రాహుల్ - అఖిలేష్ ర్యాలీకి చుక్కెదురు
రాహుల్ - అఖిలేష్ ర్యాలీకి చుక్కెదురు
Published Fri, Feb 10 2017 12:57 PM | Last Updated on Tue, Aug 14 2018 9:04 PM
మోదీ సొంత నియోజకవర్గమైన వారణాసిలో రోడ్ షో చేయాలనుకున్న రాహుల్ గాంధీ - అఖిలేష్ యాదవ్ జోడీకి మరోసారి చుక్కెదురైంది. వాళ్లు పెట్టుకున్న ముహూర్తం బాగోలేదేమో గానీ.. వారణాసి మునిసిపల్ యంత్రాంగం వాళ్ల ర్యాలీకి అనుమతి నిరాకరించింది. ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్-సమాజ్‌వాదీ పార్టీ నేతలిద్దరూ కలిసి వారణాసిలో భారీగా రోడ్ షో చేయాలని భావించారు. అయితే, సరిగ్గా రవిదాస్ జయంతి రోజునే వాళ్లు ర్యాలీ పెట్టుకోవడం, దానికి వారణాసిలో భారీ మొత్తంలో ప్రజలు వచ్చే అవకాశం ఉండటంతో.. ఇలాంటి సమయంలో ర్యాలీకి అనుమతిస్తే అది ప్రజలకు తీవ్ర అసౌకర్యంగా ఉంటుందని వారణాసి మునిసిపల్ అధికారులు తెలిపారు. దాంతో రాహుల్ - అఖిలేష్ ర్యాలీకి అనుమతి నిరాకరించారు.
వాస్తవానికి వారణాసిలో ర్యాలీకి ఎటూ అనుమతి రాదని భావించారో ఏమో గానీ, అఖిలేష్ యాదవ్ ఇదేరోజు బరేలీ, రాంపూర్ ప్రాంతాల్లో కూడా ర్యాలీలు చేయడానికి ప్లాన్ చేసుకున్నారు. ప్రధానంగా పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో అడుగుపెట్టేందుకు సమాజ్‌వాదీ పార్టీ గట్టిగా ప్రయత్నిస్తోంది. అక్కడ ఈ వారంలో అఖిలేష్ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే రాహుల్ - అఖిలేష్ కలిసి లక్నో, ఆగ్రాలలో రెండు రోడ్ షోలు నిర్వహించారు.
Advertisement