డ్రగ్స్‌పై రాజీ అతి పెద్ద నేరం..!
కొమ్మినేని శ్రీనివాసరావుతో టాలీవుడ్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ
తెలంగాణకు అనుకూలంగా చంద్రబాబు రహస్యంగా ఉత్తరాలు ఇచ్చేసి తీరా విభజన జరిగిపోయాక అర్ధరాత్రి విభజించారు, ఆంధ్రుల పొట్టకొట్టారు అని ఆరోపిస్తే ఎలా? పైగా విభజన తర్వాత ఇంత అవినీతికర పాలనను చూడలేదు. చేతులు తడపందే ఏపీలో ఇప్పుడు ఏదీ జరగదని అధికారులే చెబుతున్నారు. హైటెక్ సిటీ ప్రాంతంలో తప్పితే హైదరాబాద్‌లో ఏ ప్రాంతంలో అయినా ప్రజలు నడిచిగానీ, కారులో కానీ వెళ్లే చాన్స్ ఉందా? బాబు చేసిన అభివృద్ధి ఇదేనా? దేశమంతా కోట్లమంది డ్రగ్స్‌కు అలవాటు పడినప్పడు సినీ పరిశ్రమను మాత్రమే కౌంటర్ చేయడం తప్పని టాలీవుడ్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అంటున్నారు. డ్రగ్స్ తీసుకోవడం అతి పెద్ద నేరం కాగా దానికి క్షమాపణలు చెప్పడం, కాస్త సరళంగా వ్యవహరించమనడం ఇంకా పెద్ద నేరమని అన్నారు. పైగా సోర్సును బట్టే సిట్ విచారణ జరిగి ఉంటే, దర్శకుడు పూరీ జగన్నాథ్ క్యాంప్‌కు చెందిన వారినే ఎందుకు విచారించారని ప్రశ్నించారు. ఆడవారు ఇళ్లల్లోనే ఉండటం అనేది ఇప్పుడు పోవడంతో సమాన హక్కులూ వచ్చాయనీ.. దురలవాట్లకు సంబంధించి ఆడా మగా తేడా లేదంటున్న తమ్మారెడ్డి భరద్వాజ అభిప్రాయాలు ఆయన మాటల్లోనే...
సినిమారంగం అప్పుడెలా ఉండేది, ఇప్పుడెలా ఉంటోంది?
అప్పట్లో కలెక్టివ్‌గా టీమ్ వర్క్ ఉండేది. ఇప్పుడు అది పోయింది. అప్పుడు కూడా హీరో, హీరోయిన్‌ని కేంద్ర స్థానంలో ఉంచి సినిమాలు తీసేవారు. ఇప్పుడయితే హీరో కోసమే సినిమాలు తీస్తున్నారు. మా రోజుల్లో చిన్న సినిమాలను మా ఇష్టమొచ్చిన హీరో, హీరోయిన్లను కొత్తవారిని తీసుకుని తీసేవారం. ఇప్పుడు అలా కాదు. ఫలానా హీరో సినిమా సూపర్ హిట్ అయితే దాన్ని కొత్తవాళ్లను పెట్టి కాపీ చేస్తున్నారు. ఒకరకంగా డూప్లికేట్ సినిమాలన్నమాట. ట్రెండ్ నడుస్తోంది.. అలాగే వెళ్లాలి అనేది ఇప్పుడు ఫ్యాషన్.
నష్టాలపై చిత్ర పరిశ్రమలో ఒక ఏర్పాటు, విధివిధానాలు పెడితే మంచిదేమో కదా?
అలాంటి కన్వెన్షన్లు ఏవీ పెట్టకూడదు. ఇవ్వకూడదు. వ్యాపారం వ్యాపారమే. ఏ సిని మాకయినా ఒక అంచనా ఉంటుంది. బాహుబలి–2 చాలాబాగా ఆడింది. వేల కోట్లు బిజినెస్ చేసింది. రేపు ఇంకొకరెవరైనా అంత ఖర్చు పెట్టి సినిమా తీస్తానంటే అంత బిజినెస్ ఏ సినిమా కూడా చేయదు. టాలీవుడ్‌లో సినిమా బిజినెస్ వందకోట్లు, ఇప్పుడయితే మరో 20 కోట్లు ఎక్కువగా బిజినెస్ చేయవచ్చేమో.. కానీ బాహుబలి రూ.2 వేల కోట్లు బిజినెస్ చేసింది కాబట్టి నాకు కూడా 2 వేల కోట్లు ఇవ్వు అని నేను అమ్మితే కొనుక్కున్నవాడు ఏమైపోతాడు? రేపు మరో పెద్ద హీరో సినిమాను 500 కోట్లకు కొంటాను అని ఎవడైనా సిద్ధపడితే అది వాడి తప్పు అంతే.
డ్రగ్స్ కేసు ఇండస్ట్రీ మీద వేసిన ప్రభావం ఎంత, మీ స్పందన ఏంటి?
చిత్రపరిశ్రమపై డ్రగ్స్ ప్రభావం ఉండదు. దేశంలో డ్రగ్స్ తీసుకునేవారు కోట్లమంది ఉంటున్నారు. సినీ పరిశ్రమలో కొన్ని వేలమంది డ్రగ్స్ తీసుకుంటూ ఉండవచ్చు. ఇలాంటి వారివల్ల సినీ పరిశ్రమపై ప్రభావం ఉండదు.
సినీ పరిశ్రమ క్షమాపణలు చెప్పడం, వర్మ కౌంటర్ ఇవ్వడంపై మీ అభిప్రాయం?
క్షమాపణలు చెప్పలేదు కానీ ఈ కేసులో కాస్త సరళంగా వెళ్లమని కోరినట్లున్నారు. అది కూడా తప్పే. అలా ఎందుకడగాలి? తమ్మారెడ్డి డ్రగ్స్ తీసుకుంటున్నాడు అని తెలిస్తే ఫిలిం చాంబర్ వెంటనే ఈ భరద్వాజను లోపల వేయండి అని చెప్పాలి. అతడు మా చాంబర్‌కు ప్రెసిడెంటుగా చేశాడు. కొంచెం చూసీ చూడనట్లుగా ఉండండి అని చెప్పకూడదు. డ్రగ్స్ కేసులో ఇదే జరిగి ఉంటే తప్పు. మావాళ్లను చూసీ చూడనట్లుగా ఉండండి, వదిలేయండి అని ఆ ఉత్తరంలో ఉంటే మాత్రం అది క్రైమ్ అండి. చాలా పెద్ద క్రైమ్.
సిట్ విచారణ ప్రాతిపదిక సరైందేనా?
నాకు తెలిసినంతవరకు ఫిలిం చాంబర్ పెద్దలు క్షమాపణ చెప్పలేదు. ఒక వేళ చెప్పి ఉంటే తప్పు. కాస్త ఉదారంగా చూడమని చెప్పి ఉన్నా తప్పే. అదే సమయంలో డ్రగ్స్ కేసు విచారణ తీరు కూడా తప్పే. ఎందుకంటే సిట్ విచారించిన వారిలో రవితేజ, చార్మితోసహా తొమ్మిదిమంది పూరీ జగన్నాథ్ క్యాంపులో ఆఫీసులో కూర్చునేవారే. అంటే ఇంత పెద్ద చిత్రపరిశ్రమలో పూరీ జగన్నాథ్ తాలూకూ మనుషులే, ఆ క్యాంప్‌కు సంబంధించినవారే డ్రగ్స్ తీసుకుంటున్నారా అనేది నా ప్రశ్న. సోర్సును బట్టే చేసి ఉంటే మిగతావారిని ఎందుకు వదిలేశారు?
నటులే కాదు నటీమణులకు డ్రగ్స్ ఎలా అలవాటు అవుతోంది?
మీరు హైటెక్ సిటీకి వెళ్లండి. సాయంత్రంపూట రోడ్డుమీదే అమ్మాయిలు సిగిరెట్లు తాగుతూ మందు బాటిళ్లు పట్టుకుని నడిచి వెళుతుంటారు. వాళ్లకు అలవాటు అయిందా అంటే మనం ఏం చెబుతాం? దురలవాట్లకు సంబంధించి ఆడా మగా అని లేదండి. సమాజంలో చాలా తేడా వచ్చేసింది. మన బాల్యంలోలాగా ఆడవారు ఇళ్లల్లోనే ఉండటం అనేది ఇప్పుడు పోయింది. సమాన హక్కులూ వచ్చాయి వాటితో వాటు ఇలాంటి మార్పులు కూడా వచ్చేశాయి. లిబరలైజ్ అయ్యారు. వాళ్ల హక్కు వాళ్లది.
వైఎస్‌ఆర్, బాబు పాలనలో మీరు గమనించిన పోలికలు, తేడాలు ఏమిటి?
ఇద్దరికీ మధ్య పోలికలు లేవండి. నక్కకు నాగలోకానికి మధ్య ఉన్నంత తేడాలే ఉన్నాయి. మొదట్లో చంద్రబాబుతో చాలా సన్నిహితంగా ఉండేవాడిని. తనకు విజన్ ఉంది. కానీ ఆయన మనుగడకోసమే ఉండే విజన్ అది. సమాజాన్ని బాగు చేయడానికి విజన్ ఉంటుంది. సమాజాన్ని ఆకర్షించడానికి విజన్ ఉంటుంది. చంద్రబాబుది మాత్రం ఆకర్షణా విజన్ అని చెప్పొచ్చు. తొలిసారి ఆయనతో భేటీలో నాతో అయిదుగంటలపాటు మాట్లాడారు. ఆయన మాటలని చూస్తే ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ అంత గొప్ప రాష్ట్రం లేదనిపించింది. బాబు మాటలు వింటున్నంత సేపు ఇలాంటి సీఎంకి మనం చాకిరీ చేయకపోతే జీవితమే వేస్ట్ అనిపించింది. అంతగా నమ్మేసి పొద్దున్న ఆరుగంటలకు ఆయన కార్యాలయానికి వెళితే రాత్రి 12 గంటలకు బయటపడేవాడిని. బాబు ఇంట్లోనే పడి ఉండేవాళ్లం. గంటలు గంటలు చెబుతుంటారు కాని దాని అమలు మాత్రం కనబడేది కాదు. ఈరోజుకి కూడా ఆయన మాట్లాడితే హైదరాబాద్‌ను డెవలప్ చేశానంటారు. అంత అభివృద్ధి జరిగివుంటే ఒక హైటెక్ సిటీ ప్రాంతంలో తప్పితే నగరం మొత్తం మీద ఏ అభివృద్ధి ప్రాంతంలో అయినా ప్రజలు నడిచిగానీ, కారులో కానీ వెళ్లే చాన్స్ ఉందా? ఎవరికి వాళ్లు ఇష్టానుసారం తోచిన చోట నిర్మాణాలు చేసుకుంటూ పోతుంటే ఇక హైదరాబాద్‌ను నేనే డెవలప్ చేశానంటే కుదురుతుందా?
ప్రజలకోసం కాదు, బాబు కోసం విజన్ అంటున్నారు, స్పష్టంగా చెబుతారా?
ఎన్టీఆర్‌ను గద్దె దింపాక చంద్రబాబుతో నాలుగేళ్లు కొనసాగాను. ఆ నాలుగేళ్లలో ఆయన చెప్పిన మాట ఒక్కటి కూడా పూర్తిగా అమలు కాలేదు. ప్రయత్నాలు కొన్ని జరిగాయి. స్లో అయి ఉంటే క్షమించవచ్చు. కానీ దేన్నయితే తాను మాటల్లో వ్యక్తం చేశారో, దాంట్లో 50 శాతం అయినా పని జరగాలి. జరగలేదు. అదే వైఎస్‌ఆర్ విషయానికి వస్తే సినీ పరిశ్రమకోసమో, ఫిలిం చాంబర్ కోసమో ఫలానా సహాయం చేయాలి అని చెప్పి మేం వెనక్కి వస్తుండగానే దారిలోనే ఫోన్ చేసి ఎలాంటి సహాయం కావాలి అని అడిగేవారు. అంటే ఇచ్చిన మాటకు ఫాలో అప్ చేసేవారు. ఏదైనా సహాయం కోరి ఆయన్ని కలిసి కాగితం ఇచ్చి తిరిగి వస్తే ఆ పని కచ్చితంగా పూర్తయ్యేది. అంత నమ్మకాన్ని ఆయన కలిగించారు. చంద్రబాబు పాలనలో అలాంటిది చూడనేలేదు. నేను బాబుతో ఎంతో సన్నిహితంగా ఉండేవాడిని. కాని ఆయన తన నీడను కూడా నమ్మరు. అంత భయం. అవతలివాళ్లు అడిగారంటే మంచికోసమే అడిగి ఉంటారు అని నమ్మి దాన్ని పూర్తి చేయడం వైఎస్సార్ శైలి అయితే. ఈ పని చేస్తే ఏమవుతుందో, ఎక్కడ ఇబ్బంది వస్తుందో అని ఒకటికి పదిసార్లు అనుమానించే తత్వం చంద్రబాబుది. మొత్తానికి ఆ పని అయ్యేది కాదు. ఫలానా పని కావాలని అడిగితే ఇది కుదుర్తుంది. ఇది కుదరదు అని వైఎస్సార్ స్పాట్‌లోనే చెప్పేసేవారు. కాని చంద్రబాబు అయితే ఎంత చిన్నా పెద్దా విషయంలో కూడా తేల్చి చెప్పరు. అలా పని జరిగే ప్రాసెస్ చాలా లేటు అయ్యేది. చాలాసార్లు జరిగేది కాదు కూడా.
విభజన సమయంలో చంద్రబాబు వైఖరిపై మీ అభిప్రాయం?
చాలా అసహ్యంగా ఉంటుంది. రెండు మూడు సార్లు తెలంగాణకు అనుకూలంగా ఉత్తరాలు ఇచ్చేసి తర్వాత విభజన జరిగిపోయాక అర్ధరాత్రి విభజించారు, పొట్టకొట్టారు అని ఇతరులపై ఆరోపిస్తే ఎలా.. పైగా విభజన తర్వాత ఇంత అవినీతికర పాలన నేనెన్నడూ చూడలేదు. చిన్న పనికావాలన్నా చేతులు తడపందే ఏపీలో ఇప్పుడు జరగదని అధికారులే చెబుతున్నారు.
(తమ్మారెడ్డి భరద్వాజతో ఇంటర్వ్యూ పూర్తి పాఠం కింది లింకుల్లో చూడండి)
https://goo.gl/eCkgR4
https://goo.gl/wZLqoZ