uttar pradesh politics
-
అఖిలేశ్ యాదవ్‌ను యూపీ సర్కారు ఎందుకు అడ్డుకుంది?
UP Politics: ఉత్తరప్రదేశ్‌లో రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. జయప్రకాశ్ నారాయణ్ ఇంటర్నేషనల్ సెంటర్(జేపీఎన్ఐసీ)కు వెళ్లకుండా సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్‌ను అడ్డుకోవడంతో యూపీ రాజధాని లక్నోలో తాజాగా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. స్వాతంత్ర్య సమరయోధుడు, సోషలిస్టు నేత జయప్రకాశ్ నారాయణ్ జయంతి సందర్భంగా శుక్రవారం జేపీఎన్ఐసీకి వెళ్లాలని అఖిలేశ్ యాదవ్ భావించారు. జయప్రకాశ్ నారాయణ్‌కు నివాళి అర్పించాలని ఆయన అనుకున్నారు. అయితే అఖిలేశ్‌కు అధికారులు అనుమతి నిరాకరించారు.అఖిలేశ్‌ను అడ్డుకునేందుకు జేపీఎన్‌ఐసీని మూసివేశారు. ఆ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అడ్డంగా బారికేడ్లు పెట్టి, భారీ సంఖ్యలో పోలీసులను మొహరించారు. రేకులతో మెయిన్ గేటును క్లోజ్ చేశారు. విక్రమాదిత్య మార్గ్‌లోని అఖిలేశ్ యాదవ్ నివాసం సమీపంలోనూ పోలీసు బలగాలను భారీగా మొహరించారు. గతేడాది కూడా జేపీఎన్‌ఐసీని సందర్శించేందుకు అఖిలేశ్‌కు అనుమతి ఇవ్వలేదు. దీంతో ఆయన జేపీఎన్ఐసీ గేట్లను తోసుకుని లోపలికి వెళ్లి జయప్రకాశ్ నారాయణ్‌కు నివాళి అర్పించారు. ఈ నేపథ్యంలో అధికారులు తాజాగా గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు.ఎందుకు అనుమతి ఇవ్వలేదంటే?అఖిలేశ్‌కు అనుమతి నిరాకరించడానికి అధికారులు చెప్పిన కారణాలు వింటే ఆశ్చర్యం కలగకమానదు. జేపీఎన్‌ఐసీని సందర్శించేందుకు అనుమతి లేదంటూ లక్నో డెవలప్మెంట్ అథారిటీ(ఎల్డీఏ) గురువారం అఖిలేశ్‌కు రాసిన లేఖలో ఆసక్తికర అంశాలు ఉన్నాయి. జేపీఎన్ఐసీ ప్రమాదకర ప్రదేశంగా ఎల్డీఏ పేర్కొంది. నిర్మాణపనులు జరుగుతున్నందున ఆ ప్రాంతమంతా నిర్మాణ సామాగ్రితో గందరగోళంగా ఉందని వెల్లడించింది. వర్షాల కారణంగా పురుగూపుట్రా నుంచి ప్రమాదం పొంచివుందని హెచ్చరించింది. జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యురిటీ కలిగిన అఖిలేశ్ యాదవ్.. భద్రతా కారణాల దృష్ట్యా ఈ సమయంలో జేపీఎన్ఐసీకి వెళ్లడం సురక్షితం కాదని సూచించింది.సమాజ్‌వాదీ పార్టీ శ్రేణుల ఆందోళనఎల్డీఏ లేఖపై సమాజ్‌వాదీ పార్టీ శ్రేణులు భగ్గుమన్నాయి. అఖిలేశ్‌ను అడ్డుకునే కుట్రలో భాగంగా యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఇదంతా చేయింస్తోందని ఆరోపిస్తున్నాయి. శుక్రవారం జేపీఎన్ఐసీ వద్ద సమాజ్‌వాదీ పార్టీ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. కాగా, జేపీఎన్‌ఐసీని సందర్శించేందుకు తనకు అనుమతి ఇవ్వకపోవడంతో యోగీ ప్రభుత్వంపై అఖిలేశ్ యాదవ్ మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం వలసవాద వ్యూహాలు అనుసరిస్తోందని విమర్శించారు.చదవండి: సమాజ్‌వాదీ పార్టీ శ్రేణుల ఆందోళన.. లక్నోలో ఉద్రిక్తతఅఖిలేశ్పై బీజేపీ ఎదురుదాడిజేపీఎన్ఐసీ అంశాన్ని కావాలనే అఖిలేశ్ యాదవ్ రాజకీయం చేస్తున్నారని బీజేపీ ఎదురుదాడి చేసింది. జయప్రకాశ్ నారాయణ్ ఆదర్శాలను సమాజ్‌వాదీ పార్టీ ఎప్పుడో వదలేసిందని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి భండారీ ఆరోపించారు. జేపీఎన్ఐసీలో నిర్మాణ పనులు జరుగుతున్నందున అక్కడికి ఎవరినీ అధికారులు అనుమతించడం లేదన్నారు. నిజంగా జయప్రకాశ్ నారాయణ్‌పై అంత గౌరవం ఉంటే తన కార్యాలయంలోనే అఖిలేశ్ నివాళి అర్పించాలని సూచించారు. హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో ఇండియా బ్లాక్‌లోని పార్టీలు పొలిటికల్ స్టంట్‌కు దిగుతున్నాయని భండారీ ఎద్దేవా చేశారు. -
రాజకీయాల్లో ఉత్తర పర్వం
ఢిల్లీ పీఠానికి మార్గం లక్నో అని చెబుతుంటారు. దేశంలో అత్యధిక నియోజక వర్గాలు కలిగిన ఉత్తర ప్రదేశ్‌లో జెండా పాతడమంటే కేంద్రంలో అధికారానికి దగ్గరవ్వడమే. అయితే, ఈ రాష్ట్రంలో స్వాతంత్య్ర కాలం నుంచీ రాజకీయ అస్థిరతే. ఎన్నోమార్లు రాష్ట్రపతి పాలన విధించిన సందర్భాలున్నాయి. పెద్ద పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ తరఫున ఐదేళ్ల పదవీకాలం పూర్తిచేసుకున్న ముఖ్యమంత్రి ఇంతవరకూ లేకపోవడం దీనికి బలమైన నిదర్శనం. అయితే, యోగి ఆదిత్యనాథ్ ఇంకొన్ని నెలల్లో ఈ రికార్డు సృష్టించ నున్నారు. ఇంతే విశేషం కాదు, రానున్న శాసనసభ ఎన్నికల్లో బీజేపీని తిరిగి అధికారంలోకి తెస్తే గనక యోగి భవిష్యత్తులో ప్రధానమంత్రి పదవి రేసులో కూడా ఉంటారు. ఉత్తర ప్రదేశ్‌లో పార్టీ పునాదులను పటిష్ఠపరిచేందుకు బీజేపీ 2017 నుంచి గట్టి ప్రయత్నమే చేస్తోంది. కానీ రైతు ఆందోళనల రూపంలో ఇప్పుడు పశ్చిమ యూపీలో సవాళ్లు ఎదురవుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ రైతులకు నష్టం చేస్తాయని భావిస్తున్న మూడు వ్యవ సాయ చట్టాలను వెనక్కు తీసుకుంటున్నట్లు ప్రకటించినప్పటికీ బీజేపీకి ఈ ప్రాంతంలో అంత అనుకూలమైన వాతావరణమైతే లేదు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ ప్రతికూల పరిస్థితులన్నింటినీ తట్టుకుని మరోసారి విజయం సాధించగలరా? భావి భారత ప్రధాని పదవికి తానూ పోటీదారునే అని నిరూపించుకోగలరా? ఉత్తరప్రదేశ్‌లో ఐదేళ్ల పరిపాలన కాలం పూర్తి చేసుకున్న తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ ఇంకొన్ని నెలల్లో రికార్డు సృష్టించనున్నారు. దేశంలోనే అత్యధిక జనాభా, రాజకీయ ప్రాము ఖ్యత కలిగిన రాష్ట్రంలో ఈ ఘనత సాధించడం ఆషామాషీ వ్యవహారం కాదు. మాయావతి (బీఎస్పీ), అఖిలేశ్ యాదవ్(ఎస్పీ) ఐదేళ్ల పదవీ కాలం పూర్తి చేసుకున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే ఉత్తర ప్రదేశ్ఎన్నికల్లో 49 ఏళ్ల యోగి ఆదిత్యనాథ్ ఇబ్బందులేవీ లేకుండా గెలిచేస్తే... నరేంద్ర మోదీ తరువాత ప్రధాని పదవికి ఒక పోటీదారు అవుతారనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఎనభై లోక్‌సభ స్థానాలున్న యూపీలో 2019 నాటి పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ 62 సీట్లలో విజయం సాధించింది. 2017 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 403 స్థానాల్లో 312 గెలుచుకుని రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. 2024 లేదా 2025లో (మోదీకి 75 ఏళ్ల వయసు వచ్చినప్పుడు) ప్రధాని పదవికి వారసుడు ప్రస్తుత హోంశాఖ మంత్రి అమిత్ షా అన్న అంచనా బీజేపీలో ఉంది. అయితే రెండోస్థానంలో ఉండి... ప్రధానిగా మారిన వారు దేశంలో తక్కువ మందేనన్నది చరిత్ర చెప్పే నిజం. ఇప్పటివరకూ సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్, మోరార్జీ దేశాయి, చరణ్ సింగ్, జగ్జీవన్ రామ్, వైబీ చవాన్, దేవీలాల్, అద్వానీ వంటి ఏడు గురు ఉప ప్రధానులను చూడగా ఇందులో మొరార్జీ, చరణ్‌సింగ్ మాత్రమే ప్రధానులు కాగలిగారు. 2012 నాటికి యూపీ సీఎంగా మాయావతి ఐదేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ క్రమంలో ఆమె మాజీ సీఎం జీబీ పంత్, కమలాపతి త్రిపాఠీ, సంపూర్ణానంద్, సుచేతా కృపలానీ, ఎన్డీ తివారీ, ములాయం సింగ్, కళ్యాణ్ సింగ్ మీద ఆధిక్యత సాధించారు. యూపీలో నిరాటంకంగా ఐదేళ్లు పాలించిన తొలి సీఎం కూడా ఆమే. స్వాతంత్య్రం రాకముందే 1937లో యునైటెడ్ ప్రావిన్స్ ముఖ్య మంత్రిగా పదవి చేపట్టిన స్వాతంత్య్ర సమరయోధుడు గోవింద్ బల్లభ్ పంత్ స్వాతంత్య్రం తరువాత కూడా రెండుసార్లు అదే పదవిలో కొనసాగారు. స్వాతంత్య్రానికి ముందు రెండు సార్లు, తరువాత రెండు సారు సీఎంగా ఉన్న చరిత్ర ఆయనది. అయితే 1955లో దేశ హోం మంత్రి పదవి ఆయన చేపట్టిన తరువాత సంపూర్ణానంద్కు యూపీ పగ్గాలు దక్కాయి. బాబూజీ అని పిలుచుకునే సంపూర్ణానంద్ 1954 డిసెంబరు 28 నుంచి 1960 డిసెంబరు ఏడు వరకూ సీఎంగా కొనసాగారు. జ్యోతిషంపై నమ్మకం ఎక్కువగా ఉన్న సంపూర్ణా నంద్ చివరకు పార్టీ అంత ర్గత వివాదాల కార ణంగా పదవి వదులుకోవాల్సి వచ్చింది. కమలాపతి త్రిపాఠి, చంద్ర భానూ ప్రతాప్ రాజేసిన వివాదాల పుణ్యమా అని సంపూ ర్ణానంద్ 1960లో గవర్నర్‌గా జైపూర్ రాజ్‌భవన్‌కు వెళ్లాల్సి వచ్చింది. సంపూర్ణానంద్ స్థానంలో వచ్చిన చంద్రభానుకూ ఇందిరా గాంధీకీ మధ్య అంత సఖ్యత ఉండేది కాదు. కమలాపతి త్రిపాఠీ, హేమ్వతీ నందన్ బహుగుణా గిల్లికజ్జాల పుణ్యమా అని యూపీలో తొలిసారి కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పాటైంది. 1967లో చరణ్ సింగ్ సీఎం అయ్యారు. 1962–67 మధ్య యూపీలో చాలామంది సీఎంలు వచ్చారు. పోయారు కూడా. సుచేతా కృపలానీ 1967 వరకూ యూపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టగా అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయానికి కష్టపడాల్సి వచ్చింది. చంద్రభాను ముఖ్యమంతి అయినప్పటికీ ఆయన ప్రభుత్వం 18 రోజులు మాత్రమే మనగలిగింది. కొద్దికాలం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన నడిచిన తరువాత మరోసారి చంద్రభాను సీఎం అయ్యారు. ఎనిమిది నెలల తరువాత మరోసారి చరణ్‌సింగ్ నేతృత్వంలో కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పాటైంది. 1970లు మొత్తం చరణ్ సింగ్, నారాయణ్‌సింగ్, హెచ్ఎన్ బహుగుణ, ఎన్డీ తివారీ, రామ్ నరేశ్ యాదవ్, బనారసీ దాస్ ప్రభుత్వాలు నడిపినా... అవి ఎక్కువ కాలం మనలేదు. 1980లో కాంగ్రెస్ విజయం సాధించిన తరువాత ఇందిరాగాంధీ తనయుడు సంజయ్‌గాంధీ ఉత్తర ప్రదేశ్ సీఎంగా వీపీ సింగ్‌ను ఎంపిక చేశారు. అయితే సంజయ్ మరణం... బహుగుణతో ఇందిరకు ఉన్న విభేదాల కారణంగా వీపీ సింగ్‌కు 1982లో కేంద్ర కేబినెట్‌కు స్థానం లభించగా... ఈ సమయంలోనే శ్రీపత్ మిశ్రా, ఎన్డీ తివారీ వంటి వారి ఉత్థాన పతనాలు రెండూ నమోదయ్యాయి. కాంగ్రెస్‌తో కుదిరిన ఒక ఒప్పందం సాయంతో జనతాదళ్ తరఫున యూపీ సీఎం అయ్యారు ములాయం సింగ్ (1989–1991). అయితే 1991 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో కళ్యాణ్‌సింగ్ గద్దెనెక్కినా 1992లో బాబ్రీ మసీదు విధ్వంసం నేప థ్యంలో ఆయన పదవీకాలం ఒక ఏడాది 165 రోజులకు పరిమిత మైంది. 1993 డిసెంబర్ వరకూ రాష్ట్రపతి పాలన కొనసాగిన తరు వాత అధికార పంపిణీ సూత్రంపై చరిత్రలో మొదటిసారి ములాయం, మాయావతిల సంయుక్త ప్రభుత్వం ఏర్పాటైంది. ములాయం డిసెం బర్ 1993 నుంచి జూన్ 1995 వరకూ పదవిలో కొనసాగారు. దళితులు, మైనార్టీలు, వెనుకబడిన తరగతుల వారందరినీ ఒక ఛత్రం కిందకు తేవాలని కాన్షీరామ్ నేతృత్వంలో జరిగిన ఒక ప్రయత్నం అనతికాలంలోనే నీరుగారిపోయింది. ములాయం తరువాత అధికార పంపిణీ ఒప్పందంలో భాగంగా మాయావతి పగ్గాలు చేపట్టగా... పదవీ కాలం సగం కూడా పూర్తికాక ముందే ములాయం తెగతెంపులకు సిద్ధమయ్యారు. కాన్షీరామ్, మాయావతి బీజేపీ సాయంతో ములాయం వర్గం ఎమ్మెల్యేలను తమవైపు తిప్పు కునే ప్రయత్నం చేశారు. మాయావతి తన మద్దతుదారులైన ఎమ్మె ల్యేలతో కలిసి లక్నోలోని గెస్ట్‌హౌస్‌లో మకాం వేసి... బల పరీక్ష పిలుపు కోసం వేచి చూస్తూ ఉన్న సమయంలో ములాయం తన మద్దతుదారులతో గెస్ట్‌హౌస్‌పై దాడి చేయడం, బీఎస్పీ ఎమ్మెల్యేలను కిడ్నాప్ చేసినట్లు ఆరోపణలు రావడం తెలిసిందే. ఈ కల్లోల పరిస్థి తుల్లో మరోసారి రాష్ట్రపతి పాలన విధించారు. ఆ తరువాతి కాలంలో మాయావతి బీజేపీతో జట్టుకట్టి రెండుసార్లు సీఎం అయ్యారు కూడా. ప్రతిసారీ పదవీకాలం కొంత కాలమే ఉండింది. ములాయం, కళ్యాణ్ సింగ్, ఒక్కరోజు ముఖ్యమంత్రిగా గుర్తింపు పొందిన జగదంబికా పాల్ అలా వచ్చారు.. ఇలా దిగి పోయారు! 1997–2002 వరకూ అధికారంలో ఉన్న బీజేపీ ప్రభు త్వంలో కళ్యాణ్‌సింగ్, ప్రకాశ్‌గుప్తా, రాజ్ నాథ్‌సింగ్ సీఎం పదవిలో కొనసాగారు. 2002 తరువాత బీజేపీ సాయంతో మాయావతి, ఆ తరువాత బీఎస్పీ తిరుగుబాటు దారుల సాయంతో ములాయం సింగ్ సీఎం గద్దెనెక్కారు. ములాయం తన పదవీ కాలంలో కొంత రాజకీయ స్థిర త్వాన్ని తీసుకురాగలిగారు. 2007 మేలో అందరి అంచనాలను తారు మారు చేస్తూ మాయావతి మరోసారి యూపీలో ఘన విజయం సాధించారు. 2017లో ఉత్తర ప్రదేశ్‌లో తన కాషాయ జెండాను దిగ్వి జయంగా ఎగరేసిన బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తుందా? ప్రస్తుత ముఖ్యమంత్రి యోగీ ఆధిత్యనాథ్ పార్టీని తిరిగి గెలిపించి భవిష్యత్ ప్రధాని అభ్యర్థి అవుతారా అన్నది వేచి చూడాలి. – రషీద్ కిద్వాయ్, సీనియర్ జర్నలిస్ట్, రచయిత -
‘మీ లవర్ వేరొకరితో వెళ్తే.. ఓసారి అద్దంలో చూస్కోండి’
సాక్షి, న్యూఢిల్లీ: ‘మీ ప్రేయసి (గర్ల్‌ఫ్రెండ్) వేరొకరితో వెళ్తే ఆమెను నిందించొద్దు.. ఒకసారి మీ ముఖం అద్దంలో చూస్కోండి’ అని కాంగ్రెస్ పార్టీ నాయకుడు ట్వీట్ చేశాడు. పార్టీని నాయకులంతా వీడుతుండడంపై సొంత పార్టీపైనే ఓ నాయకుడు చేసిన ట్వీట్ ఇది. వెళ్లేవారిని తప్పు పట్టకూడదని.. పార్టీ మారాలని వ్యంగ్యంగా ట్వీట్ చేశాడు. కేంద్ర మాజీ మంత్రి, రాహుల్‌గాంధీకి అత్యంత సన్నిహితుడిగా ఉన్న జితిన్ ప్రసాద కాంగ్రెస్ పార్టీని వీడి బుధవారం బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అతడి రాజీనామా ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు తీవ్ర నష్టం చేకూరనుంది. అయితే అతడు పార్టీని వీడడంపై కాంగ్రెస్ పార్టీ భిన్నంగా స్పందించింది. పార్టీని వీడినందుకు జితిన్ ప్రసాదకు ధన్యవాదాలు అని తెలిపింది. ఈ పరిణామంపై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి సంజయ్ షా భిన్నంగా స్పందించాడు. సాధారణ ప్రపంచంలో వేటగాడిగా ఉన్న కాంగ్రెస్‌లోనే ఏదో సమస్య ఉందని ట్వీట్ చేశాడు. ఇక మరో విధంగా స్పందిస్తూ ‘ఒకవేళ మీ ప్రేయసి ఇతరులతో వెళ్తిఏ ఆమెను నిందించకుండా మీ ముఖాన్ని ఒకసారి అద్దంలో చూసుకోవాలి’ అని హితవు పలికారు. ఈ విధంగా సొంత పార్టీ తీరుపై వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ఎందుకంటే వరుసగా పార్టీని వీడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. వారిని ఆపడంలో పార్టీ విఫలమవుతోందని పరోక్షంగా చెబుతున్నాడు. ఇక పార్టీని వీడిన జితిన్ ప్రసాదపై ప్రశంసల వర్షం కురిపించాడు. జితిన్ మంచి నాయకుడు అని, అతడితో ఇటీవల మాట్లాడినట్లు తెలిపాడు. జితిన్ ప్రసాదతో బీజేపీకి లాభం.. కాంగ్రెస్‌కు నష్టం అని పేర్కొన్నాడు. అతడిని పార్టీలో చేర్చుకున్నందుకు బీజేపీని నిందించనవసరం లేదు. నేనయినా అదే చేసేవాడిని. అది రాజకీయం అంటూ ట్వీట్ చేశాడు. చదవండి: భారతీయ జనతా పార్టీలోకి కాంగ్రెస్ కీలక నేత.. If your girlfriend walks out on you with your best rival, look in the mirror. Don't blame her. 😀 — Sanjay Jha (@JhaSanjay) June 9, 2021 Jitin Prasad is BJP's gain, Congress's loss. Period. I just spoke to him recently; Jitin is a gentleman, genial and generous-hearted. You can't blame the BJP for picking up disgruntled leaders from the Congress. If I was Amit Shah I would do the same. That's politics. — Sanjay Jha (@JhaSanjay) June 9, 2021 -
ఇప్పుడు లేదు, భవిష్యత్తులో చెబుతా
లక్నో: కొత్త పార్టీ ఇప్పట్లో పెట్టే ఉద్దేశం లేదని సమాజ్‌వాదీ పార్టీ మాజీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ‘నేనిప్పుడు కొత్త పార్టీ పెట్టడం లేదు. రాబోయే రోజుల్లో మరిన్ని ప్రకటనలు చేస్తాన’ని చెప్పారు. అఖిలేశ్ యాదవ్‌కు తన ఆశీస్సులు ఉంటాయని, అయితే ఆయన తీసుకుంటున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నానని అన్నారు. ఆ నిర్ణయాలు ఏమిటనేది రాబోయే రోజుల్లో వెల్లడిస్తానని చెప్పారు. కేంద్రం, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విషయాల్లోనూ విఫలమయ్యాయని ములాయం విమర్శించారు. ‘కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడిచినా హామీలు అమలు చేయలేదు. పెట్రోలు-డీజిల్ ధరలు ఆకాశాన్నంటాయి. బెనారస్ హిందూ యూనివర్సిటీలో బాలికలకు రక్షణ లేకుండాపోయింది. ఉత్తరప్రదేశ్‌లో శాంతిభద్రతలు క్షీణించాయి. రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. యోగి పాలనలో అన్నదాతలు తీవ్ర కష్టాలు ఎదుర్కొంటున్నార’ని ములాయం మండిపడ్డారు. బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు. కాగా, ములాయం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారనగానే ఆయన కొత్త పార్టీ ప్రకటిస్తారని అంతకుముందు ప్రచారం జరిగింది. సొంత పార్టీలో చేదు అనుభవాలు ఎదురైన నేపథ్యంలో ‘పెద్దాయన’ వేరు కుంపటి పెడతారని వార్తలు వచ్చాయి. ములాయం తాజా ప్రకటనతో ఊహాగానాలకు తెరపడింది. -
‘మాయ’మేనా!
► బీఎస్పీ మనగలదా? l ► ఐదు శాతం సీట్లు కూడా రాని దుస్థితి ఉత్తరప్రదేశ్‌కు నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం. రెండున్నర దశాబ్దాలుగా యూపీ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న ఘనత ఆమె సొంతం.. వరుసగా వచ్చిన రెండు ‘నమో (నరేంద్ర మోదీ) సునామీ’ల్లో బెహన్ జీ మాయావతి ఉనికిని, బీఎస్పీ మనుగడను ప్రశ్నార్థకం చేశాయి. శనివారం వెలువడ్డ యూపీ అసెంబ్లీ ఫలితాలు మాయావతికే కాకుండా దేశవ్యాప్తంగా దళిత అస్తిత్వ రాజకీయాలకు ఎదురుదెబ్బ. అగ్రవర్ణాల ఆధిపత్యాన్ని సవాల్ చేస్తూ... దళితులకు రాజ్యాధికారమే లక్ష్యంగా ప్రారంభమైన బీఎస్పీ 1993లో తొలిసారి యూపీ (ఉమ్మడి రాష్ట్రం) అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి 11.1 శాతం ఓట్లతో 67 సీట్లు సాధించింది. తర్వాతి ఎన్నికల్లో క్రమేపీ ఓట్ల శాతం తగ్గింది. అగ్రవర్ణాలపై తీవ్ర ద్వేషాన్ని వెళ్లగక్కిన బీఎస్పీ క్రమేపీ తమ పంథా మార్చుకుని ఇతర వర్గాలకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేసింది. 2007లో దళితులు– బ్రాహ్మణుల కలయిక ఫార్ములాతో బీఎస్పీ 30.4 ఓట్ల శాతం సాధించి 206 సీట్లు గెలుచుకుని యూపీలో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అధికారంలోకి వచ్చాక మాయావతి జీవనశైలిలో వచ్చిన మార్పుతో పాటు చుట్టూ ఉన్న కోటరీ ఆమెకు, పార్టీ శ్రేణులకు మధ్య నేరుగా సంబంధాలు లేకుండా చేయడంతో 2012లో ప్రతిపక్షానికే పరిమితం అవ్వాల్సివచ్చింది . 2012 అసెంబ్లీ ఎన్నికల్లో 25.9 ఓట్ల శాతంతో బీఎస్పీ 80 స్థానాలు మాత్రమే గెలుపొందింది. 4.5 శాతం ఓట్లు తగ్గాయి. 2014 లోక్‌సభ ఎన్నికల్లో 19.8 శాతం ఓట్లు సాధించినా బీఎస్పీ ఒక్క సీటూ నెగ్గలేదు. 17 రిజర్వుడు నియోజకవర్గాల్లోను బీజేపీనే గెలిచింది. మోదీ హవాతో పాటు జాటవేతర దళితుల్లో బీజేపీకి మద్దతు పెరగడం మాయవతి ఘోర ఓటమికి కారణాలుగా నిర్ధారించారు. యూపీలోని 40 లోక్‌సభ నియోజకవర్గాల్లో దళితులు 25 శాతానికి మించి ఉన్నా... 2014 ఎన్నికల్లో 11 స్థానాల్లో మాత్రమే బీఎస్పీ రెండో స్థానంలో నిలిచింది. ప్రముఖ నేతల నిష్క్రమణ... ఓబీసీ నేత స్వామి ప్రసాద్ మౌర్య, బ్రజేష్ పాఠక్(బ్రాహ్మణ నేత), ఆర్కే చౌదరి(పాసీ, జాటవేతర దళితుల్లో ప్రముఖుడు), జుగల్ కిశోర్(దళిత ఎంపీ) 2014 తర్వాత బీఎస్పీని వీడి బీజేపీలో చేరారు. ఈసారి ముస్లిం–దళిత ఫార్ములా తెరపైకి తెచ్చిన మాయ అందరి కంటే ముందే ప్రచారంలోకి దూకారు. 99 మంది ముస్లిం లకు టికెట్లు ఇచ్చారు. ఈ లెక్కలేమీ పనిచేయలేదు. ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో బీఎస్సీకి 60–80 స్థానాలు వస్తాయని మెజారిటీ సంస్థలు చెప్పడంతో.. హంగ్ వస్తుందని.. దాంతో మాయావతి కింగ్ మేకర్‌గా అవుతారని అందరూ భావించారు. అయితే పాపం బెహన్ జీది .. ఇప్పుడు తెరమరుగయ్యే పరిస్థితి. ఉన్న కొద్దిమంది ఎమ్మెలేలను కాపాడుకోవటమూ ఇబ్బందే. ఇక ఆ పార్టీకి లోక్‌సభలో ఒక్క సభ్యుడు కూడా లేడు. రాజ్యసభలో ఆరుగురు సభ్యులున్నారు. మరో ఏడాదిలో ఆమె రాజ్యసభ పదవీకాలం ముగియనుంది. తిరిగి రాజ్యసభకు ఎన్నికవడం సాధ్యం కాకపోవచ్చు. ఏ మీట నొక్కినా బీజేపీకే ఓట్లు మాయావతి సంచలన ఆరోపణలు ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంల టాంపరింగ్ జరిగిందని బీఎస్పీ అధినేత్రి మాయావతి సంచలన ఆరోపణలు చేశారు. ఓటర్లు ఏ పార్టీ గుర్తుపై మీట నొక్కినా బీజేపీకే ఓట్లు పడ్డాయని ఆరోపించారు. శనివారం యూపీ ఎన్నికల ఫలితాల సరళి భారీగా బీజేపీవైపు మొగ్గడం మొదలవగానే మాయావతి లక్నోలో హడావిడిగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. యూపీ, ఉత్తరాఖండ్‌లో ఫలితాలు అందరికీ ఆశ్చర్యం కలిగించాయని.. బీజేపీకి తప్ప ఏ పార్టీకి ఓటు వేసినా ఈవీఎంలు అంగీకరించని పరిస్థితి కనిపిస్తున్నట్లుందని ఆమె వ్యాఖ్యానించారు. ఈ ఫలితాలు తనను తీవ్ర విస్మయానికి గురిచేశాయన్న మాయావతి... కేంద్ర ఎన్నికల కమిషన్ యూపీలో ఎన్నికల ఫలితాలను నిలుపుదల చేసి సంప్రదాయ బ్యాలట్ పద్ధతిలో రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ‘‘యూపీలో 20 శాతం ముస్లింల ఓట్లు ఉన్నప్పటికీ బీజేపీ ఒక్క టికెట్‌ను కూడా ముస్లింలకు కేటాయించలేదు. అయినప్పటికీ ముస్లిం ప్రాబల్య ప్రాంతాల్లోనూ బీజేపీ గెలవడం అసమంజసంగా ఉంది’’ అన్నారు. ఈ అంశంపై ఎన్నికల కమిషన్‌కు లేఖ రాసినట్లు చెప్పారు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
రాహుల్ - అఖిలేష్ ర్యాలీకి చుక్కెదురు
మోదీ సొంత నియోజకవర్గమైన వారణాసిలో రోడ్ షో చేయాలనుకున్న రాహుల్ గాంధీ - అఖిలేష్ యాదవ్ జోడీకి మరోసారి చుక్కెదురైంది. వాళ్లు పెట్టుకున్న ముహూర్తం బాగోలేదేమో గానీ.. వారణాసి మునిసిపల్ యంత్రాంగం వాళ్ల ర్యాలీకి అనుమతి నిరాకరించింది. ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్-సమాజ్‌వాదీ పార్టీ నేతలిద్దరూ కలిసి వారణాసిలో భారీగా రోడ్ షో చేయాలని భావించారు. అయితే, సరిగ్గా రవిదాస్ జయంతి రోజునే వాళ్లు ర్యాలీ పెట్టుకోవడం, దానికి వారణాసిలో భారీ మొత్తంలో ప్రజలు వచ్చే అవకాశం ఉండటంతో.. ఇలాంటి సమయంలో ర్యాలీకి అనుమతిస్తే అది ప్రజలకు తీవ్ర అసౌకర్యంగా ఉంటుందని వారణాసి మునిసిపల్ అధికారులు తెలిపారు. దాంతో రాహుల్ - అఖిలేష్ ర్యాలీకి అనుమతి నిరాకరించారు. వాస్తవానికి వారణాసిలో ర్యాలీకి ఎటూ అనుమతి రాదని భావించారో ఏమో గానీ, అఖిలేష్ యాదవ్ ఇదేరోజు బరేలీ, రాంపూర్ ప్రాంతాల్లో కూడా ర్యాలీలు చేయడానికి ప్లాన్ చేసుకున్నారు. ప్రధానంగా పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో అడుగుపెట్టేందుకు సమాజ్‌వాదీ పార్టీ గట్టిగా ప్రయత్నిస్తోంది. అక్కడ ఈ వారంలో అఖిలేష్ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే రాహుల్ - అఖిలేష్ కలిసి లక్నో, ఆగ్రాలలో రెండు రోడ్ షోలు నిర్వహించారు. -
సీఎం జోరు.. బాబాయ్ బేజారు!
సమాజ్‌వాదీ పార్టీ రాజకీయం మరింత వేడెక్కింది. అసలైన పార్టీ ఎవరిదో, సైకిల్ గుర్తు ఎవరికి వెళ్లాలో తేల్చుకోవాలని ఈసీ ఆదేశించడంతో.. ఎవరికి వాళ్లు తమ బలాబలాలు తేల్చుకోడానికి సిద్ధమవుతున్నారు. ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తన వర్గీయులైన ఎమ్మెల్యేలు, పార్టీ కార్యవర్గ సభ్యులు అందరి నుంచి తనకు మద్దతుగా అఫిడవిట్లు తీసుకోవడం మొదలుపెట్టారు. సమాజ్‌వాదీ పార్టీకి యూపీ అసెంబ్లీలో మొత్తం 229 మంది ఎమ్మెల్యేలుండగా, వాళ్లలో 214 మంది అఖిలేష్ వెంటే ఉన్నారు. పార్టీ కార్యవర్గ సభ్యులు, ఎమ్మెల్సీలలో కూడా చాలామంది యువ నాయకుడికే మద్దతు చెబుతున్నారు. దాంతో సైకిల్ గుర్తు అఖిలేష్ వర్గానికే దక్కేలా ఉంది. ఆయన ఎన్నికల కమిషన్‌ను శుక్రవారం కలుస్తారని, ఈలోపలే మొత్తం అన్ని అఫిడవిట్లు తీసుకుంటున్నామని ఎమ్మెల్సీ సునీల్ సింగ్ సాజన్ తెలిపారు. ఫిబ్రవరి 11వ తేదీ నుంచి ఎన్నికలు జరగనున్న తరుణంలో పార్టీలో వచ్చిన ఈ చీలిక ఒక్కసారిగా అందరికీ షాకిచ్చింది. ఎమ్మెల్యే అభ్యర్థులంతా తమ తమ నియోజకవర్గాలకు వెళ్లి ప్రచారాలు చేసుకోవాలని తమ జాతీయాధ్యక్షుడు (అఖిలేష్) చెప్పారని సాజన్ అన్నారు. వాస్తవానికి పార్టీకి ఇప్పటివరకు జాతీయాధ్యక్షుడిగా ములాయం సింగ్ యాదవ్ ఉన్నారు. దాని గురించి ప్రశ్నించగా అఖిలేష్ రాజధర్మాన్ని పాటిస్తున్నారని, తాను ఇంతకంటే ఏమీ చెప్పలేనని అన్నారు. సమాజ్‌వాదీ పార్టీలో ఒక వర్గానికి ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ నేతృత్వం వహిస్తుండగా.. మరో వర్గానికి ములాయం తమ్ముడు శివపాల్ యాదవ్ నాయకత్వం వహిస్తున్నారు. ములాయం మద్దతు తమ్ముడికే ఉండటం.. ఎన్నికలు కూడా సమీపించడంతో రాజకీయం పూర్తిగా వేడెక్కింది. అసలైన సమాజ్‌వాదీ పార్టీ తమదేనంటూ ఎవరికి వారు చెబుతుండటంతో ఎన్నికల కమిషన్ కూడా బలాలు నిరూపించుకోవాలని ఆదేశించింది. -
సమాజ్‌వాదీ తన్నులాట
ఉత్తరప్రదేశ్‌లో అధికార సమాజ్‌వాదీ పార్టీ సంక్షోభాల ముట్టడిలో కొట్టుమిట్టాడు తోంది. అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తుండగా కుటుంబ కలహాలతో అది బజారు కెక్కి నగుబాటు పాలవుతోంది. రాజకీయ రంగంలోకి అడుగుపెట్టి పాతికేళ్లు కావ స్తున్నా, విశేష పాలనానుభవం ఉన్నా ఆ పార్టీకి అవన్నీ ఎందుకూ కొరగాకుండా పోతున్నాయి. రెండు నెలలక్రితం తన కుమారుడు, ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌ను పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పించి, సోదరుడు శివ్‌పాల్ యాదవ్‌ను ములాయం సింగ్ యాదవ్ ఆ స్థానంలో ప్రతిష్టించినప్పుడు ముదిరిన విభేదాలు ప్రస్తుతం తారస్థాయికి చేరుకున్నాయి. పాలన సక్రమంగా లేదని, ఎవరూ పని చేయడం లేదని అంతక్రితం ఒకటి రెండుసార్లు ములాయం అఖిలేష్‌ను వివిధ వేదికలపై మందలించిన సందర్భాలున్నా అవి అక్కడితో ముగిసిపోయాయి. అందుకు కారణాలేమిటని మీడియాలో కథనాలు రావడం తప్ప ఎవరూ నోరు మెదపలేదు. కానీ బాబాయ్ శివ్‌పాల్ అనుచరుడిగా ఉంటున్న మంత్రి ప్రజాపతిని అఖిలేష్ కేబినెట్‌నుంచి తొలగించడం, ఆ వెంటనే ములాయం అఖిలేష్‌ను పార్టీ బాధ్యతలనుంచి తప్పించడం, అఖిలేష్ కూడా జాప్యం చేయకుండా శివ్పాల్నుంచి ముఖ్య శాఖలు తొలగించడం చకచకా పూర్తయ్యాయి. ములాయం జోక్యంతో మళ్లీ ఆయన శాఖలు ఆయనకిచ్చినట్టే కనబడిన అఖిలేష్ ఆ మర్నాడే శివ్‌పాల్‌ను కేబి నెట్‌నుంచి సాగనంపారు. ఆ తర్వాత రాజీకొచ్చి ఎవరి పదవులు వారికి వచ్చినా అది మూన్నాళ్ల ముచ్చటే అయింది. మళ్లీ తొలగింపుల పర్వం మొదలైంది. పరస్పర అనుమానాలతో, కుట్ర జరగొచ్చునన్న సందేహాలతో ప్రత్యర్థి శిబి రాలు పథకాలు రచించుకుంటున్నాయి. మరి కొన్ని నెలల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు పదునైన వ్యూహాలను ఖరారు చేసుకోవాల్సిన పార్టీ కాస్తా ఇలా తన కొంపకు తానే నిప్పంటించుకునే స్థితికి చేరింది. అయినవాళ్లే తన్నులాడుకోవడంతో పార్టీ శ్రేణుల సంగతలా ఉంచి ఎమ్మెల్యేలే దిక్కుతోచకుండా ఉన్నారు. బుధవారం హఠాత్తుగా గవర్నర్ రాంనాయక్‌తో భేటీ అయిన అఖిలేష్ తనకు 205మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందంటూ లేఖను అందజేశారంటున్నారు. అఖిలేష్‌ను సీఎం పదవినుంచి తప్పించే ఉద్దేశం లేదని తండ్రి ములాయం చెప్పిన మాటల్ని ఆయన విశ్వసించడం లేదని దీన్నిబట్టి అర్ధమవుతుంది. అటు అఖిలేష్ కొత్త పార్టీ పెట్టబోతున్నాడని ములాయం అనుమానిస్తున్నారు. అందుకే వచ్చే నెల 3 నుంచి ఆయన తలపెట్టిన వికాస్ రథ యాత్రను అడ్డుకోవడమెలా అన్న మథనంలో పడ్డారు. కుటుంబ పాలన అయితే కంటి నిండా నిద్ర పోవచ్చునని, బయటి వారితో ఇబ్బందులుంటాయని చాలామంది అనుకుంటారు. యూపీలో అందుకు భిన్నంగా జరుగుతోంది. తండ్రీ కొడుకులే ఒకరినొకరు నమ్మడం లేదు. మిగిలిన బంధుగణమంతా చెరో శిబిరంలో చేరడంతో కథ అంతులేని మలుపులు తిరుగుతోంది. సహజంగానే ఇదంతా ప్రధాన ప్రత్యర్థి పక్షాలు బీజేపీ, బీఎస్పీలకు లాభిస్తోంది. తర్వాత సంగతేమైనా ఇప్పటికైతే ఏదో రకంగా రాజీ కుదిర్చి సోదరుడు శివ్ పాల్, మిత్రుడు అమర్సింగ్లపై ఈగ వాలనివ్వకుండా చూడాలని ములాయం తాపత్రయపడటం అడుగడుగునా కనిపిస్తూనే ఉంది. మూడురోజులక్రితం లక్నోలో పార్టీ సదస్సు నిర్వహించింది అందుకే. కానీ అది బెడిసికొట్టింది. సగటు సినిమాలో కనబడే అన్ని దృశ్యాలకూ అది వేదికైంది. తిట్లు, శాపనార్ధాలు, హెచ్చరికలు, కన్నీళ్లు, భావోద్వేగాలు, కుస్తీలు, ముష్టిఘాతాలు... సర్వం అక్కడ దర్శన మిచ్చాయి. సహనం కోల్పోయి ‘నువ్వు తప్పుకో... నేను ప్రభుత్వాన్ని నడుపుతా’ అని ములాయం హెచ్చరిస్తే అఖిలేష్ దాన్ని ఖాతరు చేయలేదు. చివరకు కంటతడి పెట్టి పుట్టినరోజుకు ఆశీర్వదించమంటూ తండ్రికి మొక్కితే, ముందు బాబాయ్ ఆశీర్వాదం పొందమని ఆయన సలహా ఇచ్చారు. అఖిలేష్ ఆ పని చేసినట్టే కనబడినా ఆ వెంటనే మైక్ తీసుకుని అమర్‌సింగ్ ఈ మొత్తం వివాదానికి కారకు డంటూ నిందించారు. అక్కడితో కథ మొదటికొచ్చింది. అఖిలేష్నుంచి మైక్ లాక్కొని ఆయన్ను అబద్ధాలకోరని శివ్‌పాల్ ఆరోపించాక గొడవ ముదిరింది. అక్కడి నుంచి పార్టీ శ్రేణులు బాహాబాహీ తలబడటంతో ఆగక, దాన్ని బయట కూడా కొనసాగించి చానెళ్ల కెమెరాలకు కావలసినంత పని కల్పించారు. తరాలు మారినప్పుడు ఇలాంటి తిప్పలు ఎక్కడైనా తప్పవు. 2012లో యూపీలో సమాజ్‌వాదీకి జనం భారీ మెజారిటీతో అధికారం కట్టబెట్టినప్పుడు కుమారుడు అఖిలేష్‌కు ములాయం పగ్గాలు అప్పగించారు. యువకుడికి అధికారం ఇచ్చారు గనుక పాలన కొత్త పుంతలు తొక్కుతుందని అందరూ ఆశించారు. కానీ పాత తరం నేతలు, వారి పోకడలు అఖిలేష్‌కు శాపంగా మారాయి. తనను కాదని అఖిలేష్‌కు ఆ పదవి కట్టబెట్టడంపై ఆగ్రహంతో ఉన్న శివ్‌పాల్ మరికొందరితో కలిసి ముఠా కట్టి ఇష్టారాజ్యంగా వ్యవహరించడం మొదలుపెట్టారు. కట్టడి చేద్దామని చూసినప్పుడల్లా ములాయంకు ఫిర్యాదు చేయడం, ఆయన అఖిలేష్‌ను మందలించడం రివాజైంది. అఖిలేష్ పగ్గాలు చేపట్టిన నాలుగు నెలలకే పాలన బాగోలేదంటూ మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేల సమావేశంలో ములాయం దుయ్య బట్టారు. అప్పటికైతే నేతాజీని సంతోషపెడతామని అఖిలేష్ బదులిచ్చి ఊరుకున్నా రాను రాను ఆ విభేదాలు ముదిరిపోయాయి. వర్తమాన సమాజ్‌వాదీ సంక్షోభం ఇందిరాగాంధీ 60వ దశకం చివరిలో వృద్ధ తరం నుంచి ఎదుర్కొన్న సంక్షోభాన్ని గుర్తుకు తెస్తుంది. అప్పట్లో అచ్చం ఆమె చేసినట్టే అఖిలేష్ కొత్త పార్టీతో జనం ముందుకు రావాలని ఆయన అనుచర గణం కోరుకుంటోంది. ఆ సంగతెలా ఉన్నా ఇలాగే పరస్పర కలహాలతో కాలక్షేపం చేస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీకి పట్టుమని పాతిక సీట్లు కూడా చేజిక్కే అవకాశం లేదు. మత కలహాల కట్టడిలో అఖిలేష్ సర్కారు విఫలమైందన్న విమర్శలున్నా అనేక జనాకర్షక పథకాల ద్వారా ఆయన పేద, మధ్యతరగతి వర్గాలకు సన్నిహితమయ్యారు. తాడో పేడో తేల్చు కోవడానికే అఖిలేష్ వికాస్ రథయాత్ర తలపెట్టినట్టు కనబడుతోంది. కనుక రాగల నెలల్లో యూపీ మరిన్ని ఆసక్తికర పరిణామాలకు వేదిక అవుతుంది. -
కొత్త పార్టీ అక్కర్లేదు.. అఖిలేషే మళ్లీ సీఎం
సమాజ్‌వాదీ నుంచి విడిపోయి ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కొత్త పార్టీ పెట్టే ప్రసక్తే లేదని ఆ పార్టీ నుంచి ఆరేళ్ల పాటు బహిష్కరణకు గురైన రాజ్యసభ ఎంపీ, ములాయం సోదరుడు రాంగోపాల్ యాదవ్ స్పష్టం చేశారు. ఏమీ లేనివాళ్లే కొత్త పార్టీలు పెట్టుకుంటారని, సమాజ్‌వాదీలో అఖిలేష్‌కు సంపూర్ణ మద్దతు ఉందని ఆయన తెలిపారు. తాను ఇప్పుడు ఆ పార్టీలో లేకపోయినా మళ్లీ అఖిలేష్‌నే ముఖ్యమంత్రి చేసి తీరుతానని స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మీద ఇప్పటివరకు ప్రతిపక్షాలు కూడా చేయనన్ని ఆరోపణలను సొంత పార్టీవాళ్లే చేస్తున్నారని, ఇది చాలా విచారకరమని రాంగోపాల్ యాదవ్ అన్నారు. అమర్‌సింగ్, శివపాల్ యాదవ్ యూపీలో ఎక్కడికైనా వెళ్లి తనకు వ్యతిరేకంగా మాట్లాడి చూస్తే.. అప్పుడు వాళ్లకు రాంగోపాల్ అంటే ఏంటో తెలుస్తుందని చెప్పారు. తనకు వ్యతిరేకంగా ఒక్క మాటైనా మాట్లాడి, జనం మధ్య నుంచి సురక్షితంగా బయటకు వెళ్తే.. అప్పుడు తాను రాజకీయాలకు పనికిరానివాడినని ఒప్పుకొంటానని తెలిపారు. -
కొత్త పార్టీ అక్కర్లేదు.. అఖిలేషే మళ్లీ సీఎం
-
రామాయణంలో కైకేయి లాగే..
రామాయణంలో కైకేయి తన కుమారుడికి పట్టం కట్టడం కోసం దశరథుడి పెద్ద కుమారుడైన శ్రీరాముడిని అడవులకు పంపుతుంది. ఇప్పుడు ములాయం సింగ్ యాదవ్ కుటుంబంలో కూడా ఇంచుమించు అలాగే జరుగుతోంది. ములాయం సింగ్ యాదవ్‌కు రెండోభార్య సాధన ఉందన్న విషయం చాలా కాలం వరకు బయటపడకపోయినా.. ఇటీవలి పరిణామాల నేపథ్యంలో ఆమె పేరు బాగానే వినిపించింది. ఆమే అఖిలేష్ యాదవ్‌పై చేతబడి చేయించారని కూడా ఆరోపణలు వచ్చాయి. చేతబడి మాట ఎలా ఉన్నా.. తన కొడుకు ప్రతీక్ యాదవ్‌కు పట్టం కట్టాలన్నది ఆమె ఆశ. కానీ పెద్ద భార్య కొడుకైన అఖిలేష్ అయితే సమర్థుడన్నది ములాయం అభిప్రాయం. చిన్న వదిన సాధనకు మరిది శివపాల్ యాదవ్ మద్దతు కూడా ఉంది. ఈ పరిస్థితులన్నింటి మధ్య ములాయం నలిగిపోయారు. 2003లో ములాయం మొదటి భార్య మాలతీ యాదవ్ కన్నుమూశారు. అప్పటి నుంచి సాధన అధికారికంగా ములాయం భార్యగా చలామణి అయ్యారు. కానీ వీద్దరి మధ్య ఎప్పటినుంచో సంబంధం ఉంది. 1988లో వారిద్దరికీ పుట్టిన బిడ్డే ప్రతీక్ యాదవ్. వాస్తవానికి అతడికి రాజకీయాల్లో పెద్దగా ఆసక్తి లేకపోయినా, తల్లి మాత్రం బాగా ప్రోత్సహించేవారు. 2012 అసెంబ్లీ ఎన్నికల తర్వాతే పార్టీలో కొంతమేరకు ముసలం మొదలైంది. ఎన్నికల తర్వాత ములాయం సింగ్ యాదవే సీఎం కావాలని సాధన, శివపాల్ కోరుకున్నారు. కానీ ములాయం మాత్రం.. తన రాజకీయ వారసుడిగా, యూపీ ముఖ్యమంత్రిగా అఖిలేష్ యాదవ్‌నే ప్రతిపాదించారు. అప్పట్లోనే కొందరు ఎమ్మెల్యేలను అఖిలేష్‌కు వ్యతిరేకంగా సాధన ఎగదోశారని తాజాగా సస్పెండైన ఎమ్మెల్సీ ఉదయ్‌వీర్ సింగ్ లాంటివాళ్లు చెబుతారు. 2012లో ఎన్నికలు ముగిసిన తర్వాత అడగడం వల్ల ప్రయోజనం కలగలేదని.. అందువల్ల ఈసారి ఎన్నికలకు ముందే చక్రం తిప్పాలని సాధన భావించారు. అందుకే శివపాల్ యాదవ్ తదితర మద్దతుదారులను ఎగదోసి పార్టీలో కల్లోలం సృష్టించారని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రస్తుత ముఖ్యమంత్రి ఆటోమేటిగ్గా సీఎం అభ్యర్థి కాబోరని, ఎన్నికైన ఎమ్మెల్యేలు ఎవరిని ఎన్నుకుంటే వాళ్లే సీఎం అవుతారని ములాయం సింగ్ యాదవ్ ఎందుకు ప్రకటన చేశారో పార్టీలో అందరికీ తెలుసు. ఒకవేళ ములాయం తానే సీఎం కావాలనుకుంటే.. అడ్డుపడేవాళ్లు ఎవరూ ఉండరు. శివపాల్ పేరు ముందుకొస్తే మాత్రం.. అఖిలేష్ మద్దతుదారులు అడ్డు చెప్పొచ్చు. అందుకే ఇలా అని ఉంటారంటున్నారు. పార్టీలోంచి కొన్నాళ్ల క్రితం బహిష్కరణకు గురై, మళ్లీ ఈమధ్యే వచ్చిన అమర్‌సింగ్ కూడా సాధనకు సన్నిహితంగా ఉంటారని, ఆయనే ఆమెకు రాజకీయ సలహాదారుగా వ్యవహరిస్తూ పావులు కదుపుతున్నారని అఖిలేష్ ప్రగాఢ విశ్వాసం. అందుకే ఆయన అమర్‌సింగ్ సహచరులను మంత్రి పదవుల నుంచి తీసేయడం, ఆయనను కూడా పార్టీ నుంచి తప్పించాలని డిమాండ్ చేయడం లాంటివి చేశారు. అమర్‌సింగ్ పార్టీలోకి తిరిగి రావడంలో కూడా సాధనా యాదవ్‌ది కీలకపాత్ర. ఆమె కొడుకు ప్రతీక్ యాదవ్‌కు రాజకీయాలంటే ఆసక్తి తక్కువ కావడంతో.. కోడలు అపర్ణా యాదవ్‌ను రంగంలోకి దింపారు. రాబోయే ఎన్నికల్లో లక్నో కంటోన్మెంట్ స్థానం నుంచి అపర్ణా యాదవ్ పోటీ చేస్తారని అంటున్నారు. బహుశా అక్కడి నుంచి ఇటీవలే కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వెళ్లిన రీటా బహుగుణ జోసి పోటీచేసే అవకాశముంది. ఈ విషయాలన్నీ తెలియగానే అఖిలేష్ యాదవ్ కూడా చురుగ్గా కదిలారు. సాధనకు, శివపాల్ యాదవ్‌కు సన్నిహితులైన గాయత్రి ప్రజాపతి, రాజ్‌కిశోర్ సింగ్‌లను తన కేబినెట్ నుంచి తొలగించారు. ఆ తర్వాతి రోజే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దీపక్ సింఘాల్‌ను కూడా తప్పించారు. దీనిపై శివపాల్ యాదవ్ వెంటనే తన అన్న ములాయం వద్దకు వెళ్లి మొరపెట్టుకోవడంతో ఆయన అఖిలేష్ నుంచి పార్టీ అధ్యక్ష పదవి ఊడబీకి తన తమ్ముడికి కట్టబెట్టారు. మొత్తానికి ఇలా సాధనా యాదవ్ పుత్రప్రేమ యూపీ అధికార పార్టీ కుటుంబంలో ముసలానికి దారితీసింది. -
యాదవ్ కుటుంబంలో మళ్లీ చిచ్చు!
సమాజ్‌వాదీ పార్టీలోను, ఆ పార్టీ పెద్దలు యాదవ్ కుటుంబంలోను మళ్లీ మరో చిచ్చు మొదలైంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన శివపాల్ యాదవ్.. ఆ వెంటనే తమ మరో సోదరుడు రాంగోపాల్ యాదవ్‌కు సమీప బంధువైన ఓ వ్యక్తిని పార్టీ నుంచి తొలగించారు. భూ ఆక్రమణలకు పాల్పడుతున్నాడన్న ఆరో్పణలతో అతడిని పార్టీ నుంచి తప్పించడంతో కుటుంబంలో మళ్లీ కలహాలు మొదలయ్యాయి. అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన వెంటనే రాంగోపాల్ యాదవ్ సమీప బంధువైన అరవింద్ ప్రతాప్ యాదవ్ అనే ఎమ్మెల్సీని, ఆయనతో పాటు ఇటావా గ్రామ మాజీ సర్పంచ్ అఖిలేష్ కుమార్ యాదవ్‌ను పార్టీ నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. వీళ్లిద్దరి మీద భూ ఆక్రమణలతో పాటు మరికొన్ని ఆరోపణలు కూడా ఉన్నాయి. పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటంతో అతడిని బహిష్కరించినట్లు పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎస్ఆర్ఎస్ యాదవ్ చెప్పారు. పార్టీ కార్యాలయానికి తొలిసారి వెళ్లే ముందు విమానాశ్రయంలో తన అన్న ములాయం సింగ్ యాదవ్‌ను శివపాల్ కలిశారు. బహిష్కరణ వేటుకు గురైన ఇద్దరూ రాంగోపాల్ యాదవ్‌కు సమీప బంధువులే కావడంతో యాదవ్ కుటుంబంలో ఇప్పుడు మరో చిచ్చు మొదలయ్యేలా ఉంది. శివపాల్ - అఖిలేష్ మధ్య పోరు జరిగినప్పుడు ములాయం సోదరుల్లో ఒకరైన రాంగోపాల్ యాదవ్.. తన మద్దతును అఖిలేష్‌కే తెలిపారు. దాంతో ఇప్పుడు అఖిలేష్ వర్గం బలాన్ని క్రమంగా తగ్గించే చర్యలను శివపాల్ యాదవ్ మొదలుపెట్టారని అంటున్నారు. ఇంతకుముందు అఖిలేష్‌కు అనుకూలంగా కొందరు కార్యకర్తలు నినాదాలు చేసినప్పుడు కూడా.. ''మీరు నినాదాలు ఇవ్వాలనుకుంటే, ముందు పార్టీకి అనుకూలంగా, తర్వాత నేతాజీకి అనుకూలంగా, ఆ తర్వాత ముఖ్యమంత్రికి అనుకూలంగా ఇవ్వండి. అంతే తప్ప పార్టీలో గ్రూపిజానికి చోటులేదు'' అని హెచ్చరించారు. -
ఇంతకీ పుల్ల పెట్టింది ఎవరు?
-
అన్నయ్య ఏం చెబితే అది చేస్తా..
న్యూఢిల్లీ: తన సోదరుడు, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ ములయాం సింగ్ యాదవ్ ఏం చెబితే, అది చేస్తానని ఉత్తరప్రదేశ్ మంత్రి శివపాల్ సింగ్ యాదవ్ చెప్పారు. ములయాంపై తనకు పూర్తి నమ్మకముందని విశ్వాసం వ్యక్తం చేశారు. పార్టీలో ములయాంను వ్యతిరేకించే ధైర్యం ఎవరికీ లేదని ఆయన స్పష్టం చేశారు. అన్న కుమారుడు, యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌తో విబేధాల నేపథ్యంలో శివపాల్ బుధవారం ఢిల్లీ వెళ్లి ములయాంతో సమావేశమయ్యారు. తాజా పరిణామాలపై సోదరుడితో చర్చించారు. కాగా అఖిలేష్ కూడా ఢిల్లీకి వెళ్లి ములయాంను కలవనున్నారు. ఉత్తరప్రదేశ్‌లో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారిన సంగతి తెలిసిందే. శివపాల్ యాదవ్‌కు అత్యంత సన్నిహితుడైన యూపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దీపక్ సింఘాల్‌ను మంగళవారం అఖిలేష్ తొలగించడంతో బాబాయ్, అబ్బాయ్ మధ్య గొడవలు మొదలయ్యాయి. ఇదే రోజు ములాయం.. యూపీ ఎస్పీ అధ్యక్ష పదవి నుంచి అఖిలేష్‌ను తొలగించి, శివపాల్‌ను నియమించారు. దీంతో రగిలిపోయిన అఖిలేష్.. బాబాయ్ శివపాల్ దగ్గర నుంచి కీలక శాఖలను తొలగించారు. దీంతో వీరిద్దరి పంచాయతీ ములయాం దగ్గరకు వెళ్లింది. -
ఇంతకీ పుల్ల పెట్టింది ఎవరు?
ఉత్తరప్రదేశ్‌లో వ్యవహారం నిన్న మొన్నటివరకు అంతా సమిష్టి కుటుంబంలా ఉండేది. ప్రభుత్వంలో కూడా అందరూ బంధువులే కనిపించేవాళ్లు. పార్టీ పెద్దాయన 'నేతాజీ' ములాయం సింగ్ యాదవ్.. ఆయన తమ్ముడు శివపాల్ సింగ్ యాదవ్ ప్రభుత్వంలో ఒకానొక కీలక మంత్రి, నేతాజీ కొడుకు అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రి. వీళ్లందరికీ సన్నిహితుడైన ఆజంఖాన్ కూడా మంత్రివర్గంలో కీలక సభ్యుడు. ఇలా అంతా 'మనవాళ్లే' అనుకునేవారు. కానీ ఉన్నట్టుండి.. ముసలం పుట్టింది. బాబాయ్ - అబ్బాయ్ మధ్య గొడవలు మొదలయ్యాయి. పెద్దాయన కలగజేసుకోవాల్సి వచ్చింది. బాబాయ్‌కి కావల్సిన వాళ్లను అబ్బాయ్ తప్పిస్తూ వెళ్లాడు. దాంతో అబ్బాయికి ఉన్న కీలక పదవుల్లో ఒకదానికి పెద్దాయన కత్తెర వేశారు. దాన్ని తమ్ముడికి గిఫ్టుగా ఇచ్చారు. ఒక్కసారిగా సమాజ్‌వాదీ పార్టీ ములాయం-శివపాల్, అఖిలేష్ వర్గాలుగా విడిపోయింది. దీనంతటికీ వెనకాల ఎవరున్నారనే విషయం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశం అయ్యింది. ఇది కుటుంబంలో గొడవ కాదని.. ఎవరో బయటి నుంచి గొడవ పెట్టారని అఖిలేష్ అంటున్నారు. అంటే.. ఈ మధ్య కాలంలో పార్టీకి వచ్చినవాళ్లని అంతా అనుకుంటున్నారు. అలా వచ్చిన పెద్దమనిషి అమర్ సింగ్ ఒక్కరే. బహుశా ఆయనే ఈ సమస్యలన్నింటికీ మూల కారణం అయి ఉంటారన్న వాదన ఇప్పుడు వినిపిస్తోంది. 'ఇందులో కుటుంబ గొడవలు మీకు ఎక్కడ కనిపించాయి, ఇది ప్రభుత్వంలో గొడవ మాత్రమే' అని అఖిలేష్ యాదవ్ మీడియాతో చెప్పారు. బయటినుంచి వచ్చేవాళ్లు పదే పదే వేలు పెడుతుంటే పనపులు ఎలా జరుగుతాయని కూడా వ్యాఖ్యానించారు. అమర్‌సింగ్‌తో పాటు మాజీ సీఎస్ దీపక్ సింఘాల్ గురించి కూడా ఆయన మాట్లాడుతున్నారేమోనని పార్టీ వర్గాలు అంటున్నాయి. అఖిలేష్, శివపాల్ యాదవ్‌ల మధ్య గొడవ మొదలవడానికి ప్రధాన కారణం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నియామకమే అని తెలుస్తోంది. జూన్ 30వ తేదీన అప్పటివరకు సీఎస్‌గా ఉన్న అలోక్ రంజన్ పదవీ విరమణ చేశారు. అంతకుముందు శివపాల్ యాదవ్ దగ్గరున్న శాఖల్లో ఒకదానికి ముఖ్య కార్యదర్శిగా ఉండే దీపక్ సింఘాల్ పేరు ముందుకొచ్చింది. అదే ఖరారైంది. కానీ రెండు నెలల్లోనే సీఎం అఖిలేష్ యాదవ్ ఆయన్ను వెనక్కి పంపేశారు. కొన్ని నిర్ణయాలు ములాయంను సంప్రదించి తీసుకోగా.. మరికొన్నింటిని మాత్రం తాను సొంతంగానే తీసుకున్నానని అఖిలేష్ చెబుతున్నారు. శివపాల్ యాదవ్ శాఖలు పీకేయడమా.. సీఎస్‌ను తప్పించడమా.. ఇలా ఏ నిర్ణయం ఆయన సొంతంగా తీసుకున్నారో మాత్రం తెలియడంలేదు. ఇప్పుడు ఎటూ పంచాయతీ 'నేతాజీ' వద్దకు చేరింది కాబట్టి.. అక్కడ ఒక రాజీ ఒప్పందం కుదురుతుందని అనుకుంటున్నారు. లేనిపక్షంలో మాత్రం రాబోయే ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీకి కష్టకాలం తప్పదు. ఇప్పటివరకు వచ్చిన సర్వేలను బట్టి సమాజ్‌వాదీ, బీజేపీలకు దాదాపు సమానంగా సీట్లు వస్తాయంటున్నారు. ఇలా గొడవలు జరుగుతుంటే మాత్రం పార్టీలో కొంతమేరకు చీలిక తప్పదు. అప్పుడు అది బీజేపీకి కలిసొచ్చే అంశం అవుతుంది. ఏం జరుగుతుందన్న దానికి కాలమే సమాధానం చెప్పాలి.