కొత్త పార్టీ అక్కర్లేదు.. అఖిలేషే మళ్లీ సీఎం
కొత్త పార్టీ అక్కర్లేదు.. అఖిలేషే మళ్లీ సీఎం
Published Mon, Oct 24 2016 6:59 PM | Last Updated on Mon, Sep 4 2017 6:11 PM
సమాజ్‌వాదీ నుంచి విడిపోయి ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కొత్త పార్టీ పెట్టే ప్రసక్తే లేదని ఆ పార్టీ నుంచి ఆరేళ్ల పాటు బహిష్కరణకు గురైన రాజ్యసభ ఎంపీ, ములాయం సోదరుడు రాంగోపాల్ యాదవ్ స్పష్టం చేశారు. ఏమీ లేనివాళ్లే కొత్త పార్టీలు పెట్టుకుంటారని, సమాజ్‌వాదీలో అఖిలేష్‌కు సంపూర్ణ మద్దతు ఉందని ఆయన తెలిపారు. తాను ఇప్పుడు ఆ పార్టీలో లేకపోయినా మళ్లీ అఖిలేష్‌నే ముఖ్యమంత్రి చేసి తీరుతానని స్పష్టం చేశారు.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మీద ఇప్పటివరకు ప్రతిపక్షాలు కూడా చేయనన్ని ఆరోపణలను సొంత పార్టీవాళ్లే చేస్తున్నారని, ఇది చాలా విచారకరమని రాంగోపాల్ యాదవ్ అన్నారు. అమర్‌సింగ్, శివపాల్ యాదవ్ యూపీలో ఎక్కడికైనా వెళ్లి తనకు వ్యతిరేకంగా మాట్లాడి చూస్తే.. అప్పుడు వాళ్లకు రాంగోపాల్ అంటే ఏంటో తెలుస్తుందని చెప్పారు. తనకు వ్యతిరేకంగా ఒక్క మాటైనా మాట్లాడి, జనం మధ్య నుంచి సురక్షితంగా బయటకు వెళ్తే.. అప్పుడు తాను రాజకీయాలకు పనికిరానివాడినని ఒప్పుకొంటానని తెలిపారు.
Advertisement
Advertisement