట్టి.. జీఓ–41తో భూదోపిడీ.. 2014లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాజధాని పేరిట భారీ భూదోపిడీకి చంద్రబాబు స్కెచ్ వేశారు. అందుకోసం రాజధాని భూసమీకరణ ప్యాకేజీని నిర్ణయిస్తూ 2015, జనవరి 1న జారీచేసిన జీఓ–1ను జారీచేశారు. అందులో అమరావతిలో ప్రైవేటు భూములకే భూసమీకరణ ప్యాకేజీ ప్రకటించారు. అసైన్డ్ భూములకు ఎలాంటి ప్యాకేజీ ప్రకటించలేదు. అనంతరం చంద్రబాబు, నారాయణ తమ బినామీలు, ఏజెంట్లను అమరావతి గ్రామాల్లోకి పంపి ప్రభుత్వం అసైన్డ్ భూములను ఎలాంటి ప్యాకేజీ ఇవ్వకుండా ఉచితంగా తీసుకుంటుందని ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద రైతులను భయపెట్టారు. దాంతో తీవ్ర ఆందోళన చెందిన వారు అత్యంత తక్కువ ధరకు అంటే ఎకరాకు కేవలం రూ.2లక్షల నుంచి రూ.5 లక్షలకే చంద్రబాబు, నారాయణ, ఇతర టీడీపీ పెద్దల బినామీలకు అసైన్డ్ భూములను సేల్డీడ్ల ద్వారా విక్రయించేలా కథ నడిపారు. అనంతరం.. అసైన్డ్ భూములను కూడా ఆరు కేటగిరీల కింద విభజించి భూసమీకరణ ప్యాకేజీ ప్రకటిస్తూ 2016, ఫిబ్రవరి 17న జీఓ–41 జారీచేశారు. ఉన్నతాధికారుల అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ.. కనీసం కేబినెట్ ఆమోదం కూడా లేకుండా ఈ జీఓను తీసుకొచ్చారు. అంతేకాదు.. ఏకంగా కోర్టును కూడా మోసంచేసి తమ పన్నాగాన్ని అమలుచేశారు. చట్ట ప్రకారం.. 1954 తరువాత పంపిణీ చేసిన భూములను విక్రయించడం, కొనుగోలు చేయకూడదు. కాబట్టి అమరావతి పరిధిలోని రెవెన్యూ కార్యాలయాల్లో అసైన్డ్ భూముల రికార్డులను మాయం చేశారు. 1954 తరువాత భూపంపిణీ రికార్డులు ఏమీలేవని అమరావతి పరిధిలోని మంగళగిరి, తుళ్లూరు, తాడికొండ మండల రెవెన్యూ అధికారులతో ఓ నివేదిక ఇప్పించి న్యాయస్థానానికి సమర్పించారు. అప్పటికే అసైన్డ్ భూములు చంద్రబాబు, నారాయణ బినామీల పేరిట ఉండటంతో వారికే భూసమీకరణ ప్యాకేజీ దక్కేలా చేశారు. అందుకోసం కేబినెట్ ఆమోదం లేకుండానే ఆ జీఓను జారీ చేయడం గమనార్హం. ప్రభుత్వ భూములూ హాంఫట్.. ఇక రాజధాని కోసం అమరావతి పరిధిలోని ప్రభుత్వ భూములను కూడా చంద్రబాబు, నారాయణ ముఠా కొల్లగొట్టింది. ఎవరి ఆ«దీనంలోనూ లేని ప్రభుత్వ భూములను గుర్తుతెలియని వ్యక్తుల ఆధీనంలో ఉన్నట్లుగా రికార్డుల్లో చూపించారు. ఆ భూములకు భూసమీకరణ ప్యాకేజీని ప్రకటించారు. అనంతరం అసలు కథను తెరపైకి తెచ్చారు. మొత్తం 328 ఎకరాల ప్రభుత్వ భూములు తమ బినామీలు 522 మంది ఆ«దీనంలో ఉన్నట్లుగా చూపించి భూసమీకరణ ప్యాకేజీ వర్తింపజేశారు. తద్వారా రూ.760.25 కోట్ల విలువైన స్థలాలు కొల్లగొట్టారు. బినామీల ద్వారా అసైన్డ్ భూములను కొల్లగొట్టిన టీడీపీ పెద్దలు.. నారా చంద్రబాబు (టీడీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి) నారా లోకేశ్ (టీడీపీ ప్రభుత్వంలో మంత్రి) పొంగూరు నారాయణ (టీడీపీ ప్రభుత్వంలో మంత్రి) గంటా శ్రీనివాసరావు (టీడీపీ ప్రభుత్వంలో మంత్రి) దేవినేని ఉమామహేశ్వరరావు (టీడీపీ ప్రభుత్వంలో మంత్రి) ప్రత్తిపాటి పుల్లారావు (టీడీపీ ప్రభుత్వంలో మంత్రి) రావెల కిశోర్‌బాబు (టీడీపీ ప్రభుత్వంలో మంత్రి) తెనాలి శ్రావణ్‌కుమార్ (టీడీపీ మాజీ ఎమ్మెల్యే) గుమ్మడి సురేశ్ (టీడీపీ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు వియ్యంకుడు) మండల ఎస్ఎస్ కోటేశ్వరరావు (రియల్టర్) మండల రాజేంద్ర (రియల్టర్) టకేవీపీ అంజనీకుమార్ (రియల్టర్) దేవినేని రమేశ్ (రియల్టర్) టబొబ్బా హరిచంద్రప్రసాద్ (రియల్టర్) హరేంద్రనాథ్ చౌదరి (రియల్టర్) టపొట్లూరి సాయిబాబు (సిటీ కేబుల్) దోనేపూడి దుర్గాప్రసాద్ (రియల్టర్) అసైన్డ్ భూదోపిడీలో నిందితులు ఏ1 : నారా చంద్రబాబు ఏ2 : పొంగూరు నారాయణ మరో 38 మంది సెక్షన్లు : ఐపీసీ సెక్షన్లు 420, 506, 166, 167, 217, 120 (బి) రెడ్‌విత్ 34, 35, 36, 37లతోపాటు ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం, అసైన్డ్ భూముల అన్యాక్రాంత నిరోధక చట్టం–1977 కింద ఎఫ్ఐఆర్ నమోదు. -
పచ్చ నేతల దగా.. అసైన్డ్ భూములు స్వాహ
సాక్షి, అమరావతిబ్యూరో : ‘అసైన్డ్, లంక భూముల్ని స్వాధీనం చేసుకుంటామని బెదిరించారు. పట్టాలేని భూములు మా నుంచి దూరమవుతాయనే భయంతో వచ్చిన ధరకు విక్రయించాం. భూములన్నీ టీడీపీ నాయకులు కొన్నాక ప్రభుత్వం అసైన్డ్ భూములకు ప్యాకేజీ ప్రకటించింది. అప్పుడు కూడా ప్రభుత్వం తీవ్ర వివక్ష చూపింది. మెట్ట, అసైన్డ్, లంక భూములకు జరీబు భూములకు ఇచ్చే ప్యాకేజీ ఇవ్వాలని నాలుగేళ్లుగా డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారం కోసం విజ్ఞప్తి చేసినా ఫలితం లేదు. ఈ ఎన్నికల్లో మళ్లీ ఓట్ల కోసం ‘కొత్త’ హామీలు ఇచ్చేందుకు టీడీపీ నాయకులు వస్తున్నారు. దళితులంతా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెబుతాం’ అని రాజధాని ప్రాంత దళిత రైతులు అంటున్నారు. సాక్షి ‘రచ్చబండ’లో వారు తమ ఆవేదనను పంచుకున్నారు. ఇంత మోసం చేస్తారనుకోలేదు తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల పరిధిలోని 29 గ్రామాలను రాజధానిగా ప్రభుత్వం ప్రకటించింది. తుళ్లూరు మండలంలోని రాయపూడి, ఉద్దండరాయునిపాలెం, లింగాయపాలెం, మందడం, వెంకటపాలెం తదితర లంకల్లో సుమారు రెండు వేల ఎకరాల వరకు అసైన్డ్ భూమి ఉంది. ఈ భూములన్నీ కృష్ణా నది మధ్యలో, నదికి కిలోమీటరు దూరంలో ఉన్నాయి. రాజధానిగా ఈ ప్రాంతాన్ని ప్రకటించిన మొదట్లో లంక భూములకు ప్రభుత్వం ఎలాంటి పరిహారం ఇవ్వదని మభ్యపెట్టడంతో కొంత మంది దళిత రైతులు భూములు అమ్ముకున్నారు. ఆ భూముల్లో అధిక శాతం అధికార పార్టీ నాయకులే కొనుగోలు చేశారు. తర్వాత లంక భూములకు ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. – పొన్నూరు రాఘవులు, దళిత రైతు, లింగాయపాలెం ఈ వ్యత్యాసం ఎందుకు? పట్టా ఉన్న జరీబు భూమికి వెయ్యి గజాల నివాస, 450 గజాల వాణిజ్య ప్లాట్లను పరిహారంగా ఇస్తున్నారు. మెట్ట భూమికి వెయ్యి గజాల నివాస, 250 గజాల వాణిజ్య ప్లాట్లను కేటాయించారు. పేద రైతులకు ప్రభుత్వం పంపిణీ చేసిన భూములకు(అసైన్డ్) ఎకరా జరీబు భూమికి 800 గజాల నివాస, 200 గజాల వాణిజ్య స్థలాలను... మెట్ట(అసైన్డ్) భూములకు 800 గజాల నివాస, 100 గజాల వాణిజ్య స్థలాలను కేటాయించింది. లంక భూములకు ఎకరా జరీబు(అసైన్డ్)కు 800 చ.గజాల నివాస, 200 చ.గజాల కమర్షియల్ ప్లాట్లను కేటాయించింది. ఈ వ్యత్యాసం ఎందుకో అర్థం కావడం లేదు. ప్రభుత్వం మాపై కుట్ర చేసి భూములు లాక్కుంటోంది. – కంతేటి ఫకీరయ్య, దళిత రైతు, తుళ్లూరు నాలుగేళ్లుగా పోరాడుతున్నాం పరిహారం విషయంలో ప్రభుత్వం మాపై తీవ్ర వివక్ష చూపిస్తోంది. జీవో 259 ప్రకారం పరిహారం పంపిణీ చేయాలని నాలుగేళ్లుగా కాళ్లరిగేలా తిరిగినా పట్టించుకోలేదు. దీంతో ఓపిక నశించి గతేడాది సెప్టెంబర్‌లో అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చాం. వివక్షకు తావులేకుండా అన్ని భూములకు సమాన ప్యాకేజీ ఇవ్వాలని కోరుతున్నాం. మా భూములంత సారవంతమైనవి ఎక్కడా లేవు. రాజధాని పేరుతో మా భూముల్ని గద్దల్లా తన్నుకుపోయారు. – దాసరి సిలివేసు, దళితరైతు, తుళ్లూరు శివారు జమిందారీ భూములకు అన్యాయం మా వాళ్ల నుంచి కొనుగోలు చేసిన భూములకు ప్యాకేజీ మరీ దారుణంగా ఉంది. వందల ఏళ్లుగా ఈ భూములన్నీ మా ఆధీనంలోనే ఉన్నాయి. మా తాత, ముత్తాత కాలం నుంచి ఈ భూములపైనే ఆధారపడి జీవిస్తున్నాం. ఎకరా జరీబు భూమికి కేవలం 500 చ.గజాల నివాస, వంద గజాల వాణిజ్య ప్లాట్లను ప్రభుత్వం ఇస్తోంది. ఏళ్ల నుంచి సాగు చేస్తూ, ఎలాంటి పట్టా లేని లంక భూములకు 250 చ.గజాల నివాస స్థలంతో ప్రభుత్వం సరిపెడుతోంది. మేం దళితులం కాబట్టే పరిహారం విషయంలో ప్రభుత్వం వివక్ష చూపిస్తోంది. – నేరేళ్ల ప్రకాశ్ రావు, దళిత రైతు, తుళ్లూరు – పి. హరినాథ్‌రెడ్డి , సాక్షి, అమరావతిబ్యూరో -
వెంగళాయంపాలెం అసైన్డ్ భూముల సేకరణకు రంగం సిద్ధం
-
చట్టానికి లోబడి నడుచుకోండి : హైకోర్టు
- అసైన్డ్ భూముల సేకరణపై ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం - చట్టవిరుద్ధంగా వెళితే రైతులు కోర్టుకు రావొచ్చని వెల్లడి - వారి ప్రయోజనాలు కాపాడేందుకు తామున్నామని స్పష్టీకరణ - ఈ అంశంలో కోర్టుకు వివరణ ఇచ్చిన మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ - తహసీల్దార్ షోకాజ్ నోటీసులను ఉపసంహరించుకున్నాం - స్వాధీనం చేసుకున్న భూములను కూడా వెనక్కిచ్చాం - విధివిధానాలను తహసీల్దార్ పాటించలేదు - ఆయనపై చర్యలకు ప్రతిపాదించామని నివేదించిన కలెక్టర్ సాక్షి, హైదరాబాద్: సోలార్ పరిశ్రమ ఏర్పాటు కోసం అసైన్డ్ భూములను సేకరించాలనుకుంటే.. అందుకు ప్రభుత్వం చట్ట నిబంధనలకు లోబడి వ్యవహరించాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఒకవేళ ప్రభుత్వం చట్టవిరుద్ధంగా భూసేకరణకు దిగితే కోర్టును ఆశ్రయించవచ్చని, రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు తామున్నామని వ్యాఖ్యానించింది. అయితే అసైన్డ్ భూముల నుంచి రైతులను ఖాళీ చేయించేందుకు తహసీల్దార్ జారీ చేసిన షోకాజ్ నోటీసులన్నింటినీ ఉపసంహరించినట్లు మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ టి.కె.శ్రీదేవి నివేదించడంతో.. ఈ వ్యాజ్యంపై విచారించేదేమీ లేదంటూ పిటిషన్‌ను పరిష్కరించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావులతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. మహబూబ్‌నగర్ జిల్లా గట్టులో సోలార్ పార్క్ ఏర్పాటు కోసం ప్రభుత్వం భూసేకరణ చేపట్టిన విషయం తెలిసిందే. సోలార్ పరిశ్రమ కోసం ఏళ్ల తరబడి రైతుల అధీనంలో ఉన్న సాగు భూముల అసైన్మెంట్ను రద్దు చేసేందుకు తహసీల్దార్ జారీ చేసిన నోటీసులను సవాలు చేస్తూ న్యాయవాది బి.కొండారెడ్డి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. దీనిపై ఇప్పటికే విచారణ జరిపిన ధర్మాసనం తహసీల్దార్ సత్తయ్య వ్యవహారశైలిని తప్పుపట్టింది. ఆ నోటీసుల్లో తేదీలు లేకపోవడం, భూమి విస్తీర్ణం వంటి వివరాలను పొందుపరచకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై వివరణ ఇవ్వాలని మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. తాజాగా సోమవారం ఈ వ్యాజ్యంపై తిరిగి విచారణ జరిగింది. ఉపాధి కోసమే సోలార్ పరిశ్రమ విచారణ ప్రారంభం కాగానే మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ టి.కె.శ్రీదేవి దాఖలు చేసిన అఫిడవిట్‌ను ప్రభుత్వ న్యాయవాది దుర్గారెడ్డి ధర్మాసనం ముందుంచారు. ఆ జిల్లాలో వర్షాభావ పరిస్థితుల వల్ల పంటలు పండే అవకాశం తక్కువని, రైతులు బతుకు దెరువు కోసం కూలి పనులు చేసుకోవాల్సి వస్తోందని కలెక్టర్ తన అఫిడవిట్లో నివేదించారు. గద్వాల ప్రాంతంలోని రైతులు బోర్లపై ఆధారపడి మాత్రమే సాగు చేయగలుగుతున్నారని, కానీ ఆ బోర్లకు తగినంత విద్యుత్ సరఫరా ఉండటం లేదని వివరించారు. ఈ నేపథ్యంలో వ్యవసాయానికి తగినంత విద్యుత్ అందించేందుకు, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం గట్టు మండల పరిధిలో సోలార్ పార్క్ ఏర్పాటు చేయాలని నిర్ణయించిందన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకే గట్టు మండల పరిధిలో ప్రభుత్వ, అసైన్డ్ భూములను గుర్తిస్తున్నామని... గద్వాల ఆర్డీవో మొదట 6,401 ఎకరాల ప్రభుత్వ, అసైన్డ్ భూములను గుర్తించారని తెలిపారు. తర్వాత గట్టు తహసీల్దార్ 3,071 ఎకరాల సాగుకు పనికిరాని ప్రభుత్వ, అసైన్డ్ భూములను గుర్తించి.. అసైన్డ్ భూముల స్వాధీనానికి నోటీసులు జారీ చేశారని వివరించారు. అయితే ఈ సందర్భంగా తహసీల్దార్ చట్ట నిబంధనల మేర అనుసరించాల్సిన విధివిధానాలను పాటించలేదని.. జిల్లాకు భారీ సోలార్ పరిశ్రమ వస్తే రైతులు, కూలీల ఇబ్బందులు తొలగుతాయన్న భావనతోనే తహసీల్దార్ ఈ విధంగా వ్యవహరించారని నివేదించారు. అయినా తహసీల్దార్‌ది తొందరపాటేనని కలెక్టర్ అంగీకరించారు. ఆయనపై తగిన చర్యలకు ప్రతిపాదించామని తెలిపారు. తహసీల్దార్ జారీ చేసిన షోకాజ్‌లను ఉపసంహరించామని, స్వాధీనం చేసుకున్న భూములను తిరిగి వెనక్కి ఇచ్చామని వివరించారు. చట్ట ప్రకారం చేస్తే ఎలా అడ్డుకోగలం? తాము ఏం చేసినా కూడా చట్టప్రకారమే చేస్తామని కలెక్టర్ తరఫున ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు నివేదించగా.. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ చట్ట ప్రకారం వెళితే ఎవరికీ అభ్యంతరం ఉండదని వ్యాఖ్యానించింది. దీనికి పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది సరసాని సత్యంరెడ్డి జోక్యం చేసుకుంటూ... సోలార్ పరిశ్రమ ఏర్పాటు కోసం 6,400 ఎకరాలను గుర్తించారని, అందులో రైతులకిచ్చిన అసైన్డ్ భూములు కూడా ఉన్నాయని, వాటిని ఎప్పుడైనా తీసుకునే అవకాశం ఉందని కోర్టుకు వివరించారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ.. ‘‘చట్ట ప్రకారం భూసేకరణ జరిపితే దానిని కోర్టు ఎలా అడ్డుకోగలదు? ప్రభుత్వం ఏం చేసినా కూడా చట్ట ప్రకారమే చేయాలి. ఏం చేయాలో ప్రభుత్వానికి మేం చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవేళ ప్రభుత్వం చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తే, మా వద్దకు వచ్చేందుకు కోర్టు తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు మేమున్నాం..’’ అని స్పష్టం చేసింది. షోకాజ్ నోటీసులను ఉపసంహరించిన నేపథ్యంలో ఈ వ్యాజ్యంలో విచారించేందుకు ఏమీ లేదన్న ధర్మాసనం.. దానిని పరిష్కరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.