UP Politics: ఉత్తరప్రదేశ్‌లో రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. జయప్రకాశ్ నారాయణ్ ఇంటర్నేషనల్ సెంటర్(జేపీఎన్‌ఐసీ)కు వెళ్లకుండా సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్‌ను అడ్డుకోవడంతో యూపీ రాజధాని లక్నోలో తాజాగా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. స్వాతంత్ర్య సమరయోధుడు, సోషలిస్టు నేత జయప్రకాశ్ నారాయణ్ జయంతి సందర్భంగా శుక్రవారం జేపీఎన్‌ఐసీకి వెళ్లాలని అఖిలేశ్ యాదవ్ భావించారు. జయప్రకాశ్ నారాయణ్‌కు నివాళి అర్పించాలని ఆయన అనుకున్నారు. అయితే అఖిలేశ్‌కు అధికారులు అనుమతి నిరాకరించారు.
అఖిలేశ్‌ను అడ్డుకునేందుకు జేపీఎన్‌ఐసీని మూసివేశారు. ఆ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అడ్డంగా బారికేడ్లు పెట్టి, భారీ సంఖ్యలో పోలీసులను మొహరించారు. రేకులతో మెయిన్ గేటును క్లోజ్ చేశారు. విక్రమాదిత్య మార్గ్‌లోని అఖిలేశ్ యాదవ్ నివాసం సమీపంలోనూ పోలీసు బలగాలను భారీగా మొహరించారు. గతేడాది కూడా జేపీఎన్‌ఐసీని సందర్శించేందుకు అఖిలేశ్‌కు అనుమతి ఇవ్వలేదు. దీంతో ఆయన జేపీఎన్‌ఐసీ గేట్లను తోసుకుని లోపలికి వెళ్లి జయప్రకాశ్ నారాయణ్‌కు నివాళి అర్పించారు. ఈ నేపథ్యంలో అధికారులు తాజాగా గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు.
ఎందుకు అనుమతి ఇవ్వలేదంటే?
అఖిలేశ్‌కు అనుమతి నిరాకరించడానికి అధికారులు చెప్పిన కారణాలు వింటే ఆశ్చర్యం కలగకమానదు. జేపీఎన్‌ఐసీని సందర్శించేందుకు అనుమతి లేదంటూ లక్నో డెవలప్‌మెంట్ అథారిటీ(ఎల్‌డీఏ) గురువారం అఖిలేశ్‌కు రాసిన లేఖలో ఆసక్తికర అంశాలు ఉన్నాయి. జేపీఎన్‌ఐసీ ప్రమాదకర ప్రదేశంగా ఎల్‌డీఏ పేర్కొంది. నిర్మాణపనులు జరుగుతున్నందున ఆ ప్రాంతమంతా నిర్మాణ సామాగ్రితో గందరగోళంగా ఉందని వెల్లడించింది. వర్షాల కారణంగా పురుగూపుట్రా నుంచి ప్రమాదం పొంచివుందని హెచ్చరించింది. జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యురిటీ కలిగిన అఖిలేశ్ యాదవ్.. భద్రతా కారణాల దృష్ట్యా ఈ సమయంలో జేపీఎన్‌ఐసీకి వెళ్లడం సురక్షితం కాదని సూచించింది.
సమాజ్‌వాదీ పార్టీ శ్రేణుల ఆందోళన
ఎల్‌డీఏ లేఖపై సమాజ్‌వాదీ పార్టీ శ్రేణులు భగ్గుమన్నాయి. అఖిలేశ్‌ను అడ్డుకునే కుట్రలో భాగంగా యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఇదంతా చేయింస్తోందని ఆరోపిస్తున్నాయి. శుక్రవారం జేపీఎన్‌ఐసీ వద్ద సమాజ్‌వాదీ పార్టీ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. కాగా, జేపీఎన్‌ఐసీని సందర్శించేందుకు తనకు అనుమతి ఇవ్వకపోవడంతో యోగీ ప్రభుత్వంపై అఖిలేశ్ యాదవ్ మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం వలసవాద వ్యూహాలు అనుసరిస్తోందని విమర్శించారు.
చదవండి: సమాజ్‌వాదీ పార్టీ శ్రేణుల ఆందోళన.. లక్నోలో ఉద్రిక్తత
అఖిలేశ్‌పై బీజేపీ ఎదురుదాడి
జేపీఎన్‌ఐసీ అంశాన్ని కావాలనే అఖిలేశ్ యాదవ్ రాజకీయం చేస్తున్నారని బీజేపీ ఎదురుదాడి చేసింది. జయప్రకాశ్ నారాయణ్ ఆదర్శాలను సమాజ్‌వాదీ పార్టీ ఎప్పుడో వదలేసిందని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి భండారీ ఆరోపించారు. జేపీఎన్‌ఐసీలో నిర్మాణ పనులు జరుగుతున్నందున అక్కడికి ఎవరినీ అధికారులు అనుమతించడం లేదన్నారు. నిజంగా జయప్రకాశ్ నారాయణ్‌పై అంత గౌరవం ఉంటే తన కార్యాలయంలోనే అఖిలేశ్ నివాళి అర్పించాలని సూచించారు. హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో ఇండియా బ్లాక్‌లోని పార్టీలు పొలిటికల్ స్టంట్‌కు దిగుతున్నాయని భండారీ ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment