సీఎం కోసం ప్రొఫెసర్ సాబ్.. 'కొత్త' డ్రామా
సీఎం కోసం ప్రొఫెసర్ సాబ్.. 'కొత్త' డ్రామా
Published Sat, Oct 22 2016 4:31 PM | Last Updated on Mon, Sep 4 2017 6:00 PM
సమాజ్‌వాదీ పార్టీలో ప్రొఫెసర్ సాబ్ అంటే ప్రతి ఒక్కరికీ తెలుసు. పార్టీ అధినేత ములాయం సహా అందరూ అలా పిలిచేది ఒక్క రాంగోపాల్ యాదవ్‌ని మాత్రమే. ములాయంకు వరసుకు సోదరుడయ్యే రాంగోపాల్ యాదవ్.. గత కొన్నేళ్లుగా పార్టీ ప్రధాన కార్యదర్శి. చాలాకాలంగా పార్టీకి సంబంధించిన వ్యవహారాల్లో ఎన్నికల కమిషన్‌తో ఆయనే సంప్రదింపులు జరుపుతుంటారు. పార్టీలో వారసత్వం గురించిన గొడవలు వస్తున్నప్పుడు.. బాహాటంగా అఖిలేష్ యాదవ్‌కు రాంగోపాల్ మద్దతు పలికారు.
అయితే.. ప్రొఫెసర్ సాబ్ ఉన్నట్టుండి ఎన్నికల కమిషన్ వద్దకు వెళ్లారు. రాజ్యసభ సభ్యుడైన ఆయనకు ఢిల్లీలోని లోధీ ఎస్టేట్‌లో గల ప్రభుత్వ క్వార్టర్స్‌లో ఇల్లు ఉంది. ఎప్పుడైనా ఆయన అక్కడ ఉంటుంటారు. ఎన్నికల కమిషన్ వద్దకు ఆయన వెళ్లడం కూడా మామూలే. ఈసారి కూడా నియోజకవర్గాల పునర్విభజన అనంతరం మ్యాప్‌లు ఇవ్వాలని కోరేందుకే ఆయన వెళ్లారని అంటున్నారు. ఎన్నికలకు ముందు అన్ని పార్టీల వాళ్లూ అలా వెళ్లడం కూడా మామూలే. కానీ.. ఇక్కడ ప్రొఫెసర్ సాబ్ పాత్ర గురించి పార్టీలో రకరకాలుగా వినిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో పార్టీకి వంద కంటే తక్కువ సీట్లు వస్తే.. అందుకు పూర్తి బాధ్యత ములాయందేనని గతంలోనే లేఖ రాశారు. పార్టీలో 95 శాతం మంది అఖిలేష్ వెంటే ఉన్నారని కూడా ఆయన చెబుతుంటారు.
అలాంటి ప్రొఫెసర్ సాబ్.. ఇప్పుడు ఎన్నికల కమిషన్‌కు వెళ్లినప్పుడు ఏం చేశారన్నది స్వతహాగానే ఆసక్తికరంగా మారింది. అన్న కొడుకు కోసం కొత్త పార్టీని ఆయన ఏమైనా రిజిస్టర్ చేస్తున్నారా అన్న విషయం చర్చనీయాంశమైంది. ఇన్నాళ్లూ పార్టీ గుర్తు సైకిల్ కాగా, ఇప్పుడు మోటార్‌సైకిల్‌గా మార్చాలని కూడా కొందరు అంటున్నారు. దాన్నిబట్టి చూస్తే, పార్టీలో యువత అంతా పాత నాయకులను వదిలిపెట్టి అఖిలేష్ యాదవ్‌ను తమ నాయకుడిగా గుర్తిస్తారా అనే చర్చ మొదలైంది. ఒకవైపు అఖిలేష్ యాదవ్ రథయాత్ర మొదలుపెడుతుండగా.. మరోవైపు ప్రొఫెసర్ సాబ్ రాంగోపాల్ యాదవ్ దక్షిణాది యాత్రకు బయల్దేరుతున్నారు. ఇటువైపున్న ప్రాంతీయ పార్టీల నాయకులతో ఆయన మంతనాలు జరుపుతారని సమాచారం. ఇదంతా చూస్తుంటే ఎన్నికలకు ముందుగానీ, ఆ తర్వాత గానీ ములాయం పార్టీలో ముసలం రావడం తప్పకపోవచ్చని అంటున్నారు.
Advertisement
Advertisement