సీఎం జోరు.. బాబాయ్ బేజారు!
సీఎం జోరు.. బాబాయ్ బేజారు!
Published Thu, Jan 5 2017 2:54 PM | Last Updated on Tue, Oct 30 2018 5:17 PM
సమాజ్‌వాదీ పార్టీ రాజకీయం మరింత వేడెక్కింది. అసలైన పార్టీ ఎవరిదో, సైకిల్ గుర్తు ఎవరికి వెళ్లాలో తేల్చుకోవాలని ఈసీ ఆదేశించడంతో.. ఎవరికి వాళ్లు తమ బలాబలాలు తేల్చుకోడానికి సిద్ధమవుతున్నారు. ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తన వర్గీయులైన ఎమ్మెల్యేలు, పార్టీ కార్యవర్గ సభ్యులు అందరి నుంచి తనకు మద్దతుగా అఫిడవిట్లు తీసుకోవడం మొదలుపెట్టారు. సమాజ్‌వాదీ పార్టీకి యూపీ అసెంబ్లీలో మొత్తం 229 మంది ఎమ్మెల్యేలుండగా, వాళ్లలో 214 మంది అఖిలేష్ వెంటే ఉన్నారు. పార్టీ కార్యవర్గ సభ్యులు, ఎమ్మెల్సీలలో కూడా చాలామంది యువ నాయకుడికే మద్దతు చెబుతున్నారు. దాంతో సైకిల్ గుర్తు అఖిలేష్ వర్గానికే దక్కేలా ఉంది. ఆయన ఎన్నికల కమిషన్‌ను శుక్రవారం కలుస్తారని, ఈలోపలే మొత్తం అన్ని అఫిడవిట్లు తీసుకుంటున్నామని ఎమ్మెల్సీ సునీల్ సింగ్ సాజన్ తెలిపారు.
ఫిబ్రవరి 11వ తేదీ నుంచి ఎన్నికలు జరగనున్న తరుణంలో పార్టీలో వచ్చిన ఈ చీలిక ఒక్కసారిగా అందరికీ షాకిచ్చింది. ఎమ్మెల్యే అభ్యర్థులంతా తమ తమ నియోజకవర్గాలకు వెళ్లి ప్రచారాలు చేసుకోవాలని తమ జాతీయాధ్యక్షుడు (అఖిలేష్) చెప్పారని సాజన్ అన్నారు. వాస్తవానికి పార్టీకి ఇప్పటివరకు జాతీయాధ్యక్షుడిగా ములాయం సింగ్ యాదవ్ ఉన్నారు. దాని గురించి ప్రశ్నించగా అఖిలేష్ రాజధర్మాన్ని పాటిస్తున్నారని, తాను ఇంతకంటే ఏమీ చెప్పలేనని అన్నారు. సమాజ్‌వాదీ పార్టీలో ఒక వర్గానికి ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ నేతృత్వం వహిస్తుండగా.. మరో వర్గానికి ములాయం తమ్ముడు శివపాల్ యాదవ్ నాయకత్వం వహిస్తున్నారు. ములాయం మద్దతు తమ్ముడికే ఉండటం.. ఎన్నికలు కూడా సమీపించడంతో రాజకీయం పూర్తిగా వేడెక్కింది. అసలైన సమాజ్‌వాదీ పార్టీ తమదేనంటూ ఎవరికి వారు చెబుతుండటంతో ఎన్నికల కమిషన్ కూడా బలాలు నిరూపించుకోవాలని ఆదేశించింది.
Advertisement