Kodi Rama Krishna
-
శతాధిక చిత్రాల దర్శకుడు
-
కోడి రామకృష్ణ ఇకలేరు
హైదరాబాద్ : శతాధిక చిత్రాల దర్శకుడిగా తెలుగు చిత్రసీమపై తనదైన ముద్ర వేసిన కోడి రామకృష్ణ(63) అనారోగ్యంతో శుక్రవారం కన్నుమూశారు. ఫిలింనగర్‌లోని నివాసంలో ఉదయం ఆయనకు స్వల్పంగా గుండెనొప్పి రావడంతో కుటుంబసభ్యులు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. మధ్యాహ్నం ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో ఫిలింనగర్లో విషాదఛాయలు అలముకున్నాయి. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఆయన భౌతికకాయాన్ని ఫిలింనగర్ వెంచర్–2లోని నివాసానికి చేర్చారు. శనివారం మధ్యాహ్నం రాయదుర్గంలోని వైకుంఠ మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మృతిపై పలువురు సినీ ప్రముఖులు, సినీ కార్మికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. కోడి రామకృష్ణ మృతి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో జన్మించిన ఆయన దర్శకులు దాసరి నారాయణరావు వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా సినీ జీవితం ప్రారంభించారు. తన మొదటి సినిమా ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్యతోనే హిట్ కొట్టారు. 100కు పైగా చిత్రాలకు రామకృష్ణ దర్శకత్వం వహించడం విశేషం. (అప్పట్నుంచి ఈ కట్టు నాకు సెంటిమెంట్ అయింది) ఇది చదవండి : దర్శక దిగ్విజయుడు -
మబ్బుల్లో రామయ్య
-
దర్శకుడు కోడి రామకృష్ణ కన్నుమూత
-
నమ్మకం ఇచ్చిన మనిషి వైఎస్సార్
♦ మనసులో మాట రాజకీయనేతగా కంటే వ్యక్తిగా వైఎస్ రాజశేఖరరెడ్డి చాలా మంచిమనిషని, ఈ మనిషి ఉంటే చాలు అనే నమ్మకం ప్రజ లకు ఇచ్చిన గొప్పనేత అని శతాధిక చిత్ర దర్శకుడు కోడి రామకృష్ణ పేర్కొన్నారు. ఏ రంగంలో అయినా పొగిడేవారి కంటే విమర్శించే వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. సరైన విధంగా నచ్చచెప్పగలిగితే ఎంతటి ప్రముఖులైనా మనం చెప్పింది వింటారనేది చిత్రజీవితంలో తాను పొందిన మంచి అనుభవమన్నారు. రాజకీయ జీవితంలో క్షణం కూడా ఖాళీగా గడపకుండా వైఎస్ జగన్ అందరి అభిమానాన్ని చూరగొంటున్నారని, ఆయన కృషి ఫలిస్తుందని చెబుతున్న కోడి రామకృష్ణ అభిప్రాయాలు ఆయన మాటల్లోనే... సినిమాకు చెందిన అన్ని శాఖల్లోనూ ఇంత అనుభవం ఎలా సాధించారు? దర్శకుడికి బాయ్ చేసే పని నుంచి దర్శకుడు చేసే పనివరకు అన్నీ తెలిసి ఉండాలి. మనవద్ద పనిచేసే బాయ్ కష్టం కూడా తెలియాలి. అందుకే కాఫీ అనగానే బాయ్‌ని కేకేయకూడదు. తను ఏ కష్టంలో ఉన్నాడో చూసి అడగాలి. అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్నప్పటినుంచి నేను ఎడిటర్ పనేమింటి, అసిస్టెంట్ పనేమిటి, మ్యూజిక్ ఏమిటి, ఎలా చేస్తారు.. రైటర్ ఎవరు అని అన్నీ తెలుసుకుం టాను. వారినుంచి సహాయం తీసుకుంటాను. ప్రతి రంగంలోనూ ఒక సమర్థుడిని పెట్టుకుంటాను. సమర్థుడు అంటే నన్ను విమర్శించాలి. ఇది బాగా లేదు సార్ అనగలగాలి. అప్పుడే మళ్లీ వెనక్కు చూసుకుంటాం. సినీరంగంలో పొగడ్తలు తప్పవు కదా? పొగడటం అనేది విషం లాంటిది. మన తప్పును మనకు చెప్పే విమర్శ అద్దం లాంటిది. నాకు పొగిడేవారంటే భయం. విమర్శ మనం వెళ్లే దారిలో ఒక సిగ్నల్ లాంటిది. లేదు సార్, బాగా లేదు సర్, మనం పలాని అంశంలో రాజీపడిపోతున్నాం డైరెక్టర్ గారూ అని ఎవరన్నా అంటే వెంటనే అమ్మా అనుకుని అతడికి షేక్ హ్యాండ్ ఇచ్చి మరీ జాగ్రత్త పడాలి. పెద్ద డైరెక్టర్లు, నటులను కూడా మీరు విమర్శించేవారా? ప్రతి ఒక్కరికీ ఒక సైకాలజీ ఉంటుంది. కానీ నేరుగా విమర్శించకూడదు. భానుమతి గారున్నారు. ఆమె డైరెక్టర్, రచయిత, నటి. ఆమెకు ఒక సీన్ చెప్పామంటే తన సూచన చెబుతారు. ఒకే మేడమ్ బాగుంది పెడతాము అని చెప్పి పది నిమిషాలు ఆగి, ఇక్కడ ఇలా వచ్చింది మేడం. ఫరవాలేదా అని అడిగితే అలా వచ్చిందా, అయితేవద్దు తీసేద్దాం అని ఆమె సమాధానపడేవారు. అదే వెంటనే చెబితే కోపం వచ్చేస్తుంది కదా. మంగమ్మగారి మనవడు స్క్రిప్ట్ వినిపించాను. ఆ సినిమాలో ఆవిడ పాత్రకి డబుల్ మీనింగ్ డైలాగులు ఎక్కువ ఉంటాయి. గోపాల్‌రెడ్డిగారు, గణేష్ పాత్రో గారు నేను ఆమె వద్దకు వెళ్లి స్క్రిప్టు చదివి వినిపించగానే సర్రున లేచి వెళ్లిపోయిందామె. ‘వెళ్లిపోండి మీరు బయటకు, కాఫీలు ఇవ్వ డం కూడా దండగ మీకు. భానుమతి అంటే ఏమనుకున్నారు’ అంటూ మండిపడ్డారు. లేదమ్మా, తప్పకుండా స్క్రిప్టు మారుస్తాము అని ఒప్పించాము. సరే మార్చండి అన్నారు. ఆ తర్వాతి రోజు పొద్దున్నే కోడూరులో షూటింగ్. అన్నీ సరిగా ఉన్నాయా లేదా అని ఆమె టెన్షన్ పడుతున్నారు. ఆమె ముందుకు వెళ్లి డైలాగ్ చూపిం చాను. ఫస్ట్ షాట్. చుట్టూ జనం. ‘భయంకర బల్లి బట్టల్లేకుండా స్నానం చేస్తూ బావగారు వచ్చారని లేచి నిలబడిందట’ అని డైలాగ్. ఏకధాటిగా చెప్పేసింది. షాట్ ఓకే. జనమంతా చప్పట్లు కొట్టేశారు. ఆమెకు ఆశ్చర్యమేసింది. నిన్న మీరు వద్దన్న డైలాగ్ ఇదే అని చెప్పాను. అన్ని డైలాగులూ ఇదేరకంగా చెప్పండి మీరు. సినిమా సంవత్సరం ఆడుతుందన్నాను. అలాగే చెబుతాను అని ఒక్క డైలాగ్ కూడా మార్చకుండా అన్నీ చెప్పేశారామె. నచ్చచెప్పడంలోనే ఉందండి అసలు విషయం. ఎన్టీఆర్ పరాభవానికి తప్పు మామదా? లేక అల్లుడిదా? మన ఇంట్లో ఏం జరుగుతోంది, మన చుట్టూ ఏం జరుగుతోందని నిత్యం పరిశీలించుకోవాలి. పనిమనిషి నమ్మకంగా పనిచేస్తూ మన ఇంట్లోనే దొంగతనం చేసిందంటే కారణం ఆమె పరిస్థితులను, ఇబ్బందులను మనం అర్థం చేసుకోకపోవడమే. అవసరాలు వారిని డామినేట్ చేసినప్పుడు అందుబాటులో ఉన్న వస్తువు ఏదైనా సరే తీసుకోవాలనిపిస్తుంది. అందుకే పరిస్థితుల ప్రాబల్యమే రామారావు అలా కావడానికి కారణం అని నమ్ముతాను. వైఎస్సార్ పాలనపై మీ అభిప్రాయం? వైఎస్ రాజశేఖరరెడ్డి నాకు మంచి స్నేహితుడు. సాయిబాబా పెట్టెను మద్రాసు నుంచి హైద్రాబాదుకు విమానంలో తీసుకొస్తుంటే, మా ఆవిడ బరువు మోస్తోం దని చూసి అమ్మా ఆ పెట్టె ఇవ్వు అని అడిగి తీసుకున్నారు వైఎస్సార్. ప్రయాణం ముగిసే దాకా బాబా పెట్టె పట్టుకుని వచ్చారు. ఆరోజు బాబా పెట్టె పట్టుకున్నారు కాబట్టే మీరు సీఎం అయ్యారు అని మా అమ్మ తర్వాత కలిసినప్పుడు చెబితే అవునమ్మా అంటూ నవ్వేశారాయన. వ్యక్తిగా చాలా మంచి మనిషి. ఆయన పాలన కూడా చక్కగా చేశారు. ఈ మనిషి ఉంటే చాలు అనే నమ్మకం ప్రజలకు ఇచ్చారు వైఎస్సార్. వైఎస్ జగన్ పాదయాత్రపై మీ అభిప్రాయం ఏమిటి? వైఎస్ జగన్మోహన్రెడ్డి బాగా కష్టపడుతున్నారు. రాజ కీయాల్లో అసలు తీరికన్నదే లేకుండా, ఎప్పుడూ ఏదో ఒకటి చేస్తూనే ఉన్నారు. ఎప్పటికైనా ఆయన కృషి ఫలిస్తుంది. పైగా ప్రతి ఒక్కరూ ఆయనను ఇష్టపడుతున్నారు. యువనేతగా ఆయన శ్రమిస్తున్న తీరు చూసి, రాజకీయనేతలు కూడా బాగా ఇష్టపడుతున్నారు. కృషి ఉంటే కానీ మనిషి పైకి రాడు అని ఆయన చేసి చెబుతున్నారు. రాజకీయాల కంటే ఆయనలో ఆ తత్వమే నాకు బాగా ఇష్టం. (ఇంటర్వ్యూ పూర్తి పాఠం కింది లింకులో) https://goo.gl/tBWCH9 -
అర్జున్ పైకొస్తాడని అప్పుడే అనుకున్నా : కోడి రామకృష్ణ
‘‘అర్జున్ దర్శక, నిర్మాతల హీరో. తనతో ఐదు సినిమాలు చేశాను. ‘మా పల్లెలో గోపాలుడు’ చిత్రం ద్వారా అర్జున్‌ని నేను పరిచయం చేసినప్పుడు తను గొప్ప నటుడవుతాడని, పైకొస్తాడని అనుకున్నా. అది నిజమైంది. నటుడిగానే కాకుండా మంచి దర్శక, నిర్మాత అని కూడా అనిపించుకున్నాడు’’ అని దర్శకుడు కోడి రామకృష్ణ చెప్పారు. అర్జున్ హీరోగా నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘జై హింద్ 2’. ఈ చిత్రం ఆడియో వేడుకలో పాల్గొన్న కోడి రామకృష్ణ బిగ్ సీడీని ఆవిష్కరించారు. ఆడియో సీడీని నిర్మాత ‘దిల్’ రాజు ఆవిష్కరించి, నటుడు బ్రహ్మానందంకి ఇచ్చారు. అర్జున్ మాట్లాడుతూ- ‘‘ఓ స్టార్ హోటల్లో చెఫ్‌గా పని చేస్తున్న నారాయణ్ కృష్ణన్‌గారు ఉద్యోగాన్ని వదిలేశారు. సమాజ సేవ చేయాలనే ఆకాంక్షతో ఆక్షయ ట్రస్ట్ ప్రారంభించారు. ఆయన రియల్ హీరో అనిపించి, ఈ వేడుకకు పిలిచాం. ఈ చిత్రం కూడా సమాజానికి స్ఫూర్తినిచ్చే విధంగా ఉంటుంది. విద్యా వ్యవస్థ నేపథ్యంలో సాగే చిత్రం. అర్జున్ జన్యా మంచి పాటలు స్వరపరిచారు. నా గత చిత్రాల్లోని ఫైట్స్ అన్నీ ఒక ఎత్తయితే ఈ చిత్రంలోని ఫైట్స్ అన్నీ మరో ఎత్తు’’ అని చెప్పారు. ఈ వేడుకలో మురళీమోహన్, బీవీయస్‌యన్ ప్రసాద్, సి. కల్యాణ్, ‘దిల్’ రాజు, బ్రహ్మానందం తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సహనిర్మాతలు: ఐశ్వర్య, అంజన. -
‘చింతచెట్టు’తో భయపెడతా!
శతాధిక చిత్రాల దర్శకుడు కోడి రామకృష్ణ తనని తాను నిత్య విద్యార్థిలాగానే భావిస్తారు. 32ఏళ్లుగా అదే పరిశ్రమ.. అదే అంకితభావం... అదే క్రమశిక్షణ. ఏ తరహా సినిమానైనా అవలీలగా తెరకెక్కించే ఈ సీనియర్ సృజనాత్మక దర్శకుడి తాజా ప్రయత్నం ‘అవతారం’ రేపు విడుదల కానుంది. ఈ సినిమా గురించి, తన భవిష్యత్ ప్రణాళికల గురించి కోడి రామకృష్ణ ఈ విధంగా చెప్పారు. కేరళలో జరిగిన ఓ యథార్థ సంఘటన ఆధారంగా ‘అవతారం’ సినిమా చేశాం. పాలు అమ్ముకునే అమ్మాయి, 120 ఏళ్ల వృద్ధురాలు, దేవత.. ప్రధానంగా వీరి చుట్టూ తిరిగే కథ ఇది. గ్రాఫిక్స్ ప్రధానంగా సాగే సినిమా ఇది. కానీ, ఏ సన్నివేశంలో గ్రాఫిక్స్ ఉండాలో అక్కడే ఉంటాయి. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి నేననుకున్న విధంగా ‘అవతారం’ని తెరకెక్కించాను. ఇది చాలా మంచి సినిమా. ఇప్పటివరకూ నేను చాలా సినిమాలు చేశాను. కానీ, అన్ని సినిమాలకూ ఇలా చెప్పలేదు. ముఖ్యంగా ఈ సినిమాకి చెప్పడానికి కారణం కథాబలం. రాధిక కుమారస్వామి, రిషి నా కథకు న్యాయం చేశారు. ఇక, భానుప్రియ అభినయం ఓ ప్రత్యేక ఆకర్షణ. ఖర్చుకు వెనకాడకుండా నిర్మాత యుగంధర్ రెడ్డి ఈ సినిమా నిర్మించారు. అవుట్‌పుట్ పట్ల పూర్తి సంతృప్తితో ఉన్నారు. మొదట నుంచీ కూడా నిర్మాతను నా పక్కన పెట్టుకుని సినిమా చేయడం నా అలవాటు. ఒకవేళ నిర్మాత అందుబాటులో లేకపోతే, ఆయనను సంప్రదించిన తర్వాతే సీన్స్ తీస్తా. ఎందుకంటే, ఏ సినిమాకైనా నిర్మాతే ప్రాణం అని నమ్ముతాను. ప్రస్తుతం ‘పుట్టపర్తి సత్యసాయిబాబా’ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాను. ఈ సినిమా నలభై శాతం పూర్తయ్యింది. అలాగే అర్జున్, లక్ష్మీరాయ్ కాంబినేషన్లో ‘రాణీ రాణమ్మ’ చేస్తున్నా. ‘అంకుల్ ఆంజనేయస్వామి’ అనే చిత్రం చేయనున్నాను. ఇందులో ఆంజనేయుడిగా నటించడానికి రాజేంద్రప్రసాద్ సుముఖంగా ఉన్నారు. నా ‘దేవుళ్లు’ సినిమాలో ఆయన ఆంజనేయుడిగా చేశారు. రాజేంద్రప్రసాద్, నా కాంబినేషన్లో ఐదు సినిమాలు వచ్చాయి. అవన్నీ వంద రోజుల సినిమాలే కావడం విశేషం. మా ఊళ్లో నా కళ్ల ముందు జరిగిన సంఘటనలతో ‘చింత చెట్టు’ టైటిల్‌తో ఓ సినిమా చేయాలనుకుం టున్నా. ఇది థ్రిల్లర్ మూవీ. ఈ కథలో విశేషం. ఏంటంటే... మా ఊరు పాలకొల్లులో ఒక చింత చెట్టు ఉండేది. ఆ చెట్టు దగ్గర ప్రతిరోజూ ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటలు వరకూ గోలీలు ఆడేవాళ్లు. ఏదో కాలక్షేపం కోసం కాదు... ఆ రోజుల్లోనే లక్షల్లో పందెం కట్టి ఆడేవాళ్లు. అయితే ఆరు తర్వాత ఆ చెట్టు దగ్గరకు ఎవరూ వెళ్లేవాళ్లు కాదు. ఒకవేళ ఎవరైనా వెళితే, ఒక షరతు మీద వెళ్లేవాళ్లం. అక్కడికెళ్లిన ప్రతిసారీ ఎవరో పిలిచినట్లు ఉంటుంది. కానీ, వెనక్కి తిరిగి చూడకూడదు. అదే షరతు. దెయ్యం ఉంటుందని భయం. ఆ సంఘటనల సమాహారంతో ఈ ‘చింత చెట్టు’ సినిమా చేయబోతున్నా. -
అరుంధతి-2లో నిత్యామీనన్ ?
-
ఎవరి స్టైల్ వారిదే!
ఎక్కడలేని సెంటిమెంట్లన్నీ సినిమా రంగంలో ఉంటాయి. హీరో,హీరోయిన్ కాంబినేషన్- హీరో, దర్శకుడు కాంబినేషన్ - హీరో, నిర్మాత కాంబినేషన్- దర్శకుడు, సంగీత దర్శకుడు కాంబినేషన్ - సినిమా విడుదల నెల, తేదీ, వారం, పండుగలు.. ఇలా అనేక రకాల సెంటిమెంట్లు ఉంటాయి. మూవీ మొఘల్ రామానాయుడు గతంలో సురేష్ మూవీస్ వారి ప్రతి చిత్రంలో ఏదోఒక పాత్రలో తప్పనిసరిగా కనిపించేవారు. ఇక డైరెక్టర్స్ విషయానికి వస్తే ఒక్కో డైరెక్టర్‌ది ఒక్కో స్టైల్. చిత్ర నిర్మాణంలోనే కాకుండా వేషధారణ, భాహ్యారూపంలోనూ ఎవరి ప్రత్యేక వారికి ఉంది. కొంతమంది డైరెక్టర్లు తలకో, చేతులకో కర్చీఫ్‌లు కట్టుకుంటారు. కొంతమంది తలకు పెట్టిన క్యాప్ తీయరు. కొంతమందికి గడ్డం పెంచడం అలవాటు. దర్శకుడు విశ్వనాధ్‌కు ఖాకీ డ్రెస్ వేసుకోవడం అలవాటు. ‘మా పల్లెలో గోపాలుడు’ సినిమా షూటింగ్ దగ్గర నుంచి ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణకు తలకు చేతి రుమాలో, టర్కీటవలో కట్టుకోవడం అలవాటైపోయింది. వాస్తవానికి మొదట ఆయన ఎండవేడిమి నుంచి రక్షణ కోసం కట్టుకున్నారు. ఆ తరువాత అది ఆయనకు అలవాటైపోయింది. సెంటిమెంట్‌గా మారిపోయింది. ఇక గడ్డాలు పెంచే దర్శకుల జాబితా చాలా పెద్దదే ఉంది. త్రివిక్రమ్ శ్రీనివాస్, రాజమౌళి, సుకుమార్, తేజ ... ఇలా అనేక మందికి గడ్డం పెంచడం అలవాటైపోయింది. ఆ తరువాత అదే సెంటిమెంట్‌గా మారిపోయింది. ‘స్వయంవరం’ సినిమాతో త్రివిక్రమ్ శ్రీనివాస్ (ఆకెళ్ల నాగ శ్రీనివాస శర్మ) మాటల రచయితగా సినీరంగంలోకి ప్రవేశించి, ఆ తరువా మాటల మాత్రికుడిగా పేరు తెచ్చుకున్నారు. దర్శకుడిగా తన ప్రయాణం నువ్వే-నువ్వే సినిమాతో మొదలుపెట్టి అతడు, జల్సా, ఖలేజా, జులాయి, అత్తారింటికి దారేది? వంటి చిత్రాలతో విశ్వరూపం చూపారు. ఆయన పేరు చెబితే ముందు ఆయన గెటప్ గుర్తుకువస్తుంది. ఎప్పుడూ ఆయన గడ్డంతోనే కనిపిస్తుంటారు. షూటింగ్ టైంలో మరీ ఎక్కువగా గడ్డం పెంచేస్తుంటారు. సినిమా పూర్తి అయిన తరువాత మాత్రం ఆయన తన గడ్డం మొత్తం తీసివేస్తారు. ఆ రకంగా ఆయనకు హమ్మయ్య! అని ఊపిరి పీల్చుకోవడం అలవాటనుకుంటా. మగధీరుడు, ఈగ వంటి చిత్రాల ద్వారా అగ్రశ్రేణి దర్శకుల జాబితాలో చేరిపోయిన రాజమౌళి కూడా ఎప్పుడూ గడ్డం పెంచుకునే కనిపిస్తుంటారు. ఇప్పుడు ఆయన బాహుబలి సినిమా షూటింగ్ పనిలో ఉన్నారు. తెలుగు సినిమా పరిశ్రమలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న బాహుబలి చిత్రం నిర్మాణంలో ఆయన ఇప్పుడు ఫుల్‌గా గడ్డం పెంచేశారు. ఇక మరో డైరెక్టర్ సుకుమార్ కూడా ఎప్పుడూ గడ్డంతోనే కనిపిస్తూ ఉంటారు. ఆయన కూడా షూటింగ్ పూర్తి అయితే గానీ గడ్డాన్ని తీయరు. ఈ గడ్డం కథాకమామిషలో వీరు గడ్డం తీసివేయటానికి సమయం లేక అలా పెంచేస్తుంటారా? లేక సెంటిమెంటా? చాలా మంది దానిని సెంటిమెంటనే చెబుతుంటారు. -
కోడి రామకృష్ణ దర్శకత్వంలో రూపొందిన ’అవతారం’ ట్రైలర్
-
కోడి రామకృష్ణ మార్కు మాయాజాలం
‘‘ప్రపంచాన్ని నాశనం చేయడానికి పుట్టిన ఓ భూతాన్ని, అదే నక్షత్రంలో పుట్టిన ఓ స్త్రీ ఎలా శాసించింది? మూడు గ్రహణాల వ్యవధిలో జరిగిన ఈ పోరాటంలో గెలుపెవరిది? అనే కథాంశంతో రూపొందిన చిత్రం ‘అవతారం’. సాంకేతికంగా ఈ చిత్రం ఓ అద్భుతం’’ అని కోడి రామకృష్ణ అన్నారు. భానుప్రియ, రాధిక కుమారస్వామి, రిషి ప్రధాన పాత్రధారులుగా కోడి రామకృష్ణ దర్శకత్వంలో యం.యుగంధర్‌రెడ్డి నిర్మించిన చిత్రం ‘అవతారం’. ఈ నెల 27న విడుదల కానున్న ఈ చిత్రం ప్రచార చిత్రాలను విడుదల చేశారు. కోడి రామకృష్ణ మాట్లాడుతూ- ‘‘కేరళలో జరిగిన యథార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. మన నేటివిటీకి అనుగుణంగా మార్పులు చేశాం. జర్మని, అమెరికా, ఆస్ట్రేలియాకు చెందిన సాంకేతిక నిపుణులు కూడా ఈ సినిమాకు పనిచేశారు’’ అని చెప్పారు. 90 నిమిషాల గ్రాఫిక్స్ ఈ చిత్రానికి హైలైట్ అని, కోడి రామకృష్ణగారితో తొలి సినిమా చేయడం ఆనందంగా ఉందని నిర్మాత చెప్పారు. ఇంకా మాటల రచయిత రాజేంద్రకుమార్, యాదగిరి, మహేంద్రరెడ్డి, బాల తదితరులు కూడా పాల్గొన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: ఎం.కవిత.