లింగాయపాలెంలో రచ్చబండలో మాట్లాడుకుంటున్న దళిత రైతులు
సాక్షి, అమరావతిబ్యూరో : ‘అసైన్డ్, లంక భూముల్ని స్వాధీనం చేసుకుంటామని బెదిరించారు. పట్టాలేని భూములు మా నుంచి దూరమవుతాయనే భయంతో వచ్చిన ధరకు విక్రయించాం. భూములన్నీ టీడీపీ నాయకులు కొన్నాక ప్రభుత్వం అసైన్డ్ భూములకు ప్యాకేజీ ప్రకటించింది. అప్పుడు కూడా ప్రభుత్వం తీవ్ర వివక్ష చూపింది. మెట్ట, అసైన్డ్, లంక భూములకు జరీబు భూములకు ఇచ్చే ప్యాకేజీ ఇవ్వాలని నాలుగేళ్లుగా డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారం కోసం విజ్ఞప్తి చేసినా ఫలితం లేదు. ఈ ఎన్నికల్లో మళ్లీ ఓట్ల కోసం ‘కొత్త’ హామీలు ఇచ్చేందుకు టీడీపీ నాయకులు వస్తున్నారు. దళితులంతా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెబుతాం’ అని రాజధాని ప్రాంత దళిత రైతులు అంటున్నారు. సాక్షి ‘రచ్చబండ’లో వారు తమ ఆవేదనను పంచుకున్నారు.
ఇంత మోసం చేస్తారనుకోలేదు
తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల పరిధిలోని 29 గ్రామాలను రాజధానిగా ప్రభుత్వం ప్రకటించింది. తుళ్లూరు మండలంలోని రాయపూడి, ఉద్దండరాయునిపాలెం, లింగాయపాలెం, మందడం, వెంకటపాలెం తదితర లంకల్లో సుమారు రెండు వేల ఎకరాల వరకు అసైన్డ్ భూమి ఉంది. ఈ భూములన్నీ కృష్ణా నది మధ్యలో, నదికి కిలోమీటరు దూరంలో ఉన్నాయి. రాజధానిగా ఈ ప్రాంతాన్ని ప్రకటించిన మొదట్లో లంక భూములకు ప్రభుత్వం ఎలాంటి పరిహారం ఇవ్వదని మభ్యపెట్టడంతో కొంత మంది దళిత రైతులు భూములు అమ్ముకున్నారు. ఆ భూముల్లో అధిక శాతం అధికార పార్టీ నాయకులే కొనుగోలు చేశారు. తర్వాత లంక భూములకు ప్రభుత్వం పరిహారం ప్రకటించింది.
– పొన్నూరు రాఘవులు, దళిత రైతు, లింగాయపాలెం
ఈ వ్యత్యాసం ఎందుకు?
పట్టా ఉన్న జరీబు భూమికి వెయ్యి గజాల నివాస, 450 గజాల వాణిజ్య ప్లాట్లను పరిహారంగా ఇస్తున్నారు. మెట్ట భూమికి వెయ్యి గజాల నివాస, 250 గజాల వాణిజ్య ప్లాట్లను కేటాయించారు. పేద రైతులకు ప్రభుత్వం పంపిణీ చేసిన భూములకు(అసైన్డ్) ఎకరా జరీబు భూమికి 800 గజాల నివాస, 200 గజాల వాణిజ్య స్థలాలను... మెట్ట(అసైన్డ్) భూములకు 800 గజాల నివాస, 100 గజాల వాణిజ్య స్థలాలను కేటాయించింది. లంక భూములకు ఎకరా జరీబు(అసైన్డ్)కు 800 చ.గజాల నివాస, 200 చ.గజాల కమర్షియల్ ప్లాట్లను కేటాయించింది. ఈ వ్యత్యాసం ఎందుకో అర్థం కావడం లేదు. ప్రభుత్వం మాపై కుట్ర చేసి భూములు లాక్కుంటోంది.
– కంతేటి ఫకీరయ్య, దళిత రైతు, తుళ్లూరు
నాలుగేళ్లుగా పోరాడుతున్నాం
పరిహారం విషయంలో ప్రభుత్వం మాపై తీవ్ర వివక్ష చూపిస్తోంది. జీవో 259 ప్రకారం పరిహారం పంపిణీ చేయాలని నాలుగేళ్లుగా కాళ్లరిగేలా తిరిగినా పట్టించుకోలేదు. దీంతో ఓపిక నశించి గతేడాది సెప్టెంబర్‌లో అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చాం. వివక్షకు తావులేకుండా అన్ని భూములకు సమాన ప్యాకేజీ ఇవ్వాలని కోరుతున్నాం. మా భూములంత సారవంతమైనవి ఎక్కడా లేవు. రాజధాని పేరుతో మా భూముల్ని గద్దల్లా తన్నుకుపోయారు.
– దాసరి సిలివేసు, దళితరైతు, తుళ్లూరు
శివారు జమిందారీ భూములకు అన్యాయం
మా వాళ్ల నుంచి కొనుగోలు చేసిన భూములకు ప్యాకేజీ మరీ దారుణంగా ఉంది. వందల ఏళ్లుగా ఈ భూములన్నీ మా ఆధీనంలోనే ఉన్నాయి. మా తాత, ముత్తాత కాలం నుంచి ఈ భూములపైనే ఆధారపడి జీవిస్తున్నాం. ఎకరా జరీబు భూమికి కేవలం 500 చ.గజాల నివాస, వంద గజాల వాణిజ్య ప్లాట్లను ప్రభుత్వం ఇస్తోంది. ఏళ్ల నుంచి సాగు చేస్తూ, ఎలాంటి పట్టా లేని లంక భూములకు 250 చ.గజాల నివాస స్థలంతో ప్రభుత్వం సరిపెడుతోంది. మేం దళితులం కాబట్టే పరిహారం విషయంలో ప్రభుత్వం వివక్ష చూపిస్తోంది.
– నేరేళ్ల ప్రకాశ్ రావు, దళిత రైతు, తుళ్లూరు
– పి. హరినాథ్‌రెడ్డి , సాక్షి, అమరావతిబ్యూరో
Comments
Please login to add a commentAdd a comment