
అద్భుత రాజధాని ఆర్డరేస్తే రాదు..!
రాజధాని విషయంలో అద్భుతాలు చేస్తామనడం దూరదృష్టి లోపమంటున్నారు లోక్‌సత్తా సంస్థాపకులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ జయప్రకాష్ నారాయణ్.
మనసులో మాట
కొమ్మినేని శ్రీనివాసరావుతో డాక్టర్ జయప్రకాష్ నారాయణ్
రాజధాని విషయంలో అద్భుతాలు చేస్తామనడం దూరదృష్టి లోపమంటున్నారు లోక్‌సత్తా సంస్థాపకులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ జయప్రకాష్ నారాయణ్. విద్య, ఆరోగ్యం, ఉపాధి, సంస్కృతి ఇవన్నీ ఒకదానికి ఒకటి సమకూరితేనే ఆధునిక రాజధాని వస్తుంది తప్ప. ఆర్డర్ వేస్తేనో, భూమి రేట్లు 5 కోట్లకు వెళ్లిపోతేనో అకస్మాత్తుగా రాజధాని ఏర్పడదన్నారు. పుష్కరాలు, ఉత్సవాలు వంటి ఈవెంట్ మేనేజ్‌మెంట్‌లోనే పాలకులు కాలం గడుపుతున్నారని ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్‌ని పాలకులే కులాల కంపుతో మురికి చేయడం అభివృద్ధికి, ఆధునిక సంస్కృతికి చిహ్నం కాదన్నారు. వాగ్దానాలు, మాటల గారడీలు మాని అధికార వికేంద్రీకరణ, సమర్థ పాలన, ప్రజలకు సేవలందించటం, విద్యా ఆరోగ్యం ప్రతి బిడ్డకూ ఆందే ఏర్పాటు చేయ డమే తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి మార్గం అంటున్న జేపీ అభిప్రాయాలు ఆయన మాటల్లోనే...
చంద్రబాబు ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టినప్పుడు మీరెలా ఫీలయ్యారు?
ఒక నాయకుడికి, మిత్రపక్షాలకు 225 సీట్లను కట్టబెడుతూ జనం తీర్పునిచ్చిన ప్పుడు అర్ధరాత్రిపూట ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని దింపేస్తే అది ఏ రకమైన ప్రజా స్వామ్యం అవుతుంది? ఎలా రాజ్యాంగ బద్దమౌతుంది? సాంకేతికంగా అది చట్టబద్ధం కావచ్చు. కానీ అలాంటి పనిని ఏ పార్టీ చేసినా నైతికంగా తప్పే.
తెలంగాణ విషయంలో మీరు సరైన వైఖరి తీసుకున్నారా తీసుకోలేదా?
అప్పటికీ ఇప్పటికీ ఒకటే చెబుతున్నాను. ఆనాడు నేను చెప్పింది వాస్తవం అని రుజువవుతోంది. రాజ్యవ్యవస్థ మారకుండా రాజధాని మారితే ప్రయోజనం లేదు. రాష్ట్రం పేరు మారితే పెద్దగా ఏమీ ఒరగదు. తెలంగాణ కావాలంటే తెచ్చుకుందాం కానీ అదొక్కటే సరిపోదు అని ఆనాడే చెప్పాను.
సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వడం కరెక్టని తేలిందా లేదా?
పార్టీ కోణం నుంచి అయితే రెండు చోట్లా చతికిలపడిపోయారు కదా. ఏపీలో ఒక తరం వరకు కాంగ్రెస్ పార్టీ పుంజుకోకపోవచ్చు. తెలంగాణలోనూ ఆ పార్టీనుంచి చాలామంది జారుకుంటున్నారు. రాజ కీయంగా అద్భుతాలు సాధిస్తామనుకుని, ఓడిపోయారు. అయితే తెలం గాణ ప్రజలు దేశాన్ని కాపాడారు. తెలంగాణ సాధించిన కీర్తిని ప్రజలకు కాకుండా సోనియాకు కట్టబెట్టినట్లయితే బేజీపీ లేదా కాంగ్రెస్.. రాష్ట్ర శాసనసభతో, ప్రజల మనోభావాలతో నిమిత్తం లేకుండా ఓట్ల కోసం, సీట్ల కోసం ఈ దేశంలో అన్ని చోట్లా ఇదే ప్రయోగానికి ఒడిగట్టేవాళ్లు. ఇప్పుడిక ఈ సాహసాన్ని ఎవరూ చేయరు. ప్రజలు తమకు తాముగా కోరుకుని వారి మధ్య సంఘీభావంతో ఒక ఒప్పందానికి వస్తే తప్ప ఢిల్లీలో బలవంతంగా విభజన చేస్తామనే ప్రయత్నం ఇక ఎవరూ చేయరు.