సాక్షి, అమరావతి: కూటి కోసం కోటి పాట్లు అన్నది లోకోక్తి! ఉనికి కోసం ఆర్థిక నేరాలు అన్నది టీడీపీ అధినేత చంద్రబాబు యుక్తి! అధికారంలో ఉండగా రాజధాని పేరుతో రైతుల భూములను సమీకరించిన చంద్రబాబు ఇప్పుడు ఎన్నికల్లో వెదజల్లేందుకు నిధుల కోసం మళ్లీ ఆర్థిక నేరగాళ్లనే ఆశ్రయిస్తున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గత ఎన్నికలకు మించి ఘోర పరాజయం తప్పదని ఆందోళన చెందుతున్న ఆయన... ఉనికి చాటుకునేందుకు యధావిధిగా డబ్బు కట్టలనే నమ్ముకున్నారు. సీనియర్ నేతలను పక్కన పెట్టి ఆర్థికంగా బలవంతులైన ఎన్నారైలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, కాంట్రాక్టర్లను ఎన్నికల బరిలోకి దింపేందుకు గాలం వేస్తున్నారు.
వీళ్లిచ్చే డబ్బుతో పాటు ఎన్నికల్లో వెదజల్లేందుకు తన చుట్టూ ఉన్న ఆర్థిక నేరగాళ్లకు కూడా నిధులు సమీకరించే పని పురమాయించారు. అధిక వడ్డీల ఆశచూపి సామాన్యుల నుంచి డబ్బులు సమీకరించటం, బ్యాంకులను బురిడీ కొట్టించటం, లేని కంపెనీలను సృష్టించి మరీ రుణాలు తెచ్చి ఎగవేయటం వంటి కళల్లో సిద్ధహస్తులైన బాబు ముఠా మళ్లీ ఆ పనిలో పడ్డారు. దీన్లో భాగంగా అధిక వడ్డీల ఎర వేసి అప్పుల రూపంలో డబ్బులు సేకరించే బాధ్యత తన బినామీ అయిన మాజీ మంత్రి నారాయణకు అప్పగించారు. ఇక ఎడాపెడా రుణాలు తీసుకుని బ్యాంకులకు టోపీ పెట్టిన చరిత్ర సుజనా చౌదరిది. దాదాపు 10వేల కోట్లకుపైగా వివిధ బ్యాంకులకు ఎగ్గొట్టిన సుజనాను అరెస్టు చేస్తారన్న భయంతోనే 2019లో ఓడిపోయిన వెంటనే బీజేపీలోకి పంపారు చంద్రబాబు. గంటా శ్రీనివాసరావుదీ రుణాలు ఎగవేసిన బాపతే. వీళ్లు మళ్లీ అదే పనిలో పడ్డారని విశ్వసనీయంగా తెలియవచ్చింది.
ఆర్థిక నేరగాళ్లతో బ్యాంకులకు కన్నమేసి..
వ్యవస్థలను మేనేజ్ చేయడంలో దిట్ట అయిన చంద్రబాబుతో ఆది నుంచి ఆర్థిక నేరగాళ్లు పెనవేసుకుపోయారు. ఆది నుంచీ పలువురు బినామీలను పెంచి పోషిస్తూ వచ్చిన చంద్రబాబు... రాష్ట్రంలో 2014–19 మధ్య అధికారంలోకి వచ్చినపుడు ప్రభుత్వ సహజ వనరులను, వ్యవస్థలను వీళ్లకు అప్పగించేశారు. అంతా అందినకాడికి దోచుకున్నారు. ఇది చాలదన్నట్టు అధికారాన్ని అడ్డం పెట్టుకుని వీరు బ్యాంకులను కూడా అధికారికంగా దోచుకున్నారు. ఎడాపెడా నకిలీ కంపెనీలు పెట్టి... వాటి పేరిట కోటానుకోట్ల రుణాలు తీసుకున్నారు.
► వివిధ బ్యాంకుల నుంచి రూ.10 వేల కోట్ల రుణాలను తీసుకుని ఎగ్గొట్టిన కేసులో సుజనా చౌదరిపై 2018–19లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణ చేపట్టింది. గత ఎన్నికల ఫలితాలు వెలువడగానే టీడీపీని వీడి బీజేపీ పంచన చేరిన సుజనా... ఇప్పటికీ యథేచ్ఛగా ఆర్థిక అక్రమాలు సాగిస్తూనే ఉన్నారని, చంద్రబాబుకు ఇం‘ధనం’ చేకూర్చుతున్నారని టీడీపీ సీనియర్ నాయకుడొకరు వ్యాఖ్యానించారు.
► ప్రత్యూష కంపెనీ పేరుతో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వివిధ బ్యాంకుల నుంచి రూ.141 కోట్ల రుణాన్ని తీసుకోగా వడ్డీతో కలిపి రూ.203.62 కోట్లకు చేరాయి. వాటిని చెల్లించకుండా మొండికేస్తున్న గంటా మరిన్ని ఆర్థిక సంస్థలను కొల్లగొడుతూ టీడీపీకి ఎన్నికల వ్యయాన్ని భారీ ఎత్తున సమకూరుస్తున్నారని సమాచారం.
రిత్విక్‌కు పందేరం..
2019 ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక కేసుల నుంచి తప్పించుకునేందుకు సుజనా చౌదరితో పాటు తనకు అత్యంత సన్నిహితుడైన సీఎం రమేష్ ను కూడా బీజేపీ గూటికి చేర్చారు చంద్రబాబు. ఆయన బీజేపీలో ఉంటున్నా తరిస్తున్నది మాత్రం చంద్రబాబు సేవలోనే. 2014–19 మధ్య అధికారంలో ఉన్నప్పుడు సాగునీటి ప్రాజెక్టుల్లో రూ.వేల కోట్ల విలువైన పనులను సీఎం రమేష్ సంస్థ రిత్విక్ ప్రాజెక్టŠస్‌కు కట్టబెట్టిన చంద్రబాబు కమీషన్లు వసూలు చేసుకున్నారు. రిత్విక్ ప్రాజెక్ట్స్ తోపాటు సీఎం రమేష్కు సన్నిహితంగా ఉండే కాంట్రాక్టు సంస్థల ద్వారా బ్యాంకుల నుంచి భారీగా రుణాలను సేకరిస్తూ టీడీపీకి ఇం‘ధనం’ సమకూర్చుతున్నట్లు ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి.
పోలవరాన్ని పాతిపెట్టి!
పోలవరం ప్రాజెక్టు హెడ్ వర్క్స్ పనులను 2013లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పార్టీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్‌ట్రాయ్‌కు కట్టబెట్టింది. దాన్ని అప్పట్లో ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న చంద్రబాబు తీవ్రంగా తప్పుబట్టారు. అర్హత లేని ట్రాన్స్‌ట్రాయ్‌కి అత్యంత ప్రతిష్టాత్మకమైన పోలవరం పనులు ఎలా అప్పగిస్తారని ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో కాంగ్రెస్ అధిష్టానానికి రూ.వందల కోట్లు ముడుపులు ముట్టాయని ఆరోపించారు. అనంతరం 2014 ఎన్నికల్లో భారీ ఎత్తున ఇం‘ధనం’ సమకూర్చాలనే షరతుతో రాయపాటిని చంద్రబాబు తమ పార్టీలోకి తీసుకున్నారు.
మొబిలైజేషన్ అడ్వాన్సుల రూపంలో ప్రభుత్వం నుంచి తీసుకున్న డబ్బులతోపాటు పోలవరం పనుల కోసం బ్యాంకుల నుంచి ట్రాన్స్‌ట్రాయ్ తీసుకున్న రుణాన్ని సైతం ఎన్నికల ఖర్చుల కోసం చంద్రబాబు వసూలు చేశారని, అలా ఇచ్చేశాం కాబట్టే తాము దివాలా తీయాల్సి వచ్చిందని ఇటీవల ట్రాన్స్‌ట్రాయ్ అధినేత రాయపాటి రంగారావు బహిరంగంగా ప్రకటించటం తెలిసిందే. చంద్రబాబు కమిషన్ల కక్కుర్తితో పోలవరం ప్రాజెక్టుతో పాటు తాము కూడా నాశనమయ్యామని ఆయన స్పష్టంగా చెప్పారు.
కాలేజీలో నారాయణ ‘కౌంటర్’
2014 వరకూ చంద్రబాబు ఆర్థిక వ్యవహారాలను పర్యవేక్షిస్తూ బినామీగా వ్యవహరించిన నారాయణ విద్యాసంస్థల అధినేత పొంగూరు నారాయణ.. అధిక వడ్డీల ఆశ చూపిస్తూ భారీ ఎత్తున రుణాలను సేకరించి చంద్రబాబుకు అందిస్తుంటారు. టీడీపీ హయాంలో నారాయణకు అత్యంత కీలకమైన పురపాలక, పట్టణాభివృద్ధి శాఖను కేటాయించిన చంద్రబాబు ఆయనతో కలసి అమరావతి భూకుంభకోణంలో భారీ ఎత్తున దోచేశారు. అయితే ఎన్నికలు ముగిశాక అధిక మొత్తంలో అప్పులు ఇచ్చిన ఇద్దరు బడా వ్యాపారులు, మార్వాడీలకు నారాయణ టోపీ పెట్టారనే చర్చ నెల్లూరులో భారీ ఎత్తున సాగింది.
ఇప్పుడు కూడా నారాయణ తనకు అలవాటైన రీతిలో అధిక వడ్డీల ఎర వేసి వ్యాపారులు, మార్వాడీలు, ప్రజల నుంచి పెద్ద ఎత్తున రుణాలు సేకరిస్తున్నారు. నెల్లూరులోని నారాయణ వైద్య కళాశాలలో వారం క్రితం నాలుగు కౌంటర్లు తెరిచి నూటికి 5 రూపాయల వడ్డీ ఆశ చూపించి... (అంటే ఏడాదికి 60 శాతం) వ్యాపారులు, మార్వాడీల నుంచి దాదాపు రూ.650 కోట్లు సమీకరించారని సమాచారం. దీన్ని రహస్య ప్రాంతానికి తరలించిన నారాయణ... అక్కడి నుంచి చంద్రబాబు సూచించిన స్థావరాలకు చేరవేయడంలో నిమగ్నమయ్యారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment